Sunday, February 10, 2013

ఏం చెయ్యాలి వీళ్ళని..!!

పరనింద పాపం అంటారు. ఆపాపం చెయ్యనిదే పాపం..మన రాజకీయ నాయకులకు పూట గడవదు. రోజూ క్రమం  తప్పకుండా ప్రెస్ మీట్ పెట్టి మరీ..తమ రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలూ, వాగ్బాణాలూ, ఎకసెక్కాలూ, బూతులు తిట్టడాలూ, బురద జల్లడాలూ చేస్తూ ఉంటారు. వారికది నిత్యకృత్యం..! అలవాటైన ప్రాణం కదా..! ప్రొద్దున్నే టైం ప్రకారం తినడానికో తాగటానికో, ఏదో ఒకటి కడుపులో పడకపోతే ఎలా నీరసం వచ్చి వణుకు మొదలౌతుందో అలా అన్న మాట. పొద్దున్నే లేచి పేపరు చూడడం..,తమకు పనుకొచ్చే క్లిప్పింగు లన్నీ సేకరించి పార్టీ ఆఫీసు దగ్గరికొచ్చి ప్రెస్ మీట్ పెట్టి,  పైన చెప్పిన పనులన్నీ చెయ్యడం వాళ్ళ దినచర్య లో భాగం అయిపొయింది.

ఈ ప్రెస్ మీట్ వల్ల రెండు లాభాలు..! 
ఒకటి. సాధారణంగా ఇవన్నీలైవ్ గా ప్రసారం అయిపోతున్నాయి కాబట్టీ నోటిని అదుపులో ఉంచుకోవాల్సిన పనిలేదు. ఎడిట్ చేసే సమయం ఉండదు కదా. అవతలి వాళ్ళు పచ్చి బూతులు తిడితే వీళ్ళు అమ్మనా బూతులు అందుకోవడం ద్వారా నోటి దురద తీరుతుంది.
రెండు. ముందురోజు ఎగస్పార్టీ వాళ్ళూ, (ఈమధ్య సొంతపార్టీ వాళ్ళుకూడా) తమ మీద చల్లిన బురద ని మళ్ళీ వాళ్లమీదికే తిరిగి చల్లేయ్యోచ్చు. ఖర్చు లేకుండా..!! (సో.. ఇద్దరూ బురద మొహాల్తోనే ఉండొచ్చు. హెచ్చు తగ్గులు లేకుండా..!)

పైరెండూ కాక  అతిముఖ్యమైన విషయం ఇంకోటుంది.
తమ నియోజక వర్గానికి సంబంధించిన ప్రజలతో ప్రత్యక్షంగా కలిస్తే అప్పుడప్పుడూ వాళ్ళు అడిగే ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కోవాలి. అదే ప్రత్యక్ష ప్రసారం ద్వారా కలిసారనుకోండి..గ్లామరూ పెరుగుతుంది. పైన చెప్పిన ఇబ్బందీ ఉండదు. చచ్చినట్టు వీళ్ళు చెప్పేదంతా వినాలి. అంతేకాక రాష్ట్రప్రజానీకం మొత్తానికి తో సంబంధం ఏర్పడి చోటా నాయకుడు బడా నాయకుడిగా ఎదిగే అవకాశం కలుగుతుంది.

పైవన్నీ అలా ఉంచండి.
ఈ మధ్య రాజకీయాలలో ఒక చిత్రమైన పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. ఇదేదో ఒక్కరోజులో జరిగిపోయింది కాదులెండి. ఇంతకీ సంగతేమిటంటే.. ఒక విషయం మీద (అవినీతి అవ్వొచ్చు, కబ్జాలు అవ్వొచ్చు, హత్యా యత్నాలు అవ్వొచ్చు, బూతు సినిమాలు చూడడం కావొచ్చు..) ఫలానా ఘోరం చేసేస్తున్నారు బాబోయ్, ఇంతకన్నా నీచం మరిలేదు మహాప్రభో..అంటూ నిన్ననే కష్టపడి గొంతు చించుకొని అవతల వాళ్ళ మీద ఆరోపణలు చేసి జబ్బలు చరుచుకుంటే.. ఇవాళ స్వపక్షీయులే సరిగ్గా అలాంటి నీచపు పనో, తత్సమానమైన ఇంకో దిక్కుమాలిన పనో చేసి దొరికిపోతున్నారు. ఏతావాతా తేలేదేమిటంటే అందరూ ఆ తాను ముక్కలే అని..! ఒక వేలెత్తి వీళ్ళు అవతలి వాణ్ని చూపిస్తే మూడువేళ్ళు వీళ్ళని చూపిస్తూ ఉంటాయన్నమాట.  ప్రజలు మాత్రం ఎటూ మాట్లాడలేని బ్రొటన వేలులాగా భగవంతుడా నీవే రక్ష..! అనుకొంటూ ఆకాశం వైపు తెల్లమొహం వేసుకొని చూస్తూఉంటారు.

అధికార పక్షం వాళ్ళు "మా హయాం లో ముగ్గురు మంత్రులని పదవులు పీకి కోర్టుల్లో శిక్ష వేయించి జైల్లో పెట్టేశాం. మమ్మల్ని మించిన ధర్మ ప్రభువులు నభూతో.. "అనేస్తారు. ఇంకో పక్క ఈ స్కాం బయటకి రావటానికి కారణమైన వ్యక్తులని ఎన్ని అగచాట్లకు గురి చెయ్యాలో అంతా చేస్తారు. అయ్యా..! చెవిలో పువ్వులెవరికి పెడుతున్నారు..?? సాధ్యమైనంత వరకు స్వపక్షీయులని రక్షించడానికి ఎన్ని పనులు చేయాలో అన్నీ చేసి, కోర్టు చేత నానా తిట్లు తిట్టించుకొని, మొట్టికాయలు వేయించుకొని, ఇంక లాభంలేదు అన్న పరిస్థితిలో తప్పనిసరై తమ వారిని ఇంటికి పంపిస్తే, కోర్టు వారి ఆదేశాలు వారిని జైల్లో దిగపెడుతున్నాయి. దీనిలో పాలకపక్షం గొప్పతనం, ధర్మోద్ధరణ ప్రసక్తి ఎక్కడుంటుంది..??

దీంట్లో ఇంకో చిదంబర రహస్యం ఉంది. కోర్టులో శిక్షపడ్డాకే దోషి గానీ, అంతవరకూ నిర్దోషి గానే పరిగణించబడతారు.   ఒకడు పది సంవత్సరాల క్రితం లక్షరూపాయలు లంచం తీసుకొనో, ఆయన దగ్గర పని చేసే సెక్రెటరీని చంపేసో,  బోల్డు వాదోపవాదాల దరిమిలా కోర్టులో దోషిగా తేలి ఏడాది శిక్ష పడితే అతడు పై కోర్టు కి పోయి ఇంకో పదేళ్ళో లేక జీవితకాలమో అతని శిక్ష తప్పించుకోవడానికి కావలసిన వెసులుబాట్లు మన చట్టాల్లోనే ఉన్నాయి. ఈకాలంలో అతడు రకరకాల ప్రభుత్వ పదవులు వెలగబెట్టొచ్చు. ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభలకు ఎన్నికవ్వొచ్చు. నామినేటెడ్ పదవులు పొందొచ్చు. దేవుడు మేలు చేస్తే ముఖ్యమంత్రి, గవర్నర్ గిరీ లాంటి అత్యున్నత పదవులతో సహా అందుకోలేని అందలం ఉండదు. తద్వారా మరో "వందల కోట్లు ఆర్జించే" అవకాశాన్ని దర్జాగా వినియోగించుకోవచ్చు. చిట్టచివరికి అతడి నేరం రుజువై (అప్పటికే చట్టానికి అందని ఎత్తులోఉన్నా) శిక్ష పడినా అది ఆ వ్యక్తి చిన్నప్పుడు చేసిన శిక్ష కి  అనుగుణంగానే ఉంటుంది. అది  ఈ వ్యక్తి ఇప్పుడున్న స్థాయికి తుపుక్కని ఉమ్మేసిన పాటి. అంతేకాని నేరానికీ శిక్షకూ మధ్యకాలంలో ప్రభుత్వంవారు దయచేయించిన జీత భత్యాలూ, ఏసీ మర్యాదల్తో ప్రయాణాలూ, అవకాశం వచ్చిందికదాని ఇతగాడు పట్టేసిన వందల కోట్ల రూపాయలకూ ఆ మట్టి అంటదు.

ఈ పైన చెప్పిన యవ్వారాలన్నిటికన్నా ప్రమాద కరమైనది..పైన చెప్పిన మన నాయకులు బొత్తిగా బాధ్యత మర్చిపోయి, తమ ముందు మైకు ఉంది కదాని నోటికి ఎంతొస్తే అంత అనేయడం...! వాళ్ళు వాడే భాష ఎంత నీచం గా ఉన్నా , దాని పర్యవసానంగా రెండు కులాల మధ్య, మతాల మధ్య, లేదా ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఏర్పడి తద్వారా దేశ సమగ్రతకి భంగం కలిగే పరిస్థితి దాపురించినా.. వీళ్ళకు పట్టదు.  ఈ వ్యక్తులలో కొందరికి నోటి దూలతో పాటూ చేతి తీటా ఎక్కువే..! చెప్పిన పైలు వెంటనే అందించని తమ పర్సనల్ సెక్రెటరీ అయినా, తాము చెప్పిన వాళ్లకి అర్హత లేదన్న కారణంతో అప్పివ్వని బాంకు మేనేజరైనా, లేక సాక్షాత్తూ జిల్లా కలెక్టరే అయినా వీరికి చిర్రెత్తుకొచ్చిందంటే చాలు. తమ నోటికీ చేతికీ కూడా పని చెబుతారు.

యధా రాజా తథా ప్రజా అన్నారు..! బడానాయకుల్ని చూసి చోటా నాయకులు, వారిని చూసి వారి అనుచరులూ, ఒక్కరేమిటి, పైనుంచీ క్రిందదాకా అందరిదీ ఒకటే వ్యవహార శైలి..! సుగుణాలలోనూ, ఆదర్శాలలోనూ స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన పాతతరం 'దేశ'నాయకుల స్థానంలో అవినీతీ, గూండాగిరీలకు ముందుండి దిశా నిర్దేశం చేస్తున్న 'ఖల్' నాయకుల  ఆధ్వర్యం లో రాజకీయాలు నడుస్తున్నాయిప్పుడు..! నిరాడంబరుడు, స్నేహశీలి, ఆశాజ్యోతి, ప్రియతమ నాయకుడు లాంటి విశేషణాలు ఇప్పుడూ కనిపిస్తాయి... దిగువ శ్రేణి నాయకత్వం, వారి అధినాయకత్వాల జన్మదినాల సందర్భంగా ఊరంతా పరిచేసే ఫ్లెక్సీ లలో... నేతి బీరకాయ చందంగా..!!
 
ఇప్పుడు ప్రశ్న... వ్యవస్థను నిర్వీర్యం చేసి, దాని  పతనానికి కారకులయ్యే పై పెద్దమనుషులకి దేశద్రోహ నేరం అంటదా..??  ఏం  చెయ్యాలి వీళ్ళని..??

5 comments:

 1. Well said Radheshyam. Unfortunately media is thriving on this. If media stops giving exposure to these kind of people they shall be "cured" of their psychological delinquency.

  Unfortunately, media is part of this entire problem and they most of the time instigate these elements to talk more nonsense, just to increase their TRP.

  There is a proverb in Telugu which reads as follows:

  అసలే కోతి కల్లు తాగింది, ......."

  Now the above Telugu proverb is to be rewritten as follows:

  "అసలే రౌడీ, ఆపైన రాజకీయ నాయకుడు, మీడియా ముందున్నాడు, పైగా లైవ్ టెలికాస్ట్‌ట"

  What more we can expect from this horrendous situation of self serving Politicians and Media.

  ReplyDelete
  Replies
  1. "అసలే రౌడీ, ఆపైన రాజకీయ నాయకుడు, మీడియా ముందున్నాడు, పైగా లైవ్ టెలికాస్ట్‌ట"
   నా మొత్తం పొస్టు లో ఉన్న విషయాన్ని సింపుల్ గా ఒక్క వాక్యం లోనే చెప్పేశారు సార్..!
   ధన్యవాదాలు.

   Delete
 2. ఈ ఆవేదన ఈ సమాజం లో ఉన్న అందరిదీను.

  వీటన్నిటికి మందు: ప్రజల్లో మార్పు వచ్చి ఎన్నికల్లో వోటు ని తప్పనిసరిగా వేసి , సద్వినియోగ పర్చుకోవడమే.

  ReplyDelete
 3. "ka raju" kathalalo rangula cheruvu laga veri tappulu varu enchutaru vari tappulu veeru enchutaru idi eppaTiki mugeyadu. naa abhiprayam prakaaram vote veyadaniki andaru vedhavalE varini paTTichukokunDa unte chalu. adE manchi parishkaram. prEkshakulu lenichota kaLakarudu tana kaLa ne pradarsinchadu.

  ReplyDelete
 4. "క రజు" కథలలొ రంగుల చెరువు లగ వెరి తప్పులు వరు ఎంచుతరు వరి తప్పులు వీరు ఎంచుతరు ఇది ఎప్పటికి ముగెయదు. నా అభిప్రయం ప్రకారం వొతె వెయదనికి అందరు వెధవలే వరిని పట్టిచుకొకుండ ఉంతె చలు. అదే మంచి పరిష్కరం. ప్రేక్షకులు లెనిచొత కళకరుదు తన కళ నె ప్రదర్సించదు.

  ReplyDelete

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)