Sunday, January 26, 2020

నేను 30 ఏళ్ళ క్రితం వేసిన బొమ్మలు

 ఎప్పుడో 1990 లో అనుకుంటా, నేను వేసిన బొమ్మలు ఈ మధ్య కనబడ్డాయి. ఏదో పుస్తకం కోసం వెతుకుతూ ఉంటే ఒక Full Sketchbook నిండా ఇవి కనబడ్డాయి..!  


 

 




సింహాచలం ఘాట్ రోడ్ ఎక్కేముందు కనిపించే తోరణం ఇది. కొండ ఎక్కడానికి బస్సు ఎక్కి, అది ఇంకా బయల్దేరకపోయే సరికి ఈ స్కెచ్ మొదలుపెట్టాను. బస్సు బయల్దేరేదాకా వేసాను..! అందుకే అసంపూర్ణం.

పూర్తిగా చదవండి...

Monday, January 13, 2020

పోతన కవితా చమత్కృతి - రవిబింబంబుపమింప పద్యం:

బమ్మెర పోతన ఆంధ్రీకరించిన శ్రీమద్భాగవతం అష్టమ స్కంధంలో, వామనుడు త్రివిక్రమావతారుడై పెరిగిపోయే దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించిన పద్యం ఇది.

మత్తేభము.
రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై/
శ్రవణాలంకృతియై, గళాభరణమై సౌవర్ణ కేయూరమై/
ఛవి మత్కంకణమై, కటిస్థలి నుదంచద్ఘంటయై, నూపుర/
ప్రవరంబై, పదపీఠమై, వటుడు తా బ్రహ్మాండమున్నిండుచోన్!

ఒక గీతను చెరపకుండా చిన్న గీత చెయ్యాలి అంటే ఏంచెయ్యాలో మనకందరకూ తెలిసిన సంగతే! దాని ప్రక్కనే మరో పెద్ద గీత గీస్తే సరి..! ఒక వస్తువు పెద్దదా చిన్నదా అని తెలియాలి అంటే దానితో పోల్చి చెప్పడానికి ప్రక్కన ఇంకో వస్తువు ఉండాలి. అలా చెప్తే మనం పోల్చిన ఆ వస్తువుయొక్క గుణము ఎంత పెద్దదో లేదా చిన్నదో తెలుస్తుంది. మనం విమానం లో ప్రయాణిస్తున్నప్పుడు మనకి ఆకాశంలో చుట్టుపక్కల మేఘాలో మరింకొకటో ఏమీ లేకపోతే మనం కదులుతున్నట్టే అనిపించదు. నిజానికి మనం చాలా వేగంతో వెళ్తూ ఉంటాం.  అదే విమానం లో మనం నేలపైకి దిగినప్పుడు వేగంగా వెనక్కి వెళ్ళిపోతున్న పరిసరాల్ని చూస్తే విమానం ఎంతవేగంతో వెళ్తోందో మనకి అనుభవం లోకి వస్తుంది. 
పై చిత్రాలు రెండూ కీ. శే. బాపు గారివి. వారికి నా కృతజ్ఞతాంజలి.
ఎత్తు- పల్లం, పొడుగు- పొట్టి,  పెద్ద - చిన్న ఇలాంటి వాటికి ఏదో ఒకటి పోల్చడానికి ఉండాలి. ఎందుకంటే అవన్నీ సాపేక్షం కాబట్టి..!  
ఇప్పుడు మనం మన పద్యంలోకి వచ్చేద్దాం..! ఇక్కడ వామనుడు త్రివిక్రముడై భూనభోంతరాలు దాటి పెరుగుతున్నాడు. విశ్వమంతా వ్యాపిస్తున్న అతనిని కొలవాలి, లేదా ఎంతగా వ్యాపిస్తున్నాడో చెప్పాలి అంటే మనకు బాగా తెలిసిన, రోజూచూసే దానితో పోల్చి సాపేక్షంగా చెప్తే బాగా తెలుస్తుంది.       
పోతన ఆ పొలికకు రవి బింబాన్ని ఎన్నుకున్నారు. ఎదుగుతూ ఉన్న వామనుడు ఎంతగా పెరిగాడంటే,
మొదట అతనికి ఛత్రము (గొడుగు) వలె శోభించిన రవి బింబము, తరువాత శిరోరత్నము వలె, చెవి ప్రోగు వలె, కంఠాభరణము వలె, బంగారు దండకడియము వలె, కంకణము వలె, మొలత్రాడులో గంట వలె, కాలి అందె వలె చివరకు పాదం క్రింద పీట వలె భాసించిందట..! గమనించవలసిందేమంటే ఇక్కడ ఈ పొలికలన్నీ పురుషులు తమ శరీరంలో తలనుంచి పాదం దాకా ధరించే వివిధము లైన ఆభరణాలను సూచిస్తున్నాయి. 
ఇక్కడ సూర్యుడు స్థిరంగా ఉన్నాడు. సూర్యుడు గొడుగు గాను, పాద పీఠం గానూ ‘మారలేదు’. అలా కనిపించాడు అంతే..! ఉపమానానికి అంటే పోల్చడానికి పాత్రమయాడు అని పోతన్న గారే చెప్పారు. అంటే వామనుడు పెరుగుతూ సూర్యుణ్ణి కూడా ఎంతలా దాటి పోయాడంటే గొడుగు వలె కనిపించిన సూర్యుడు అంతలోనే పదపీఠం వలె కనిపించాడట..!                        
ఈ పోలిక ద్వారా వామనుడు త్రివిక్రముడైన రూపం మనకు ఊహించుకోవడానికి ఒక కొలమానం (స్కేల్) ఇచ్చారు పోతన గారు. ఇప్పుడు ఆ ఊహతో ఆ కొలమానాన్నిబట్టి పద్యాన్ని మళ్ళీ చదవండి, ఎంత అద్భుతంగా ఉంటుందో..!
సూర్యుడే మనకి చాలా దూరంలో ఉంటాడు, అలాంటిది మరి ఆ సూర్య బింబం త్రివిక్రముడైన వామన మూర్తికి పాద పీఠం గా అమరింది అంటే ఆ స్వామి ఎంతగా పెరిగాడో తెలుస్తుంది..! (తెలుస్తుందా..!?) 

 

ఈ పద్యాన్ని స్వరపరచిన ప్రముఖ సంగీత కళాకారిణి సంగీత సుధానిధి శ్రీమతి మండ సుధారాణిగారు తమ స్వర రచనలో చూపిన చమత్కృతి గమనించండి. ఎంతో ఎత్తున ఉన్న సూర్యుడు అలా అలా క్రిందికి దిగుతున్నట్ట్లు కనిపిస్తున్నాడని కదా పోతన గారి వర్ణన..!? అదే కవి హృదయాన్ని అనుసరిస్తూ పద్యాన్ని తారస్థాయిలో మొదలుపెట్టి మారుతున్న సూర్యుడి స్థానానికికి తగ్గట్టుగా ఒక్కక్క స్థాయికి స్వర సంచారాన్ని అవరోహణ చేయిస్తూ వచ్చి పదపీఠమై అన్న దగ్గర మంద్రస్థాయి షడ్జంలో నిలిపారు.

కాని ఆ సమయంలో వటువు త్రిభువనాలు దాటి ఎదుగుతున్నాడే, మరి ఆ స్వామిని దర్షించాలంటే ఎంత తొందరగా మనం ఆ ఎత్తుకి వెళ్ళాలి? అందుకే శ్రోతలకు ఆ గమనాన్ని సూచించేటట్లుగా ’వటువు తా బ్రహ్మాండమున్ నిండుచోన్’ అంటున్నప్పుడు స్వరాలను మంద్ర స్థాయినుంచి మధ్యమ తారస్థాయి లను దాటించి అతి తారస్థాయికి వేగవంతమైన సంచారం చేయించి త్రిభువనాలను దాటి వెళ్ళాడన్న కవి భావాన్ని తమ స్వరకల్పనలో ఆవిష్కరించి, స్వామి వారి హృదయస్థానమైన తారస్థాయిలో పద్యాన్ని నిలిపారు. పై వీడియో లో పద్యాన్ని ఆలపించింది శ్రీమతి సుధారాణిగారివద్ద వద్ద శిష్యరికం చేస్తున్న మా అమ్మాయి చి. కృష్ణప్రియ.
సర్వవ్యాపి ఐన విష్ణువు మనందరకూ శుభము కలుగజేయు గాక..!
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)