Showing posts with label సినిమాలు. Show all posts
Showing posts with label సినిమాలు. Show all posts

Saturday, February 9, 2013

అద్భుతమైన జంధ్యాల మార్కు కామెడీ సినిమా 'రావూ - గోపాల్రావూ' ..!



పరకాయప్రవేశం ఇతివృత్తంగా రిసెర్చిలో మునిగిపోయి ఇంటి బాధ్యతలు మర్చిపోయిన ఒక  ప్రొఫెసర్ (గోపాలరావు పాత్ర : రావుగోపాలరావు), ఏ బాధ్యతా లేకుండా తిరిగే జల్సాగా తిరిగే విద్యార్ది (రామారావు పాత్ర : చంద్రమోహన్) చుట్టూ అల్లిన అద్భుతమైన జంధ్యాల మార్కు కామెడీ సినిమా             రావూ - గోపాల్రావూ.

ఆద్యంతం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే ఈ సినిమా చిన్నప్పుడెప్పుడో చూశాను. ఒక నాలుగేళ్ల క్రితం సీడీ షాపులో కనిపించి రెండు వీసీడీల ప్యాక్ ని కొన్నాను. తరువాత మళ్ళీ ఎక్కడెక్కడో తిరిగి ఈ పండగలకి మళ్ళీ నా వద్దకు చేరింది.


కథ లోకెళితే ... అనగనగా ఒక చరిత్ర ప్రొఫెసర్ గారు. పేరు గోపాల్రావు (రావు గోపాలరావు). పరకాయ ప్రవేశం గురించీ రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. కాలేజీ లైబ్రేరియన్ (శ్రీలక్ష్మి) రిఫెరెన్సులు ఇచ్చి సహాయం చేస్తూ ఉంటుంది. అతగాడి ధ్యాసంతా ఆ విద్యని ఎలా సాధిద్దామనే విషయం పైనే ఉండడంతో ఇంటి విషయాలని అస్సలు పట్టించుకోడు. పైగా విపరీతమైన మతిమరుపు. పెళ్ళాం పిల్లల పేర్లు కూడా గుర్తుండవ్..! తన పిల్లల మీద, తన పెంపకం మీద  గ్రుడ్డి నమ్మకంతో ఉన్న ఈయనకి వాళ్ళ చెడు తిరుగుళ్ళు, త్రాగుడు, పేకాటలూ కనపడవ్..!! అతని జీవిత లక్ష్యం ఒక్కటే.. అదే పరకాయ ప్రవేశ విద్యని సాధించడం..!!

అదే కాలేజీ లో చదువుతున్న రామారావు (చంద్ర మోహన్) ఇతన్ని తెగ ఏడిపిస్తూ ఉంటాడు. చరిత్ర అంటే చచ్చేంత ఎలెర్జీ..! ఇతని తండ్రి (పీ ఎల్ నారాయణ) తన కొడుకుని ఎలాగైనా చరిత్రలో గోల్డ్ మెడల్ సాధించాలంటూ తుపాకీ పుచ్చుకొని మరీ వెంటపెట్టి  వేధిస్తూ ఉంటాడు. అతని తల్లిది (రాధాకుమారి) చిత్రమైన బలహీనత. గుడ్డ కనబడితే చాలు దాన్ని ఇచ్చేసి స్టీలు గిన్నెగా మార్చుకొందే నిద్ర పట్టదు. ఇంట్లో కనపడ్డ ప్రతీ బట్టనీ స్టీల్ సామాన్లవాడికి ఇచ్చేసి ఏ  చెంచా నో చెంబు నో తీసుకొని తృప్తి పడుతూ ఉంటుంది. ఆ స్టీలు సామాన్ల వాడు కూడా ఈ ఇంటి చూరునే విడవకుండా పట్టుకు వేళ్ళాడుతూ ఆ ఇంటి యజమానికి బీపీనీ పెంచుతూ మనకు కామెడీనీ  పంచుతూ సినిమా చివరి దాకా ఉంటాడు.

తన క్లాస్ మేట్  అయిన శారద (ముచ్చెర్ల అరుణ) ని  ప్రేమిస్తాడు రామారావు. ప్రస్తుతానికి అది వన్  సైడే ..! ఒకానొక పరిస్థితిలో ఆవిడ చేతిలో చెంపదెబ్బ తిన్న రామారావు మూడ్ బాలేక ఆ రోజు పొద్దుపోయిన దాకా అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉంటాడు. (ఒక బ్రాందీ షాపు కనబడితే వెళ్ళి బీరుందా అని అడుగుతాడు. షాపువాడు ఫుల్ బాటిలు తెస్తాడు. రా.రా.: "అబ్బే ఇంత పెద్దది వద్దండీ.. ఒక క్వార్టరు బాటిలూ, రెండు సోడాలూ  ఇవ్వండి..!"
షా.వా.: "ఒక క్వార్టరు బీరూ , రెండు సోడాలూనా..! డబ్బులిలా వేస్ట్ చెయ్యకండి సార్..! పక్కనే హోటలుంది రెండిడ్లీ ఓ కాఫీ తాగండి..!!" అంటూ ఉచిత సలహా పారేస్తాడు)

ఒక వెర్రి నవ్వు నవ్వి బయటకు వచ్చేసిన రామారావు అంత  రాత్రి వేళ ఒక గుట్ట మీదకి వెళ్తున్న గోపాలరావు మాష్టార్ని చూస్తాడు.  క్యూరియాసిటీ కొద్దీ  అతన్ని అనుసరించిన రామారావు, ప్రొఫెసర్ గారు కొన్ని తాళ పత్రాలూ, ఓ కోతి  శవమూ బయటకి తీసి అండర్లైన్ చేసిపెట్టుకున్న మంత్రాలు చదివి పరకాయప్రవేశం ద్వారా కోతి శరీరం లోకి ప్రవేశించడం చూస్తాడు. అదను చూసి ఇతనూ  అవే మంత్రాలు చదివి ప్రొఫెసర్ గారి శరీరం లోకి దూరిపోతాడు. కోతి  శరీరంతో కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి, వెనక్కి వచ్చిన ప్రొఫెసర్ గారితో "తన శరీరంతో పరీక్షరాసి గోల్డు మెడల్ కొట్టమనీ, అప్పుడు మీ శరీరాన్ని మీకిచ్చేస్తాననీ" బేరం పెడతాడు.  విధిలేని పరిస్థితిలో రామారావు శరీరాన్ని తొడుక్కుంటాడు గోపాల్రావు మేష్టారు...!

ఆ సినిమాలోని screen shots  చూడండి:







అది మొదలు మనకి నవ్వుల విందు..!
పొరపాటున వేరే శరీరాల్లో ఉన్నామన్న సంగతి మర్చిపోయి  తమ తమ పాత ఇళ్ళకి వెళ్లి చిక్కుల్లో పడతారు ఇద్దరూ..! దాంతో రాజీకొచ్చి గోపాల్రావుగారి ఇంటికి ఆయన శరీరంలో ఉన్న రామారావు, రామారావు ఇంటికి అతని శరీరంతో గోపాల్రావు మేష్టారూ వెళ్తారు. కొత్త వాతావరణం, పరిసరాలతో ఇద్దరూ ఇబ్బంది పడతారు. శరీరాలైతే మారాయిగానీ వ్యక్తిత్వాలూ , అలవాట్లూ  మారవుకదా ..!! ఇంట్లో వారి కుటుంబ సభ్యులు కూడా హటాత్తుగా వారిలో వచ్చిన మార్పుకి తికమక పడతారు.

ఇలా ఉండగా గోపాల్రావు శరీరంలో ఉన్న రామారావుకి, అప్పటివరకూ వన్ సైడెడ్ గా ఉన్న ప్రేమ రెండో వైపు నుంచీ కూడా మొగ్గ తొడిగిందని తెలుసుకొని, ఎంత తొందరగా తన శరీరంలోకి మారిపోదామా అని తెగ ఇదైపోతూ ఉంటాడు. కానీ రామారావు శరీరంలోని గోపాలరావు మేష్టారికి  తన  పిల్లల అసలు వ్యవహారాలు కళ్ళబడి తన నమ్మకపు పొరలు తొలగిపోవడంతో కనువిప్పు కలుగుతుంది. దాంతో "పరీక్షలైపోయాయి గనక  శరీరాలు మార్చేసుకుందా"మంటూ రామారావు వెంటపడుతున్నా తన సమస్యలు తీరేదాకా తిరిగి పాత శరీరాల్లోకి మారేది లేదని తెగేసి చెప్పేస్తాడు. మొదట అపార్ధం చేసుకున్న రామారావు తను తొడుక్కున్న గోపాల్రావు  శరీరాన్ని ఎన్ని ఇక్కట్ల పాలు చెయ్యాలో, ఎన్ని వెకిలి వేషాలు వేస్తే  ఆ శరీరానికి చెడ్డ పేరు వస్తుందో అన్నీ చేస్తాడు. కానీ తరువాత మేష్టారి కష్టాన్ని, బాధనీ అర్ధం చేసుకున్నాక ఆయనకు సాయంగా నిలిచి వారి కుటుంబాన్ని నిలబెడతాడు. 

కానీ వాళ్లకి శరీరాలు మార్చుకోవడానికి వాహకంగా కావలసిన ఒక శవం దొరక్క నానా పాట్లూ పడుతూ ఉంటారు.

ఈ లోగా శారదతో రామారావు పెళ్ళికి  వాళ్ళ నాన్న(పీ ఎల్ నారాయణ) ఒప్పుకొని పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు.  రామారావు శరీరంతోఉన్న గోపాల్రావు మేష్టారికే పెళ్ళికొడుకుని చెయ్యడం, ఊరేగింపూ లాంటి తంతులన్నీ జరిపించేస్తూ ఉంటే అసలు రామారావు మరింత ఉడికిపోతూ ఉంటాడు. చివరకి ఈ పెళ్లి ఊరేగింపుకి ఒక శవం ఎదుర్రావడంతో ఆ శవాన్నే వాహకం గా చేసుకొని శరీరాలు మార్చుకుంటారు మన రావూ  - గోపాల్రావులు. రామారావుకి  శారదతోనూ, అలాగే మేష్టారి కూతురికి ఆమె ప్రేమించిన యువకుడితోనూ పెళ్ళిళ్ళు జరగడంతో శుభం కార్డు పడుతుంది.

ఈ సినిమాలో కామెడీ ట్రాక్ అంటూ సెపరేట్ గా కాక కథలో అంతర్భాగం గా ఉంటుంది. జంధ్యాల గారి సినిమాల్లో అది కామనే అనుకోండి..! కానీ రావు గోపాలరావూ, చంద్రమోహన్ వాళ్ళ ఒరిజినల్ కారెక్టర్ లో కన్నా శరీరాలు మార్చుకున్నాక అవతల వాళ్ళ బాడీలాంగ్వేజ్, మేనరిజం లతో పండించిన హాస్యం సూపర్బ్..! ఇద్దరిలోకీ రావుగోపాల్రావే (పాత్ర పరంగా స్కోప్ కూడా ఉండడంతో) అద్భుతంగా పోషించాడు. అలాగే కాలేజి లైబ్రేరియన్ మంగతాయారు గా గోపాల్రావుకి రీసెర్చి లో సాయపడుతూ, తాళపత్రాలు ఇచ్చే పాత్రలో శ్రీలక్ష్మి, 'L' బోర్డు తో TVS మోపెడ్ నడుపుతూ అడ్డొచ్చిన వాళ్ళని గుద్దేస్తూ ఉంటుంది. ఆమె బండి నడుపుతూ ఉంటే వెనకాతలే ఇంకో అతను ను పరిగెడుతూ ఉంటాడు. స్టాండు వెయ్యడానికీ, పడిపోతే లేపదానికీ అన్నమాట.

ఇక పొట్టి ప్రసాద్, రావుగోపాలరావు బావమరిది. అతనికి తన బావదగ్గర మస్కా కొట్టి డబ్బులు లాగేస్తూ ఉంటాడు. అతని దగ్గర అతని మేనల్లుడు వాటా కొట్టేస్తాడు (పోలీసుల పేరు చెప్పి భయపెట్టి..!). అతడు సరిగ్గా ఈ వ్యవహారంలో ఉండగా శ్రీలక్ష్మి ఎదురుపడుతుంది. (శ్రీలక్ష్మికీ, పొట్టిప్రసాద్ కీ ఎత్తులో సుమారు అడుగు తేడా ఉంటుంది). ఆ సీన్లో శ్రీలక్ష్మిని మొదట ఆడ పోలీసుగా భావించి వినయం నటించే పొట్టిప్రసాద్, ఆవిడ లైబ్రేరియన్ అని తెలిసే సరికి ఒకసారి ఎగాదిగా చూసి, రెండు మెట్లు ఎక్కి ఎత్తు సరిచూసుకొని మరీ,  "వెళ్ళెళ్ళవమ్మా..!" అంటూ దబాయిస్తాడు. నటీనటుల శరీర సౌష్ఠవాన్ని కూడా సహజమైన హాస్యానికి వస్తువుగా తీసుకోగలిగే చాతుర్యం జంధ్యాలకే చెల్లు..! ( ముఖ్యంగా మరొకర్ని నొప్పించేటట్టు కాకుండా..!)

సినిమా మొత్తం మీద బెస్ట్ కామెడీ అని చెప్పగలిగేది.. రామారావు(చంద్రమోహన్) తల్లిదండ్రులు ఫోర్జరీ సాంబమూర్తి (పీ ఎల్ నారాయణ), స్టీలు సీతాలక్ష్మి(రాధాకుమారి), మరియు స్టీలు సామాన్లవాడు ఈ ముగ్గురి మధ్యా నడిచే సన్నివేశాలు..!! ఆ సంభాషణలూ, వాళ్ళ టైమింగ్ చూస్తే మనకి పొట్ట చెక్కలవ్వడం  ఖాయం..!! సినిమా మొదట్లో పంచ, లాల్చీ, కండువాలతో కనిపించే ఫోర్జరీ సాంబమూర్తి సినిమా నడుస్తున్న కొద్దీ ఒక్కొక్క వస్త్ర విశేషాన్నీ కోల్పోయి చివరకొచ్చేసరికీ బొందులాగూ తో మిగుల్తాడు. అదే ఆ స్టీలు సామాన్ల వాడు ఒక్కొక్కటిగా చొప్పున చివరికోచ్చేసరికీ ఆ పట్టుపంచ, లాల్చీ, కండువాల వేషం తో ఇంటి యజమానితో పోటీ అన్నట్లు ఇతగాడు తయారైపోతాడు. దానికి అతడు చెప్పే లాజిక్ నవ్వు తెప్పిస్తుంది. పెద్దవారింటికి వచ్చేటప్పుడు ( పాత బట్టలకి స్టీల్ సామాన్ల మార్పిడికే అనుకోండి..) చింకి బట్టలతో వస్తే ఏం బాగుంటుంది.. అంటాడు. అలాగే బట్ట చూపిస్తే చాలు అది వెంటనే తన ఒంటికి చుట్టేసుకొని, స్టీలు చెంచానో, గరిటో, ఇస్తానంటూ బేరాలు మొదలెడతాడు. కొసమెరుపేంటంటే వాడు ఈ ఇంటి యజమానితో వాడి కష్టం చెప్పుకుంటాడు. ఈమధ్య వాళ్ళ ఆవిడ క్రొత్తగా ప్లాస్టిక్ వస్తువులంటే పది చచ్చిపోతోందనీ, కన్ను చాటయితే ఒంటిమీద ఉన్న గుడ్డలు సైతం ఒలిచేసి ఆ బట్టల్ని ఇచ్చి ప్లాస్టిక్ డబ్బాలు, చెంచాలు మార్చుకొని ఇల్లంతా ప్లాస్టిక్ మాయం చేసేస్తోంది అంటూ వాపోతాడు. పాపం ఫోర్జరీ సాంబమూర్తికి నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు.

గోపాలరావు శరీరం లో ఉన్న రామారావు, తను గోపాలరావు కాదనీ, రామారావుననీ మేష్టారి కుటుంబాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. అతని కొక్కిరాయి చేష్టలకి హడలెత్తిన పిల్లలు ఒక మెంటల్ డాక్టర్ని(సుత్తివేలు) తెస్తారు.  తీరా చూస్తే  అతడు డాక్టరు కాదుకదా అక్కడ తచ్చాడుతున్న పేషెంటు..! చిన్న పాత్రే అయినా చాలా చక్కగా మెప్పిస్తాడు సుత్తి వేలు..! మళ్ళీ చివరన కనిపించే శవం పాత్ర కూడా సుత్తి వేలు చేతే వేయించారు జంధ్యాల. ఒకే వ్యక్తి  రెండు వేర్వేరు పాత్రలు వేసినా ఎక్కడా ఆ విషయమే స్ఫురణకి రాదు.


మొత్తంగా సినిమా ప్రతీ సీనులోనూ హాస్యాన్ని రంగరించి, ఎక్కడా వడి  తగ్గకుండా, బోరు కొట్టకుండా కథ నడుపుతూ జంధ్యాల గారు అద్భుతంగా వండి వడ్డించిన చక్కని చిత్రం రావూ  - గోపాల్రావూ 
పూర్తిగా చదవండి...

Saturday, November 24, 2012

రహస్యం చలన చిత్రం లోని 'గిరిజా కళ్యాణం' యక్షగానం సాహిత్యం

రహస్యం చలన చిత్రం లోని 'గిరిజా కళ్యాణం' యక్షగానం సాహిత్యం
రచన : మల్లాది రామకృష్ణశాస్త్రిగారు స్వర రచన: ఘంటసాలగారు

కీ. శే. శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు 
కీ. శే. శ్రీ ఘంటసాల గారు
ఈ పాటను గురించి ఇల్లాలి ముచ్చట్లు బ్లాగులో శ్రీమతి సుధ గారు వ్రాసిన వ్యాఖ్యానం ఈ లింక్ కి వెళ్లి చదవండి(http://illalimuchatlu.blogspot.in/2012/02/blog-post_20.html). ప్రతిపదార్ధ వివరణతో పద ప్రయోగం లోని విశేషాలను వివరిస్తూ అద్భుతంగా వ్రాశారు. పాట  ఆడియోలింక్ కూడా ఉంచారు.
వారి బ్లాగులో వీడియో కనిపించడం లేదు. అది ఇక్కడ చూడవచ్చు.

నేను కేవలం సుధ గారు వ్రాసిన వ్యాసం లోని యక్షగాన సాహిత్యాన్ని విడిగా ఒకదగ్గర పెట్టాను అంతే...!!

  
**************************************** 
ఈ పాట ఆడియో లింక్:


****************************************
 
అంబా పరాకు దేవీ పరాకు
మమ్మేలు మా శారదంబా పరాకు

ఉమా మహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవనా గజాననా!

బహుపరాక్ బహుపరాక్...
చండభుజాయమండల దోధూయమాన వైరిగణా – షడాననా!  
బహుపరాక్ బహుపరాక్..

మంగళాద్రి నారసింహ, బంగరుతల్లి కనకదుర్గ,
కృష్ణాతీర కూచెన్నపూడి నిలయా గోపాలదేవ

అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా
లలితకళల విలువ తెలియు సరసులు పదింపదిగ పరవశమయ్యే


ఈశుని మ్రోల హిమగిరి బాల- కన్నెతనము ధన్యమయిన గాథ

కణకణలాడే తామసాన కాముని రూపము బాపీ, ఆ కోపీ-
తాపముతీరి కనుతెరిచి తను తెలిసీ
తన లలనను పరిణయమాడిన ప్రబంధము –   || అవధరించరయ్యా ||


రావో రావో లోల లోల లోలం బాలక రావో....
లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి

రాజ సులోచన రాజాననా...

చెలువారు మోమున లేలేత నగవులా
కలహంస గమనాన కలికీ ఎక్కడికే

మానస సరసినీ మణిపద్మ దళముల
రాణించు అల రాజ హంస సన్నిధికే

వావిలి పూవుల మాలలు గైసేసి
వయ్యారి నడల బాలా ఎక్కడికే

కన్నారా నన్నేల కైలాస నిలయాన
కొలువైన అలదేవ దేవు సన్నిధికే 


తగదిది తగదిది తగదిది
ధరణీ ధర వర సుకుమారీ తగదిదీ ..
  
అండగా మదనుడుండగా
మన విరిశరముల పదనుండగా 
నిను బోలిన కులపావని తానై
వరునరయగ బోవలెనా ...ఆ.....ఆ....ఆ...తగదిది తగదిది తగదిది

కోరినవాడెవడైనా ఎంతటి ఘనుడైనా
కోలనేయనా సరసను కూలనేయనా
కనుగొనల ననమొనల గాసి చేసి -నీ దాసు చేయనా

ఈశుని దాసుని చేతువా
-అపసద!! అపచారము కాదా!!
కోలల కూలెడు అలసుడు కాడూ -ఆదిదేవుడే అతడూ !!
సేవలు చేసి ప్రసన్నుని చేయ  - నా స్వామి నన్నేలు నోయీ - నీ సాయమే వలదోయీ...

కానిపనీ మదనా కాని పనీ మదనా !!
అది నీ చేతకానిపనీ మదనా !!
అహంకరింతువ - హరుని జయింతువ !!  
అది నీ చేతకాని పని మదనా .....కానీపనీ మదనా.


చిలుక తత్తడి రౌత ఎందుకీ హూంకరింతా
వినకపోతివా ఇంతటితో-నీ విరిశరముల పని సరి
సింగిణి పని సరి - తేజోపని సరి - చిగురికి నీ పని సరి మదనా
కానిపనీ మదనా....


సామగ సాగమ సాధారా -శారద నీరద సాకారా
దీనా ధీనా ధీసారా 

ఇవె కైమోడ్పులు            - ఇవె సరిజోతలు
వినతులివే అరవిందోజ్వలా  - ఇదె వకుళాంజలి మహనీయా
ఇదె హృదయాంజలి         - ఈశా మహేశా    || సామగ సాగమ ||


విరులన్ నిను పూజచేయగా - విధిగా నిన్నొక గేస్తు సేయగా
దొరకొన్న రసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ


కరుణన్ గిరిరాజ కన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా
మరుడే పున రూపున వర్థిలుగా
రతి మాంగల్యము రక్ష సేయరా ప్రభూ -పతిభిక్ష ప్రభూ....


అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో
జనకుడవై ఆదరణగ తనయునిగా జేకొనవో
అంబాయని నను పిలిచెను వినవో...

మనమే నీ మననమై తనువే నీ ధ్యానమై
నీ భావన లీనమైన గిరిబాలనేకొనవో
శరణంభవ శరణంభవ శరణంభవ స్వామీ !!
పరిపాలయ పరిపాలయ పరిపాలయమాం స్వామీ!!


బిడియపడి భీష్మించి పెళ్ళికొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం
విరులచే వరునిచేకరముచేకొనజేయు జగమేలు తల్లికి జయమంగళం
కూచేన్నపూడి భాగవతుల సేవలందే దేవదేవునికి మంగళం||
శ్రీమతి సుధ గారికి మనః పూర్వక ధన్యవాదాలు.



పూర్తిగా చదవండి...

Monday, April 16, 2012

నాకు నచ్చిన చిత్రాలు : మా ఊళ్ళో మహాశివుడు

మా ఊళ్ళో మహాశివుడు (1979)

దర్శకత్వం: రాజా చంద్ర ; తారాగణం: రావు గోపాలరావు, సత్యనారాయణ, మురళీ మోహన్, సుభాషిణి, అల్లురామలింగయ్య, వంకాయల, రాజబాబు తదితరులు ; మాటలు: అప్పలాచార్య; సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం; నిర్మాణ సంస్థ: గీతా సినీ ఎంటర్‌ప్రైజెస్ ; గీతరచన:సి నారాయణరెడ్డి, ఆరుద్ర , వీటూరి ; నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం; సంగీతం : సత్యం;                                                             

చాలా ఏళ్ళ (సుమారు పదేళ్ళ) క్రితం ఒకరోజు యధాలాపం గా టీవీ చానెల్స్ మార్చుతూ ఉంటే ఈ సినిమా వస్తోంది..! రావుగోపాల రావుని ఈ ప్రత్యేకమైన గెటప్ లో చూసి ఆసక్తికరంగా అనిపించి చూడడం కంటిన్యు చేసాను. పూర్తిగా చూసాక "అరె మొదటి నుండి చూడలేక పోయానే..!" అనిపించింది. అక్కడినుంచీ ఒక రెండేళ్ళ వెతుకులాట తరువాత ఈ సినిమా VCD కనిపించి కొనుక్కొని మళ్ళీ మొదటినుంచీ చూసాను. కడుపుబ్బా నవ్వుకున్నాను.

ఫుల్ లెంగ్త్ శివుడి పాత్రలో కనిపించే రావుగోపాలరావు ఈ సినిమాలో గ్రాంధికం కాకుండా వ్యవహారిక భాష మాట్లాడతాడు. ముత్యాల ముగ్గు సినిమాతో అఖిలాంధ్ర ప్రేక్షకుల అభిమానం సంపాదించుకోవడం తో పాటూ డైలాగ్ డెలివెరీ లో ఒక ఒరవడి సృష్టించాడు. అసలే రావుగోపాల రావు డైలాగ్ డెలివెరీ కి పెట్టింది పేరు. సత్యనారాయణ తో కలసి చేసిన సీన్లలో కడుపుబ్బా నవ్వించే హాస్యం పండించారు. గుడిపూజారి (సత్యనారాయణ) అమాయకంగా వేసే ప్రశ్నలకు శివుడిచ్చే సమాధానాలు చూసి తీరవలసిందే.

యుట్యూబ్ లో కనిపించిన వీడియోలు మీకోసం ఇక్కడ పంచుకుంటున్నాను.
సాంబయ్య అనే చాలా పేదవాడైన ఒక ఊరి గుళ్ళో పూజారి తన కూతురి పెళ్లి నిశ్చయం కావడంతో కట్నం డబ్బు పదివేల రూపాయల కోసం ప్రయత్నించి విఫలమౌతాడు. ఆ స్థితిలో సంయమనం కోల్పోయి ఏ దేవుడినైతే సర్వస్వంగా భావించి నిత్యం కోలుస్తున్నాడో ఆ పరమేశ్వరుణ్ణి ఆవేశం తో నిందిస్తూ తెలివి తప్పి పడిపోతాడు.ఆ తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ క్రింది వీడియోలు చూడండి.


శివుడు  అనుగ్రహించి  ప్రత్యక్షముతాడు. అక్కడినుంచీ భగవంతుడికీ భక్తుడికీ సంవాదం మొదలౌతుంది. ప్రేక్షకులకు నవ్వు మొదలౌతుంది. స్వామిని తనకూతురి పెళ్ళికి కావలసిన డబ్బు అనుగ్రహించమని వేడుకుంటాడు పూజారి. ఆ ఊరి భూస్వామి (అల్లురామలింగయ్య) దగ్గరకు పూజారి కూడా వెళ్ళిన శివుడు, సదరు భూస్వామి గుట్టుమట్లూ, వ్యాపారం లో చేసే స్మగ్లింగు, చేయించిన హత్యలూ ఏకరువు పెట్టేసరికి, కిమ్మనకుండా డబ్బు తెచ్చి పూజారి చేతిలో పెడతాడు. 
భూస్వామి కొడుకు గుళ్ళోని అమ్మవారి విగ్రహాన్ని అమెరికాలో అమ్మేయ్యడానికి బేరం సిద్ధం చేస్తాడు. అయితే గుడి తాళాల కోసం పూజారి భార్యకి కూతురి పెళ్ళికి అవసరమైన పదివేలూ బలవంతంగా చేతిలో పెట్టి, తాళాల కోసం వేధిస్తూ ఉంటాడు. ఎలాగైతేనేం అతగాడి బెదిరింపులకి లొంగిన పూజారి భార్య తాళాలు ఇచ్చేస్తుంది. వెంటనే విగ్రహం మాయమవ్వడం, ఆ నింద పూజారి మీద పడడం జరిగిపోతాయి. 
భూస్వామి తన గుట్టుమట్లు చెప్పిన ఆ శివుడి వేషధారిని చంపెయ్యమని సింహాచలం (రాజబాబు) అనే వాణ్నిపీకల్దాకా పట్టించి పంపిస్తాడు. ఆ తరువాతి సన్నివేశాలు చూడండి.


ప్రఖ్యాత హాస్య నటుడు శ్రీ అల్లు రామలింగయ్య సొంత నిర్మాణ సంస్థ అయిన గీతా సినీ ఎంటర్‌ప్రైజెస్ బానర్ మీద తీసిన ఈ సినిమాలో రామలింగయ్య గారి కుమారుడు శ్రీ అల్లు అరవింద్ ఎస్సై గా ఒక పాత్ర పోషించాడు. భూస్వామిని బ్లాక్మెయిల్ చేసాడనే అభియోగం మీద శివుడిని విచారించడానికని స్టేషన్ కి పిలిపిస్తాడు. వారిమధ్య సాగే సంభాషణ ఆసక్తికరంగా ఉంటుంది. ఇదే సీనుకి అనుకరణ, అనుసరణగా తరువాత చాలా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు వచ్చాయి.

ఇదిలాఉంటే విగ్రహం తాలూకు లావాదేవీలన్నీ కళ్ళబడిన సిద్ధయ్య (చిన్నపూజారి) కోపం పట్టలేక భూస్వామి కొడుకుతో ఘర్షణ కి దిగుతాడు. ఆ కొట్లాటలో సిద్ధయ్య చనిపోతాడు. సాంబయ్య కుమిలిపోతాడు. అప్పుడు శివుడు పూజారికి ధైర్యం చెబుతూ చావు పుట్టుకల గురించి, పాప పుణ్యాల గురించీ లోకం తీరు గురించీ కొన్ని మాటలు చెబుతాడు.

"కాలం చేసిన ప్రతీ వాణ్ణీ కన్నీటితోనే బ్రతికించగలిగితే ఈ లోకం లో పుట్టిన ప్రతి వ్యక్తీ జీవితాంతం విలపిస్తూనే వుండాలి".

"మంచి చెడ్డలకీ మరణానికీ సంబంధం లేదు సాంబయ్యా..! స్మశానం ఊరికి ఒకే దూరం లో ఉన్నా అందరూ ఒకేసారి చేరుకోలేరు.."

ఇంతలో భూస్వామి కొడుకు ఒక నకిలీ విగ్రహాన్ని పూజారి కూతురు(సుభాషిణి) ప్రేమించిన యువకుడు (మురళీమోహన్) ఇంట్లో దొరికేలా చేసి ఊరి వాళ్ళందరినీ అతని మీదకు ఉసిగొల్పుతాడు. అప్పుడు జరిగిన ఘర్షణలో ప్రేమికులిద్దరూ చనిపోతారు. పాపం సాంబయ్య దుఃఖానికి హద్దుండదు. తన కూతురి శవాన్నితీసుకొని గుడిలో దేవుడి ముందుంచి దేవుడిని నానా మాటలూ అంటాడు. దేవుడన్నవాడే లేడంటాడు. చివరికి ఒక గునపం తీసుకొని శివలింగాన్ని పెకలించేయ్యడానికి తెగబడతాడు. అప్పుడు శివుడు  మళ్ళీ రుద్ర రూపం దాల్చి భయంకరంగా తాండవం చేస్తూ ఉండగా..పూజారి నిలువెల్లా వణికి పోతాడు. తప్పు మన్నించి అనుగ్రహించమని వేడుకొంటూ స్పృహలోకీ, కంటున్న కల వదలి లోకం లోకీ వచ్చి పడతాడు. కళ్ళు తెరిచేసరికీ చనిపోయారనుకున్న వాళ్ళందరూ,( సిద్ధయ్య, కూతురూ, ఆమె ప్రేమికుడూ) ఎదురుగా కనిపిస్తారు. కలలో లోకాన్ని చూసిన పూజారి కూతురి పెళ్లి ఆమెకు నచ్చిన వాడితో జరగడంతో శుభం కార్డు పడుతుంది.

సినిమా అంతా నచ్చిందనీ, కథ సూపరనీ చెప్పను గానీ, శివుడి పాత్రా, రావుగోపాలరావు డైలాగులూ మాత్రం అద్భుతం. అది హాస్య రసమైనా, వేదాంతమైనా అద్భుతం గా పండాయి. సత్యనారాయణ కూడా చాలా బాగా నటించాడు. నాకైతే నచ్చింది, మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాల్లో చెప్పండి. 

  
(రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతున్న శివుడు (1979  లో అని మర్చిపోకండి)

పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)