Saturday, April 7, 2012

ది గాడ్స్ మస్ట్ బి క్రేజీ -1 (The Gods Must Be Crazy - 1)

ది గాడ్స్ మస్ట్ బి క్రేజీ -1 (The Gods Must Be Crazy -1)
 


1980 లో విడుదలైన ఈ సినిమాకి కథా రచన, దర్శకత్వం Jamie Uys. ఈ పేరుతో వచ్చిన చిత్రాల సీరీస్ లో ఇది మొదటిది. ఈశాన్య నమీబియాకి చెందిన Nǃxau అనే పిగ్మీ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి నాలుగు సీక్వెల్స్ కూడా నిర్మిత మయ్యాయి. మొదటి రెండూ సౌత్ ఆఫ్రికాలో తీయబడితే చివరి మూడూ మాత్రం హాంకాంగ్ లో నిర్మించబడ్డాయి(ట). 
ఒక Documentary లాగా మొదలయ్యే ఈ సినిమాలో కొంతసేపు నడచిన తరువాత కథలో లీనమైపోతాం.

విశేషమేమిటంటే ఇందులో మూడు కథలు సమాంతరంగా నడుస్తూ వుంటాయి. సినిమా  క్లైమాక్స్ కి చేరుకున్నప్పుడు మూడింటి సమన్వయం చేస్తాడు దర్శకుడు.

మొదటి కథ: నాగరిక జీవితం (?) గురించి అస్సలు పరిచయం లేని పిగ్మీలనబడే ఒక తెగకు చెందిన Xi అనే వ్యక్తికి నాగరికుల  వల్ల  కలిగే చిత్రమైన అనుభవాలను ఈ సినిమాలో తెరకెక్కించారు. Xi తన తండాతో కలసి 'కలహారి ఎడారి'లో  నాగరికులకి దుర్భరమనిపించే పరిస్థితులలో ఎంతో సంతృప్తికరంగా ఆనందం గా జీవిస్తుంటాడు. ఒకరోజు విమానంలో వెళుతున్న ఒక నాగరికుడు తాగి క్రింద పారేసిన కోకాకోల సీసా దొరకడంతో అది వీరి జీవితాలలోకి ఎలాంటి తంటాలు తెచ్చిందో, దాన్ని వదిలించుకోవడానికి ఎలాంటి తిప్పలు పడ్డాడో చూస్తాం. దాంతో - ఇది ఎవరి జీవితం లోకి వచ్చినా ఇలాగే సతమత మౌతారని  నమ్మిన - Xi   ఆ దయ్యపు వస్తువుని (కోకాకోల సీసా కి అతను పెట్టిన పేరు) వదిలించుకోవడానికి Xi భూమి అంచుదాకా వెళ్లి  అంతులేని అగాధం లోకి విసిరెయ్యాలని నిర్ణయించుకుంటాడు.
  
(తండాలో అందరి అబ్బురపాటుకీ కారణమై తర్వాత లేనిపోని కొట్లాటలకు కారణమైన దయ్యపు వస్తువు)
రెండవ కథ: అమ్మాయిలతో ఎలా నడచుకోవాలో తెలియని ఒక ఆంత్రపాలజి డాక్టరు ఆ అడవికి వచ్చిన స్కూల్ టీచర్ మీద మనసు పారేసుకొని చెప్పలేక మానలేక సతమత మవుతుంటే మధ్యలో ఇంకొక తెలివైన టూరిస్టు గైడు పానకం లో పుడకలాగా మారుతుంటాడు. మన వాడికి వచ్చిన అవకాశాలను వాడు తన్నుకు పోతుంటాడు.

మూడో కథ: ఆ దేశపు మంత్రి మండలి మీద దాడి చేసి వారిని చంపడానికి విఫలయత్నం చేసిన మిలిటెంట్ బృందం,  వారిని తరుముతున్న పోలీసుల నుంచి పారిపోతూ వుంటుంది. వారికి రక్షణ కవచం గా మన హీరోయిన్ తో పాటూ  ఆవిడ పనిచేస్తున్న స్కూల్ లో పిల్లల్నికూడా బందీలుగా పట్టుకుని తీసుకుపోతారు.

డాక్టర్ గారూ.. అతని స్నేహితుడూ..
స్కూల్ టీచర్ 
అలా బయల్దేరిన Xi తన ప్రయాణంలో మన అమాయకపు డాక్టర్ నీ, ఆ స్కూల్ టీచర్ నీ కలుస్తాడు. వాళ్ళ లాంటి మనుషులని (నాగరికులని) అతను ఇదివరకు చూడక పోవడం తో వీళ్ళే దేవతలనుకొని ఆ సీసాని వెనక్కి తీసుకోమంటాడు. వారు నిరాకరించడంతో నిరాశ చెందుతాడు. (అతని దృష్టిలో దేవుడిచ్చిన- నీరు, చెట్లూ, కందమూలాలూ - అన్నీ మంచి వస్తువులే..! అతని దైనందిన జీవితంలో బతకడానికి పనికి వచ్చేవే..!! అన్నీ తండాలో అందరికీ చెందుతాయి. ఎవ్వరికీ ఏ ఒక్కటీ సొంతం కాదు. కానీ ఈ క్రొత్త వస్తువు అతనికి లేనిపోని తలనొప్పులు తెస్తుంది. దేవుడిచ్చాడని భావిస్తున్న ఈ సీసా వల్ల  బోలెడు  ఉపయోగాలు  కనిపిస్తాయి. కానీ వస్తువు ఒక్కటే వుండడం తో వారి తండాలో ఎవరికీ ఇదివరకూ అనుభవం లోకి రాని ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేషం, స్వార్థ చింతన, స్వలాభాపేక్ష , హింస లాంటివి ఆ తండాలోకనిపిస్తాయి. అది ఎంతదూరం వెళ్తుందంటే దాన్ని వదిలించుకోవాలని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించుకుంటారు. ఇప్పుడు ఆ దేవుళ్ళే కనిపించినపుడు ఆ దయ్యపు వస్తువుని వెనక్కియ్యబోతే తీసుకోకపోవడం Xi  కి బాధ కలిగిస్తుంది.)

ఈ నిస్పృహ లో వుండగా, ఆకలేసి ఒక గొర్రెల మందలో ఒక గొర్రె ని మత్తు కలిగించే బాణం తో కొడతాడు. వేటాడిన   దాన్ని కలసే తిందామని ఆహ్వానించినా అంగీకరించని 'నాగరికుడైన' మంద యజమాని పోలీసులకు  చెప్పి Xi ని అరెస్టు చేయిస్తాడు. Xi  కి తన తప్పేంటో అర్థం కాదు. వేటాడి తినడం అతని ప్రకృతి. అందరితో కలసి పంచుకొని తినడం అతని నైజం. పైగా భాష కూడా ప్రతిబంధకంగా మారడం తో అతని గోడు వినే వారు లేక శిక్ష తప్పని పరిస్థితి వస్తుంది.

ఇలాంటి పరిస్థితిలో మన ఆంత్రపాలజి డాక్టరు గారూ, అతని స్నేహితుడూ (ఇతనికి పిగ్మీల భాష కూడా వచ్చు) కలసి ఇతన్ని చేరదీస్తారు. తమ దగ్గర అతని శిక్షా కాలం మూడు నెలలూ పూచీ పడి పనిలో పెట్టుకొంటారు. ఈ కాలం లో Xi 'నాగరికుల' అలవాట్లూ ఆచార వ్యవహారాలూ కొద్ది కొద్దిగా తెలుసుకుంటాడు.

ఇంతలో ఆ టెర్రరిస్టులు స్కూల్ పిల్లల్నీ, టీచర్నీ కిడ్నాప్ చెయ్యడం తో వాళ్ళని రక్షించడానికి తన ఇద్దరు సహచరులతో పాటూ బయల్దేరతాడు. ఆ ప్రయత్నం లో Xi సఫలమౌతాడా..,? ఆ సీసాని ఏం చేసాడు..??, డాక్టరు గారి ప్రేమకథ సంగతేంటి..?? అన్నది మిగతా కథ.
Xi కి అతని మిత్రులు వీడ్కోలు పలికే సన్నివేశం..!!
Xi చూసిన భూమి అంచు...!!
అప్పట్లో వచ్చిన ఆ సినిమా పోస్టర్..!!
దర్శకుడు ఈ సినిమాని ఒక డాక్యుమెంటరీ లాగా మొదలెట్టి, పిగ్మీల జీవన విధానం, వారి అలవాట్లు, వారి వేటాడే పద్ధతి, మొదలైనవన్నీ చూపిస్తూ దానికి కాంట్రాస్టింగ్ గా నాగరిక సమాజం తీరు తెన్నులను చూపించే తీరు మన నాగరికులందరినీ అంతశ్శోధనలో పడేస్తుంది. మన పద్ధతులూ, మన టైం టేబుల్ మొదలైనవి ప్రకృతి సిద్ధమైన సహజ సూత్రాలకి ఎంతో దూరమన్న సంగతిని ఎత్తి చూపుతుంది. పిగ్మీల జీవన విధానాన్ని పరిచయం చేసేటప్పుడు చూపిన ప్రతీ అంశాన్నీ కథలో సమర్థవంతంగా వినియోగించుకుంటాడు. ఏ టైం టేబుల్, ఏ  అసహజమైన నియమాలూ లేని ప్రాకృతిక జీవనం లో వారెంత ఆనందంగా జీవిస్తుంటారో కళ్ళకు కట్టిస్తాడు. అలాగే నియమ బద్ధమైన మన నాగరిక సమాజంలో మనం ఏర్పరచుకొన్న నియమాలనే మనం ఎలా తుంగలోకి తొక్కుతామో చూపుతాడు.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1980 మొదట్లో రిలీజ్ అయినా అమెరికాలో విడుదల కాలేదు. దానికి కలిగిన మంచి పాజిటివ్ రెస్పాన్సు, వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ తో రెండేళ్ళు ఆలస్యంగా 1982 లో విడుదలయ్యింది. దాని తరువాత 1989  లో రెండవ భాగం విడుదలయ్యింది. (నాకు ఇది కూడా చాలా నచ్చింది.. దీని గురించీ కూడా వ్రాయడానికి ప్రయత్నిస్తాను) ఆతరువాత వచ్చిన మూడు సీక్వెల్స్ లోనూ (అది కూడా మూడేళ్ళలోనే)కూడా ప్రథాన పాత్ర పోషించింది..Nǃxau యే..!!
కానీ దీనిమీద రివ్యూ రాసిన ఇంకొకరి మాటల్లో...
"....almost all of the thought-provoking cultural insight from the original was lost forever. Indeed, what started as a brilliant social commentary in 1980 ended as a silly slapstick comedy franchise more than a decade later. "

అయితే ఈ సినిమా పుణ్యమా అని  Nǃxau  కి ప్రపంచవ్యాప్తంగా పర్యటించే అవకాశం కలిగింది. చివరకు మళ్ళీ సరిగ్గా పదేళ్ళ తరువాత 1990 లో తన స్వగ్రామానికి వెనక్కి వచ్చిన Nǃxau , దురదృష్టవశాత్తూ క్షయవ్యాధి soki మరణించాడు. 1984 లో రెండవసారి విడుదలై 30  బిలియన్ డాలర్లు ఆర్జించిన ఈ సినిమా లో Xi  పాత్ర లో నటనకు గానూ  Nǃxau కి $300 మాత్రమే ఇచ్చారట. అయితే ఆయన మరణానికి ముందు మాత్రం $20,000/- ధనసహాయం, అలాగే నెలవారీ భత్యం కూడా ఏర్పాటు చేసారుట.

వెంకటేష్ హీరో గా వచ్చిన "బొబ్బిలి రాజా" (విడుదల 1991 -92  మొదట్లో అనుకుంటా)  సినిమాలో చాలాచోట్ల ఈ సినిమా లోని సన్నివేశాలు యధాతధంగా వాడుకున్నారు. హీరో వెంకటేష్ చేత ’ అయ్యో..అయ్యో అయ్యయ్యో..! ’ అనిపించడం, జీపు డౌన్ లోకి జారిపోవడం, దివ్యభారతి చెట్టు మీదనుంచీ దిగడం, నీళ్ళు పట్టడానికి విండ్ మిల్ దగ్గర ప్రయత్నిస్తూ ఉండగా.. కోతి వచ్చి ఆ నీళ్ళు తాగెయ్యడం.. ఇలా చాలాఉన్నాయి.

ఏదైనా గానీ పిల్లలూ పెద్దలూ బాగా ఎంజాయ్ చేసిన చిత్రం ’ది గాడ్స్ మస్ట్ బి క్రేజీ’




పై వీడియో ఈ సినిమాలోని మొదటి పది నిముషాలూ..! చూడండి, చాలా బాగుంటుంది ..!


13 comments:

  1. Radhe Syam,

    You have written about very good series of comedy movy. I have the collector's edition DVDs. There is lots of background info about the protagonist and the Director. Time permitting, I shall try to share the info in my blog.

    Thanks for giving a good idea with your excellent intro to GODS MUST BE CRAZY.

    ReplyDelete
  2. రాధేశ్యాం గారూ,
    సాంకేతిక విలువల జోలికి పోకుండా ఒక సినిమాను కథలాగా, నవల్లాగా ఆద్యంతం చదివించేలా చక్కటి పరిచయం చేశారు. మీ పరిచయం చూశాక ఈ సినిమా ఆన్ని భాగాలను ఒకేసారి చూడాలనిపిస్తోంది. శివరాం గారూ, మీరే నాకు ఈ విషయంలో సహాయం చేయాలి. కొరియర్ చార్జీలన్నీ నేనే పెట్టుకుంటాను. మీ కలెక్టర్ ఎడిషన్‌ని నాకు షేర్ చేయగలరా. లేదా మార్కెట్లో ఇప్పటికీ ఇది దొరుకుతుందంటే ఇక్కడే కొంటాను.

    "మన పద్ధతులూ, మన టైం టేబుల్ మొదలైనవి ప్రకృతి సిద్ధమైన సహజ సూత్రాలకి ఎంతో దూరమన్న సంగతిని ఎత్తి చూపుతుంది. పిగ్మీల జీవన విధానాన్ని పరిచయం చేసేటప్పుడు చూపిన ప్రతీ అంశాన్నీ కథలో సమర్థవంతంగా వినియోగించుకుంటాడు. ఏ టైం టేబుల్, ఏ అసహజమైన నియమాలూ లేని ప్రాకృతిక జీవనం లో వారెంత ఆనందంగా జీవిస్తుంటారో కళ్ళకు కట్టిస్తాడు. అలాగే నియమ బద్ధమైన మన నాగరిక సమాజంలో మనం ఏర్పరచుకొన్న నియమాలనే మనం ఎలా తుంగలోకి తొక్కుతామో చూపుతాడు."

    ఇరవై ఏళ్ల క్రితం అనుకుంటాను.. నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలో జీవిస్తున్న చెంచులను ఉద్ధరించడానికి నడుం కట్టిన ప్రభుత్వం వారిని అక్కడి నుంచి బయటకి తెచ్చి మైదాన ప్రాంతంలో నివాస ప్రాంతం, వ్యవసాయ భూమి కల్పించి బతికేయమని చెప్పింది. అడవి ఉత్పత్తులమీద, ఆహార సేకరణ మీద ప్రధానంగా బతుకుతూ వచ్చిన చెంచులు ఒక్కసారిగా తమ కళ్లముందు కనిపించిన ఈ విశాలప్రపంచంలో ఏం చేయాలో, ఎలా బతకాలో అర్థం కాక తిండిలేక చనిపోయారు. భూమి ఇచ్చాం కదా బతికేస్తారులే అని వదిలేసిన మన ఘనత వహించిన ప్రభుత్వం, అధికారులు వారికి వ్యవసాయం వచ్చా, రాకపోతే వారికి కల్పించవలసిన కనీస ప్రాధమిక శిక్షణ, పరికరాలు, తదితర వ్యవసాయ అవసరాలను తీర్చడం ఎలా అనే విషయాలను ప్రాథమికంగానే మర్చిపోయారు. ఏం చేయాలో తోచని స్థితిలో ఆ ఆడవి పుత్రులు ఆకలికి మాడి చనిపోయారు. ఈ రోజుకీ అడవి పుత్రులను ఇలాగే ఉద్ధరిస్తున్నారని ఇటీవలే ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో లెనిన్ రాసిన అద్భుత వ్యాసం తేటతెల్లం చేసింది. అభివృద్ధి అని మనం అనుకుంటున్న గొప్ప విషయాలు ఆ అదివాసీలను ఆకలికి మాడి చావకుండా నిరోధించలేకపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా అభివృద్ధి నమూనా ఇలాగే కొనసాగుతున్నట్లుంది.

    రాధేశ్యాం గారూ, ఒక అభ్యర్థన మనం చూసి తీరవలసిన మంచి సినిమాలను, వరల్డ్ క్లాసిక్‌లను మీరు నెలకు ఒక్కటయినా ఇలాగే పరిచయం చేయరా...? మీ ఈ సినిమా పరిచయం ఆద్యంతం బావుంది.
    అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. రాజు గారూ,
      మనప్రభుత్వాలన్నీ పేదప్రజలను ఓట్ల యంత్రాల లాగానే చూస్తున్నాయి తప్ప మనుష్యులుగా వారి అవసరాలను, ఆకాంక్షలనూ పట్టించుకోవడం మానేసి చాలాకాలం అయింది. అర్బనైజేషన్ పేరుతో పేదవారిని కట్టకట్టి నగరంనుంచీ బయటకు తరిమేసే ప్రక్రియ నిరంతరం సాగుతూనే ఉంది. ఇలాంటి దారుణాలకు మీరు చెప్పిన ఉదంతం ఒక ఉదాహరణ అయితే రెండవది మత్స్యకార కుటుంబాలదీ, రైతులదీ. తరతరాలుగా వారిజీవనాధారం అయిన సముద్రం, అడవులూ, పంట భూములూ వారిదగ్గర నుండీ లాక్కొనే ప్రక్రియని ప్రజాస్వామ్యమనీ, అలాంటి ప్రభుత్వాలని రైతు ప్రభుత్వాలనీ నమ్మబలుకుతున్నారు ఈ రాజకీయ రక్కసులు. ప్రకృతి ప్రసాదించిన సహజవనరులకు దూరమై బయటి ప్రపంచంలో బ్రతకడానికి తగ్గ ఆధారమూ కరువై ఒడ్డున పడ్డ చేపల బతుకైపొతోంది ఈ బడుగులకు. పారదర్శకత పేరుతో జబ్బలు చరుచుకొనే ఈ ప్రభుత్వాలు తీసుకు వచ్చే జీఓలు ఎలాఉన్నాయంటే.. వడ్డించేవాడు మనవాడైతే (ఓటు వేసాం కాబట్టీ మనవాడే అనుకుంటారు కదా..!)అనేది పాతసామెత అయిపోయింది. వండేవాడూ, వడ్డించుకొనేవాడూ, ఒక్కమెతుకు మిగల్చకుండా తినేసేవాడూ కూడా ఒక్కడే కదా ఈరోజుల్లో..!!

      Delete
  3. No problem Raju garu. Next time when we meet either in Chennai or Bangalore, I shall give a copy. But before, that I should search for the DVDs. You know the size of my collection. uncatalogued DVD/CDs are more than the cataloged ones. That's why I wrote "time permitting".

    ReplyDelete
  4. ధన్యవాదాలు శివరాం గారూ,
    ఆలస్యంగా అయినా సరే మీ నుండే ఈ సినిమాల కాపీలు తీసుకుంటాను. రెగ్యులర్‌గా మీరూ ప్రపంచ సినిమాలను ఫాలో అవుతుంటారు కనుక మీరు కూడా ఏదైనా సినిమాను చూసిన వెంటనే కనీసం నాలుగు మాటలతో పరిచయం చేశారంటే అది అందరికీ ఉపయోగపడుతుంది. వీలయితే మీ బ్లాగులో సినిమా పరిచయం లేదా సమీక్ష పేరుతో కేటగిరీ రూపొందించి పరిచయం చేయగలరు. మంచి సినిమాలను చూసే భాగ్యం కూడా ప్రస్తుతం కరువవుతోందనుకుంటాను. నవతరంగం వాళ్లు ఈ విషయంలో చక్కటి కృషి చేస్తున్నారనుకుంటాను.

    ReplyDelete
  5. నెలవంక రాజు గారికి గారికి, శివగారికి, ధన్యవాదాలు. నిజానికి నేను ఈ పోస్టు వ్రాయడం మొదలు పెట్టి ఆర్నెల్ల పైనే అవుతోంది. అప్పుడు సగం లో వదిలేశాను. మొన్న drafts లో వెతుకుతూ ఉంటే కనిపించి పూర్తి చేసాను. అప్పట్లో మా అబ్బాయి (నాలుగేళ్ళు) ఈ సినిమాని రోజుకి మూడు ఆటలు చొప్పున చూసేవాడు.
    శివగారూ మీనుంచి ఈ సీరీస్ మీద మరింత విశ్లేషణ కథనం కోసం ఎదురుచూస్తుంటాం.
    రాజు గారూ, మీ సూచనని శివగారు ఆచరణలోకి తీసుకువస్తారని, వారికి ఆ వీలు చిక్కాలనీ ఆశిద్దాం.

    ReplyDelete
  6. రాధేశ్యాం గారూ!

    ఆ ప్రయత్నం లో Xi సఫలమౌతాడా..,? ఆ సీసాని ఏం చేసాడు..??, డాక్టరు గారి ప్రేమకథ సంగతేంటి..?? అన్నది మిగతా కథ.

    అని మీరు రాయడాన్ని బట్టి మీ బ్లాగు చదివిన వాళ్ళు వెంటనే సినిమా మొత్తాన్ని చూట్టానికి వువ్విల్లూరుతారని మీ అభిప్రాయం. మంచిదే కానీ అందరికీ ఆ భాగ్యం దొరుకొద్దూ.

    ఈ పద్దతి వెనుకటికి మిగతా భాగం వెండితెర మీద చూసి తరించండి అంటూ ప్రేక్షకున్ని వూరించే వారు. అది పబ్లిసిటి లో ఒక భాగం.

    కాని ఇక్కడ మీరు పనిలో పనిగా కథ మొత్తం ఆద్యంతం సినిమా చూసినట్లుగా అంటే
    కళ్ళకు కట్టినట్లుగా రాసేస్తే పోలా ఈ సస్పెన్స్ ఎందుకు?

    ఏది ఏమైనా సినిమా వివరణ చదివించేలా వుండి, సినిమా కనిపించేలా వుంది.
    అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. రమణగారూ,
      మీ విలువైన అభిప్రాయానికి ధన్యవాదాలు. భలే పాయింటు పట్టారు. అప్పట్లో అలాగే వచ్చేది.
      పైన మీ ముందరి కామెంటుకి సమాధానంలో రాసినట్టు "నిజానికి నేను ఈ పోస్టు వ్రాయడం మొదలు పెట్టి ఆర్నెల్ల పైనే అవుతోంది. అప్పుడు సగం లో వదిలేశాను. మొన్న drafts లో వెతుకుతూ ఉంటే కనిపించి పూర్తి చేసాను."
      ఆ ప్రయత్నం లో Xi సఫలమౌతాడా..,? ఆ సీసాని ఏం చేసాడు..??, డాక్టరు గారి ప్రేమకథ సంగతేంటి..?? అని ఆపెయ్యడానికి కారణం తప్ప.. ఈ పోస్టు చదివిన వారు అప్పటికప్పుడే వెతుకులాట మొదలెట్టి పూర్తి సినిమా చూసేస్తారని కాదూ, ఉవ్విళ్ళూరించెయ్యాలని కాదూ..!!

      Delete
    2. [సారీ..! పైన "..అని ఆపెయ్యడానికి కారణం తప్ప.." ని
      "..అని ఆపెయ్యడానికికారణం అదే తప్ప.." అని చదువుకోగలరు.]

      Delete
    3. Radhesyam,

      I shall try to write after I locate the DVDs. Before that I just now discovered my favourite series Dr. Martin where a Doctor from London chooses to go to rural England (to his native village)to practice. The entire TV series is all about how a City Doctor adopts and the village adopts to a City Doctor through various incidents and characters.Its a very good TV series and I like it very much. I wish I can write about it soon.

      I hope our people will atleast copy the concept and come out with a TV serial, rescuing us from the present day tears,revenge and lady villain daily serials.

      Delete
    4. @దాసరి వెంకటరమణ garu,

      I hope and wish efforts will be made to get this hilarious movie into Telugu and release across AP. Now a days we see third rate English movies getting dubbed into Telugu. Instead, for a change if this movie is dubbed into Telugu with good dubbing artists (not the usual tiresome 3-4 fellows now available giving their voice to all characters)and our Children see it understanding every dialogue, it would be great for them.

      Delete
  7. I think I have seen the movie... however a good effort by you now to present this to us... congrats.

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)