Sunday, August 28, 2011

మేము చేసిన మట్టి వినాయక ప్రతిమ..!!


ప్రతీ ఏటా వినాయక చవితికి (వీలైనప్పుడల్లా) నేను మట్టితో వినాయకుడిని చేస్తాను. నా clay modelling talent ని బతికించి ఉంచడానికి ఒక కారణమైతే... ఇంకొకటి పర్యావరణ పరిరక్షణ. నేను మొట్టమొదట వినాయకుణ్ణి చేసింది మేము యలమంచిలి లో వుండగా..!! అప్పుడు నేను ఎనిమిదో క్లాసు చదూతున్నాను. మా  పక్కింట్లో ఒకతను వుండేవారు. ఆయన చెయ్యగా చూసాను. అడుగున్నర విగ్రహం..! అదే  స్ఫూర్తితో  వెంటనే వచ్చి ఇంట్లో తయారు చేసేసాను. ఆరంగుళాలు ఎత్తు..దానికి water colour painting కూడా చేసాను. కానీ అంత బాగా రాలేదు.

అప్పటినుంచీ మట్టితో చిన్న చిన్నవి బొమ్మలు తయారుచెయ్యడం హాబీగా మారింది. ప్రతీ సారీ వినాయక చవితికి రెండు రోజుల ముందు తయారు చేసేవాడిని. ఈసారి ఇంకా ముందుగానే పదిరోజుల ముందే తయారు చేసేసాను. నాతో పాటూ మా అమ్మాయి కృష్ణప్రియ  కూడా ఈసారి  తయారుచేసింది. మొదటి సారి చేసినా పర్వాలేదనిపించింది.

అయితే ఈ విగ్రహం తయారు చేసినా మళ్ళీ వినాయక చవితి రోజు పత్రితో పాటూ ఇంకో మట్టి విగ్రహం కొని దానికే ప్రధానం గా పూజ చేస్తాము. నేను చేసిన విగ్రహానికి పూజ  (ఒక్కొక్క పత్రం, పుష్పం, ఫలం, తోయం..) సింపుల్ గా ముగించేసి ఊరుకుంటాము. (అష్టోత్తర శతనామాలూ, షోడశోపచారాలూ చేస్తే ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేసేయ్యాలేమోనని..ఈ దుర్బుద్ధి). వినాయక చవితి అయిపోగానే దానిని నేను చేసిన మిగతా బొమ్మలతో కలిపేసి, showcase లో పెట్టేస్తాను. అలాగ ఇప్పటివరకూ ఒక 10 విగ్రహాలు చేసి వుంటాను. విరిగిపోయినవి పోగా రెండో మూడో ఉన్నట్టున్నాయి.

సర్సరే..!! ఇక మేము చేసి బొమ్మల గోల పక్కన పెట్టేసి, ఇంతకీ మన బ్లాగు మిత్రులకందరికీ చెప్పొచ్చే విషయం ఏంటంటే...మట్టి తోనే విగ్రహాలు చేద్దాం. పర్యావరణాన్ని కాపాడుకొందాం. పైగా పిల్లలతో కలిసి మట్టితో విగ్రహాలు చేస్తే ఆ సరదాయే వేరు. మా బొమ్మల్నించి స్పూర్తి పొందినవారెవరైనా, రేపు ఎలాగూ ఆదివారమే కాబట్టీ, మీ ఇంట్లో పిల్లలతో కలిసి ఆ పనిలో వుండండి. వినాయక చవితి నాటి విశేషాలు అందరితోనూ పంచుకోండి...

జై జై జై గణేశ జై జై జై జై..!!

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ..!
నీ అండా దండా ఉండాలయ్య చూపించయా  త్రోవ..!!
మీ కందరికీ ముందస్తుగా vinaayaka chaviti శుభాకాంక్షలతో,

మీ రాధేశ్యాం మరియు కృష్ణప్రియ..

  

మా అమ్మాయి కృష్ణ ప్రియ చేతిలో రూపు దిద్దుకొన్న చిట్టి వినాయకుడు:
కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యం కూడా పెట్టేసింది..! ఇంకోపక్క గ్లాసు తో  నీళ్ళు కూడా..!! గమనించండి.
 

నేను వేసిన మరికొన్ని బొమ్మలు నా ’కలాపోసన’ పేజీ లో చూడండి.  

10 comments:

  1. రాధేశ్యాం...థ్రీ ఛీర్స్ టు యు...మాటలు చెప్పడం కాదు ..చేతల్లో అమలుపరచడం గొప్పవిషయం.గత చాలాకాలంగా వినాయకుణ్ణి చేసి పూజిస్తున్నారంటే చాలా సంతోషం...మీ భావాలను, ఉన్నతాశయాలను సాకారం చేసుకోగలగడం కేవలం భగవదనుగ్రహం...మీ అమ్మాయిక్కూడా అదే అభిరుచులు ఆశయాలు ఉండడం ముదావహం...మీకూ మీ కుటుంబానికి ఆ గణనాథుడు సర్వశుభాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను....మరొకసారి మీ కృషిని అభినందిస్తూ...అందరూ ఎవరివంతు కృషి వారు చేసిననాడు ఆదర్శభారతం ఆవిర్భవిస్తుంది అని నమ్ముతూ....

    ReplyDelete
  2. విగ్రహాలు చాలా బాగున్నాయి. మీ సంకల్ప శుద్ధికి శుభాభినందనలు. మీ వారసురాలికి శుభాకాంక్షలు. నేను కూడా మా ఇంటిలో స్వయంగా చేసిన మట్టి విగ్రహాన్నే పెడతాను. అది చూసి మా బాబు చాలా సంతోషిస్తాడు.

    మాధురి.

    ReplyDelete
  3. ఎంత అద్భుతంగా ఉన్నాయండీ మీ మట్టి వినాయక ప్రతిమలు. చాలా అందంగా ఉన్నాయి...
    వట్టిమాటలు కట్టిపెట్టోయ్..గట్టిమేల్ తలపెట్టవో్య్..అనే ఆదర్శాన్ని ఆచరణలో చూపుతున్నందుకు, అందుకో వారసురాలిని తయారుచేసుకోవడంలో కూడా కృతకృత్యులయినందుకు అభినందనలు...అందుకోండి.

    ReplyDelete
  4. telugulo rayadam maku ishtame kaani technologically challenged kanuka idi ela rayalo telika ila englishlo badhapedutuntamu. mee vigrahau bagunnayi. memu ee saari matti vinayakudike puja chestunnamu.

    ReplyDelete
  5. రాధే శ్యాం గారూ.........
    నమస్తే. నిజంగా మీరు చేసిన వినాయకుడున్నాడు చూశారా....అది మట్టి బొమ్మ కాదండీ.........విఘ్నేశ్వరుని ప్రాణ ప్రతిష్ట. వెనకటికి కొడవటిగంటి కుటుంబరావు గారనుకుంటా...చందమామలో వినాయకుడు సీరియల్ రాశారు చదివారా...అందులో వినాయకుడు తమ్ముడితో కలిసి చవితి నాడు మారు వేషం లో భూలోకానికి వస్తాడు. వినాయకుడు గాయకుడుగానూ, షణ్ముఖుడు నర్తకీమణిగానూ..వచ్చి . "మాకు నచ్చిన వినాయక విగ్రహం ముందు నాట్యం చేస్తామని మొక్కుకున్నాం" అని చెప్పగానే, రంగు రంగుల్లో ఖరీదైన విగ్రహాలు చేసిన వాళ్లంతా తమ తమ విగ్రహాల్ని పోటీ పడి మరీ వాళ్లకి చూపిస్తారు. కాని వినాయకుడు ఓ పేద పిల్లవాదు ఉత్త మట్టి తో మనసారా భక్తిగా చేసిన మామూలు విగ్రహం ముందు చతికిలబడి, "తాండవ నృత్యకరీ గజానన" అంటూ అందుకుంటాడు. అందమైన నర్తకి వేషం లో వచ్చిన కుమారస్వామి అందుకు అనుగుణం గా నాట్యం చేస్తాడు. అచ్చం అలాగే మీ విగ్రహం చూసి వినాయకుడు మీ ఇంటికి రావడం ఖాయం. మీ విగ్రహ మూర్తి ఎంత అద్భుతంగా....అచ్చ తెలుగులో చెప్పాలంటే ఎంత "కళకళ్లాడుతూ" ఉందంటే, నాకు మీ ఇంటికొచ్చి ఆ దేవుడి పాదాలకే పూజ చెయ్యాలనిపించింది. ఆ పని చెయ్యలేకపోయినా కనీసం ఒకే ఊళ్లో ఉంటున్నాం కాబట్టి వచ్చి ఆ సుందర విగ్రహ మూర్తి దర్శనం ఐనా చేసుకుంటాను...మీరు మీ చిరునామా అనుగ్రహిస్తే....మీకు, మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు....మీ అభిరుచుల్ని పుణికి పుచ్చుకుంటున్న మీ చిన్నారి కృష్ణ ప్రియకి ఆశీస్సులు
    Gayatri

    ReplyDelete
  6. @హనుమంతరావు గారికి.. మీ ఆశీస్సులకి ధన్యవాదాలు.
    @మాధురి గారూ: పిల్లలు కొన్న వస్తువుల కంటే తమంత తాము చేసిన దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. వారికి మనోవికాసం తో పాటూ సరదాగా కూడా వుంటుంది. మీకు కూడా అభినందనలు, వీలయితే మీరు చేసిన గణపతి ఫోటోలు పంపండి. ధన్యవాదాలు.

    ReplyDelete
  7. @ సుధ గారూ..చాలా సంతోషం. ధన్యవాదాలు.
    @ప్రసూన గారూ: తెలుగులో వ్రాయడం చాలా ఈజీ అండీ..గూగుల్ మెయిల్ కంపోస్ చేసేటప్పుడే మీరు లాంగ్వేజ్ ఆప్షన్ ని తెలుగు సెలెక్ట్ చేసుకుంటే సరి. ఇంగ్లీషులో టైపు చేసాక అదే తెలుగు స్క్రిప్ట్ లోకి మారిపోతుంది. దానిని కాపీ చేసి కామెంట్ బాక్స్ లో పేస్టు చెయ్యడమే.
    మీ మెసేజ్ తెలుగులో చూడండి. ఎంత హాయిగా వుందో:
    "తెలుగులో రాయడం మాకు ఇష్టమే కానీ technologically challenged కనుక ఇది ఎలా రాయాలో తెలీక ఇలా ఇంగ్లిష్లో బాధపెడుతుంటాము. మీ విగ్రహాలు బాగున్నాయి . మేము ఈసారి మట్టి వినాయకుడికే పూజ చేస్తున్నాము."
    మట్టి విగ్రహాలు పెడుతున్నందుకు మీకు నా అభినందనలు.

    ReplyDelete
  8. @గాయత్రి గారూ,
    నమస్కారం. నాకు చాలా ఇష్టమైన చందమామ సీరియల్స్ లో 'విఘ్నేశ్వరుడు' ఒకటి. చిన్నప్పుడు ఆ సీరియల్ లోని శంకర్ గారి వినాయకుడు బొమ్మలు చాలా ఆసక్తిగా చూసేవాడిని. అందులోని మంచి ఘట్టాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. అది కుటుంబరావు గారు వ్రాసారా..!? నాకు తెలీదు.
    పొగడ్త ఎవరికి చేదు గానీ, మరీ మీరు పొగిడినంత లేదోమో..!! ( మనసులో ఒక మూల లడ్డూలే లెండి..!)
    మా గణపతి మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. మీరు కూడా ఆ విఘ్న వినాయకుడి కృప సదా కలగాలని కోరుతూ,
    అభినందనలతో
    రాధేశ్యాం.

    ReplyDelete
  9. చి" రాధేశ్యామ్ ! కృష్ణ ప్రియ సృష్ఠించిన మట్టి వినాయకుడి విగ్రహా నిర్మాణాన్ని అంచెలంచెలుగా చూపించినందుకు ధన్యవాదాలు. చి"కృష్ణప్రియకు మా దంపతులిద్దరి ఆశీస్సులు,శుభాకాంక్షలు!

    ReplyDelete
  10. చి" రాధేశ్యామ్ ! కృష్ణ ప్రియ సృష్ఠించిన మట్టి వినాయకుడి విగ్రహా నిర్మాణాన్ని అంచెలంచెలుగా చూపించినందుకు ధన్యవాదాలు. చి"కృష్ణప్రియకు మా దంపతులిద్దరి ఆశీస్సులు,శుభాకాంక్షలు!

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)