Showing posts with label హైదరాబాదు. Show all posts
Showing posts with label హైదరాబాదు. Show all posts

Thursday, June 9, 2011

హైదరాబాదులో పరుగో పరుగు..


మధ్య పిల్లల సెలవులు పురస్కరించుకొని హైదరాబాద్ ట్రిప్ వేసోచ్చాం..!ఎప్పుడు వెళ్ళినా బయటికెక్కడికీ వెళ్ళడానికి అవ్వట్లేదు. ఈసారి ఎలాగైనా వెళ్ళాలి అనుకోని వెళ్లాం. వెళ్ళడమంటే వెళ్ళాం గానీ,పిల్లలతో బయటికి వెళ్ళే సాహసం చెయ్యలేక పోయాం. ఒకటి ఎండలు..! రెండు ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా దూరం..!! ఫ్యామిలీని హైదరాబాదులో ఎక్కడికైనా తీసుకెళ్దామని అనుకుంటూండగానే నాల్గు రోజులు గడిచిపోయాయి. చుట్టాలిళ్ళు చూడడాలు అయిపోయింతరువాత.. ఇంక ఒక్కరోజే ఉంటున్నాం అనగా.. పిల్లల్ని, మా ఆవిడనీ, మా అక్కపిల్లలు ఇద్దరు, మా అన్నయ్య కూతురు,(వీళ్ళు ఇంజనీరింగ్, ఇంటర్ చదూతున్నారు.) మొత్తం ఏడుగురం టాక్సీ తీసుకొని ఊరిమీద పడ్డాం..! అక్కడినుంచీ మొదలైంది మా పరుగు.
రామంతాపూర్ లో బయలుదేరే సరికి సాయంత్రం నాలుగు. బయలుదేరింది.. చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యుజియం, ఎన్టీయార్ గార్డెన్స్, ఐ - మాక్స్ మొదలైనవి చూద్దామని..!! మొదట సాలార్జంగ్ కి వెళ్ళాము. నాలుగుంపావుకే టికెట్ కౌంటర్ క్లోజ్ చేసేస్తాడట. సరే అని గేటు బయటినుంచే చూపించేసి..గబగబా దానిగురించి నాకుతెలిసిన నాలుగు ముక్కలూ మా అమ్మాయికి చెప్పేసి..చార్మినార్ కి బయలుదేరాం. నేనుకూడా చార్మినార్ ఎప్పుడూ పైకెక్కలేదు. ఎంట్రీ టికెట్స్ తీసుకొని ఒక గైడుని కూడా పెట్టుకున్నాం. చార్మినార్ ఒక మినార్ లోపటినుంచీ.. మెట్లు ఎక్కించి సుమారు ఆరంతస్తుల ఎత్తున్న చార్మినార్ మొదటి అంతస్తుకి తీసుకెళ్ళాడు. ఒక్కొక్క మెట్టూ అడుగున్నర ఎత్తుండి వెడల్పు రెండున్నర అడుగులు కూడా లేదు. మా అబ్బాయిని ఎత్తుకొని మరీ ఎక్కాను. అక్కడినుంచీ చుట్టుపక్కల ప్రాంతాలు చూపించాడు మా గైడు. పిల్లలందరికీ బాగా నచ్చింది. మొత్తం టీం లో నేను మా అబ్బాయి(నాలుగేళ్ల వాడు) తప్ప మిగతా అందరూ ఆడాళ్ళే కదా..అందుకు చార్మినార్ తో పాటూ అక్కడ గాజుల షాపింగ్ ఇంకా నచ్చింది వాళ్లకి. దాంతో అక్కడే ఆరున్నరైపోయింది. అక్కడి నుంచి గోల్కొండ.
గోల్కొండ చేరేసరికీ ఏడు. ఆ చీకటిలో పరుగెత్తి మేము వెళ్ళే సరికే లైట్ అండ్ సౌండ్ షో మొదలైపోయింది. ఇదికూడా అందరం మొదటిసారి చూడడం. చాలా బాగుంది. అమితాబ్ బచ్చన్ కామెంటరీ, అక్కడక్కడ బాలమురళీ కృష్ణ రామదాసు కీర్తనలూ.. కవితా కృష్ణ మూర్తి అనుకుంటా..ఆవిడ జావళీలు..!
బయట కొచ్చేసరికీ ఎనిమిదిన్నర. మళ్ళీ పరుగు.. ఈసారి ఎన్టీయార్ గార్డెన్స్ కి.. అక్కడికెళ్ళేసరికే తోమ్మిదయిపోయింది. మళ్ళీ ఇవికూడా(ప్రసాద్స్ ఐ-మాక్స్ , ఎన్టీయార్ గార్డెన్స్, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు..) గేట్లే చూపించేసి మమ అనిపించేసాను. ఫైనల్ గా వచ్చి నెక్లేస్ రోడ్డు, ఈట్ స్ట్రీట్లో పడ్డాం. ఆత్మారాముడిని శాంతింపజేసి హైదరాబాదు దర్శన్ అయిందనిపించాను. మా అన్నయ్య, అక్క కూతుర్లని మళ్ళీ రామంతాపూర్ లో దించేసి మేము 'చందా నగర్' వెళ్లేసరికి రాత్రి పన్నెండు.
అలాగే బయలుదేరిపోతున్న రోజు ట్రైన్ టైంకి మూడుగంటల ముందు చందానగర్లో బయల్దేరి (రవీంద్రభారతి దగ్గరకి వచ్చేసరికి గంట టైము పట్టింది) పిల్లలకి బిర్లామందిర్, ప్లానటోరియం,సైన్సు మ్యుజియం కూడా
రెండుగంటల్లో (ఫాస్ట్ ఫార్వర్డ్ లో) చూపించేసాను..!!ఆ విధంగా మా హైదరాబాదు దర్శన్ ముగించి వైజాగు బయలుదేరడానికి సిద్దంగా వున్న రైలేక్కేసాం చివరినిమిషంలో..!!

సాలార్జంగ్ మ్యుజియం

పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)