Monday, April 16, 2012

నాకు నచ్చిన చిత్రాలు : మా ఊళ్ళో మహాశివుడు

మా ఊళ్ళో మహాశివుడు (1979)

దర్శకత్వం: రాజా చంద్ర ; తారాగణం: రావు గోపాలరావు, సత్యనారాయణ, మురళీ మోహన్, సుభాషిణి, అల్లురామలింగయ్య, వంకాయల, రాజబాబు తదితరులు ; మాటలు: అప్పలాచార్య; సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం; నిర్మాణ సంస్థ: గీతా సినీ ఎంటర్‌ప్రైజెస్ ; గీతరచన:సి నారాయణరెడ్డి, ఆరుద్ర , వీటూరి ; నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం; సంగీతం : సత్యం;                                                             

చాలా ఏళ్ళ (సుమారు పదేళ్ళ) క్రితం ఒకరోజు యధాలాపం గా టీవీ చానెల్స్ మార్చుతూ ఉంటే ఈ సినిమా వస్తోంది..! రావుగోపాల రావుని ఈ ప్రత్యేకమైన గెటప్ లో చూసి ఆసక్తికరంగా అనిపించి చూడడం కంటిన్యు చేసాను. పూర్తిగా చూసాక "అరె మొదటి నుండి చూడలేక పోయానే..!" అనిపించింది. అక్కడినుంచీ ఒక రెండేళ్ళ వెతుకులాట తరువాత ఈ సినిమా VCD కనిపించి కొనుక్కొని మళ్ళీ మొదటినుంచీ చూసాను. కడుపుబ్బా నవ్వుకున్నాను.

ఫుల్ లెంగ్త్ శివుడి పాత్రలో కనిపించే రావుగోపాలరావు ఈ సినిమాలో గ్రాంధికం కాకుండా వ్యవహారిక భాష మాట్లాడతాడు. ముత్యాల ముగ్గు సినిమాతో అఖిలాంధ్ర ప్రేక్షకుల అభిమానం సంపాదించుకోవడం తో పాటూ డైలాగ్ డెలివెరీ లో ఒక ఒరవడి సృష్టించాడు. అసలే రావుగోపాల రావు డైలాగ్ డెలివెరీ కి పెట్టింది పేరు. సత్యనారాయణ తో కలసి చేసిన సీన్లలో కడుపుబ్బా నవ్వించే హాస్యం పండించారు. గుడిపూజారి (సత్యనారాయణ) అమాయకంగా వేసే ప్రశ్నలకు శివుడిచ్చే సమాధానాలు చూసి తీరవలసిందే.

యుట్యూబ్ లో కనిపించిన వీడియోలు మీకోసం ఇక్కడ పంచుకుంటున్నాను.
సాంబయ్య అనే చాలా పేదవాడైన ఒక ఊరి గుళ్ళో పూజారి తన కూతురి పెళ్లి నిశ్చయం కావడంతో కట్నం డబ్బు పదివేల రూపాయల కోసం ప్రయత్నించి విఫలమౌతాడు. ఆ స్థితిలో సంయమనం కోల్పోయి ఏ దేవుడినైతే సర్వస్వంగా భావించి నిత్యం కోలుస్తున్నాడో ఆ పరమేశ్వరుణ్ణి ఆవేశం తో నిందిస్తూ తెలివి తప్పి పడిపోతాడు.ఆ తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ క్రింది వీడియోలు చూడండి.


శివుడు  అనుగ్రహించి  ప్రత్యక్షముతాడు. అక్కడినుంచీ భగవంతుడికీ భక్తుడికీ సంవాదం మొదలౌతుంది. ప్రేక్షకులకు నవ్వు మొదలౌతుంది. స్వామిని తనకూతురి పెళ్ళికి కావలసిన డబ్బు అనుగ్రహించమని వేడుకుంటాడు పూజారి. ఆ ఊరి భూస్వామి (అల్లురామలింగయ్య) దగ్గరకు పూజారి కూడా వెళ్ళిన శివుడు, సదరు భూస్వామి గుట్టుమట్లూ, వ్యాపారం లో చేసే స్మగ్లింగు, చేయించిన హత్యలూ ఏకరువు పెట్టేసరికి, కిమ్మనకుండా డబ్బు తెచ్చి పూజారి చేతిలో పెడతాడు. 
భూస్వామి కొడుకు గుళ్ళోని అమ్మవారి విగ్రహాన్ని అమెరికాలో అమ్మేయ్యడానికి బేరం సిద్ధం చేస్తాడు. అయితే గుడి తాళాల కోసం పూజారి భార్యకి కూతురి పెళ్ళికి అవసరమైన పదివేలూ బలవంతంగా చేతిలో పెట్టి, తాళాల కోసం వేధిస్తూ ఉంటాడు. ఎలాగైతేనేం అతగాడి బెదిరింపులకి లొంగిన పూజారి భార్య తాళాలు ఇచ్చేస్తుంది. వెంటనే విగ్రహం మాయమవ్వడం, ఆ నింద పూజారి మీద పడడం జరిగిపోతాయి. 
భూస్వామి తన గుట్టుమట్లు చెప్పిన ఆ శివుడి వేషధారిని చంపెయ్యమని సింహాచలం (రాజబాబు) అనే వాణ్నిపీకల్దాకా పట్టించి పంపిస్తాడు. ఆ తరువాతి సన్నివేశాలు చూడండి.


ప్రఖ్యాత హాస్య నటుడు శ్రీ అల్లు రామలింగయ్య సొంత నిర్మాణ సంస్థ అయిన గీతా సినీ ఎంటర్‌ప్రైజెస్ బానర్ మీద తీసిన ఈ సినిమాలో రామలింగయ్య గారి కుమారుడు శ్రీ అల్లు అరవింద్ ఎస్సై గా ఒక పాత్ర పోషించాడు. భూస్వామిని బ్లాక్మెయిల్ చేసాడనే అభియోగం మీద శివుడిని విచారించడానికని స్టేషన్ కి పిలిపిస్తాడు. వారిమధ్య సాగే సంభాషణ ఆసక్తికరంగా ఉంటుంది. ఇదే సీనుకి అనుకరణ, అనుసరణగా తరువాత చాలా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు వచ్చాయి.

ఇదిలాఉంటే విగ్రహం తాలూకు లావాదేవీలన్నీ కళ్ళబడిన సిద్ధయ్య (చిన్నపూజారి) కోపం పట్టలేక భూస్వామి కొడుకుతో ఘర్షణ కి దిగుతాడు. ఆ కొట్లాటలో సిద్ధయ్య చనిపోతాడు. సాంబయ్య కుమిలిపోతాడు. అప్పుడు శివుడు పూజారికి ధైర్యం చెబుతూ చావు పుట్టుకల గురించి, పాప పుణ్యాల గురించీ లోకం తీరు గురించీ కొన్ని మాటలు చెబుతాడు.

"కాలం చేసిన ప్రతీ వాణ్ణీ కన్నీటితోనే బ్రతికించగలిగితే ఈ లోకం లో పుట్టిన ప్రతి వ్యక్తీ జీవితాంతం విలపిస్తూనే వుండాలి".

"మంచి చెడ్డలకీ మరణానికీ సంబంధం లేదు సాంబయ్యా..! స్మశానం ఊరికి ఒకే దూరం లో ఉన్నా అందరూ ఒకేసారి చేరుకోలేరు.."

ఇంతలో భూస్వామి కొడుకు ఒక నకిలీ విగ్రహాన్ని పూజారి కూతురు(సుభాషిణి) ప్రేమించిన యువకుడు (మురళీమోహన్) ఇంట్లో దొరికేలా చేసి ఊరి వాళ్ళందరినీ అతని మీదకు ఉసిగొల్పుతాడు. అప్పుడు జరిగిన ఘర్షణలో ప్రేమికులిద్దరూ చనిపోతారు. పాపం సాంబయ్య దుఃఖానికి హద్దుండదు. తన కూతురి శవాన్నితీసుకొని గుడిలో దేవుడి ముందుంచి దేవుడిని నానా మాటలూ అంటాడు. దేవుడన్నవాడే లేడంటాడు. చివరికి ఒక గునపం తీసుకొని శివలింగాన్ని పెకలించేయ్యడానికి తెగబడతాడు. అప్పుడు శివుడు  మళ్ళీ రుద్ర రూపం దాల్చి భయంకరంగా తాండవం చేస్తూ ఉండగా..పూజారి నిలువెల్లా వణికి పోతాడు. తప్పు మన్నించి అనుగ్రహించమని వేడుకొంటూ స్పృహలోకీ, కంటున్న కల వదలి లోకం లోకీ వచ్చి పడతాడు. కళ్ళు తెరిచేసరికీ చనిపోయారనుకున్న వాళ్ళందరూ,( సిద్ధయ్య, కూతురూ, ఆమె ప్రేమికుడూ) ఎదురుగా కనిపిస్తారు. కలలో లోకాన్ని చూసిన పూజారి కూతురి పెళ్లి ఆమెకు నచ్చిన వాడితో జరగడంతో శుభం కార్డు పడుతుంది.

సినిమా అంతా నచ్చిందనీ, కథ సూపరనీ చెప్పను గానీ, శివుడి పాత్రా, రావుగోపాలరావు డైలాగులూ మాత్రం అద్భుతం. అది హాస్య రసమైనా, వేదాంతమైనా అద్భుతం గా పండాయి. సత్యనారాయణ కూడా చాలా బాగా నటించాడు. నాకైతే నచ్చింది, మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాల్లో చెప్పండి. 

  
(రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతున్న శివుడు (1979  లో అని మర్చిపోకండి)

3 comments:

  1. నా చిన్నప్పుడెప్పుడో ఒకసారి టి.వి.లో ఈ సినిమా ఒకసారి చూశాను. అదీ కూడా పూర్తిగా కాదు. కరెంటు పోయింది అప్పుడు అందుకే వీలవ్వలేదు :-( ముఖ్యంగా శివుడికీ, పూజారి కి మధ్యన జరిగే సంభాషణలు అద్భుతం. తెలంగాణా కోసం కూడా శివుడు భలే బాగా చెప్తాడు. :-)

    ReplyDelete
  2. ee cinema chaalakalam kritam neenu chuseenu malli gurthu cheesenanduku krutagyatalu

    ReplyDelete
  3. జాహ్నవి గారూ: నాకూ మొత్తం సినిమాలో ఆ సంభాషణలే చాలా ఇష్టం అండీ..!! ఢన్యవాదాలు. మాయాబజార్: చాలా సంతోషం అండీ..! మీ బ్లాగులో కూడా వ్రాయడం మొదలుపెట్టండి త్వరగా..! :)

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)