Showing posts with label మధురానుభూతులు. Show all posts
Showing posts with label మధురానుభూతులు. Show all posts

Sunday, May 8, 2011

నా బ్లాగు ప్రారంభించి రెండేళ్ళు..!!

నా బ్లాగు ప్రారంభించి మొన్న మే రెండవ తేదీకి రెండేళ్ళు. చప్పట్లు...!!
ఆలస్యంగా కేక్ కటింగ్ పెట్టానేంటి అనేనా మీ సందేహం..? కారణాలు చెప్పి ఇంకా టైమెందుకు వేస్టు గానీ.. పాయింటుకొచ్చేస్తున్నా..!!

కోడి బర్త్ డే ఎప్పుడు చేసుకోవాలి..?? గుడ్డుగా భూమ్మీద పడినప్పుడా.. లేక పొదగబడి పిల్లగా నేలమీద కాలు మోపినప్పుడా..!?
నిజానికి మే 2009లోనే బ్లాగ్ పెట్టినా సుమారు ఒక సంవత్సర కాలం ఏరకమైన రాతలూ లేకుండానే గడిపేశాను. అప్పుడప్పుడు చిన్నచిన్నవి ఏవో రాసినా అవి నా బ్లాగు పేరుకి తగ్గట్టే నిజంగా సొంతఘోషే..!! ( ఈ సంవత్సర కాలం లో నేను వ్రాసినవి ఆరు మాత్రమే..!!)
అయితే ఈ సమయంలో నేను చాలా బ్లాగులు చూసేవాడిని. ఒకరోజు శ్రీ కప్పగంతు శివరాం ప్రసాదు గారి ’మన తెలుగు చందమామ' బ్లాగు కనపడింది..! తెగ నచ్చేసింది..!! అన్నన్ని సంగతులెలా రాయగలరో అర్ధమయ్యేదికాదు. వారి పోస్టులు క్రమం తప్పకుండా చూస్తూండే వాడిని. వారి పోస్టు ఒకదానికి నేను పెట్టిన వ్యాఖ్యకి వారు రిప్లై వ్రాసారు. దానితో మొదలైన మా ఈ-మెయిల్ సంభాషణ కొన్నాళ్ళు కొనసాగింది. ప్రతీ మెయిల్ లోనూ ఏమైనా వ్రాయమని చాలా ప్రోత్సహిస్తూ ఉండేవారు. నాకే ధైర్యం చాలేది కాదు. ఒకరోజు అనుకోకుండా వారి బ్లాగ్ లో మా ఈ-మెయిల్ సంభాషణ ప్రచురించారు.
'మనతెలుగు చందమామ' బ్లాగు లో నేను.. నా రాతలు..!!
ఆ రోజు నా ఆనందానికి అవధుల్లేవు. ఏదో కథల పోటీలో ఫస్టు ఒచ్చినంత ఆనందం వేసింది. ఆ ఉత్సాహంతో చాలా రోజులు గడిపేశాను..!! కానీ ఏదైనా వ్రాద్దామని కూర్చుంటే పెన్ను కదలందే..!! అక్కడికి సరిగ్గా నాలుగునెలల తరువాత ( నా బ్లాగ్ మొదలెట్టిన సంవత్సరానికి..) నా ఈ కృత్యాద్యవస్థనే 'ఏదో రాయాలనే కోరిక..!!' అంటూ మొదలెడితే మినీ కవితలా వచ్చింది. ఇదేదో బాగానే ఉందనుకొని ఆ రోజే కూడలి, మాలిక మొదలైన అగ్రిగేటర్ లకి నా బ్లాగుని జత చేసి గుడ్డు దశ దాటి పిల్లగా బ్లాగు ప్రపంచం లో కాలుపెట్టాను..!! అప్పటినుంచీ ఈ రెండవ సంవత్సర కాలం లో 36 పోస్టులు వ్రాసాను. నామీద అభిమానంతో నాకు 'మన తెలుగు చందమామ' లో సహరచయితగా చోటిచ్చి ఆదరించిన శ్రీ శివరామ ప్రసాదుగారికి సర్వదా కృతజ్ఞుడిని. నేను వ్రాసిన కొన్నిచందమామ జ్ఞాపకాలూ, వడ్డాది పాపయ్య గారి మీద వ్యాసాలూ వారి బ్లాగు లో ప్రచురించి వారందించిన ప్రోత్సాహం మరువలేనిది. అలాగే వారి సాహిత్య అభిమాని, రేడియో అభిమాని, మొదలైన బ్లాగులు ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పాల్సి వస్తే అది ముంజేతి కంకణానికి అద్దం చూపించినట్టే..!! వారి వ్యాఖ్యలు గానీ వ్యాసాలూ గానీ ఎంత సూటిగా ఉంటాయో అంతే నిర్మాణాత్మకం గానూ వుంటాయి. వారు నాకెప్పటికీ గురుతుల్యులు.

అలాగే శ్రీ యమ్వీ అప్పారావు ( సురేఖ) గారు..!! బ్లాగు ద్వారానే మొదలైన వారిపరిచయం చాలా ఆత్మీయమైన స్నేహం గా పరిణమించింది. వారు మా ఇంటికి వచ్చారు. నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు నేను కూడా వారి ఇంటికి వెళ్లాను. బాపూ రమణల వీరాభిమాని. ఈవయసులో కూడా (ఆమాట అననివ్వరు) వారు ఒక పక్క వారి రేఖా చిత్రం బ్లాగులో కనీసం రెండురోజులకొక ఆర్టికల్ వ్రాస్తారు.., హాసం క్లబ్ ని రాజమండ్రి లో స్థాపించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.., పత్రికల్లో కడుపుబ్బా నవ్వించే కార్టూన్లు గీస్తారు. వీరి కార్టూన్ల పుస్తకం 'సురేఖార్టూన్లు' కి ముందుమాట స్వర్గీయ ముళ్ళ పూడి వారు వ్రాసారంటే ఆ క్వాలిటీ ఎలాంటిదో తెలుస్తుంది. చందమామలూ మొదలైన పుస్తకాలతో వుండే వారి లైబ్రరీ ఒక మ్యూజియం ని తలపిస్తుందంటే నమ్మండి. ఈయన దగ్గర వున్న ఇంకో ప్రతేకత ఏమిటంటే ఈ మధ్య కొత్తగా వస్తున్న స్క్రాప్ బుక్స్( ఒక పుస్తకం లో ఏదో ఒక విషయానికి సంబంధించి పత్రికల్లో పడే ఆర్టికల్స్, ఫోటోలూ సేకరించడం) ని వారు వారి చిన్నప్పటినుంచీ సొంతంగా తయారు చేసుకొని అందంగా తీర్చి దిద్దుతున్నారు. బాపూ రమణల మీదే 14 పుస్తకాలు, రాజమండ్రి నగరం యొక్క సాంస్కృతిక వారసత్వ సంపదని ప్రతిబింబించే పుస్తకాలూ చూస్తే మనకాశ్చర్యం కలుగక మానదు.

పై ఇద్దరు పెద్దలూ నాకెపుడూ స్ఫూర్తి ప్రదాతలుగా వుంటారు. వారికి ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని సింహాచలేశుడు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామిని ప్రార్ధిస్తున్నాను. నాకున్న కొద్దిపాటి అభిరుచికీ వారి ప్రోత్సాహాన్ని జతచేసి సలహాలూ సూచనలూ అందించే మా పెదనాన్నగారు శ్రీ రుద్రావఝల రామ కృష్ణా రావుగారూ, మరియు మా అత్త డా. సుమన్ లత గారికీ నా కృతఙ్ఞతలు. అలాగే నా బ్లాగు 'పోస్టులకు' వారివ్యాఖ్యల తోరణాలు కట్టిన చదువరులూ, బ్లాగు మిత్రులందరికీ ధన్యవాదాలు.

మరో పోస్టుతో మీ ముందుంటాను.
అంతవరకూ సె'లవ్'
పూర్తిగా చదవండి...

Sunday, March 20, 2011

మహా చందమామ..!!

ఆనాటి బాలరాముడి దగ్గరనుంచీ, వయసుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లలూ పెద్దవాళ్ళనీ, అందరినీ అలరించిన వెన్నెలరాజు.. నిన్న మళ్ళీ మనకి అతి చేరువలోకి వచ్చి మహా చందమామ గా ఉదయించాడు. మా విశాఖ సాగరతీరంలో ఉదయిస్తున్న ఆ చంద్రబింబాన్ని, సముద్రపు అలల మధ్య వెండి ఆకులు తేలుతునట్టు వుండే ప్రతిబింబాన్ని చూడాలనీ ముందునుంచీ అనుకున్నాను. కానీ ఆ రోజు ఆ సమయం లో బీచ్ దగ్గరకి వెళ్ళడం కుదరలేదు. తీరా నేను వెళ్ళేసరికీ చంద్రుడు నడినెత్తిన వున్నాడు..!ప్రతిబింబం కనబడలేదు.


మా మేడ మీదనుంచీ నా కెమెరా లో వీడియో తీశాను జ్ఞాపకంగా..!


కానీ మన టీవీ వాళ్ళమీద నాకు ఒళ్ళు మండింది. ముందర రోజు దాకా 'సూపర్ మూన్' వల్ల భూమి కి కాలం చెల్లిందనీ.. ప్రళయం వచ్చేస్తుందనీ...సునామీలు, భూకంపాలూ, అగ్నిపర్వతాలు బ్రద్దలు కావడానికి..ఇదే కారణమనీ ఊదరగొట్టారు. జ్యోతిష్యులకీ, పంచాంగ కర్త లకీ హేతువాదులకీ, వాగ్యుద్ధాలు పెట్టి చోద్యం చూసారు. కార్యక్రమం చివరిలో..అలాంటిదేమీ లేదు..తప్పకుండా వెన్నెలని ఎంజాయ్ చెయ్యండంటూ ముక్తాయించారు. కానీ కార్యక్రమం చూస్తున్నంతసేపూ.. ఒక ఫ్రేం లో డిస్కషన్ చూపిస్తూ, మిగిలిన సగం లో జపాన్ సునామీ దృశ్యాలనీ, భూమి పగిలిపోతున్నట్టు 3D ఎనిమేషన్, 2012 సినిమా లో క్లిప్పింగ్స్ చూపించి.. వాళ్ళు చెప్పదలచు కొన్నది ఏమిటో అర్ధం కాకుండా చేసేసారు.

కానీ అదే టీవీ వాళ్ళు 'అట్టు తిరగేసి' ఉదయిస్తున్న మహా చంద్రుడిని వైజాగ్, కాకినాడ ల దగ్గరినుంచి లైవ్ చూపించారు. వర్ధమాన గాయకుల్ని స్టూడియోకి పిలిచి, చంద్రుడి మీద, వెన్నెల రాత్రులమీద వున్న పాటలు పాడించారు.

మన చందమామ మాత్రం ఎప్పట్లాగే చల్లటి వెన్నెలనే కురిపించి చూసినవారందరికీ ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచాడు.
మరికొన్ని వీడియోల కోసం చూడండి:
http://vimeo.com/21247386
http://vimeo.com/21245909
http://vimeo.com/21245718
పూర్తిగా చదవండి...

Tuesday, October 5, 2010

ఏవీ ఆ మధురానుభూతులు..??

ఏవీ ఆ మధురానుభూతులు..??
బాలభానుని బంగారు కిరణాలు
వెండి వెన్నెలలో నిండు స్నానాలు
గోధూళి వేళలో గంటల గణగణలు
పక్కనపారే సెలయేటి గలగలలు..
కోయిల కూజితాలు, పక్షుల కిల కిలారావాలు

అన్నీ బాల్య కాలపు గత స్మృతులు !
నేడు స్వప్నాలకే పరిమితమైన వింత అనుభూతులు..!!
పెరుగుతున్న సౌఖ్యాలు..,
తరుగుతున్న మానవత్వపు విలువలు..
గమ్యమెరుగని పరుగులు..

ఎదుగుతున్నామన్న వెఱ్ఱి భ్రమలు
కార్ఖానాల కూతలే ఉభయ సంధ్యల సంకేతాలు
కలుషిత జల - వాయువులే ప్రాణాధారాలు
మచ్చుకైనా కానరాని పచ్చదనాలు
అడుగడుగునా వెలుస్తున్న "కాంక్రీటు వనాలు"

గుర్తు తెలియని పొరుగువారి ముఖాకృతులు
కాలు కదుపనీయని క్రొత్త ఆర్ధిక బంధాలు..
తనవారు పెరవారవుతున్న వింత వైనాలు
వలసలతో వెలవెల బోతున్న పల్లెసీమలు ;
"గ్లోబల్ విలేజి" లవుతున్న నగర జీవితాలు..

నీరెండ సౌఖ్యాలు - వనభోజనాలు..
ఆషాఢపు తొలకరులు - ఆకాశ దీపాలు
ఉగాది ఊహలు - సంక్రాంతి సంబరాలు
శ్రావణ మేఘాలు - శరత్ చంద్రోదయాలు..
మదిలో దాగిన మధురాలాపనలు..

కవులందించే వింత సోయగాలు
నిఘంటువులో నిలచిన శబ్దార్ధాలు
వెతికితే దొరకొచ్చుఅంతరార్ధాలు
వెదకి వేసారినా దొరకునా మధురానుభూతులు ?


***********************************
రచన : డా. ఆర్. సుమన్ లత
(ఈ కవిత ' ఆంధ్రప్రదేశ్ ' మాసపత్రిక జూన్ '09 లో ప్రచురితమైంది )
***********************************
పూర్తిగా చదవండి...

Thursday, May 13, 2010

'మనతెలుగు చందమామ' బ్లాగు లో నేను.. నా రాతలు..!!

శ్రీ కప్పగంతు శివరాం ప్రసాద్ గారు నన్ను ప్రోత్సహించ టానికన్నట్టు మామధ్య జరిగిన ఈ-మెయిల్ సంభాషణని వారి ' మన తెలుగు చందమామ' బ్లాగు లో ప్రచురించారు. దాన్నే యధాతధంగా నా బ్లాగులో మళ్ళీ..
**************************

మరొక వీరాభిమాని

బ్లాగుల్లో మనం వ్రాసుకునే విషయాలు ఎంతమంది చదువుతున్నారో మనకి తెలియదు. ప్రపంచ వ్యాప్తంగాఎక్కడనుంచైనా మనం వ్రాసింది చదివి స్పందించవచ్చు . మన తెలుగు చందమామ బ్లాగు ఏర్పరిచిన తరువాత అప్పటివరకూ పరిచయమున్న చందమామ అభిమానులే కానీ కొత్త వారు పరిచయం కాలేదు. ఈ లోటు తీర్చటానికి అన్నట్టుగా, విశాఖపట్టణానికి చెందిన రాధేశ్యాం గారు ఒక మెయిలు పంపి తనకు చందమామ మీద ఉన్న అభిమానాన్ని చాటారు. వారు ఇచ్చిన మైళ్ళు ఇక్కడే ప్రచురిస్తున్నాను.

ఇలా మైళ్ళు ఇవ్వటమే కాకుండా రాధేశ్యాం గారు ముందు ముందు ఈ బ్లాగులో వ్యాసాలు వ్రాయాలని ఆకాంక్ష.

********************************************************
పంపినవారు: radhemadhavi
తేది: 13 మే 2010 7:01 am
సబ్జెక్టు: [సాహిత్య అభిమాని] అమరావతి కథలు మరో ఆరు కథలుపై క్రొత్త వ్యాఖ్య.
కి: vu3ktb@gmail.com


మీ "అమరావతి కథలు మరో ఆరు కథలు" పోస్ట్‌పై radhemadhavi క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

శివరాం ప్రసాద్ గారికి.. నమస్కారములు..
నాపేరు రాధేశ్యాం రుద్రావఝల. ఊరు విశాఖపట్నం. వృత్తి రీత్యా Architect ని. వయస్సు 36.
మీ బ్లాగ్ చూడడం నేడే తటస్థించింది. మీ పాత పాత పోస్ట్స్ అన్నీతీరిక గా చదివాను. చాల బాగున్నాయి సార్... మీరు, బ్లాగాగ్ని గారు, మరియు ఇతర బ్లాగ్ మిత్రులు చేస్తున్న effort , వెచ్చిస్తున్న సమయం... జోహార్లు...మన "చంపి" లందరూ పెద్ద నిధి దొరికినట్టు ఫీల్ అయిపోతున్నారు.. (వాళ్ళ వ్యాఖ్యలే అందుకు సాక్షి) నేను ఒక ఏడాది లేట్ గా చూసినందుకు ఎంత తిట్టుకున్ననో చెప్పలేను..నాదగ్గర తోక చుక్క , మకర దేవత, విఘ్నేశ్వరుడు సీరియల్స్ పుస్తకాలు గా కుట్టి ఉండేవి... అవి నేను 6th.. 7th చదువుతున్నప్పుడు నేనే పేజీలు చింపి కుట్టుకున్న పుస్తకాలు. ఎలా మాయమయ్యాయో తెలీదు.కాని పోయాయి. రాజు గారి బ్లాగ్ లో కంటెంట్ పోయిందని చదివి చాలా బాధ వేసింది. ఇప్పటికీ నా దగ్గర "ఇద్దరు మోసగట్టెలు" (త కింద త గా చదూకోండి), Gandharva raju kooturu, వుంది. స్కాన్ చేసి అప్ లోడ్ చేస్తాను.
మీ లింక్స్:
http://saahitya-abhimaani.blogspot.com/2009_06_01_archive.html
http://saahitya-abhimaani.blogspot.com/2009_07_01_archive.html
http://saahitya-abhimaani.blogspot.com/2009/07/blog-post_7059.html

లో కంటెంట్ చూడడానికి ట్రై చేస్తే.. error మెసేజ్ వస్తోంది
"error
The file could not be found. Please check the download link."
"error
This file has been removed from the server, because the file has not been accessed in a long time."
దయచేసి తరుణోపాయం చెప్పండి.. ప్లీజ్ ..
బ్లాగాగ్ని గారికి మెయిల్ చేసాను.. రిప్లై లేదు..ఈ మధ్య ఆయన పోస్ట్స్ కూడా చెయ్యట్లేదు...కారణం తెలీదు. వైజాగ్ లో మన బ్లాగ్ మిత్రులు ఎవరైనా వుంటే వాళ్ళ contacts చెప్పగలరు..
ధన్యవాదాలతో..
మీ రిప్లై కోసం ఎదురు చూస్తూ.. రాధేశ్యాం
********************************************************
ఇందుకు నా జవాబు
పంపినవారు: SIVARAMAPRASAD KAPPAGANTU
తేది: 13 మే 2010 7:15 am
సబ్జెక్టు: Re: [సాహిత్య అభిమాని] అమరావతి కథలు మరో ఆరు కథలుపై క్రొత్త వ్యాఖ్య.
కి: radhemadhavi


రాధేశ్యాం గారూ,

నమస్తే.

మీ కామెంటు మొన్ననే ఆఫీసు లో చూసాను మళ్ళి ఇంటికి వచ్చేప్పటికి మరచాను.

నేను కొన్ని చందమామ ధారావాహికలను నా బ్లాగులో Download ఆవకాశం కల్పిస్తూ ఉంచిన మాట వాస్తవం. కాని కాపీ రైటు గొడవలవల్ల ఆ అవకాశాన్ని తొలగించాను. ప్రస్తుతానికి చందమామల ధారావాహికలు ఎక్కడా దొరకటం లేదు. బ్లాగాగ్ని గారి బ్లాగులోనే కొన్ని ధారా వాహికలు ఉన్నాయి.

మీకు తెలిసే ఉంటుంది, "రచన" అని ఒక చక్కటి సాహిత్య మాస పత్రిక ఉన్నది. ఆ పత్రిక మే నెల సంచిక ఇప్పుడు మార్కెట్టులో ఉన్నది. తప్పకుండా చదవ వలసిన సంచిక. ఎందుకు అంటే, ఈ సంచిక "దాసరి సుబ్రహ్మణ్యం" గారి ప్రత్యెక సంచిక. ఆయన చందమామలో వచ్చిన ధారావాహికలు అన్ని అంటే శిధిలాలయం, రాకాసిలోయ, తోక చుక్క వగైరా వ్రాసిన ఆయన. ఈ మధ్యనే మరణించారు. ఆ సంచికలో, నేను వ్రాసిన వ్యాసాలు కూడ ఉన్నాయి. చూడండి.

నిజమే, మీరు ఆలస్యంగా బ్లాగులు చూడటం మొదలు పెట్టటం వల్ల కొన్ని ధారావాహికలు దొరకలేదు మీకు. ప్రస్తుతానికి దొరుకుతున్నవి తీసుకోండి. కాలక్రమాన పరిస్థితులు బాగున్నప్పుడు మళ్ళి బ్లాగులో ఉంచటానికే మా ప్రయత్నం.

ఉంటాను.

-శివరామప్రసాదు కప్పగంతు
బెంగుళూరు భారత్ నుండి
********************************************************


పంపినవారు: radhemadhavi rudravajhala
తేది: 13 మే 2010 7:09 pm
సబ్జెక్టు: Re: [సాహిత్య అభిమాని] అమరావతి కథలు మరో ఆరు కథలుపై క్రొత్త వ్యాఖ్య.
కి: SIVARAMAPRASAD KAPPAGANTU


శివరాం గారికి..

మీ కృషి గురించి నా ముందర మెయిల్ లో మరో నాలుగు మాటలు రాసాను గానీ.. ముత్యాల ముగ్గు లోని .. ధీం తక.. ధీం తక.. బ్యాక్ గ్రౌండ్ లో వినిపించి.. ఉత్తి జొహార్లతో సరిపెట్టేసాను.
మీ లింక్స్ లో కంటెంట్ కనపడక కొంత నిరుత్సాహానికి గురైన మాట వాస్తవం. ప్రత్యేకించి వపా గారి paitings అన్నీ గుది గుచ్చానన్నారే..అది. అయితే విశాఖపట్నం లో 5 - 6 నెలల క్రితం వడ్డాది పాపయ్య గారి paintings ప్రదర్శనకి ఉంచేరు. అన్నీ స్కాన్ చేసి PPT లో చూపించారు. ఆ paintings శ్రీ చలపతి రావు గారని.. ఆయనా ఆర్టిస్టే..చిత్ర కళా పరిషత్ అని ఒక సంస్థ నడుపుతున్నారు. వపా గారు చివరి రోజులలో కసింకోట లో వున్న 12 ఏళ్ళు ఈయన తో చాలా ఆత్మీయం గా వుండేవారట. వారు వ్రాసిన ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డ్స్, ఇంకా కొన్ని ఒరిజినల్ paintings కూడా చూడ గలిగే భాగ్యం కలిగింది. అది నిజంగా మాటలలో వర్ణించలేని అనుభూతి. వాళ్ళు ఆ సందర్భంగా కొన్ని ఉత్తరాలు, paintings కలిపి ఒక పుస్తకం రిలీజ్ చేసారు. paintings తో ఒక CD కూడా త్వరలో వస్తోందని చెప్పారు.

దాసరి వారి ప్రత్యేక సంచిక విడుదలైన విషయం గురించి మీరు వ్రాసిన పోస్ట్ చదివిన వెంటనే (10 ని. లలో) షాప్ కి వెళ్లి అడిగాను.. మర్నాడు వస్తుందని చెప్పారు . ఆరోజే నేను హైదరాబాద్ వెళ్ళడం వాళ్ళ ఒక వారం లేటుగా కొన్నాను..( రెండు కొన్నాను నాకొకటి.. US లో ఉన్న మా తమ్ముడికొకటి.) మీరు ఆ సంచిక గురించి చర్చించుకోవడం, ఎవరెవరు ఏయే ఆర్టికల్స్ రాస్తారో నిర్ణయించుకోవడం..లాంటి పోస్ట్ లన్నీ చదువుతూ ఆ సంచిక కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నాను.. మీరన్నట్టు రచన శాయి గారు నిజంగా అభినందనీయులు.

చందమామని ఇంటర్నెట్ లో చూద్దామన్న కోరికతో 2 ఏళ్ళ క్రితం మొదలైన నా వేట కి మొదటి మైలురాయి.. ఈమాట.కాం లో కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి "చందమామ జ్ఞాపకాలు" పోస్ట్. అప్పటి నుంచి వెదుకుతూ వుండగా మీ "మన తెలుగు చందమామ", బ్లాగాగ్ని, షన్ముఖన్ గారి బ్లాగ్ మొదలైనవన్నీ కనిపించాయి. అన్నిటినీ ఫాలో అవుతున్నాను... నేను రచన,హాసం...మొదలైన పత్రికలకు ఒకప్పటి చందదారునే. హాసం నుంచి విడుదలైన నవ్వుటద్దాలు, కిషోర్ జీవన ఝరి నుంచి నిన్నటి (ఇం)కోతి కొమ్మచ్చి వరకు అన్ని పుస్తకాలు వదలకుండా కొని చదివి లైబ్రరీ లో దాచుకున్నాను . 'రచన' ప్రచురితాలైన 'బాల' విహంగ వీక్షణ ప్రత్యేక సంచిక 4 volumes, బాపు బొమ్మల సంకలనం కూడా వున్నాయి. ఈమాట.కాం లోవి రోహిణీ ప్రసాద్ గారి ఆర్టికల్స్, సాంప్రదాయ సాహిత్యం మొదలైనవి ప్రింట్ తీసి bind చేసి పెట్టుకున్నాను. ఇవి కాక archive .org మరియు ఇతర తెలుగు సైట్ల నుంచి డౌన్ లోడ్ చేసిన 450 కి పైగా ఈ-బుక్స్ నా laptop లో PDF రూపం లో వున్న్నాయి. బ్లాగాగ్ని గారి పుణ్యమా అని వాటికి ఇప్పుడు దాసరి వారి సీరియల్స్ కూడా చేరాయి.

చిన్నప్పుడు మా తాతగారి ఇంట్లో లెండింగ్ లైబ్రరీ వుండేది. చందమామ, బాల, బాలజ్యోతి, మిగిలినవి చాలా పుస్తకాలు ఉండేవి. సెలవులలో ప్రొద్దున్న లోపలికి వెళ్ళిన వాళ్ళం మళ్ళీ మధ్యాన్నం భోజనానికే మళ్ళీ బయటకు రావడం. నేను కూడా మన మిత్రులు కొంతమందిలా తోకచుక్క సీరియల్ సినిమాగా తీస్తే బాగుంటుందని ఊహించుకొనే వాడిని. ఐతే ఎప్పుడూ చదవడమే గాని అంత గొప్ప వ్రాయసగాడిని కాకపోవడం వల్ల మీ బ్లాగ్స్ లో నా కామెంట్స్ లేవు. పైగా మీ అంత విషయ పరిజ్ఞానం కూడా నాకున్నట్టు తోచదు. సాహిత్యాభిరుచైతే ఉంది గానీ దానిమీద కామెంట్ చేసే సాహసం చెయ్యలేను.

చాలా రాసేసాను సార్.. లేటు గా వచ్చాను కదా.. అది కవర్ చేద్దామనే దురాశ...ఏమీ అనుకోకండి...పైగా తోటి 'చంపి'లనే చనువు కొద్దీ..

ఇంక మరి సుత్తి కొట్టను.. సెలవు..
నమస్కారాలతో..
రాధేశ్యాం

********************************************************
విశాఖపట్టణం ప్రాంతాల్లో ఇంతకు ముందు ఎవరైనా చందమామ అభిమానులు పాత ధారావాహికలను డౌన్లోడ్ చేసుకుని ఉంటే రాధేశ్యాం గారికి అందించగలరు. వారి ఈ మెయిలుచిరునామా radhemadhavi@gmail.కం

పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)