Saturday, November 24, 2012

రహస్యం చలన చిత్రం లోని 'గిరిజా కళ్యాణం' యక్షగానం సాహిత్యం

రహస్యం చలన చిత్రం లోని 'గిరిజా కళ్యాణం' యక్షగానం సాహిత్యం
రచన : మల్లాది రామకృష్ణశాస్త్రిగారు స్వర రచన: ఘంటసాలగారు

కీ. శే. శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు 
కీ. శే. శ్రీ ఘంటసాల గారు
ఈ పాటను గురించి ఇల్లాలి ముచ్చట్లు బ్లాగులో శ్రీమతి సుధ గారు వ్రాసిన వ్యాఖ్యానం ఈ లింక్ కి వెళ్లి చదవండి(http://illalimuchatlu.blogspot.in/2012/02/blog-post_20.html). ప్రతిపదార్ధ వివరణతో పద ప్రయోగం లోని విశేషాలను వివరిస్తూ అద్భుతంగా వ్రాశారు. పాట  ఆడియోలింక్ కూడా ఉంచారు.
వారి బ్లాగులో వీడియో కనిపించడం లేదు. అది ఇక్కడ చూడవచ్చు.

నేను కేవలం సుధ గారు వ్రాసిన వ్యాసం లోని యక్షగాన సాహిత్యాన్ని విడిగా ఒకదగ్గర పెట్టాను అంతే...!!

  
**************************************** 
ఈ పాట ఆడియో లింక్:


****************************************
 
అంబా పరాకు దేవీ పరాకు
మమ్మేలు మా శారదంబా పరాకు

ఉమా మహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవనా గజాననా!

బహుపరాక్ బహుపరాక్...
చండభుజాయమండల దోధూయమాన వైరిగణా – షడాననా!  
బహుపరాక్ బహుపరాక్..

మంగళాద్రి నారసింహ, బంగరుతల్లి కనకదుర్గ,
కృష్ణాతీర కూచెన్నపూడి నిలయా గోపాలదేవ

అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా
లలితకళల విలువ తెలియు సరసులు పదింపదిగ పరవశమయ్యే


ఈశుని మ్రోల హిమగిరి బాల- కన్నెతనము ధన్యమయిన గాథ

కణకణలాడే తామసాన కాముని రూపము బాపీ, ఆ కోపీ-
తాపముతీరి కనుతెరిచి తను తెలిసీ
తన లలనను పరిణయమాడిన ప్రబంధము –   || అవధరించరయ్యా ||


రావో రావో లోల లోల లోలం బాలక రావో....
లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి

రాజ సులోచన రాజాననా...

చెలువారు మోమున లేలేత నగవులా
కలహంస గమనాన కలికీ ఎక్కడికే

మానస సరసినీ మణిపద్మ దళముల
రాణించు అల రాజ హంస సన్నిధికే

వావిలి పూవుల మాలలు గైసేసి
వయ్యారి నడల బాలా ఎక్కడికే

కన్నారా నన్నేల కైలాస నిలయాన
కొలువైన అలదేవ దేవు సన్నిధికే 


తగదిది తగదిది తగదిది
ధరణీ ధర వర సుకుమారీ తగదిదీ ..
  
అండగా మదనుడుండగా
మన విరిశరముల పదనుండగా 
నిను బోలిన కులపావని తానై
వరునరయగ బోవలెనా ...ఆ.....ఆ....ఆ...తగదిది తగదిది తగదిది

కోరినవాడెవడైనా ఎంతటి ఘనుడైనా
కోలనేయనా సరసను కూలనేయనా
కనుగొనల ననమొనల గాసి చేసి -నీ దాసు చేయనా

ఈశుని దాసుని చేతువా
-అపసద!! అపచారము కాదా!!
కోలల కూలెడు అలసుడు కాడూ -ఆదిదేవుడే అతడూ !!
సేవలు చేసి ప్రసన్నుని చేయ  - నా స్వామి నన్నేలు నోయీ - నీ సాయమే వలదోయీ...

కానిపనీ మదనా కాని పనీ మదనా !!
అది నీ చేతకానిపనీ మదనా !!
అహంకరింతువ - హరుని జయింతువ !!  
అది నీ చేతకాని పని మదనా .....కానీపనీ మదనా.


చిలుక తత్తడి రౌత ఎందుకీ హూంకరింతా
వినకపోతివా ఇంతటితో-నీ విరిశరముల పని సరి
సింగిణి పని సరి - తేజోపని సరి - చిగురికి నీ పని సరి మదనా
కానిపనీ మదనా....


సామగ సాగమ సాధారా -శారద నీరద సాకారా
దీనా ధీనా ధీసారా 

ఇవె కైమోడ్పులు            - ఇవె సరిజోతలు
వినతులివే అరవిందోజ్వలా  - ఇదె వకుళాంజలి మహనీయా
ఇదె హృదయాంజలి         - ఈశా మహేశా    || సామగ సాగమ ||


విరులన్ నిను పూజచేయగా - విధిగా నిన్నొక గేస్తు సేయగా
దొరకొన్న రసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ


కరుణన్ గిరిరాజ కన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా
మరుడే పున రూపున వర్థిలుగా
రతి మాంగల్యము రక్ష సేయరా ప్రభూ -పతిభిక్ష ప్రభూ....


అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో
జనకుడవై ఆదరణగ తనయునిగా జేకొనవో
అంబాయని నను పిలిచెను వినవో...

మనమే నీ మననమై తనువే నీ ధ్యానమై
నీ భావన లీనమైన గిరిబాలనేకొనవో
శరణంభవ శరణంభవ శరణంభవ స్వామీ !!
పరిపాలయ పరిపాలయ పరిపాలయమాం స్వామీ!!


బిడియపడి భీష్మించి పెళ్ళికొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం
విరులచే వరునిచేకరముచేకొనజేయు జగమేలు తల్లికి జయమంగళం
కూచేన్నపూడి భాగవతుల సేవలందే దేవదేవునికి మంగళం||
శ్రీమతి సుధ గారికి మనః పూర్వక ధన్యవాదాలు.



పూర్తిగా చదవండి...

Friday, November 23, 2012

విశాఖపట్నం లో 'శారద రాత్ర కవితా కౌముది' కవి సమ్మేళనం..

విశాఖ పట్నం లో 'శారద రాత్ర కవితా కౌముది' కవి సమ్మేళనం..
శ్రీ విశాఖ సారస్వత వేదిక మరియు శ్రీ విజయ త్యాగరాజ సంగీత సభ ల సంయుక్త ఆధ్వర్యం లో 2012, నవంబరు 28  బుధవారం, శ్రీ నందన నామ సంవత్సర కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం 6:30 గంటలకు, స్థానిక మధురానగర్, శంకర మఠం లో నిర్వహించ బడును.
మరిన్ని వివరాలకోసం ఫోటో పై క్లిక్ చేసి పెద్దది గా చూడండి.
పై కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే..!!

పూర్తిగా చదవండి...

Wednesday, November 21, 2012

భరత మాత ముద్దు బిడ్డలు.. !!


              26 నవంబరు 2008 నాటి రాత్రి ముంబాయి నగరానికి కాళరాత్రి. ఆనాటి ముష్కర మూకల దాడిలో మరణించిన అమరవీరుల ఆత్మలకు నేడు శాంతి చేకూరింది. ప్రాణాలతో పట్టుబడ్డ ఒకేఒక్క తీవ్రవాది కసబ్ ను మన న్యాయస్థానాలు చట్టప్రకారం విచారించి విధించిన ఉరిశిక్షను ఘటన జరిగిన నాలుగేళ్ల తరువాత అమలు చేసి వారి బలిదానానికి ఈ రోజు భారత ప్రభుత్వం బదులివ్వగలిగింది. అతడు అప్పీలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించిన వెంటనే మరిక ఎలాంటి సాగతీతకూ తావివ్వకుండా, రెండో కంటివాడికి  కూడా తెలియకుండా శిక్షను అమలుపరచి ఆనాటి అమరవీరుల కుటుంబాలకు స్వాంతన చేకూర్చగలిగింది. 
                 రాజకీయ నాయకుల కొట్లాటలూ, ఈ ఉదంతం నుండి లబ్ధి పొందడానికీ, తద్వారా ఓట్లు దండుకోవడానికి ప్రయత్నించడాలూ, మీడియా రాద్ధాంతాలూ, మన మేధావుల వ్యాఖ్యానాలూ ఇక రాబోయే రోజుల్లో తప్పక చూడబోతాం. కానీ నిజానికి తమకున్న ఆధారాన్నీ, పెద్దదిక్కునీ కోల్పోయిన ఆకుటుంబాలు తమ జీవితంలో అస్సలు ఊహించని అతిపెద్ద కుదుపుకి లోనయ్యాయి. వారికి మన రాజకీయ నాయకుల మెరమెచ్చు మాటలు స్వాంతనని కలిగించలేవు. వారికి కలిగిన నష్టం పూడ్చలేనిది.
            ఆనాటి రాత్రి దేశం మీద కేవలం పదిమంది సీమాంతర ఉగ్రవాదులు జరిపిన యుద్ధంలో మరణించిన ఒక్కొక్క వీరుడిదీ ఒక్కొక్క వీరగాధ. ఒక్కొక్కరి నేపధ్యాలూ, స్థితిగతులూ, హోదాలూ వేరు..!! కానీ అన్ని కథలలోనూ వినిపించిన అంతర్వాణి దేశభక్తి తప్ప మరొకటి కాదు. ఆ విపత్కర సమయంలో ఏ ఒక్కరూ మడమ త్రిప్పలేదు. తమ దేశ ప్రజల కోసం పోరాడారు. ఆ క్షణంలో వారి మదిలో దేశరక్షణ, విధి నిర్వహణ, ముంబైకార్ల భద్రత తప్ప మరొక విషయం ఆలోచించి ఉండరేమో..! ప్రమాదానికి రొమ్ము ఒడ్డి తన బలగాన్ని లీడ్ చేసి 'ముందుండి నడిపించడం' అంటే ఏమిటో చూపించారు ఈ ఉన్నతాధికారులు..! తమ కుటుంబానికి తామే ఆధారమైనా, ప్రజా శ్రేయస్సు కోసం ప్రాణాలకు తెగించారు ఈ చిరుద్యోగులు. ప్రమాదం ఎటునుంచి పంజా విసురుతుందో తెలియని నిశిరాత్రిలో మనకెందుకని పారిపోకుండా, గాయపడ్డ తోటివారికి సహాయమందించారు మరికొందరు సామాన్యులు.  ఆ నాయకత్వ లక్షణాలు, తెగింపు మరువలేనిది.  ఇలాంటి వారు మన జాతికి గర్వకారణం..! మన యువతకు స్ఫూర్తి కలగాల్సింది ఈ యోధుల పోరాట పటిమ నుంచి...! మన నిజమైన దేశనాయకులు వీరే..!!   మాతృభూమి ఋణం తీర్చుకున్న వీరే భరత మాతకు నిజమైన ముద్దు బిడ్డలు...!!


కీ. శే. హేమంత్ కర్కరే 

 కీ. శే. అశోక్ కాంప్టే 

కీ. శే. విజయ్ సాలస్కర్ 
కీ. శే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ - ఆ కళ్ళలో కొట్టొచ్చిన ఆత్మవిశ్వాసం చూడండి..!!






 కీ. శే. తుకారాం ఓంబ్లే - తన శరీరాన్ని బుల్లెట్లు జల్లెడ చేస్తున్నా లక్ష్యపెట్టక అజ్మల్ కసాబ్ ను సజీవంగా పట్టుకొని  ప్రాణాలు విడిచిన  ధీశాలి.

ఇంకెందరో అమరవీరులు ..!!

మానవత్వం మీద జరిగిన దాడిలో 
విధినిర్వహణలో దేశం కోసం ప్రాణాలొడ్డిన ఈ  వీరపుత్రులకు 
శతసహస్ర వందనాలర్పిస్తున్నాను.
జై హింద్..!! జై హింద్..!! జై హింద్..!!
********
దేశాభిమానము నాకు కద్దని 
వట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని ఏదైనా ఒక మేల్ 
కూర్చి జనులకు చూపవోయ్..!

సొంత లాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడు పడవోయ్
దేశమంటే మట్టికాదోయి
దేశమంటే మనుషులోయ్ !

చెట్ట పట్టాల్ పట్టుకుని
దేశస్తు లంతా నడవవలె నోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలె నోయి !
***************


పూర్తిగా చదవండి...

Tuesday, November 13, 2012

వడ్డాది పాపయ్యగారు దీపావళి సందర్భంగా గీసిన బొమ్మలు..!

బ్లాగు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు. 
అందరూ దీపాల పండుగ 'ధమాల్ ధమాల్' గా చేసుకొని ఉంటారని తలుస్తాను. 
మన వడ్డాది పాపయ్యగారు దీపావళి సందర్భంగా గీసిన బొమ్మలు మీకోసం..!!
 పై చిత్రాలు స్వాతి సపరివార పత్రిక ముఖచిత్రంగా వేసినవి 
(మొదటిది దీపావళికి గీసినదా లేక సంక్రాంతికా..!!??)
 నరకాసురుడిని సంహరిస్తున్న సత్యభామ.
 ఇవి మూడూ 'యువ' మాస పత్రిక దీపావళి ప్రత్యేక సంచికలకు వేసిన బొమ్మలు 


పూర్తిగా చదవండి...

Sunday, November 4, 2012

శకునాలూ..! సెంటిమెంట్లూ..!!


సెంటిమెంట్ , శకునం అంటే ఏమిటి..?


           
రెండూ మనిషియొక్క నమ్మకం మీద ఆధార పడేవే..! అలాగే రెండిటి పర్యవసానం ఒకటే గానీ కొంచం తేడా ఉంది. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు 'శకునం' చూసుకొని వెళ్ళమంటారు. ముత్తైదువ ఎదురొస్తే మంచిది.., దంపతులు ఎదురొస్తే మంచిది.., పిల్లి ఎదురొస్తే మంచిది కాదు.., పనిమీద వెళ్తున్నప్పుడు తుమ్మితే లేదా ఎక్కడకి అని అడిగితే పని జరగదు..,   ఇలా శకునాల గురించి పంచాంగాల్లో చూస్తే చాలానే రాసి వుంటుంది.! [దీనిలో కొన్ని శకునాలకి స్త్రీ పురుషుల తేడాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి అబ్బాయిలకి కుడికన్నులేదా భుజం అదిరితే కన్యాలాభం అంటారు. ( ఘంటసాల పాత పాట ఒకటి గుర్తుతెచ్చుకోండి.. అన్నీ మంచి శకునములే.. కన్యా లాభ సూచనలే..).  అదే కుడికన్నుఆడవాళ్ళకి అదిరితే మంచిది కాదంటారు.]  
        ఇక సెంటిమెంటు అనేది మనోభావాలకి సంబంధించినది. ఇది ఒక్కో వ్యక్తికీ ఒక్కో విధంగా ఉండడం చూస్తాం. కలాపోసన లేని మడిసి (గొడ్డు లాంటోడయినా) ఉంటాడుగాని  సెంటిమెంటు లేని మనిషి బహుశా ఉండడేమో..!!
ఇది లాజిక్ కి అందనిది, సైన్సు నిరూపించలేనిది. సమాజంలో వివిధరంగాలలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారికి ప్రత్యేకించి రాజకీయాలూ, క్రీడలూ, సినీమా, వ్యాపారం మొదలైన రంగాల్లో ఉన్నవారికి ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. విద్యార్ధులూ, ఇంటర్వ్యూ లకు వెళ్ళే వారికి కూడా ఈ బాధ తప్పదు. మొదటి రకానికి చెందిన వారిలో ఆ సెంటిమెంటు జీవితాంతం ఉంటే రెండో వర్గానికి ఇది సందర్భానుసారం మారుతూ ఉండవచ్చు. చూసేవాడికి  చాలా సిల్లీ గానూ మూర్ఖం గానూ అనిపించే విషయాలు ఆ సెంటిమెంట్ ఉన్నవాడికి డూ ఆర్ డై లాగా ఉంటుంది...!!
        నామట్టుకు నాకు చిన్నప్పుడు కొన్ని సెంటిమెంట్లు ఉండేవి. పరీక్షలలో మొదటి పరీక్షకి వెళ్ళినప్పుడు ఏ చొక్కా వేసుకొని వెళ్ళానో అదే చొక్కా అన్ని పరీక్షలకీనూ..!! (మధ్యలో ఏదైనా పరీక్ష చెడగొట్టాననుకోండి...! వెంటనే అదే సెంటీ ఇంకో చొక్కా మీదకి మారిపోయేది.) అలాగే పరీక్షలకి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ త్రోవలో చదువుకుంటూ వెళ్ళేవాడిని కాదు. పదోక్లాసులో లెక్కల పరీక్షకి (మొదటి యూనిట్ టెస్ట్) పరీక్షకి బయల్దేరి స్కూల్ కి వెళ్ళేదాకా రోడ్డుమీద చదువుకుంటూ వెళ్లాను. ఆరోజు పరీక్షలో ఒక్క లెక్కకి కూడా ఆన్సర్ రాయలేక పోయాను. ఖాళీ పేపర్ ఇచ్చేయ్యడంతో సున్నా వచ్చింది. అప్పటి నుంచి సెంటిమెంట్ పట్టుకుంది. తరువాత చచ్చినా త్రోవలో చదివేవాడిని కాదు. తరువాత ఫైనల్ పరీక్షల్లో 98 వచ్చాయనుకోండి.. ! అదివేరే విషయం..!!
              క్రికెటర్స్ లో కొందరికి ఒక స్టేడియం అచ్చొచ్చిందైతే మరికొందరికి ఇంకోటి. ఈ సెంటిమెంట్లని ఎస్టాబ్లిష్ చెయ్యడం లో పత్రికల వాళ్ళు ముందుంటారు. ఏదో రకంగా బోడిగుండుకీ మోకాలికీ ముడి వేసి కొన్నాళ్ళకి అదే సెంటిమెంటుగా ప్రాచుర్యం లోకి తెచ్చేస్తారు. క్రీడాకారుల నమ్మకాలే వీళ్ళూ రాస్తారేమో కూడా..! సెంటిమెంటు కొద్దీ ఒక ఆటగాడు పిచ్ మీదకి బ్యాటింగ్ కి రాగానే మూడుసార్లు తన పాడ్ ని సర్దుకొని ఆకాశం వైపు చూస్తే, ఇంకో ఆటగాడు తన కుడి చేత్తో బాట్ పట్టుకొని అపసవ్య దిశలో బ్యాటు ని  గాల్లో రెండున్నర సార్లు తిప్పి సూర్యుడి వైపు చూస్తాడు. ప్రేక్షకులకీ ఇలాంటివి ఉంటాయండోయ్..!! కొందరు మన టీం బ్యాటింగ్ చేస్తున్నంత సేపూ కూర్చున్న చోటు నుంచీ కదలకపోతే (కాలుకూడా పెట్టిన చోటు నుంచి కదపని వాళ్ళు నాకు తెలుసు.), వీడు టీ తాగగానే వికెట్టు పడిందని ఆట అయ్యే లోపల ఇరవై కప్పులు ఊదేసేవాళ్ళు కొందరు. అలాగే పాకిస్తాన్ తో మాచ్ కి శుక్రవారం సెంటిమెంట్ కూడా ప్రాచుర్యం లో ఉన్నదే.

                సినిమా పరిశ్రమలో కొందరు హీరోలకి సినిమా పేరు ఫలానా అక్షరంతో మొదలవ్వాలని సెంటిమెంటైతే, ఇంకొందరికి పేరు చివర పొల్లు ఉండాలి. కొందరికి సంక్రాంతి సెంటిమెంటైతే మరికొందరికి దసరా..! రాజకీయ నాయకులకి ఈ సెంటిమెంట్లు ఇంకా చిత్రంగా ఉంటాయి. ఈ నియోజక వర్గం నుండీ ప్రచారం మొదలెడితే జయం నిశ్చయం అనీ, ఫలానా ఊరిలో శంకుస్థాపనకో రిబ్బన్ కటింగ్ కో వెళ్తే అట్నించి అటే పదవి పోగొట్టుకోవాల్సి వస్తుందనీ, చాలా..!! ఒక స్థానం లో పని చేసిన మంత్రులిద్దరూ వేరే వేరే కారణాల వాళ్ళ పదవి అర్ధంతరంగా ఊడగొట్టుకుంటే ఆ వచ్చే మూడో ఆయన, ఆయనకి  బాగా అచ్చొచ్చిన పార్టీ ఆఫీసు నుంచో  క్యాంపు  కార్యాలయం నుంచో పనులు నడుపుతాడు గానీ, చచ్చినా పాత ఆఫీసులో కాలు పెట్టడు. పెట్టినా దాని రూపు రేఖలూ, వాస్తూ సమూలం గా మార్చిగానీ గృహప్రవేశం చెయ్యడు.


              పైన చెప్పిన అన్ని సందర్భాలలోనూ వివిధ రంగాలకు చెందిన వ్యక్తులందరి మధ్యా కామన్ గా కనిపించేది వారి మానసిక దౌర్బల్యమే (బలహీనత) తప్ప మరొకటి కాదు. తమ జీవితాలలో ఒక స్థాయికి చేరడానికి స్వయంశక్తిని నమ్ముకున్నవారు ఆ స్థాయిని నిలబెట్టుకోవడానికి ఈ సెంటిమెంట్ ల మీద ఆధారపడడం మొదలుపెడతారు. దీనిలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ సెంటిమెంట్ కి రాజూ - పేదా తేడాలేదు.  దీనికి ముఖ్య కారణం ఫలితాన్ని ఆశించి పని చెయ్యడం..! ఆశించిన ఫలితం వచ్చి తీరాలనో, రాకపోతే ఏదో  అయిపోతుందేమోననే భ్రమ, దాని పర్యవసానమైన భయం ఇంకో కారణం. కొన్నిసందర్భాలలో ఈ సెంటిమెంట్ విషయంలో అది ఉన్న వ్యక్తులకే అది చాలా ఫూలిష్ గా అనిపిస్తుండొచ్చు. కానీ అది పాటిస్తే పని జరుగుతుందన్న నమ్మకం కన్నా పాటించకపోతే పని జరగదన్న అపనమ్మకం ప్రభావమే అధికంగా ఉంటుంది..! అందువల్ల ఆ సెంటిమెంట్ ని వదలలేక సతమతమౌతూ ఉంటారు.
                 ఈ మానసిక స్థితి నుంచీ బయటపడాలంటే చెయ్యవలసింది మన శక్తియుక్తులన్నీ చేసే పనిమీద కేంద్రీకరించి చేసే పనిని నీకు చేతనైనంతలో చక్కగా చెయ్యడం, ఫలితాన్ని ఆశించక పోవడం.
గీతాచార్యుడి వాక్కుని జ్ఞాపకం చేసుకుందాం: 
కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన
నీకు కర్మలను ఆచరించుటయందు అధికారమున్నది గాని కర్మఫలములపైన లేదు.
ఫలితం ఎలాఉన్నాఫరవాలేదనే మానసిక స్థితికి మనం చేరగలిగినప్పుడు, దాన్ని మనం ప్రభావితం చేస్తున్నామనే భ్రమలో పాటించే ఈ సిల్లీ సెంటిమెంట్లకి దూరంగా ఉండగలుగుతాం.

పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)