Saturday, April 24, 2021

👨‍🦲 నున్నగుండు కథ..! 👨‍🦲

అనగనగా ఒక పల్లెటూర్లో ఒకడుండేవాడు. వాడికి నెత్తిమీద ఒక్క వెంట్రుక కూడా ఉండేది కాదు. చక్కగా, బోర్లించిన రాగి చెంబులాగా ఉండేది. అందుకని వాణ్ణి ఊర్లో అందరూ నున్నగుండు అని పిలిచేవారు. వాడి అసలుపేరు ఆ ఊర్లో ఎవ్వడికీ గుర్తుకూడాలేదు. వాళ్ళకేమిటి, మన కథానాయకుడే మర్చిపోయాడనుకోండి...! పలకరింపుకీ, వెక్కిరింతకూ, పని చెప్పడానికి, మాట్లాడదానికీ కూడా వాణ్ణి అందరూ "నున్నగుండూ..! , నున్నగుండూ..!!" అని పిలుస్తూ ఉంటే వాడికి చాలా ఉక్రోషం గా ఉండేది. ఈ బాధపడలేక వాడు ఆ ఊరినుంచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకొని, ఎవ్వరికీ చెప్పకుండా ఒకనాటి తెల్లవారు ఝామునే, ఇంకా చీకటి కూడా వదలకుండానే బయల్దేరిపోయి అలా చెట్లవెంటా పుట్టలవెంటా అడవుల్లోకి వెళ్ళిపోయాడు.
 

కొద్దిరోజులు అలా దొరికిందేదో తింటూ అరణ్యాలు పట్టి తిరుగుతూ ఉంటే వాడికి ఒక మునీశ్వరుడు కనిపించి, "నాయనా ఎవరునువ్వు..! ఎందుకీ నిర్జనారణ్యంలో ఒంటరిగా తిరుగుతున్నావు..!? అడవి మృగాల కంట పడ్డావంటే అపాయంకదా..!" అని అడిగాడు. 


నాకెవరూ లేరండీ..! నాకసలు బ్రతకాలనే లేదు..! అంటూ వలవలా ఏడుస్తూ ముని పాదాల చెంత కూలబడ్డాడు మన నున్నగుండు(చూశారా..! నేనూ వాణ్ణి అలాగే అనేశాను..! ప్చ్..!). 

 

ఏమైంది నాయనా జీవితం మీద అంత విరక్తి చెందావు..!? అని ముని అడిగితే, మనవాడు మళ్ళీ ఏడుపు మొదలుపెట్టి వాడికథంతా చెప్పాడు. 

 

"నా గుండుమీద ఎలాగైనా జుత్తు మొలిపించండి స్వామీ.. అంటూ కాళ్ళావేళ్ళా పడ్డాడు. అప్పుడా ముని "నీ బోడిగుండుమీద జుత్తు మొలిపించడం బ్రహ్మతరం కూడా కాదు నాయనా, దాని సంగతి మర్చిపో..! అని, "ఉండు, నిన్నింక ఎవరు నున్నగుండు అని పిలిచినా వాళ్ళకి తగిన శాస్తి జరిగేలా చేస్తా..!, ఏదీ నీ కుడి చెయ్యి ఇలా చూపించు" అని అడిగి వాడిచేతికి ఒక మంత్రం వేశాడు. ఇకనుంచి నిన్ను ఎవరైనా నున్నగుండూ అని పిలిస్తే వాడి నెత్తిమీద చెయ్యిపెట్టు, తక్షణం వాడి జుత్తు కూడా చక్కగా ఊడిపోయి నున్నగుండుగా మిగుల్తాడు" అని తనదారిన తాను వెళ్ళాడు. 

 

మనవాడు సంతోషంగా తన ఊరి దారి పట్టాడు. ఊర్లోకి ఇంకా చేరకుండానే ఒకడు కనిపించి "ఓరి నున్నగుండూ, బాగున్నావా..!? ఇన్నిరోజులు చెప్పాపెట్టకుండా ఎక్కడికి పోయావు..!?" అని అడిగాడు. వెంటనే మనవాడు.. "నన్ను నున్నగుండు అంటావా, నువ్వు నున్నగుండైపోవ..!" అంటూ వాడి నెత్తిన చెయ్యి పెట్టాడు. వెంటనే అవతలవాడి జుత్తు సమస్తం మాయమై ఒక చక్కని బోర్లించిన కుండలాగా అయిపోయింది. అది చూసిన మన నున్నగుండు ఆనందానికి అవధుల్లేవు. గంతులేస్తూ ఊర్లోకి వెళ్ళాడు. ఊర్లో వీణ్ణి చూసిన అందరూ వీణ్ణి నున్నగుండూ అని పిలవడం, వీడు "నన్ను నున్నగుండు అంటావా, నువ్వు నున్నగుండైపోవ..!" అంటూ వాళ్ళ నెత్తిన చెయ్యిపెట్టడం..! 

 

ఆ దెబ్బకి ఊర్లో మూడొంతులమంది, ఆడ, మగ, పెద్దా చిన్నా తేడా లేకుండా నున్నగుండులైపోయారు. వాళ్ళంతట వాళ్ళు ఈ మంత్రం సంగతి తెలియక మనవాడిని నున్నగుండు అని నున్నగుండై పోయినవాళ్ళు కొందరైతే, మరికొందరిని మనవాడే వెళ్ళి మరీ నున్నగుండు చేసి చక్కా వచ్చాడు. అందరూ నున్నగుండు అయిపోయాక ఎవరు అసలు నున్నగుండో తెలియకుండా పోయింది. 

 

ఇదిలా ఉండగా ఒకరోజు మనవాడికి మంత్రం వేసిన మునీశ్వరుడు ఆ ఊరొచ్చారు. ఊళ్ళో ఇలా అందరూ నున్నని గుళ్ళతో ఉండడం చూసి ఆశ్చర్యపోయి, విషయం ఏమిటని ఆరా తీస్తే వాళ్ళు మన కథానాయకుడి సంగతి చెప్పారు. "అరె, నేనిచ్చిన మంత్రాన్ని ఇంతదారుణంగా ప్రయోగించాడా అని కోపంగా, ఎక్కడున్నాడు ఆ నున్నగుండు గాడు అన్నాడు..! ఆ జనంలోనే ఉన్న మన అసలు నున్నగుండు, "నువ్వుకూడా నన్ను నున్నగుండు అంటావా, నువ్వు నున్నగుండైపోవ..!" అంటూ ఆ ముని నెత్తిమీద చెయ్యిపెట్టేశాడు. దెబ్బకి ఆ మునికూడా నున్నగుండై కూర్చున్నాడు. 

 

దాంతో వాళ్ళంతా తమ మొహాలు చూసుకోలేక, మమ్మల్నింకెవరు చూస్తారంటూ తెగ బాధపడుతూ ఉంటే మన మునీశ్వరుడి గురువుగారు ప్రత్యక్షమై బాధపడకండి నాయనా, భవిష్యత్తులో మీరంతా ప్రపంచ ప్రఖ్యాతి పొందుతారు, అందరూ మీ బొమ్మలు మాటకి ముందు మాట తరువాతా ఉపయోగిస్తారు, మీ  ముఖాలు లేకుండా వాక్యాలు పూర్తవవు అని వరమిచ్చాడు.

😀😁😂😃😄😅😆😇😈😉😊😋😌😍

 

😎😏😐😑😒😓😔😕😖😗😘😙😚😛

 

😜😝😞😟😠😡😢😣😤😥😦😧😨😩

 

😪😫😬😭😮😯😰😱😲😳😴😵😶😷


అదిగో..! ఆ కథలో అలా వరంపొందిన నున్నగుండు గాడి బాధితులే ఇప్పుడు మనకి ఇమోజీలుగా దర్శనమిస్తూ, మన మెసేజ్ లలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి..! 

వాళ్ళ తరవాత తరాలవాళ్ళు జుత్తుతో మామూలుగానే ఉన్నారు.

👶👱👦👧👨👩👪👫👬👭

 

👤👥 🙋🙅🙆🙇🙋🙍🙎💁



అదండి..! నున్నగుండు అలియాస్ ఇమోజీల కథా కమామిషూ..!!

 

- రాధేశ్యామ్ రుద్రావఝల 🙏🙏🙏


పూర్తిగా చదవండి...

Friday, April 23, 2021

పరీక్షలు బాబోయ్ పరీక్షలు..! (రెండవ భాగం)

మొదటిభాగం చదవని వారు ఇక్కడ చదవవచ్చు.

తరువాత 10వ తరగతి పరీక్షలు: నేను యలమంచిలి GJ కాలేజ్ లో చదువుకున్నాను. ఐతే ఇక్కడ మొదట యూనిట్ టెస్ట్ స్టోరీ చెప్పాలి..! మాకు ఆ సంవత్సరం రమణరావు మాస్టారని లెక్కలు చెప్పడానికి వచ్చేవారు..! సిగిరెట్లు విపరీతంగా కాల్చేవారు. అంత నీట్ గా డ్రెస్సప్ అయ్యేవారు కాదు. ఇన్ షర్ట్ చేసేవారు, అదికూడా సరిగ్గా ఉండేది కాదు..! బెల్టు పెట్టుకొనేవారు కాదు.  గడ్డం కాస్త నెరిసి ఉండేది, నీట్ గా షేవ్ చేయ్యగా నేనెప్పుడూ చూడలేదు..! నాకేమో ఆ సిగరెట్ వాసన అస్సలు పడేది కాదు. నేను ముందు వరస లో కూర్చొనేవాణ్ణి..! దృష్టి పాఠం మీదకి వెళ్ళేది కాదు. ఆయన మాత్రం ఎప్పుడూ నన్ను బాగానే చూసేవారు..! సరదాగానే ఉండేవారు. నేనేమో ఆయనతో మాట్లాడేటప్పుడు కూడా మొహం మాడ్చుకొని మాట్లాడేవాణ్ణి..! ఇలా కొట్టుమిట్టాడుతూ ఉండగా మొదటి యూనిట్ టెస్ట్ వచ్చెసింది.


ఆరోజు పరీక్షకి బాగానే చదివాను, పరీక్షకి నడుచుకొని వెళ్తూ కూడా తోవంతా చదూకుంటూ వెళ్ళాను. పరీక్ష పేపరిచ్చారు. చూస్తే ఒక్కటికూడా నాకు వచ్చింది పడలేదు..! కనీసం ఒక్కటి కూడా..!! ఏంచెయ్యాలో తెలియలేదు. పక్కవాళ్ళని అడిగి రాసే అలవాటు ఎప్పుడూ లేదు..!! నాకు యేడుపు ఆగలేదు. పేపర్ ని అరగంట సేపు అటుతిప్పి ఇటు తిప్పి ఇంక భరించలేక లేచి వెళ్ళి ఖాళీ పేపర్ ఇచ్చేసాను. "అదేంట్రా.. అంత తొందరగా రాసేసావు..!?" అన్నారు..!! నేను మళ్ళీ ఇంకో రౌండు కన్నీళ్ళు పెట్టుకొని ఏమీ రావండీ అన్నాను.  అందుకే పాఠం శ్రద్ధగా వినాలి..! సరేలే..! దీంతో ఏమీ ఐపోలేదుకదా..! ఫైనల్ పబ్లిక్ పరీక్షల వరకూ బోల్డు పరీక్షలున్నాయి..! చూద్దాంలే ఎందుకు రావో మార్కులు..! అన్నారు..! ఆ క్షణంలో నాకు ఆయన సిగరెట్లూ, ఇన్ షర్టూ, మాసిన గడ్డం ఇవేమీ గుర్తు రాలేదు.! వారిలో నిజమైన గురువు కనిపించారు.! అప్పుడు ఇంకా ఏడుపొచ్చేసింది.! మొత్తానికి వారు నన్ను ఓదార్చి పంపేసారు..!

ఇంటికి వెళ్ళాక మా అమ్మ మళ్ళీ ఆవిడ ప్రశ్నలతో తయారు..!

ఎలా రాసావు రా..?

బాగారాయలేదు.

ఎన్నొదిలేసావు..?

అన్నీ వదిలేసాను..!

అదేమిట్రా..?? అసలు ఎన్నొస్తాయేం మార్కులు..!!??

ఏమీరావమ్మా..! సున్నా వస్తుంది..! ఏమీ రాయలేదు అంటూ ఉంటే..అంటూ కోపం పడిపోయి లోపలికి వెళ్ళిపోయాను. మొదటిసారి నాకెన్నొస్తాయో నేను ఊహించడం..!!


ఒకరోజు పేపర్లు ఇచ్చారు..! అనుకున్నట్టే ఇరవై అయిదుకి సున్నా వచ్చింది..!! అన్ని షీట్లమీదా పైనుంచీ కిందదాకా ఒక రెడ్ లైను.. ఫలితంగా సున్నా మార్కులు..! మా మాస్టారు అందరివీ ఆన్సర్ షీట్లు వెనక్కి తీసుకుంటూ.. నాతో, "ఏరా..! కౌంటింగ్ సరిపోయిందా? ఎక్కడేనా తప్పులున్నాయా..!" అని అడిగి నవ్వేసారు..!! నాకు కూడా నవ్వొచ్చేసింది..! కాని అందవలసిన పాఠం అందింది. అప్పటినుంచి నాలో బాగా మార్పు వచ్చింది. వారితో చాలా సన్నిహితంగా మసిలేవాణ్ణి. లెక్కల పాఠాలు చాలా  శ్రద్ధగా వినేవాడిని. వారు నాకు లెక్కలలో ఎంత సరదా ఉంటుందో అనుభవంలోకి తెచ్చారు. ఎప్పుడైతే నేను వారిమీద కాకుండా వారి పాఠం మీద దృష్టి పెట్టానో సబ్జెక్ట్ బాగా బుర్రకెక్కింది. లెక్కల టెక్స్ట్ బుక్ పొట్లపండు అయిపోయేటంతగా ప్రాక్టీసు చేసేవాడిని. లెక్క చూసి డైరెక్ట్ గా ఆన్సర్ తెలిసిపోయేది. మొత్తానికి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో 96 మార్కులు వచ్చాయి. కాని ఆరోజు సున్న వచ్చిందానికన్నా ఎక్కువ బాధవేసింది నూటికి నూరు రాలేదని..! అయినా గాని మా రమణరావు మాస్టారి సహకారం, ఆదరంతో ఆమాత్రం మార్కులు వచ్చాయి. వారిని జన్మలో మర్చిపోలేను..!!

🙏🙏🙏🙏🙏🙏 
పూర్తిగా చదవండి...

Thursday, April 22, 2021

పరీక్షలు బాబోయ్ పరీక్షలు..!! (మొదటి భాగం)

[ఇది ఎప్పుడో 2018 మార్చిలో వ్రాసిన పోస్టు. అప్పుడు పబ్లిష్ చెయ్యలేదు ఎందుచేతనో..! ఇన్నాళ్లకు, మన పిల్లల స్కూలు, కాలేజి పరీక్షలు వాయిదా పడడం లేదా రద్దవడం వార్తలు చూసి ఇది గుర్తొచ్చి పోస్ట్ చేస్తున్నాను. కరోనా కాదుగాని, ఈ క్రింద రాసిన అనుభవాలు అన్ని బొత్తిగా జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. సరే..! ఇంక విషయం లోకి వచ్చేస్తాను. 

ఇది 2018 లో వ్రాసినపోస్టు అని మళ్ళీ గుర్తు చేస్తున్నాను.]

నిన్నటి నుంచి మా అమ్మాయికి పదవతరగతి పరీక్షలు..! మేము పొద్దున్నే తనతోపాటు తయారైపోయి వాళ్ళ స్కూల్ బస్ కి తనని డ్రాప్ చేసి, ఆ బస్సుతో పాటు సెంటర్ వరకు ఫాలో అయ్యి, అక్కడ ఒక గంట సేపు ఎండలో నిలుచుని, మిగతా పేరెంట్స్ తో తరవాత వాళ్ళ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేస్తున్నారో మాట్లాడి, (అందరూ సుమారుగా ఇదే చేస్తున్నారు..!) పరీక్ష మొదలయ్యాక కూడా ఇంకా అక్కడే నిలుచున్న తల్లిదండ్రుల పక్క జాలిగా ఒక చూపు విసిరి మళ్ళీ వెనక్కు బయలుదేరాం..!! వాళ్ళు మమ్మల్ని "ఎంత బాధ్యత లేని తల్లిదండ్రుల్రా వీళ్ళు..!" అన్నట్టు మామీదో చూపు విసిరారు..!!

అప్పుడే నాకు చిన్నప్పుడు మేము పరీక్షలు వ్రాసినప్పటి అనుభవాలన్నీ బుర్రలో మెదిలి ఈ బ్లాగ్ పోస్టు వ్రాయడానికి పురిగొల్పింది.

[Flash back లో Flash back..! ఏమనుకోకండి..!!😄😄😄

సరే..! పాయింటులోకి వచ్చేస్తున్నా..!]


మేము ఇద్దరం..! నేను, మా తమ్ముడూ..! మాతమ్ముడు నా కన్నా ఒక ఏడాది చిన్నవాడు. మా అమ్మగారు మమ్మల్నిద్దర్నీ కూర్చోపెట్టి చదివించేవారు. మా నాన్నగారు బ్యాంకులో ఆఫీసరు గా చేస్తూ బిజీగా ఉండేవారు. అందువల్ల పెద్దగా అందుబాటులో ఉండేవారు కాదు. ఒక్క హిందీ పరీక్షకి మాత్రం ఆయనే చదివించేవారు. (ఆయన బాల్యం అంతా నాగపూరు, బనారస్ మొదలైన ఉత్తరాది ప్రాంతాలలో సాగింది. మమ్మల్ని ఎప్పుడూ మా నాన్నగారు బస్ స్టాప్ కి కూడా దింపలేదు పరీక్షలకి..! మేమెప్పుడూ అడిగేవాళ్ళం కూడా కాదు..! ఇంట్లో బయల్దేరేటప్పుడు దేముడికి దణ్ణం పెట్టుకొని మా అమ్మచేత ’ఆల్ ది  బెస్ట్’ చెప్పించుకొని బయల్దేరడమే. స్కూల్ దూరం బట్టీ నడుచుకుంటూనో, బస్సు మీదో వెళ్ళేవాళ్ళం. చిన్నప్పటినుంచి మా అమ్మగారు మా చదువులని దగ్గరుండి చూసుకునేవారు. మా మొత్తం సిలబస్ ఆవిడకి కూడా కంఠతా వచ్చి ఉండేది. పరీక్షవ్రాసి ఇంటికి రాగానే.. మా అమ్మగారి ప్రశ్నలు ఇలా ఉండేవి..

అమ్మ: ఎలా రాసావు పరీక్ష?
మేము: బాగా రాశానమ్మా!!
అ: ఎన్ని మార్కులొస్తాయి?
మే: ఏదో చెప్పేవాళ్ళం..!
అ: ఎన్ని వదిలేసావు?
మే: రెండు 3 మార్కుల ప్రశ్నలూ  4 బిట్లూ 
అ: మరింకేమిటి రాసేవ్.. ఏదీ క్వశ్చన్ పేపరు..??

అంటూ అక్కడ మొదలెట్టి  మొత్తం పేపరంతా మాచేత మళ్ళీ  చేయించేవారు. మేము ఇప్పుడే వచ్చాము పరీక్ష వ్రాసి మళ్ళీ  రాయమంటే ఎలా..? అని విసుక్కుంటూ మా అమ్మ అడిగినవాటికి చెప్పేవాళ్ళం..! చదివినవే ప్రశ్నలు పడిపోతే మాకు చాలా హుషారుగా ఉండేది..! మళ్ళీ చెప్పక్కర్లేదు కాబట్టీ..! లెక్కలపేపర్ లో ఆన్సర్లు చివరకి ఎంతొచ్చిందో తప్పక రాయాలి..! తరువాత చెక్ చేసుకోవడానికి..! ఆవిడ ఎన్ని మార్కులొస్తాయని చెప్పేవారో సరిగ్గా అన్నే వచ్చేవి. 

మా పరిస్థితి ఇలా ఉంటే మా స్నేహితుడు ఒక అబ్బాయి - వాళ్ళ అమ్మగారు కూడా ఇలాగే అడుగుతూ ఉండేవారు - ఒక పరీక్ష చాలా చెత్తగా వ్రాసాడు. బయటకి వచ్చాక ఆ ప్రశ్న పత్రాన్ని చక్కగా పరీక్ష సెంటర్ బయట ఒక మేక కనిపిస్తే దానికి తినిపించేసి చక్కా వచ్చాడు. ఇంట్లో ఇవాళ పేపర్ ఇవ్వలేదని చెప్పేసాడు. ఐతే వాళ్ళ అమ్మగారు మాదగ్గర పేపరు తీసుకొని వాడి నిర్వాకం తెలుసుకొని బడితెపూజ చేసారనుకోండి..!! అది వేరే విషయం..!!

ఇదంతా ఎనిమిది, తొమ్మిది చదువుతున్నప్పటి సంగతి..!! 
 
అయితే అంతకు ముందర ఏడో క్లాసు పరీక్షలకి కూడా పబ్లిక్ ఉండేది ఆరోజుల్లో..!! ఐతే పరీక్షల ఫలితాలు స్కూల్ లో పెట్టారు అని తెలిసి మా అమ్మగారు వెళ్ళి చూసుకోమని శతపోరుతూ ఉన్నా ఇదిగో అదిగో అని ఆటల్లోనూ పుస్తకాలు చదవడంలోనూ బిజీగా ఉండే వాడిని..! ఒకరోజు మా అమ్మగారే నన్ను బలవంతంగా తీసుకువెళ్ళారు స్కూల్ కి. (అప్పట్లో నేను సెయింట్ ఆంథోని పాఠశాల లో చదివాను. మాఇంటినుంచి బస్సులో వెళ్ళే వాళ్ళం.)

వెళ్ళాక స్కూల్లో మా బిల్డింగ్ పోర్టికో రాతి గోడకి పెద్ద అక్షరాలతో ఏడవతరగతి పరీక్షా ఫలితాలు అనిబోర్డు పెట్టి నోటీసు బోర్డులో ఫలితాల కాగితాన్ని అతికించారు. మా అమ్మగారు వెళ్ళి వెతకడం మొదలుపెట్టారు. నాకు ముందునుంచీ ఆ రష్‍లో తొక్కుకుంటూ ఉండడం చిరాకు. అందుకని నేను కాస్త దూరంగా వెళ్ళి నిలుచున్నాను. మా అమ్మగారు అక్కడినుంచి చెయ్యి ఊపుతూ ఏదో చెప్తున్నారు. నేనది పట్టించుకోకుండా నాలోకంలో నేనున్నాను. మా అమ్మగారు ఇక పట్టలేక నాదగ్గరికి వచ్చేసి కోపంగా "ఆ లిస్టులో నీపేరు లేదు..! అన్నిసార్లు చెప్తున్నాను వెళ్ళి చూసుకోరా అని..!! ఒక్కనాడు వినలేదు నా మాట.! ఇప్పుడు వెళ్ళి చూసుకో నీ పేరు..!! వెధవా..! బా..గా కనిపిస్తుంది..! అరె..!! పరీక్షలలో ఇంకొంచం సేపు చదవరా అని ఎన్నిసార్లు చెప్పినా నాకన్నీ వచ్చేసు అంటూ తిరిగావ్..!! ఇప్పుడు చూడు ఏకంగా పరీక్షే పోయింది అంటూ ఇంక కంట నీరు ఉబకడానికి సిద్ధంగా ఉన్నటైమ్ కి నే నీలోకంలోకి వచ్చాను..!! చాలా మెల్లగా తాపీగా అమ్మా నువ్వు చూసినది పరీక్ష పోయిన వాళ్ళ లిస్టేమోనే..! సరిగ్గా చూసావా..!!?? అని అడిగాను..! ఇంకేమిటి చూడ్డానికి మిగిలింది..!! నా బొంద..! అంటూ మా అమ్మగారు పాపం చాలా దుఃఖ పడుతున్నారు. నాకు చాలా బాధవేసింది..!! నేను బాగా రాసానమ్మా..! నాపరీక్ష పోవడమేంటి అని అప్పుడు వెళ్ళి నేనే చూసుకున్నాను స్వయంగా!! నా ఊహ నిజమే..! మా అమ్మగారు తప్పు లిస్టు చూస్తున్నారు..! నాపేరు/ రోల్ నెంబరు ఫస్ట్ క్లాసులో కనిపించాయి. నేను చాలా ఉక్రోషంగా వచ్చి మా అమ్మగారి దగ్గరికి చూసుకో.., నా పేరు ఫస్ట్ క్లాసులో ఉంది..! నువ్వే తప్పులిస్టు చూసావు..! అన్నాను. అప్పుడు ఆవిడ వెళ్ళి అసలు లిస్టులో నాపేరు చూసి అప్పటికి స్థిమిత పడి ఎంతో ఆనందించారు. ఆవిడ హ్యాపీ..!! నేను డబుల్ హ్యాపీ..!! కథ సుఖాంతం..!!

*******

(సశేషం)

(పరీక్షలు బాబోయ్ పరీక్షలు -2 లో కలుద్దాం)

పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)