Saturday, September 25, 2010

భగవద్గీత - అర్జున విషాద యోగం 'బుర్రకథ' -2

(క్రిందటి భాగం లో ఈ బుర్రకథ నేర్చుకొనే టప్పటి సంగతులు ముచ్చటించుకున్నాం కదా... ఈ భాగం లో దీని సాహిత్యం... మీకోసం..)

మేము పాడిన బుర్రకధ ఎవరు రాసారో దానికి మిగతా భాగం వుందో లేదో ఏమీ తెలీదు. కానీ చిన్నప్పుడే నేర్చుకోవడం వల్ల మా నాలుకల పై ఇంకా అది నాట్యమాడుతూనే వుంది. ట్యూన్అక్కడక్కడ కొంత మర్చిపోయాను. సుమారు పాతికేళ్ళ తరువాత ఆశ్చర్యంగా మా అమ్మగారి పూజా పుస్తకాలలో ఈ క్రింది భాగం మాత్రం దొరికింది. దాని సాహిత్యం బాగున్నందు వల్ల అందరి తో పంచుకోవాలనిపించింది:
భగవద్గీత - అర్జున విషాద యోగం 'బుర్రకథ'
ప్రార్థన:
అంబా జగదంబా నమో! నమో భారతాంబా జగదంబా నమో!! //అంబా!//
సకల విద్యలకు తల్లివనుచు ఈ యుర్విజనులు నిన్ను వేడుకొందురు - 2
అజుని రాణి మమ్మదరించి మా వాక్కులందు వసియించుమమ్మ.. //ఓ అంబా!//

ఓ అంబా జగదంబా నమో! నమో భారతాంబా జగదంబా నమో!!

వాణీవైనా నీవేనమ్మా జగదంబా..! మాకభయమిచ్చి బ్రోవవమ్మా శారదాంబా..!!
అమ్మలగన్న అమ్మావమ్మా జగదంబా..! మాకానందం చేకూర్చవమ్మా శారదాంబా..!!
శబ్ద దోషములు లేకుండగా జగదాంబా ..! వాక్సుద్ధిగాను పలికిన్చావంమా శారదాంబా..!!
//అంబా!//
తాకిట ఝం తరితా // తఝం తరితా// తఝం తరితా//
*****
వేదసారమిది భగవద్గీత ఇహపరములకూ బంగరు బాట - 2
ఆది దేవుడగు నారాయణుడు ముదమున పార్థున కుపదేశించెను .//వేదసారమిది//

ధర్మ క్షేత్రమగు కురుక్షేత్రమున పోరుకు నిలచిన నా కురు వీరుల
పాండునందనుల వివరములన్నీ అరమరికుంచక తెలుపుము నాకు.. //వేదసారమిది//

అడిగిన కురుపతి ద్రుతరాష్ట్రునకూ సంజయుదంతట తెలిపె విశదముగ...
దుర్యోధనుడట గురువును చేరి పలికిన పలుకులు వినిచెను రాజుకు.. //వేదసారమిది//

వచనము: ఇట్లు ద్రుతరాష్ట్రుండడుగాగా సంజయుండేమంటున్నాడయ్యా అంటే..??
వంత : ఏమంటున్నాడయ్య...!!??

రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా..!!
పాండవ సైన్యము వ్యూహము మాదిరి పన్నియుంట జూచీ - 2
దుర్యోధనుడూ వెంటనే వెళ్ళెను ద్రోణ సమీపముకూ - 2 //రాజరాజ మహారాజా//

వచనము: వెళ్లి ఏమంటున్నాడయ్యా అంటే..??
వంత : ఏమంటున్నాడయ్య...!!??


దేవ దేవ గురుదేవా రణజయ భావా వినుమయ్యా..
//తందానా తందాన తందానా దేవవందనానా //
సర్వ సమృద్ధంబగు ఆ పాండవ సైన్యము చూచావా - 2
ఆ దండున భీమార్జున సములై అలరుచున్నవారూ
ధృష్టకేతువూ, మత్స్యవిభుండూ, ద్రుపదుడు, పురజిత్తూ
శైభ్యుడు, సాత్యకి, కుంతిభోజుడూ, చేకితానుడుండే
ఉత్తమోజుడూ, కాశీ రాజూ, యుధామన్య నృపతీ //దేవ దేవ గురుదేవా//

ఆహవ నిపుణులు ద్రౌపది పుత్రులు అభిమన్యాదులునూ
ప్రముఖ వీరులూ మహారథులునూ బలవంతులు గలరూ //దేవ దేవ గురుదేవా//

మన సైన్యములో ముఖ్యులు తెలిపెద.. // తందానా తందానే తందానా //
తాము, భీష్ముడూ, కర్ణుడు కృపుడూ.. // తందానా తందానే తందానా //
అశ్వత్దామా భూరీశ్రవుడూ // తందానా తందానే తందానా //
జయధ్రదుండూ వికర్ణాదులూ // తందానా తందానే తందానా //

నానిమిత్తమై తమ ప్రాణాలను నాశనమొనరింప //తందానా తందానే తందానా దేవవందనానా//
పోరాటంలో నిలచినారయా పూజ్యులు ప్రియులంతా //తందానా తందానే తందానా దేవవందనానా//
మా పితామహుడూ భీష్ముడు సేననే మాడ్కి గాచువాడో //దేవ దేవ గురుదేవా//

తాకిట ఝం తరితా // తఝం తరితా// తఝం తరితా//
వచనము: అని ఒకమారు దుర్యోధనుడు భీష్ముని వైపు చూచాడు. వెంటనే..
వంత : ఏం జరిగింది....!!??


రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా..!! - 2
కురు వృద్ధుండగు భీష్ముడు వెంటనే మురిసిపోయినాడూ - 2 //రాజరాజ మహారాజా//
దుర్యోధనుడూ సంతసించుటకు భం భం భం అనుచూ
శంఖనాదమును చేసినాడు నిశ్శంకమయ్యే సేనా //రాజరాజ మహారాజా//
కౌరవ సేనలో భేరీరవములు గ్రమ్ముకున్నవండీ
ఫణవానకములు భూమ్యాకాశములను బ్రద్దలు చేసాయీ //రాజరాజ మహారాజా//
వచనము: అప్పుడేం జరిగిందయ్యా అంటే..??
వంత : ఏం జరిగింది ...!!??


తెల్లగుర్రముల రధమును త్రోలే నల్లనయ్య జూచీ - 2
పాంచజన్యమును మ్రోగించగనే పార్ధుడు తలఎత్తీ - 2
దేవదత్తమను శంఖమునూదెను దిక్కులెల్ల మ్రోయ - 2 //రాజరాజ మహారాజా//
వచనము: ఇంతే గాక
అనంత విజయము యుధిష్టిరుండూ //తందానా తందానే తందన//
పౌండ్ర శంఖమును భీమసేనుడూ //తందానా తందానే తందన//
సుఘోష శంఖము నకులుడూదెనూ //తందానా తందానే తందన//
మణి పుష్పకమును సహదేవుండూ //తందానా తందానే తందన//
కాశీ రాజూ ద్రుష్టద్యుమ్నుడూ //తందానా తందానే తందన//
తమ తమ శంఖాలన్నిటి నొక్కటే ధాటిగా నూదారూ //తందానా తందానే తందానా దేవవందనానా// -2
ప్రపంచమంతా నిండి యాధ్వనులు ప్రతిధ్వనించాయీ //తందానా తందానే తందానా దేవవందనానా//
కౌరవసేనల గుండెలు వణికీ గబ గబ లాడాయీ
తాకిట ఝం తరితా // తఝం తరితా// తఝం తరితా//
వచనము: అప్పుడు యుద్ధానికి తయారుగానున్న కౌరవసేనను అర్జునుడు చూచి విల్లు నెక్కుపెట్టి శ్రీ కృష్ణునితో ఇలా అన్నాడు..
వంత : ఏమన్నాడయ్యా ...!!??

//తందాన తందాన తానె తందనానా// తందానా తానా తానే తందానా // - 2
చిత్తగించుమా నాదు మనవినీ శ్రీనివాస శౌరీ
రెండు సేనలా మధ్య రధమునూ యుండనిమ్ము కృష్ణా.. //చిత్తగించుమా//
దుర్యోధనునకు ప్రియము కోరినా.............................( పేజీ చిరిగిపోయింది.)
వారల చూచెద కన్నులనిండా వ.............................( పేజీ చిరిగిపోయింది.)
ఎవరెవరలతో పొరవలయునో................................. ( పేజీ చిరిగిపోయింది.)
వచనము: అని ఈ ప్రకారముగా పలికే అ.......................
గుర్రముల రధమును రెండుసేనల మధ్య నిలిపినవాడై................
ఎవరెవర్ని చూశాడయ్యా అంటే....
వంత : ఎవరెవర్ని చూశాడయ్యా ...!!??

తాతల, తండ్రుల, గురువుల, మామల, తమ్ముల, నన్నలనూ...
పుత్రుల, మిత్రుల, పౌత్రుల జూచీ భోరున యేడ్చాడూ...పార్ధుడు భోరున యేడ్చాడూ...
వచనము: ఈ విధంగా దుఃఖిస్తున్న అర్జునుడు శ్రీ కృష్ణునితో ఇలా అన్నాడు..

చిత్తగించుమా నాదగు మనవిని శ్రీనివాస శౌరీ ...
బావా కృష్ణా నిలువలేను ఈ భండనమున నేనూ ..
//చిత్తగించుమా //
సర్వాంగములూ గజ గజ వణుకుతూ చమటలు పోశాయీ...
ఎండెను నోరూ.. చేతినుండి నా గాండీవము జారే..
శకటము పై కూర్చొనుటకు కూడా శక్తి చాలదయ్యా..
చిత్తగించుమా నాదగు మనవిని శ్రీనివాస శౌరీ ...- 2
అంటూ శర చాపాలను వదలి రధము పై చతకిలబడ్డాడూ
పార్ధుడు..శర చాపాలను వదలి రధము పై చతకిలబడ్డాడూ...
**************
దీనిగురించి ఇంకేమైనా వివరాలు.. తెలిసిన వారు ఎవరైనా వుంటే చెప్పగలరు.
పూర్తిగా చదవండి...

భగవద్గీత - అర్జున విషాద యోగం 'బుర్రకథ' -1

నేను ఆరవ తరగతి విశాఖపట్నం లో శ్రీ శాంతి ఆశ్రమం స్కూల్ లో చదువుకున్నాను. మాతమ్ముడు రామ్ మనోహర్ శ్యాం అయిదవ తరగతి చదివే వాడు. స్కూల్ ఆవరణ లో బోల్డు చెట్లు ఉండేవి..మామిడి, పనస, జామ , వేప, చింత ..ఇంకా చాలా ! చెట్ల కిందే పాఠాలు..!! వారాంతాలలో భజనలు..!!చాలా కోలాహలం గా వుండేది.
రోజుల్లో మా పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏదైనా ప్రోగ్రాం చేద్దామనుకున్నారు మా ప్రిన్సిపాల్ గారు ( వీరిని ఈమధ్యే ట్రైన్ లో కలిసాము) శ్రీ Ch. కృష్ణమూర్తి మాష్టారు...అంతకు ముందెప్పుడూ చెయ్యలేదుట..అదే మొదలు. మేమూ ఇంకా జాయిన్ ఐన కొత్త. మేము అప్పటి వరకు భీమిలి saint anns స్కూల్ లో చదువుతూ అకడెమిక్ ఇయర్ సగంలో వచ్చాం. మంచి స్కూల్ నుంచి వచ్చారు.. బాగా చదువుతున్నారు అనే సదభిప్రాయం వుండేది మామీద. పైగా చిన్న చిన్న పాటలూ అవీ పాడేవాళ్ళం. అంచేత మా ఇద్దర్నీ ఇంకొక సహాధ్యాయి బి శ్రీనివాస్ ని ( ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు) కలిపి బృందం గా తయారు చేసి మాకు "భగవద్గీత - అర్జున విషాద యోగం" బుర్రకథ నేర్పిస్తాం.. పాడాలి.. అన్నారు. మా హిందీ మాష్టారు మాకు ట్రైనింగ్. రోజూ క్లాసులు అయిపోయాక ఒక అరగంట extra ఉండి నేర్చుకోవాలి. ఆయనది మాంచి నిండిన రూపం..తెల్ల గ్లాస్గో షరాయి, లాల్చీ వేసుకొని వచ్చేవారు.. కొంచం ఎర్రగా వుండేవారు. హార్మోనియం చాలా బాగా వాయించేవారు..వాయిస్తూ నేర్పించేటప్పుడు ఒక రకమైన ట్రాన్స్ లో వుండేవారు. చాలా హుషారుగా చెప్పేవారు. (బాధాకరమైన విషయం: అప్పట్లో మాష్టార్లని హిందీ మాష్టారు.. తెలుగు మేష్టారూ.. అనేగానీ పేర్లు చెప్పడం అలవాటు లేకపోవడం తో ఆయన పేరు మర్చిపోయాను... ) మాకూ చాలా సరదాగా కొత్తకొత్తగా వుండేది. కధ కూడా తొందరగానే వచ్చేసింది.
దంతా బాగానే ఉంది గానీ.. మేము ఇలా నేర్చుకుంటున్నట్లు మా ఇంట్లో చెప్పలేదు. మా అమ్మగారు మా చదువుల మీ చాలా శ్రద్ధ కనబరిచేవారు. ఆవిడకి తెలిస్తే ఎక్కడ తిడతారో అని భయంగావుండేది. ఒకరోజు తెలియనే తెలిసింది. ఏంజరిగిందంటే : మా మేష్టారు మమ్మల్ని ఒక డ్రామా కంపెనీ కి తీసుకు వెళ్లి మాకు తంబుర, తలపాగాలు, చిడతలూ, చిన్న మద్దెల లాంటిది ఒకటి..అన్నీ మా సైజు లో తీసుకొని.. వాటితో పాటూ మమ్మల్ని ఇంటికి పంపించేసారు. మా 'బుర్ర'కథ రామకీర్తన అనేరసకందాయం లో పడింది. మా అమ్మ స్కూల్ కి వచ్చి మా మాష్టారితో మాట్లాడేరు. మొత్తం మా రిహార్సల్ అంతా చూసేరు . సంతోషంగా ఒప్పుకున్నారు.
మొత్తానికి మా ప్రోగ్రాం రోజు వచ్చింది. అప్పటికి మా ఇరుగు పోరుగులకీ చుట్టాలకీ తెలిసి అంత మందీ చూడడానికి వచ్చేరు. మా మామ్మగారు కూడా శ్రమకోర్చి వచ్చారు. మాకు మేకప్ అదీ చేసి ప్రక్క వాద్యాలు: హార్మోనియం - మా మాష్టారూ, తబలా కి ఇంకో అతన్నీ కూడా స్కూల్ వాళ్ళే arrange చేసి పాడించారు. వచ్చిన జనాన్ని చూసి మా ప్రిన్సిపాల్ గారు, మా మాష్టార్లందరూ చాలా హ్యాపీ. అలా మా మొదటి స్టేజి ప్రదర్శన దిగ్విజయంగా ముగిసింది.
**********
ఇప్పుడు ఏదైనా స్కూల్ anniversary అంటే... మొత్తం స్కూల్ లో వున్న పిల్లలందరినీ (అన్ని క్లాసులూ.. అన్ని సెక్షన్లూ) డబ్బులు తీసుకొని, costumes కి వేరేగా collect చేసి 40 -50 తో గ్రూప్ డాన్సు లు చేయించి..ఫుల్ సౌండ్స్, లైట్స్ తో పిల్లల్ని, పేరెంట్స్ ని కూడా బెంబేలేత్తిస్తున్నారు.
**********
కానీ ఆ ప్రోగ్రాం రికార్డింగ్ కానీ, ఒక ఫోటో కానీ జ్ఞాపకానికి ఒక్కటీ లేదు..ప్చ్ ..ఆశ్చర్యంగా చిన్నప్పుడు రాసుకున్న దాని స్క్రిప్ట్ మాత్రం పాతికేళ్ళ తరువాత నిన్ననే దొరికింది. ఆ సంగతులు వచ్చే పోస్ట్ లో ...
- సశేషం
పూర్తిగా చదవండి...

Saturday, September 18, 2010

ఆకాశవాణి లో కృష్ణప్రియ..

ఆకాశవాణి... విశాఖపట్నం కేంద్రం.. బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో
ఈ రోజు చి. కృష్ణప్రియ పాడి పాటలు వింటారు.
ప్రసార సమయం: సాయంత్రం 5:౦౦, తేదీ: 18.9.2010 శనివారం.
ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

(ఇంతకీ కృష్ణప్రియ అంటే మా అమ్మాయి, మూడవ తరగతి చదువుతోంది.)

Get this widget | Track details | eSnips Social DNA
పూర్తిగా చదవండి...

Thursday, September 16, 2010

ఏదో రాయాలనే కోరిక..

ఏదో
రాయాలనే కోరిక..
****

ఏదైనా చదవగానే నాకూ రాయాలనే కోరిక...

ఏదో ఒక కధ, వ్యాఖ్య, కవిత లేదా శీర్షిక..

ఏం రాయాలో ఎలా రాయాలో తెలియక...మనసులోని ఆలోచనలు కుదురుకోక..

కుదురుకున్న ఆలోచనలకు రూపం రాక..

వచ్చిన రూపాన్ని అక్షరబద్ధం చెయ్యలేక..
రాద్దామని కూర్చుంటే మొదలుపెట్టలేక..

ఎంత కిందా మీదా పడ్డా బుర్రకేం తోచక..

అందరూ రాసేసే సులువు అర్ధం కాక...
పోనీ మానేద్దామంటే మనసొప్పక...

అలాగని మనసోప్పే సాకు దొరకక...

అవస్థపడుతున్న నాకో దారి కానరాక...
పెన్ను మూసేసి పేజీని తెల్లగానే వదిలేశాక...

ఏమైనా రాయాలనే కోరిక ఇంకా చావక...

నిన్నట్లాగే అనుకుంటా..."రేపు వ్రాసెద గాక!!"

పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)