Sunday, May 8, 2011

నా బ్లాగు ప్రారంభించి రెండేళ్ళు..!!

నా బ్లాగు ప్రారంభించి మొన్న మే రెండవ తేదీకి రెండేళ్ళు. చప్పట్లు...!!
ఆలస్యంగా కేక్ కటింగ్ పెట్టానేంటి అనేనా మీ సందేహం..? కారణాలు చెప్పి ఇంకా టైమెందుకు వేస్టు గానీ.. పాయింటుకొచ్చేస్తున్నా..!!

కోడి బర్త్ డే ఎప్పుడు చేసుకోవాలి..?? గుడ్డుగా భూమ్మీద పడినప్పుడా.. లేక పొదగబడి పిల్లగా నేలమీద కాలు మోపినప్పుడా..!?
నిజానికి మే 2009లోనే బ్లాగ్ పెట్టినా సుమారు ఒక సంవత్సర కాలం ఏరకమైన రాతలూ లేకుండానే గడిపేశాను. అప్పుడప్పుడు చిన్నచిన్నవి ఏవో రాసినా అవి నా బ్లాగు పేరుకి తగ్గట్టే నిజంగా సొంతఘోషే..!! ( ఈ సంవత్సర కాలం లో నేను వ్రాసినవి ఆరు మాత్రమే..!!)
అయితే ఈ సమయంలో నేను చాలా బ్లాగులు చూసేవాడిని. ఒకరోజు శ్రీ కప్పగంతు శివరాం ప్రసాదు గారి ’మన తెలుగు చందమామ' బ్లాగు కనపడింది..! తెగ నచ్చేసింది..!! అన్నన్ని సంగతులెలా రాయగలరో అర్ధమయ్యేదికాదు. వారి పోస్టులు క్రమం తప్పకుండా చూస్తూండే వాడిని. వారి పోస్టు ఒకదానికి నేను పెట్టిన వ్యాఖ్యకి వారు రిప్లై వ్రాసారు. దానితో మొదలైన మా ఈ-మెయిల్ సంభాషణ కొన్నాళ్ళు కొనసాగింది. ప్రతీ మెయిల్ లోనూ ఏమైనా వ్రాయమని చాలా ప్రోత్సహిస్తూ ఉండేవారు. నాకే ధైర్యం చాలేది కాదు. ఒకరోజు అనుకోకుండా వారి బ్లాగ్ లో మా ఈ-మెయిల్ సంభాషణ ప్రచురించారు.
'మనతెలుగు చందమామ' బ్లాగు లో నేను.. నా రాతలు..!!
ఆ రోజు నా ఆనందానికి అవధుల్లేవు. ఏదో కథల పోటీలో ఫస్టు ఒచ్చినంత ఆనందం వేసింది. ఆ ఉత్సాహంతో చాలా రోజులు గడిపేశాను..!! కానీ ఏదైనా వ్రాద్దామని కూర్చుంటే పెన్ను కదలందే..!! అక్కడికి సరిగ్గా నాలుగునెలల తరువాత ( నా బ్లాగ్ మొదలెట్టిన సంవత్సరానికి..) నా ఈ కృత్యాద్యవస్థనే 'ఏదో రాయాలనే కోరిక..!!' అంటూ మొదలెడితే మినీ కవితలా వచ్చింది. ఇదేదో బాగానే ఉందనుకొని ఆ రోజే కూడలి, మాలిక మొదలైన అగ్రిగేటర్ లకి నా బ్లాగుని జత చేసి గుడ్డు దశ దాటి పిల్లగా బ్లాగు ప్రపంచం లో కాలుపెట్టాను..!! అప్పటినుంచీ ఈ రెండవ సంవత్సర కాలం లో 36 పోస్టులు వ్రాసాను. నామీద అభిమానంతో నాకు 'మన తెలుగు చందమామ' లో సహరచయితగా చోటిచ్చి ఆదరించిన శ్రీ శివరామ ప్రసాదుగారికి సర్వదా కృతజ్ఞుడిని. నేను వ్రాసిన కొన్నిచందమామ జ్ఞాపకాలూ, వడ్డాది పాపయ్య గారి మీద వ్యాసాలూ వారి బ్లాగు లో ప్రచురించి వారందించిన ప్రోత్సాహం మరువలేనిది. అలాగే వారి సాహిత్య అభిమాని, రేడియో అభిమాని, మొదలైన బ్లాగులు ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పాల్సి వస్తే అది ముంజేతి కంకణానికి అద్దం చూపించినట్టే..!! వారి వ్యాఖ్యలు గానీ వ్యాసాలూ గానీ ఎంత సూటిగా ఉంటాయో అంతే నిర్మాణాత్మకం గానూ వుంటాయి. వారు నాకెప్పటికీ గురుతుల్యులు.

అలాగే శ్రీ యమ్వీ అప్పారావు ( సురేఖ) గారు..!! బ్లాగు ద్వారానే మొదలైన వారిపరిచయం చాలా ఆత్మీయమైన స్నేహం గా పరిణమించింది. వారు మా ఇంటికి వచ్చారు. నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు నేను కూడా వారి ఇంటికి వెళ్లాను. బాపూ రమణల వీరాభిమాని. ఈవయసులో కూడా (ఆమాట అననివ్వరు) వారు ఒక పక్క వారి రేఖా చిత్రం బ్లాగులో కనీసం రెండురోజులకొక ఆర్టికల్ వ్రాస్తారు.., హాసం క్లబ్ ని రాజమండ్రి లో స్థాపించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.., పత్రికల్లో కడుపుబ్బా నవ్వించే కార్టూన్లు గీస్తారు. వీరి కార్టూన్ల పుస్తకం 'సురేఖార్టూన్లు' కి ముందుమాట స్వర్గీయ ముళ్ళ పూడి వారు వ్రాసారంటే ఆ క్వాలిటీ ఎలాంటిదో తెలుస్తుంది. చందమామలూ మొదలైన పుస్తకాలతో వుండే వారి లైబ్రరీ ఒక మ్యూజియం ని తలపిస్తుందంటే నమ్మండి. ఈయన దగ్గర వున్న ఇంకో ప్రతేకత ఏమిటంటే ఈ మధ్య కొత్తగా వస్తున్న స్క్రాప్ బుక్స్( ఒక పుస్తకం లో ఏదో ఒక విషయానికి సంబంధించి పత్రికల్లో పడే ఆర్టికల్స్, ఫోటోలూ సేకరించడం) ని వారు వారి చిన్నప్పటినుంచీ సొంతంగా తయారు చేసుకొని అందంగా తీర్చి దిద్దుతున్నారు. బాపూ రమణల మీదే 14 పుస్తకాలు, రాజమండ్రి నగరం యొక్క సాంస్కృతిక వారసత్వ సంపదని ప్రతిబింబించే పుస్తకాలూ చూస్తే మనకాశ్చర్యం కలుగక మానదు.

పై ఇద్దరు పెద్దలూ నాకెపుడూ స్ఫూర్తి ప్రదాతలుగా వుంటారు. వారికి ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని సింహాచలేశుడు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామిని ప్రార్ధిస్తున్నాను. నాకున్న కొద్దిపాటి అభిరుచికీ వారి ప్రోత్సాహాన్ని జతచేసి సలహాలూ సూచనలూ అందించే మా పెదనాన్నగారు శ్రీ రుద్రావఝల రామ కృష్ణా రావుగారూ, మరియు మా అత్త డా. సుమన్ లత గారికీ నా కృతఙ్ఞతలు. అలాగే నా బ్లాగు 'పోస్టులకు' వారివ్యాఖ్యల తోరణాలు కట్టిన చదువరులూ, బ్లాగు మిత్రులందరికీ ధన్యవాదాలు.

మరో పోస్టుతో మీ ముందుంటాను.
అంతవరకూ సె'లవ్'

7 comments:

  1. రాధే శ్యాం గారూ,

    మీ బ్లాగ్ రెండేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మన:పూర్వక శుభాకాంక్షలు. మీలో మంచి అభిరుచి ఉన్నది. ఆ అభిరుచిని అలా వదిలెయ్యకుండా మీరు పెంచి పోషించి చక్కగా కాపాడుకుంటున్నారు. ఆ పెంచి పోషించే ప్రయత్నమే మీ చేత చక్కటి వ్యాసాలు వ్రాయిస్తున్నది. మీరు ఇలాగే ఎన్నో మరెన్నో సంవత్సరాలు మీ బ్లాగును విజయవంతంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను.

    ఇంతకు ముందు మీరు ఒక సంగీత ప్రధాన బ్లాగు మొదలు పెట్టారు. దయచేసి ఆ బ్లాగులో నెలకు రెండు మూడు వ్యాసాలు వ్రాయటానికి ప్రయత్నించండి.

    మన బ్లాగుల్లో ఏదో ఒకటి చోటు నింపే ప్రయత్నం, వ్యాసాల సంఖ్య పెంచే ప్రయత్నం చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలా కాకుండా చక్కటి విషయాలను ఎంచుకుని, మనకు తోచినంత వ్రాసి ఇతరులకు వివరాలు అందించేవారు తక్కువ. అటువంటి తక్కువ సంఖ్యను ఎక్కువ చెయ్యటానికి మీ వంటి యువకుల ప్రయత్నాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

    పొద్దున్నే నా ఫోటో తో వేసిన మీ వ్యాసం చాలా ఆశ్చర్యఆనందాలను కలిగించింది. మీరు నా గురించి వ్రాసిన మంచి మాటలకు ధన్యవాదాలు.

    మరొక్కసారి అభినందనలతో

    ReplyDelete
  2. రాధే శ్యాం గారూ ! మీ పోస్టు చూసాక చాలా ఆనందం కలిగింది. నా బ్లాగు కూడా చూడండి. నా బ్లాగు పేరు క్షీరగంగ. http://sridhar-ayala.blogspot.com/

    ReplyDelete
  3. @ చిలమకూరు విజయమోహన్ గారూ, శ్రీధర్ గారూ..
    ధన్యవాదాలు.
    @ శివరామ్ గారూ,
    మీ సలహాలు నాకు శిరోధార్యాలు. నేను ఏమైనా రాస్తున్నానంటే అది మీ వంటి పెద్దల ఆశీర్వాదం, మార్గదర్శకత్వమే..!!
    'వాగ్గేయ సుధా స్రవంతి' బ్లాగ్ లో ఇప్పటికి 5 పోస్టులు వ్రాసాను. డిజైన్ కూడా మీ సూచన మేరకు మార్చాను. వీలు చేసుకొని చూడ గలరు.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  4. పొరబాటే...ఇంతవరకూ మీ సొంతఘోషకు దగ్గరవలేకపోయాను...కారణం ఏమిటి అంటే ఏదో ఒకటి చెప్పటంకన్నా బద్ధకం అని ఒప్పేసుకోవడం నిజాయితీగా వుంటుందేమో....ఈ రోజు చూసాను....ఓర్నాయనోయ్ ఎంత అందంగా వుందండి...మీ బ్లాగు...నీట్ గా, ప్రశాంతంగా, చక్కగా వుంది...రెండేళ్ళు నిండిన మీ బ్లాగుకి జన్మదినం ...ఆ సందర్భంగా గురువందనం.....చాలా బాగుంది....ఆ మధ్య మీకు మెయిల్ పెట్టా...మీ పేరు చాలా బాగుందని...ఇప్పుడీ బ్లాగుకూడా మీ పేరుకి అందం తెస్తున్నది...అలాగే మంచి మంచి రచనలతో మీ బ్లాగు మాకందరికీ ఆనందం పంచాలని మరీ మరీ కోరుకుంటున్నాను....

    ReplyDelete
  5. $రాధేశ్యాం గారు

    మీకు, మీ అందమైన బ్లాగుకి రెండవ వార్షికోత్సవ సందర్భంగా

    :: శుభాభినందనలు ::

    ReplyDelete
  6. ప్రియమితృలు చిరంజీవి రాధేశ్యాం గారు,
    ఇంతకాలానికి మీబ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ జేస్తున్నందుకు
    అన్యధాభావించరని తలుస్తాను. మీరు నాపై చూపించినన అభిమానానికి
    ఎంతో ఆనందించాను. త్వరలో మనం కలుద్దాం! మీ పాపకు సంగీతంలో
    బహుమతి వచ్చిందని తెలిసి మేమిద్దరం చాలా సంతోషించాము.
    సురేఖాచిత్రం

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)