Wednesday, August 31, 2011

మంటపాలలో కొలువుతీరడానికి సిద్ధంగా ఉన్నగణపతులు..!!


హైదరాబాదులో వినాయక చవితి ఎంత కోలాహలం గా చేస్తారో మనకి తెలియంది కాదు. చూడముచ్చటైన గణేశ ప్రతిమలు  రోడ్డుప్రక్కన ఉన్నచిన్నచిన్నగుడిశలలోని కళాకారుల చేతిలో ప్రాణం పోసుకుంటాయి. ఇక్కడి నుంచి విగ్రహాలు ఇతర ప్రాంతాలకి కూడా ఎగుమతి అవుతాయి. రేపు జరగబోయే గణపతి నవరాత్రి మహోత్సవాలకి కొలువుతీరడానికి సిద్ధంగా ఉన్న అలాంటి విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకొంటున్న తరుణంలో తీసిన ఫోటోలు ఇవి. (విశాఖపట్నం నుంచి తెలిసిన వాళ్ళు కొందరు హైదరాబాద్ వెళ్లి ఒక పదిహేడడుగుల భారీ  విగ్రహం తెచ్చుకున్నారు. విగ్రహాల కోసం తిరుగుతూ నచ్చిన విగ్రహాల ఫోటోలు తీసారు. ఆ ఫోటోలు క్రింద చూడండి.
 


 


విఘ్నేశ్వరుడి విగ్రహ తయారీలో తుది మెరుగులు: 
ఇక్కడి దాకా పోతపోసే అచ్చులుంటాయి కాబట్టీ ఒక రకం గా పని సులువే. కానీ ఇకపై ఉండేదంతా చేతితోనే చెయ్యాలి. అన్ని విగ్రహాల మీదా ఒకేరకమైన శ్రద్ధ చూపాలి. ఆహార్యం, అలంకరణ, ఆభూషణాలూ అన్నీ ముఖ్యమైనవే..!కళాకారుడి పనితనం తెలిసేది ఈ చివరి అంకంలోనే. ఒక్క మాటలో చెప్పాలంటే విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ.


మరింత పెద్ద విగ్రహాలు - ఎత్తు ముప్పై అడుగుల పైమాటే..!!
 కానీ ఈవిగ్రహాలలో చాలా వరకు ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారుచెయ్యబడినవేనట. ఈసారి ప్రజలలో కూడా మట్టి విగ్రహాల వాడకంలో మంచి చైతన్యం వచ్చింది. అక్కడక్కడ ఇంకా కొందరు మాత్రం పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నూ, రసాయన పదార్ధాలు కలిసిన రంగులనూ వాడుతున్నారు. అయితే విశాఖపట్నం లో తయారవుతున్న రెండు అతి భారీ విగ్రహాలు మాత్రం పర్యావరణానికి అస్సలు హానిచేయని రీతిలో పూర్తిగా మట్టితోనే తయారయి "మట్టితో భారీ విగ్రహాలను తయారు చెయ్యడం సాధ్యమేనా..?" లాంటి అనుమానాలను పటాపంచలు చేసాయి. రెండిటి లో ఒకటి 117 అడుగులు (గాజువాక) కాగా రెండోది (ఎం.వీ.పీ. కోలనీ) 95 అడుగుల పొడవు.
క్రింద వీడియో చూడండి.


 మట్టి విగ్రహాలు దొరికే స్థలాలూ, మరియు ఇతర వివరాల కోసం ఈ క్రింద చూపించిన లింకుల పై నొక్కండి.
పూర్తిగా చదవండి...

Sunday, August 28, 2011

మేము చేసిన మట్టి వినాయక ప్రతిమ..!!


ప్రతీ ఏటా వినాయక చవితికి (వీలైనప్పుడల్లా) నేను మట్టితో వినాయకుడిని చేస్తాను. నా clay modelling talent ని బతికించి ఉంచడానికి ఒక కారణమైతే... ఇంకొకటి పర్యావరణ పరిరక్షణ. నేను మొట్టమొదట వినాయకుణ్ణి చేసింది మేము యలమంచిలి లో వుండగా..!! అప్పుడు నేను ఎనిమిదో క్లాసు చదూతున్నాను. మా  పక్కింట్లో ఒకతను వుండేవారు. ఆయన చెయ్యగా చూసాను. అడుగున్నర విగ్రహం..! అదే  స్ఫూర్తితో  వెంటనే వచ్చి ఇంట్లో తయారు చేసేసాను. ఆరంగుళాలు ఎత్తు..దానికి water colour painting కూడా చేసాను. కానీ అంత బాగా రాలేదు.

అప్పటినుంచీ మట్టితో చిన్న చిన్నవి బొమ్మలు తయారుచెయ్యడం హాబీగా మారింది. ప్రతీ సారీ వినాయక చవితికి రెండు రోజుల ముందు తయారు చేసేవాడిని. ఈసారి ఇంకా ముందుగానే పదిరోజుల ముందే తయారు చేసేసాను. నాతో పాటూ మా అమ్మాయి కృష్ణప్రియ  కూడా ఈసారి  తయారుచేసింది. మొదటి సారి చేసినా పర్వాలేదనిపించింది.

అయితే ఈ విగ్రహం తయారు చేసినా మళ్ళీ వినాయక చవితి రోజు పత్రితో పాటూ ఇంకో మట్టి విగ్రహం కొని దానికే ప్రధానం గా పూజ చేస్తాము. నేను చేసిన విగ్రహానికి పూజ  (ఒక్కొక్క పత్రం, పుష్పం, ఫలం, తోయం..) సింపుల్ గా ముగించేసి ఊరుకుంటాము. (అష్టోత్తర శతనామాలూ, షోడశోపచారాలూ చేస్తే ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేసేయ్యాలేమోనని..ఈ దుర్బుద్ధి). వినాయక చవితి అయిపోగానే దానిని నేను చేసిన మిగతా బొమ్మలతో కలిపేసి, showcase లో పెట్టేస్తాను. అలాగ ఇప్పటివరకూ ఒక 10 విగ్రహాలు చేసి వుంటాను. విరిగిపోయినవి పోగా రెండో మూడో ఉన్నట్టున్నాయి.

సర్సరే..!! ఇక మేము చేసి బొమ్మల గోల పక్కన పెట్టేసి, ఇంతకీ మన బ్లాగు మిత్రులకందరికీ చెప్పొచ్చే విషయం ఏంటంటే...మట్టి తోనే విగ్రహాలు చేద్దాం. పర్యావరణాన్ని కాపాడుకొందాం. పైగా పిల్లలతో కలిసి మట్టితో విగ్రహాలు చేస్తే ఆ సరదాయే వేరు. మా బొమ్మల్నించి స్పూర్తి పొందినవారెవరైనా, రేపు ఎలాగూ ఆదివారమే కాబట్టీ, మీ ఇంట్లో పిల్లలతో కలిసి ఆ పనిలో వుండండి. వినాయక చవితి నాటి విశేషాలు అందరితోనూ పంచుకోండి...

జై జై జై గణేశ జై జై జై జై..!!

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ..!
నీ అండా దండా ఉండాలయ్య చూపించయా  త్రోవ..!!
మీ కందరికీ ముందస్తుగా vinaayaka chaviti శుభాకాంక్షలతో,

మీ రాధేశ్యాం మరియు కృష్ణప్రియ..

  

మా అమ్మాయి కృష్ణ ప్రియ చేతిలో రూపు దిద్దుకొన్న చిట్టి వినాయకుడు:
కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యం కూడా పెట్టేసింది..! ఇంకోపక్క గ్లాసు తో  నీళ్ళు కూడా..!! గమనించండి.
 

నేను వేసిన మరికొన్ని బొమ్మలు నా ’కలాపోసన’ పేజీ లో చూడండి.  

పూర్తిగా చదవండి...

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)