Sunday, December 26, 2010

శ్రీ పశుపతినాధేశ్వర దర్శనం

నిన్న నా జీవితం లో మరచిపోలేని ఒక అద్భుత దర్శనం జరిగింది. విజయనగరం లో శ్రీ పశుపతినాధేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాను. ఆలయాన్ని కట్టి రెండు మూడేళ్ళు అవుతున్నట్టు ఉంది. నా ఫ్రెండ్/పార్టనర్ విజయ్ ఇంతకు ముందు ఒకసారి దర్శనం చేసుకొన్నాడు. సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక దర్శనం ఉంటుందని అంటే.. సరిగ్గా ఆ టైము కి శివాలయానికి వెళ్ళేట్టుగా ప్లాన్ చేసుకొని, ఆ లోపల మా మిగతా పనులు ముగించుకొని, ఆరయ్యే సరికి శివాలయం దగ్గర వున్నాం. మాతో పాటూ మా క్లయింట్ (ఆయన ఆలయ కమిటీ మెంబరు కూడానట) కూడా వచ్చారు. శివ లింగం స్ఫటికమని చెప్పారు. నేను ఇంతకు ముందు (రామేశ్వరం లో అనుకుంటాను..) ఒక చోట స్పటిక లింగం చూసాను. చిన్నది..దాని వెనుక దీపం పెట్టారు. స్ఫటికం లోనుండి..ఆ కాంతి మనకు కనిపిస్తుంది.!! నేను కూడా అలానే ఊహించుకొంటూ వెళ్ళాను. కానీ ఇక్కడి శివలింగం..పానవట్టమే ఎత్తు సుమారు మూడడుగులుంది. స్ఫటికం బయటకు లింగాకృతి లో ఒకటిన్నర అడుగులు కనిపిస్తుంది. లింగం వెండి తొడుగుతో కప్పబడి (నాకు మొదట తెలీదు), దానిమీదనే పరమేశ్వర ముఖాకృతి (లింగం నలు వైపులా నాలుగు) చెక్కబడి ఉంది. వెండికట్టు కట్టిన రుద్రాక్ష మాలలతోనూ, వివిధ రకాలైన పుష్పాలతోనూ అలంకరించబడి ఉంది. ప్రధాన ఆలయానికి ఆనుకొని వున్న మంటపంలో ఉపాలయాలుగా ద్వాదశ జ్యోతిర్లింగాలనూ ప్రతిష్టించారు. గర్భాలయానికి చేరోవైపూ, విజయ గణపతి మరియు అపర్ణాదేవి ఆలయాలున్నాయి.

మేము వెళ్ళే సరికి అర్చకులు ఇక్కడ వేంచేసి వున్న స్వామిని గురించీ, అప్పుడు జరగబోయే స్పటిక లింగ దర్శనం విశిష్టతను గురించి మైకు లో అనౌన్స్ చేస్తున్నారు. స్వామి శ్రీ పశుపతి నాధేశ్వరునిగా కొలువు తీరారు. ప్రొద్దున్న 6:30 నుంచి, ఎనిమిదిన్నర వరకూ స్వామికి అభిషేకం జరుగుతుంది. అభిషేకానంతరం నాలుగు ముఖాలతో అలరారే వెండితోడుగుని లింగం పై కప్పి వుంచి సాయంత్రం మళ్ళీ ఆరుగంటలకి హారతి, స్పటిక లింగ దర్శనం ఉంటాయట. దర్శనానికి వచ్చిన భక్తులందరూ వరుసలోమూల విరాట్టుకీ నందీశ్వరునికీ మధ్యత్రోవ వదలి ఇరుప్రక్కలా కూర్చొన్నారు. అర్చక స్వాములు ఒకరు ఘంట, ఇంకొకరు ఢమరుకం, వేరొకరు డప్పు లయబద్ధంగా మ్రోగిస్తూ వుండగా, స్వామివారి సాయంత్రపు హారతి మొదలైంది. ఆ వాద్య ఘోషలో ఓంకారం వినిపిస్తూండగా, ఆ లయలో లీనమౌతూ ఆ నాదాన్ని వింటున్నకొద్దీ.. ఒకరకమైన గగుర్పాటు..! ఒక రకమైన పరవశంతో చేతులు నాకు తెలియ కుండానే ' తక తకిట.. ,తక తకిట.. ' అంటూ ఖండ గతిలో వున్న ఆ లయని అనుసరించ సాగాయి..!!

అర్చనానంతరం..హారతి అంతా దాదాపు ఇరవై నిముషాలపాటూ సాగింది. మొదట ఎదురుగావున్న స్వామివారి ముఖానికి హారతిచ్చి, భక్తితో స్వామికి ప్రణమిల్లి, రెండవముఖం ఎదురుగా వచ్చేలా వెండి తోడుగుని జరిపి, మరలా దానికి హారతిచ్చారు. అలా పశుపతి నాధుని నాలుగు ముఖాలకీ ప్రత్యేక హారతిచ్చారు. తరువాత ఆలయం లో వున్న విద్యుద్దీపాలన్నిటినీ ఆపివేసి.. వేద మంత్రోచ్చారణ నడుమ, 'హరహర మహాదేవ శంభో శంకర' అని నామ ఘోష మార్మోగుతుండగా..స్వామికి కప్పబడి వున్న వెండి తోడుగుని తీసేశారు. ఒక్కసారిగా స్పటిక లింగ రూపం లో స్వామి దర్శనం..!! ఆహా..!! పరమాద్భుతం..! మాటలకందని ఆనందం!! దేదీప్యమానమైన కాంతులతో వున్న స్వామిని చూడడానికి రెండు కళ్ళూ చాలలేదు.చీకటిలో చుట్టూ వెలిగే చిరు దీప కాంతుల మధ్య తెల్లటి వెలుగు తో వున్న వున్న స్పటికలింగాన్ని చూస్తే, కార్తీక పౌర్ణమి రోజున మినుకు మనే నక్షత్రాల మధ్య వెండి వెన్నెలల జాబిల్లి తలపుకి వచ్చినా , 'ఆహా! ఈ సుందరేశ్వరుడి సౌందర్యం ముందు, ఇంకే సౌందర్యమైనా దిగదుడుపే..!' అనిపించక మానదు. తెల్లవారు ఝామున.. కార్తీక స్నానాలకోసం నూతిగట్టు దగ్గరికి వెళ్లి, పైబట్టలు తీసి నిలబడ గానే, చల్లటి గాలికి ఒళ్ళు ఒక్కసారి జలదరించినట్టై, రోమంచితమవుతుంది చూడండి..!! అదే అనుభవం కలిగింది నాకు.

ఇక అర్చకులు మైకులో స్వామివారి వివిధ స్తోత్రాలనూ మొదలైన వాటిని చదువుతూ వుంటే.. అక్కడ వున్న భక్తులకూ..అవి ముద్రించి వున్న కరపత్రాలను పంచి అర్చకులతో గొంతు కలిపే అవకాశాన్ని కల్పించారు. ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపూ ఒక రకమైన ట్రాన్స్ లో వున్నట్టనిపించింది.

స్తోత్ర గానం పూర్తి అవగానే అందరమూ లేచి.. ఉపాలయాలలోని ద్వాదశ జ్యోతిర్లింగ ప్రతిరూపాలనూ దర్శించుకొని స్ఫటికలింగానికి దగ్గరగా వెళ్లి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలూ, శఠారినీ పుచ్చుకోన్నాం. ఈలోపలే స్వామివారికి అలంకరణ కూడా పూర్తి అయింది.
ఇప్పుడు స్వామి వారికి,(స్పటిక లింగానికి) వెండి నామాలూ మధ్యలో నిలువుగా ఎర్రటి పోడులతో తాపడం చెయ్యబడిన..మూడవ నేత్రం, రుద్రాక్షలూ, అన్నీ అలంకరించారు..! ఇప్పుడింక స్వామివారి అందం ద్విగుణీకృతం అయింది. పునర్దర్శన ప్రాప్తి కోరుకొంటూ..అక్కడి నుంచి పక్కనే వేంచేసి వున్న లక్ష్మి, పార్వతీ సమేత జ్ఞాన సరస్వతీ దేవి దర్శనం కూడా చేసుకొని మెల్లగా బయలు దేరి విశాఖపట్నానికి తిరుగుప్రయాణమయ్యాం.
శ్రీ పశుపతి నాధేశ్వరాలయం మరియు జ్ఞాన సరస్వతీ ఆలయం లోనికొన్ని చాయా చిత్రాలను చూడడానికి ఈ లింకు నొక్కండి: http://travel.webshots.com/album/576720508ahJGRe

ravi7us గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి ఫోటోల లింక్ ఉపయోగిస్తున్నానని వారికి చెప్పి అనుమతి కోరడానికి లింక్ లో వారి ఈమెయిలు ఏమీ కనిపించక పోవడం చేత..ఇలా బ్లాగ్ ద్వారానే ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఈ ఆలయాన్ని గురించిన ఇంకొన్నివివరాలూ , కరపత్రాలూ స్కాన్ చేసి మళ్ళీ ఇదే పోస్ట్ లో పెడతాను.
పూర్తిగా చదవండి...

Friday, December 17, 2010

తంబురా శ్రుతి..!!

పనిచేసుకొనేప్పుడు కూనిరాగం తీయని వాడు ఉండడు. అందునా శాస్త్రీయ సంగీతం నేర్చుకొనీ కూనిరాగాలు తీసేసే వాళ్లకి తంబురా శ్రుతి వింటూ పాడుకొంటే వుండే ఆనందమే వేరు...! కంప్యూటర్ లోనూ, కారులో.. శ్రుతి ఎక్కడ వస్తుంది చెప్పండి..!! మనసు రాగాల పల్లకి లో ఒలలాడుతూవుంటే శ్రుతి చక్కని పిల్లతిమ్మెరలా హాయినిస్తుంది. చక్కగా అందుబాటులో ఉండేలా శ్రుతి బాక్స్ టూల్ దొరికింది. దానిని ఫోన్ లో గానీ..లేక కంప్యూటర్ లోగానీ రన్ చేసుకొని అది వింటూ పాడుకోవడమే ఇంక..!! పైగా మన పాటని మనమే శ్రుతి సహితం గా రికార్డు కూడా చేసుకోవచ్చు.


క్రింద లింక్ ని నొక్కి ఈ టూల్ ని డౌన్లోడ్ చేసుకొని ఆనందించండి..!!!


దీనిలో అదనపు ఆకర్షణ ఏంటంటే.. అన్ని శ్రుతులూ.. ఒక నిమిషం, ఎనిమిది నిమిషాల నిడివిలో wave sound format లో లభ్యం అవుతోంది..! మనకు కావలసిన నిడివిలో ప్లే చేసుకోవచ్చు...!!

అలాగే క్రొత్తగా సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టేవారికోసం సరళీ స్వరాలనుంచీ కృతుల వరకూ కూడా వున్నాయి.(దీనిగురించి ముందే తెలిసిన వాళ్ళు కొంచం వెనక్కి వుండండి..తెలియని వాళ్ళని ముందరకి రానియ్యండి మేష్టారూ..!!)
******
Android phone users can dowload from the following link or directly from android market:

పూర్తిగా చదవండి...

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)