Thursday, February 28, 2013

'ఆధార్ కార్డు' ఆన్ లైన్ ప్రింట్ తీసుకోవడం ఎలా..??

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం గా గణుతికెక్కిన మన భారత దేశంలో మన ఓటు మనమే వెయ్యడానికీ, అది ఇంకొకరి చేతులో పడి దుర్వినియోగం అవకుండా ఉండడానికి ఓటర్ గుర్తింపు కార్డుల నమోదు, పంపిణీ పెద్ద ఎత్తున చేపట్టారు. కానీ ఆ కార్డులు చేతిలోకి వచ్చాక చూసుకుంటే దాని నిండా బూతులే ..!! పేరు స్పెల్లింగ్ తప్పు..! డేట్ ఆఫ్ బర్త్ , తండ్రి పేరు, అడ్రెస్ అన్నీ తప్పులే..! ఫోటో మనది, పేరు ఇంకొకడిది .. , పేరు మనది తండ్రిపేరు ఇంకోటి ..! ఒకే కుటుంబంలో ఉన్న ఆరుగురి కార్డులు చూస్తే అందరి వివరాలూ కలగాపులగం చేసేసి, దానిని మించిన తప్పుల తడక ఇంకొకటి ఉండదనిపించారు. అది మన గుర్తింపు కార్డు గా పనికొస్తుందనుకుంటే ఆకార్డు చూపిస్తే మన అసలు గుర్తింపే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. రెండు మూడు సార్లు నమోదనీ, సవరణ అనీ ఎన్ని రకాలుగా కుస్తీ పట్టినా ఆ తప్పుల తడకలో చిల్లులు మరింత పెరిగాయి గానీ తగ్గలేదు. 

ఓటరు గుర్తింపు కార్డు 


పోస్టు లో వచ్చే 'ఆధార్ కార్డు' నమూనా

అలాంటి పరిస్థితిలో భారత ప్రభుత్వం దేశం లోని ప్రజలందరికీ బహుళార్థకంగా  ఉపయోగ పడడానికి ఉద్దేశించిన ఫోటో గుర్తింపు కార్డు ఆధార్ ను వినియోగంలోకి తెచ్చింది ..! ప్రతీ వ్యక్తికీ సంబంధించిన పలు విషయాలను ఈ ఆధార్ నంబరు తో అనుసంధానం చేసి, తద్వారా ఇదే కార్డు మన ఫోటో గుర్తింపు కార్డుగానూ, ఓటరు ఐడీ కార్డుగానూ, ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగ పడేలా రూపొందించి, ఈ కార్డు తీసుకోవడం తప్పనిసరి చేశారు. పాత ఓటరు ఐడీ ల తో పోల్చితే ఆధార్ కార్డు మరింత పకడ్బందీగా ఉందని చెప్పాలి. కేవలం ఫోటో ఒక్కటే కాకుండా మన వేలిముద్రలూ , మరియు కళ్ళను స్కాన్ చేసి మన గుర్తింపు ఖచ్చితంగా ఉండేలా రూపొందించారు. అలాగే నమోదు చేసేటప్పుడు కూడా, మన వివరాలు మనమే సరిచూసుకొనే ఏర్పాటు కూడా చేశారు. అలాగే ప్రతీ కార్డుమీదా ప్రత్యేకమైన QR కోడ్ ను కూడా ముద్రించారు. అది మన మొబైల్ ఫోన్ తో స్కాన్ చేస్తే మన వివరాలన్నీ మొబైల్ స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతున్నాయి.  
వివరాలు నమోదు చేస్తున్న ఉద్యోగి, మన వివరాలు మనమే సరిచూసుకోనేందుకు పెట్టిన రెండవ Monitor 

వేలిముద్రల నమోదు
కళ్ళ స్కానింగ్ (ఐరిస్)
కానీ ఇదివరకూ నమోదు చేయించుకున్న వారికి కూడా ఇంకా ఈ కార్డుల పంపిణీ పూర్తిగా జరగలేదు. ఇవి స్థానిక పోస్టాఫీసుల్లో గుట్టలుగా పేరుకుపోయాయని పేపర్లలో చూస్తున్నాం ..!  మా ఇంట్లో మా అమ్మ, నాన్నగార్లవీ మా ఆవిడదీ ఆధార్ కార్డులు వచ్చాయి కానీ నాది మాత్రం రాలేదు.  కానీ పోస్టుమాన్ ని అడిగితే  మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు అన్నీ పంచేశామనీ, కొత్తవి ఇంకా ఏమీ రాలేదనీ సమాధానం వస్తోంది . ఇది ఇలా ఉంటే ఇంతవరకూ నమోదు చేయించుకొని వాళ్లకి  కొత్తగా నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఆధార్  నమోదు కేంద్రాల వద్ద పడిగాపులు, తొక్కిసలాటలు చూస్తూనే ఉన్నాం. అయితే వివరాలు నమోదు చేయించుకున్న వాళ్లకి కార్డు ఆన్ లైన్ ద్వారా ప్రింట్ తీసుకొనే వెసులుబాటు కల్పించారు. దాని వల్ల  సగం పని తప్పింది కదా..! అదెలాగో ఇప్పుడు చూద్దాం ..!!

  ఈ లింక్ కి వెళ్ళండి : http://eaadhaar.uidai.gov.in/

Provide the Enrollment number , date/time and pin code as mentioned during the Aadhaar registration .

Provide Enrollment Details
Provide Enrollment Details


A confirmation whether you still have the same mobile number that was mentioned when registering is displayed.If you have changed your mobile number since then, just mention the new mobile number by clicking No.


Mobile Number Confirmation
Mobile Number Confirmation


An OTP(One Time Password) will be sent to your registered mobile number. Just type the same.

OTP sent to the mobile number
OTP sent to the mobile number

And there you go, you will get a link to download the PDF copy of your Aadhaar / UIDAI letter :)

Download your AADHAAR Card
Download your AADHAAR Card
The Password of the PDF copy of your Aadhaar letter is your pin code mentioned during registration. (The PDF is also digitally signed :) )

నమూనా 'ఈ-ఆధార్ కార్డు'
Many have reported that they are getting validity / signature error when opening the PDF file. Kindly refer to Solution provided by UIDAI in case you are facing such problem.

అదండీ సంగతి..!! అంచేత కార్డు ఇంటికి వచ్చేదాకా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూడడం మానేసి, సింపుల్ గా ఇంట్లోనే ప్రింట్ తీసుకొని వాడుకోండి ..!!

పై ప్రణాళిక కర్టెసీ :
Get your Aadhaar card letter online [India]
thanks  to  ఆదిత్య ఉదయ్ ..!

పూర్తిగా చదవండి...

Sunday, February 10, 2013

ఏం చెయ్యాలి వీళ్ళని..!!

పరనింద పాపం అంటారు. ఆపాపం చెయ్యనిదే పాపం..మన రాజకీయ నాయకులకు పూట గడవదు. రోజూ క్రమం  తప్పకుండా ప్రెస్ మీట్ పెట్టి మరీ..తమ రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలూ, వాగ్బాణాలూ, ఎకసెక్కాలూ, బూతులు తిట్టడాలూ, బురద జల్లడాలూ చేస్తూ ఉంటారు. వారికది నిత్యకృత్యం..! అలవాటైన ప్రాణం కదా..! ప్రొద్దున్నే టైం ప్రకారం తినడానికో తాగటానికో, ఏదో ఒకటి కడుపులో పడకపోతే ఎలా నీరసం వచ్చి వణుకు మొదలౌతుందో అలా అన్న మాట. పొద్దున్నే లేచి పేపరు చూడడం..,తమకు పనుకొచ్చే క్లిప్పింగు లన్నీ సేకరించి పార్టీ ఆఫీసు దగ్గరికొచ్చి ప్రెస్ మీట్ పెట్టి,  పైన చెప్పిన పనులన్నీ చెయ్యడం వాళ్ళ దినచర్య లో భాగం అయిపొయింది.

ఈ ప్రెస్ మీట్ వల్ల రెండు లాభాలు..! 
ఒకటి. సాధారణంగా ఇవన్నీలైవ్ గా ప్రసారం అయిపోతున్నాయి కాబట్టీ నోటిని అదుపులో ఉంచుకోవాల్సిన పనిలేదు. ఎడిట్ చేసే సమయం ఉండదు కదా. అవతలి వాళ్ళు పచ్చి బూతులు తిడితే వీళ్ళు అమ్మనా బూతులు అందుకోవడం ద్వారా నోటి దురద తీరుతుంది.
రెండు. ముందురోజు ఎగస్పార్టీ వాళ్ళూ, (ఈమధ్య సొంతపార్టీ వాళ్ళుకూడా) తమ మీద చల్లిన బురద ని మళ్ళీ వాళ్లమీదికే తిరిగి చల్లేయ్యోచ్చు. ఖర్చు లేకుండా..!! (సో.. ఇద్దరూ బురద మొహాల్తోనే ఉండొచ్చు. హెచ్చు తగ్గులు లేకుండా..!)

పైరెండూ కాక  అతిముఖ్యమైన విషయం ఇంకోటుంది.
తమ నియోజక వర్గానికి సంబంధించిన ప్రజలతో ప్రత్యక్షంగా కలిస్తే అప్పుడప్పుడూ వాళ్ళు అడిగే ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కోవాలి. అదే ప్రత్యక్ష ప్రసారం ద్వారా కలిసారనుకోండి..గ్లామరూ పెరుగుతుంది. పైన చెప్పిన ఇబ్బందీ ఉండదు. చచ్చినట్టు వీళ్ళు చెప్పేదంతా వినాలి. అంతేకాక రాష్ట్రప్రజానీకం మొత్తానికి తో సంబంధం ఏర్పడి చోటా నాయకుడు బడా నాయకుడిగా ఎదిగే అవకాశం కలుగుతుంది.

పైవన్నీ అలా ఉంచండి.
ఈ మధ్య రాజకీయాలలో ఒక చిత్రమైన పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. ఇదేదో ఒక్కరోజులో జరిగిపోయింది కాదులెండి. ఇంతకీ సంగతేమిటంటే.. ఒక విషయం మీద (అవినీతి అవ్వొచ్చు, కబ్జాలు అవ్వొచ్చు, హత్యా యత్నాలు అవ్వొచ్చు, బూతు సినిమాలు చూడడం కావొచ్చు..) ఫలానా ఘోరం చేసేస్తున్నారు బాబోయ్, ఇంతకన్నా నీచం మరిలేదు మహాప్రభో..అంటూ నిన్ననే కష్టపడి గొంతు చించుకొని అవతల వాళ్ళ మీద ఆరోపణలు చేసి జబ్బలు చరుచుకుంటే.. ఇవాళ స్వపక్షీయులే సరిగ్గా అలాంటి నీచపు పనో, తత్సమానమైన ఇంకో దిక్కుమాలిన పనో చేసి దొరికిపోతున్నారు. ఏతావాతా తేలేదేమిటంటే అందరూ ఆ తాను ముక్కలే అని..! ఒక వేలెత్తి వీళ్ళు అవతలి వాణ్ని చూపిస్తే మూడువేళ్ళు వీళ్ళని చూపిస్తూ ఉంటాయన్నమాట.  ప్రజలు మాత్రం ఎటూ మాట్లాడలేని బ్రొటన వేలులాగా భగవంతుడా నీవే రక్ష..! అనుకొంటూ ఆకాశం వైపు తెల్లమొహం వేసుకొని చూస్తూఉంటారు.

అధికార పక్షం వాళ్ళు "మా హయాం లో ముగ్గురు మంత్రులని పదవులు పీకి కోర్టుల్లో శిక్ష వేయించి జైల్లో పెట్టేశాం. మమ్మల్ని మించిన ధర్మ ప్రభువులు నభూతో.. "అనేస్తారు. ఇంకో పక్క ఈ స్కాం బయటకి రావటానికి కారణమైన వ్యక్తులని ఎన్ని అగచాట్లకు గురి చెయ్యాలో అంతా చేస్తారు. అయ్యా..! చెవిలో పువ్వులెవరికి పెడుతున్నారు..?? సాధ్యమైనంత వరకు స్వపక్షీయులని రక్షించడానికి ఎన్ని పనులు చేయాలో అన్నీ చేసి, కోర్టు చేత నానా తిట్లు తిట్టించుకొని, మొట్టికాయలు వేయించుకొని, ఇంక లాభంలేదు అన్న పరిస్థితిలో తప్పనిసరై తమ వారిని ఇంటికి పంపిస్తే, కోర్టు వారి ఆదేశాలు వారిని జైల్లో దిగపెడుతున్నాయి. దీనిలో పాలకపక్షం గొప్పతనం, ధర్మోద్ధరణ ప్రసక్తి ఎక్కడుంటుంది..??

దీంట్లో ఇంకో చిదంబర రహస్యం ఉంది. కోర్టులో శిక్షపడ్డాకే దోషి గానీ, అంతవరకూ నిర్దోషి గానే పరిగణించబడతారు.   ఒకడు పది సంవత్సరాల క్రితం లక్షరూపాయలు లంచం తీసుకొనో, ఆయన దగ్గర పని చేసే సెక్రెటరీని చంపేసో,  బోల్డు వాదోపవాదాల దరిమిలా కోర్టులో దోషిగా తేలి ఏడాది శిక్ష పడితే అతడు పై కోర్టు కి పోయి ఇంకో పదేళ్ళో లేక జీవితకాలమో అతని శిక్ష తప్పించుకోవడానికి కావలసిన వెసులుబాట్లు మన చట్టాల్లోనే ఉన్నాయి. ఈకాలంలో అతడు రకరకాల ప్రభుత్వ పదవులు వెలగబెట్టొచ్చు. ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభలకు ఎన్నికవ్వొచ్చు. నామినేటెడ్ పదవులు పొందొచ్చు. దేవుడు మేలు చేస్తే ముఖ్యమంత్రి, గవర్నర్ గిరీ లాంటి అత్యున్నత పదవులతో సహా అందుకోలేని అందలం ఉండదు. తద్వారా మరో "వందల కోట్లు ఆర్జించే" అవకాశాన్ని దర్జాగా వినియోగించుకోవచ్చు. చిట్టచివరికి అతడి నేరం రుజువై (అప్పటికే చట్టానికి అందని ఎత్తులోఉన్నా) శిక్ష పడినా అది ఆ వ్యక్తి చిన్నప్పుడు చేసిన శిక్ష కి  అనుగుణంగానే ఉంటుంది. అది  ఈ వ్యక్తి ఇప్పుడున్న స్థాయికి తుపుక్కని ఉమ్మేసిన పాటి. అంతేకాని నేరానికీ శిక్షకూ మధ్యకాలంలో ప్రభుత్వంవారు దయచేయించిన జీత భత్యాలూ, ఏసీ మర్యాదల్తో ప్రయాణాలూ, అవకాశం వచ్చిందికదాని ఇతగాడు పట్టేసిన వందల కోట్ల రూపాయలకూ ఆ మట్టి అంటదు.

ఈ పైన చెప్పిన యవ్వారాలన్నిటికన్నా ప్రమాద కరమైనది..పైన చెప్పిన మన నాయకులు బొత్తిగా బాధ్యత మర్చిపోయి, తమ ముందు మైకు ఉంది కదాని నోటికి ఎంతొస్తే అంత అనేయడం...! వాళ్ళు వాడే భాష ఎంత నీచం గా ఉన్నా , దాని పర్యవసానంగా రెండు కులాల మధ్య, మతాల మధ్య, లేదా ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఏర్పడి తద్వారా దేశ సమగ్రతకి భంగం కలిగే పరిస్థితి దాపురించినా.. వీళ్ళకు పట్టదు.  ఈ వ్యక్తులలో కొందరికి నోటి దూలతో పాటూ చేతి తీటా ఎక్కువే..! చెప్పిన పైలు వెంటనే అందించని తమ పర్సనల్ సెక్రెటరీ అయినా, తాము చెప్పిన వాళ్లకి అర్హత లేదన్న కారణంతో అప్పివ్వని బాంకు మేనేజరైనా, లేక సాక్షాత్తూ జిల్లా కలెక్టరే అయినా వీరికి చిర్రెత్తుకొచ్చిందంటే చాలు. తమ నోటికీ చేతికీ కూడా పని చెబుతారు.

యధా రాజా తథా ప్రజా అన్నారు..! బడానాయకుల్ని చూసి చోటా నాయకులు, వారిని చూసి వారి అనుచరులూ, ఒక్కరేమిటి, పైనుంచీ క్రిందదాకా అందరిదీ ఒకటే వ్యవహార శైలి..! సుగుణాలలోనూ, ఆదర్శాలలోనూ స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన పాతతరం 'దేశ'నాయకుల స్థానంలో అవినీతీ, గూండాగిరీలకు ముందుండి దిశా నిర్దేశం చేస్తున్న 'ఖల్' నాయకుల  ఆధ్వర్యం లో రాజకీయాలు నడుస్తున్నాయిప్పుడు..! నిరాడంబరుడు, స్నేహశీలి, ఆశాజ్యోతి, ప్రియతమ నాయకుడు లాంటి విశేషణాలు ఇప్పుడూ కనిపిస్తాయి... దిగువ శ్రేణి నాయకత్వం, వారి అధినాయకత్వాల జన్మదినాల సందర్భంగా ఊరంతా పరిచేసే ఫ్లెక్సీ లలో... నేతి బీరకాయ చందంగా..!!
 
ఇప్పుడు ప్రశ్న... వ్యవస్థను నిర్వీర్యం చేసి, దాని  పతనానికి కారకులయ్యే పై పెద్దమనుషులకి దేశద్రోహ నేరం అంటదా..??  ఏం  చెయ్యాలి వీళ్ళని..??
పూర్తిగా చదవండి...

Saturday, February 9, 2013

అద్భుతమైన జంధ్యాల మార్కు కామెడీ సినిమా 'రావూ - గోపాల్రావూ' ..!పరకాయప్రవేశం ఇతివృత్తంగా రిసెర్చిలో మునిగిపోయి ఇంటి బాధ్యతలు మర్చిపోయిన ఒక  ప్రొఫెసర్ (గోపాలరావు పాత్ర : రావుగోపాలరావు), ఏ బాధ్యతా లేకుండా తిరిగే జల్సాగా తిరిగే విద్యార్ది (రామారావు పాత్ర : చంద్రమోహన్) చుట్టూ అల్లిన అద్భుతమైన జంధ్యాల మార్కు కామెడీ సినిమా             రావూ - గోపాల్రావూ.

ఆద్యంతం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే ఈ సినిమా చిన్నప్పుడెప్పుడో చూశాను. ఒక నాలుగేళ్ల క్రితం సీడీ షాపులో కనిపించి రెండు వీసీడీల ప్యాక్ ని కొన్నాను. తరువాత మళ్ళీ ఎక్కడెక్కడో తిరిగి ఈ పండగలకి మళ్ళీ నా వద్దకు చేరింది.


కథ లోకెళితే ... అనగనగా ఒక చరిత్ర ప్రొఫెసర్ గారు. పేరు గోపాల్రావు (రావు గోపాలరావు). పరకాయ ప్రవేశం గురించీ రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. కాలేజీ లైబ్రేరియన్ (శ్రీలక్ష్మి) రిఫెరెన్సులు ఇచ్చి సహాయం చేస్తూ ఉంటుంది. అతగాడి ధ్యాసంతా ఆ విద్యని ఎలా సాధిద్దామనే విషయం పైనే ఉండడంతో ఇంటి విషయాలని అస్సలు పట్టించుకోడు. పైగా విపరీతమైన మతిమరుపు. పెళ్ళాం పిల్లల పేర్లు కూడా గుర్తుండవ్..! తన పిల్లల మీద, తన పెంపకం మీద  గ్రుడ్డి నమ్మకంతో ఉన్న ఈయనకి వాళ్ళ చెడు తిరుగుళ్ళు, త్రాగుడు, పేకాటలూ కనపడవ్..!! అతని జీవిత లక్ష్యం ఒక్కటే.. అదే పరకాయ ప్రవేశ విద్యని సాధించడం..!!

అదే కాలేజీ లో చదువుతున్న రామారావు (చంద్ర మోహన్) ఇతన్ని తెగ ఏడిపిస్తూ ఉంటాడు. చరిత్ర అంటే చచ్చేంత ఎలెర్జీ..! ఇతని తండ్రి (పీ ఎల్ నారాయణ) తన కొడుకుని ఎలాగైనా చరిత్రలో గోల్డ్ మెడల్ సాధించాలంటూ తుపాకీ పుచ్చుకొని మరీ వెంటపెట్టి  వేధిస్తూ ఉంటాడు. అతని తల్లిది (రాధాకుమారి) చిత్రమైన బలహీనత. గుడ్డ కనబడితే చాలు దాన్ని ఇచ్చేసి స్టీలు గిన్నెగా మార్చుకొందే నిద్ర పట్టదు. ఇంట్లో కనపడ్డ ప్రతీ బట్టనీ స్టీల్ సామాన్లవాడికి ఇచ్చేసి ఏ  చెంచా నో చెంబు నో తీసుకొని తృప్తి పడుతూ ఉంటుంది. ఆ స్టీలు సామాన్ల వాడు కూడా ఈ ఇంటి చూరునే విడవకుండా పట్టుకు వేళ్ళాడుతూ ఆ ఇంటి యజమానికి బీపీనీ పెంచుతూ మనకు కామెడీనీ  పంచుతూ సినిమా చివరి దాకా ఉంటాడు.

తన క్లాస్ మేట్  అయిన శారద (ముచ్చెర్ల అరుణ) ని  ప్రేమిస్తాడు రామారావు. ప్రస్తుతానికి అది వన్  సైడే ..! ఒకానొక పరిస్థితిలో ఆవిడ చేతిలో చెంపదెబ్బ తిన్న రామారావు మూడ్ బాలేక ఆ రోజు పొద్దుపోయిన దాకా అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉంటాడు. (ఒక బ్రాందీ షాపు కనబడితే వెళ్ళి బీరుందా అని అడుగుతాడు. షాపువాడు ఫుల్ బాటిలు తెస్తాడు. రా.రా.: "అబ్బే ఇంత పెద్దది వద్దండీ.. ఒక క్వార్టరు బాటిలూ, రెండు సోడాలూ  ఇవ్వండి..!"
షా.వా.: "ఒక క్వార్టరు బీరూ , రెండు సోడాలూనా..! డబ్బులిలా వేస్ట్ చెయ్యకండి సార్..! పక్కనే హోటలుంది రెండిడ్లీ ఓ కాఫీ తాగండి..!!" అంటూ ఉచిత సలహా పారేస్తాడు)

ఒక వెర్రి నవ్వు నవ్వి బయటకు వచ్చేసిన రామారావు అంత  రాత్రి వేళ ఒక గుట్ట మీదకి వెళ్తున్న గోపాలరావు మాష్టార్ని చూస్తాడు.  క్యూరియాసిటీ కొద్దీ  అతన్ని అనుసరించిన రామారావు, ప్రొఫెసర్ గారు కొన్ని తాళ పత్రాలూ, ఓ కోతి  శవమూ బయటకి తీసి అండర్లైన్ చేసిపెట్టుకున్న మంత్రాలు చదివి పరకాయప్రవేశం ద్వారా కోతి శరీరం లోకి ప్రవేశించడం చూస్తాడు. అదను చూసి ఇతనూ  అవే మంత్రాలు చదివి ప్రొఫెసర్ గారి శరీరం లోకి దూరిపోతాడు. కోతి  శరీరంతో కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి, వెనక్కి వచ్చిన ప్రొఫెసర్ గారితో "తన శరీరంతో పరీక్షరాసి గోల్డు మెడల్ కొట్టమనీ, అప్పుడు మీ శరీరాన్ని మీకిచ్చేస్తాననీ" బేరం పెడతాడు.  విధిలేని పరిస్థితిలో రామారావు శరీరాన్ని తొడుక్కుంటాడు గోపాల్రావు మేష్టారు...!

ఆ సినిమాలోని screen shots  చూడండి:అది మొదలు మనకి నవ్వుల విందు..!
పొరపాటున వేరే శరీరాల్లో ఉన్నామన్న సంగతి మర్చిపోయి  తమ తమ పాత ఇళ్ళకి వెళ్లి చిక్కుల్లో పడతారు ఇద్దరూ..! దాంతో రాజీకొచ్చి గోపాల్రావుగారి ఇంటికి ఆయన శరీరంలో ఉన్న రామారావు, రామారావు ఇంటికి అతని శరీరంతో గోపాల్రావు మేష్టారూ వెళ్తారు. కొత్త వాతావరణం, పరిసరాలతో ఇద్దరూ ఇబ్బంది పడతారు. శరీరాలైతే మారాయిగానీ వ్యక్తిత్వాలూ , అలవాట్లూ  మారవుకదా ..!! ఇంట్లో వారి కుటుంబ సభ్యులు కూడా హటాత్తుగా వారిలో వచ్చిన మార్పుకి తికమక పడతారు.

ఇలా ఉండగా గోపాల్రావు శరీరంలో ఉన్న రామారావుకి, అప్పటివరకూ వన్ సైడెడ్ గా ఉన్న ప్రేమ రెండో వైపు నుంచీ కూడా మొగ్గ తొడిగిందని తెలుసుకొని, ఎంత తొందరగా తన శరీరంలోకి మారిపోదామా అని తెగ ఇదైపోతూ ఉంటాడు. కానీ రామారావు శరీరంలోని గోపాలరావు మేష్టారికి  తన  పిల్లల అసలు వ్యవహారాలు కళ్ళబడి తన నమ్మకపు పొరలు తొలగిపోవడంతో కనువిప్పు కలుగుతుంది. దాంతో "పరీక్షలైపోయాయి గనక  శరీరాలు మార్చేసుకుందా"మంటూ రామారావు వెంటపడుతున్నా తన సమస్యలు తీరేదాకా తిరిగి పాత శరీరాల్లోకి మారేది లేదని తెగేసి చెప్పేస్తాడు. మొదట అపార్ధం చేసుకున్న రామారావు తను తొడుక్కున్న గోపాల్రావు  శరీరాన్ని ఎన్ని ఇక్కట్ల పాలు చెయ్యాలో, ఎన్ని వెకిలి వేషాలు వేస్తే  ఆ శరీరానికి చెడ్డ పేరు వస్తుందో అన్నీ చేస్తాడు. కానీ తరువాత మేష్టారి కష్టాన్ని, బాధనీ అర్ధం చేసుకున్నాక ఆయనకు సాయంగా నిలిచి వారి కుటుంబాన్ని నిలబెడతాడు. 

కానీ వాళ్లకి శరీరాలు మార్చుకోవడానికి వాహకంగా కావలసిన ఒక శవం దొరక్క నానా పాట్లూ పడుతూ ఉంటారు.

ఈ లోగా శారదతో రామారావు పెళ్ళికి  వాళ్ళ నాన్న(పీ ఎల్ నారాయణ) ఒప్పుకొని పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు.  రామారావు శరీరంతోఉన్న గోపాల్రావు మేష్టారికే పెళ్ళికొడుకుని చెయ్యడం, ఊరేగింపూ లాంటి తంతులన్నీ జరిపించేస్తూ ఉంటే అసలు రామారావు మరింత ఉడికిపోతూ ఉంటాడు. చివరకి ఈ పెళ్లి ఊరేగింపుకి ఒక శవం ఎదుర్రావడంతో ఆ శవాన్నే వాహకం గా చేసుకొని శరీరాలు మార్చుకుంటారు మన రావూ  - గోపాల్రావులు. రామారావుకి  శారదతోనూ, అలాగే మేష్టారి కూతురికి ఆమె ప్రేమించిన యువకుడితోనూ పెళ్ళిళ్ళు జరగడంతో శుభం కార్డు పడుతుంది.

ఈ సినిమాలో కామెడీ ట్రాక్ అంటూ సెపరేట్ గా కాక కథలో అంతర్భాగం గా ఉంటుంది. జంధ్యాల గారి సినిమాల్లో అది కామనే అనుకోండి..! కానీ రావు గోపాలరావూ, చంద్రమోహన్ వాళ్ళ ఒరిజినల్ కారెక్టర్ లో కన్నా శరీరాలు మార్చుకున్నాక అవతల వాళ్ళ బాడీలాంగ్వేజ్, మేనరిజం లతో పండించిన హాస్యం సూపర్బ్..! ఇద్దరిలోకీ రావుగోపాల్రావే (పాత్ర పరంగా స్కోప్ కూడా ఉండడంతో) అద్భుతంగా పోషించాడు. అలాగే కాలేజి లైబ్రేరియన్ మంగతాయారు గా గోపాల్రావుకి రీసెర్చి లో సాయపడుతూ, తాళపత్రాలు ఇచ్చే పాత్రలో శ్రీలక్ష్మి, 'L' బోర్డు తో TVS మోపెడ్ నడుపుతూ అడ్డొచ్చిన వాళ్ళని గుద్దేస్తూ ఉంటుంది. ఆమె బండి నడుపుతూ ఉంటే వెనకాతలే ఇంకో అతను ను పరిగెడుతూ ఉంటాడు. స్టాండు వెయ్యడానికీ, పడిపోతే లేపదానికీ అన్నమాట.

ఇక పొట్టి ప్రసాద్, రావుగోపాలరావు బావమరిది. అతనికి తన బావదగ్గర మస్కా కొట్టి డబ్బులు లాగేస్తూ ఉంటాడు. అతని దగ్గర అతని మేనల్లుడు వాటా కొట్టేస్తాడు (పోలీసుల పేరు చెప్పి భయపెట్టి..!). అతడు సరిగ్గా ఈ వ్యవహారంలో ఉండగా శ్రీలక్ష్మి ఎదురుపడుతుంది. (శ్రీలక్ష్మికీ, పొట్టిప్రసాద్ కీ ఎత్తులో సుమారు అడుగు తేడా ఉంటుంది). ఆ సీన్లో శ్రీలక్ష్మిని మొదట ఆడ పోలీసుగా భావించి వినయం నటించే పొట్టిప్రసాద్, ఆవిడ లైబ్రేరియన్ అని తెలిసే సరికి ఒకసారి ఎగాదిగా చూసి, రెండు మెట్లు ఎక్కి ఎత్తు సరిచూసుకొని మరీ,  "వెళ్ళెళ్ళవమ్మా..!" అంటూ దబాయిస్తాడు. నటీనటుల శరీర సౌష్ఠవాన్ని కూడా సహజమైన హాస్యానికి వస్తువుగా తీసుకోగలిగే చాతుర్యం జంధ్యాలకే చెల్లు..! ( ముఖ్యంగా మరొకర్ని నొప్పించేటట్టు కాకుండా..!)

సినిమా మొత్తం మీద బెస్ట్ కామెడీ అని చెప్పగలిగేది.. రామారావు(చంద్రమోహన్) తల్లిదండ్రులు ఫోర్జరీ సాంబమూర్తి (పీ ఎల్ నారాయణ), స్టీలు సీతాలక్ష్మి(రాధాకుమారి), మరియు స్టీలు సామాన్లవాడు ఈ ముగ్గురి మధ్యా నడిచే సన్నివేశాలు..!! ఆ సంభాషణలూ, వాళ్ళ టైమింగ్ చూస్తే మనకి పొట్ట చెక్కలవ్వడం  ఖాయం..!! సినిమా మొదట్లో పంచ, లాల్చీ, కండువాలతో కనిపించే ఫోర్జరీ సాంబమూర్తి సినిమా నడుస్తున్న కొద్దీ ఒక్కొక్క వస్త్ర విశేషాన్నీ కోల్పోయి చివరకొచ్చేసరికీ బొందులాగూ తో మిగుల్తాడు. అదే ఆ స్టీలు సామాన్ల వాడు ఒక్కొక్కటిగా చొప్పున చివరికోచ్చేసరికీ ఆ పట్టుపంచ, లాల్చీ, కండువాల వేషం తో ఇంటి యజమానితో పోటీ అన్నట్లు ఇతగాడు తయారైపోతాడు. దానికి అతడు చెప్పే లాజిక్ నవ్వు తెప్పిస్తుంది. పెద్దవారింటికి వచ్చేటప్పుడు ( పాత బట్టలకి స్టీల్ సామాన్ల మార్పిడికే అనుకోండి..) చింకి బట్టలతో వస్తే ఏం బాగుంటుంది.. అంటాడు. అలాగే బట్ట చూపిస్తే చాలు అది వెంటనే తన ఒంటికి చుట్టేసుకొని, స్టీలు చెంచానో, గరిటో, ఇస్తానంటూ బేరాలు మొదలెడతాడు. కొసమెరుపేంటంటే వాడు ఈ ఇంటి యజమానితో వాడి కష్టం చెప్పుకుంటాడు. ఈమధ్య వాళ్ళ ఆవిడ క్రొత్తగా ప్లాస్టిక్ వస్తువులంటే పది చచ్చిపోతోందనీ, కన్ను చాటయితే ఒంటిమీద ఉన్న గుడ్డలు సైతం ఒలిచేసి ఆ బట్టల్ని ఇచ్చి ప్లాస్టిక్ డబ్బాలు, చెంచాలు మార్చుకొని ఇల్లంతా ప్లాస్టిక్ మాయం చేసేస్తోంది అంటూ వాపోతాడు. పాపం ఫోర్జరీ సాంబమూర్తికి నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు.

గోపాలరావు శరీరం లో ఉన్న రామారావు, తను గోపాలరావు కాదనీ, రామారావుననీ మేష్టారి కుటుంబాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. అతని కొక్కిరాయి చేష్టలకి హడలెత్తిన పిల్లలు ఒక మెంటల్ డాక్టర్ని(సుత్తివేలు) తెస్తారు.  తీరా చూస్తే  అతడు డాక్టరు కాదుకదా అక్కడ తచ్చాడుతున్న పేషెంటు..! చిన్న పాత్రే అయినా చాలా చక్కగా మెప్పిస్తాడు సుత్తి వేలు..! మళ్ళీ చివరన కనిపించే శవం పాత్ర కూడా సుత్తి వేలు చేతే వేయించారు జంధ్యాల. ఒకే వ్యక్తి  రెండు వేర్వేరు పాత్రలు వేసినా ఎక్కడా ఆ విషయమే స్ఫురణకి రాదు.


మొత్తంగా సినిమా ప్రతీ సీనులోనూ హాస్యాన్ని రంగరించి, ఎక్కడా వడి  తగ్గకుండా, బోరు కొట్టకుండా కథ నడుపుతూ జంధ్యాల గారు అద్భుతంగా వండి వడ్డించిన చక్కని చిత్రం రావూ  - గోపాల్రావూ 
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)