Thursday, August 30, 2012

ఊలూకం లేక గుడ్లగూబ కథ

మా ఇంటి మేడ మీద గత నాలుగు రోజులుగా రాత్రి అయ్యేసరికి దర్శనమిస్తున్న గుడ్లగూబలు ఇవి. పొద్దున్న ఉండట్లేదు. ఎక్కడికి వెళ్తాయో తెలీదు. కానీ రాత్రి చీకటి పడగానే మళ్ళీ ప్రత్యక్షం అవుతున్నాయి. మా పిల్లలు గబ్బిలాలు అని ఒకసారి, గుడ్లగూబలు అని ఒకసారి అంటూ ఉంటే పెద్ద పట్టించుకోలేదు. నిన్న మా నాన్నగారు కూడా చెబితే చూసాను. గుడ్లగూబలు అంటే చిన్నప్పుడు చదివిన చందమామ సీరియల్ తోకచుక్క లో చతుర్నేత్రుడి బంటు ఊలూకుడి లాగా నల్లని శరీరంతో, చింత నిప్పుల్లా మెరిసే కళ్ళతో,  దిక్కులు పిక్కటిల్లేలా కూత పెట్టే భయంకరమైన రూపమే తట్టే నాకు ఇవి చాలా అమాయకంగా కనిపించాయి. రెండు పక్షులు, ఎత్తు సుమారు 12 నుంచీ పదిహేను అంగుళాల  పైనే ఎత్తు తో ఉన్నాయి.  ఎగిరినప్పుడు వాటి రెక్కల అంచుల వరకూ సుమారు మూడడుగుల పైనే ఉంటుంది. పైగా చాలా నిశ్శబ్దం గా ఉన్నాయి.
సాధారణంగా ఒళ్ళంతా మట్టి రంగు ఈకలతో లైట్ బ్రౌన్ కలర్ లో చిన్నప్పుడు ఎప్పుడో చూసిన గుడ్లగూబలకు భిన్నంగా ఇవి ముందరి భాగం అంతా తెల్ల ఈకలతో ప్రత్యేకంగా కనిపించాయి.  వెంటనే ఫోటోలు తీయటానికి ప్రయత్నించాను. బయట బాగా మబ్బు పట్టి కొంచం వర్షం కూడా పడుతూ ఉండడం తో చాలా చీకటి గా ఉంది. ఇంతలో మా మాటలూ, మా పిల్లల అరుపులతో అవి మాఇంటి మీదనుంచీ, పక్క వాళ్ళ మేడమీద వాలాయి. అప్పుడే ఫోటో తీశాను. దూరం గా వుండడం తో ఫోటోలు సరిగ్గా రాలేదు.

మాఇంట్లో కనిపించిన గూబలతో పోలిన గుడ్లగూబలని గూగిలీకరించి పేరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే  కనిపించిన ఫోటో ఇది:
వీటిలో చాలా రకాలు వున్నాయిట. దగ్గరగా పోలినవి రెండు రకాలు కనిపించాయి. ఒకటి Common Barn Owl, రెండు Masked  Owl.  మాకు కనిపించినవి ఏవో ఖచ్చితంగా తెలియలేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.

నేను తీసిన ఫోటోలు:






సాధారణంగా చెట్లు ఎక్కువగా ఉండే పల్లెటూర్లలోనూ, పొలాల్లోనూ కనిపించే ఈ పక్షులు ఎలకలనీ, చిన్న చిన్న కోడిపిల్లల్నీ తిని బ్రతుకుతాయి. అలాంటిది ఇవి చెట్లన్నవే కనిపించని, మనుష్యులుండే హౌసింగ్ కాలనీలలోకి వచ్చేస్తున్నాయంటే, వాటి పరిస్థితి  అర్ధం చేసుకోవచ్చు. వికిపీడియా లో  చూస్తే ఈ ప్రాణులను కొన్ని దేశాలలో అంతరించి పోతున్న జాతులలో చేర్చారట. కానీ మనం ఇంకా వీటి గురించిన విషయాలో చాలా భయాలూ, భ్రమలతో ఉంటున్నాం. ఇవి ఇంటిమీద వాలితే మంచిది కాదని, దాని అరుపు వింటే అరిష్ఠమనీ (నిజానికి వాటి అరుపు వినగానే చంపెయ్యడానికి సిద్ధపడే మనుషుల నుంచి వాటికే అరిష్టం.. అంతేకానీ మనుషులకి కాదు) ఇలా చాలా అశాస్త్రీయమైన మూఢ నమ్మకాలతో వాటి మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్నాం. 
ఇది ఎలాంటిదంటే ఎవరో చేతబడి, బాణామతి లాంటివి చేస్తున్నారనే అర్ధం లేని అనుమానాలతో సాటి మనుషులని కూడా ఆలోచించకుండా వాళ్ళ పళ్ళు పీకడం, గాయ పరచడం, చంపెయ్యడం ఎంత అనాగరికమో ఇదీ అంతే. మనుషులు కాబట్టీ వార్తల్లోకి వస్తారు. వీటికి వార్తల్లోకి వచ్చే అంత  ప్రాముఖ్యం లేదు. అంతే తేడా..!    

నేను ఇవాళ పొద్దున్నే మా విశాఖపట్నం 'జూ' అసిస్టెంట్ క్యురేటర్ శ్రీ మహాలక్ష్మి నాయుడు గారితో మాట్లాడాను. వారు ఈ పక్షుల 'రకం' గుర్తించడానికి నిపుణుడైన వ్యక్తిని పంపుతానన్నారు. అలాగే ఈరోజు రాత్రి అవసరమైతే వాటిని జాగ్రత్తగా పట్టుకొని జూకు తరలించే ఏర్పాటు కూడా చేస్తామన్నారు.  చూడాలి ఏం జరుగుతుందో..!!


ఇవి మా విశాఖపట్నం జూలో నిద్రావస్థలో ఉన్న బార్న్ఔల్ రకానికి చెందిన గుడ్లగూబలు. వీటికి గల ప్రత్యేకత ఏమిటంటే వాటి ముఖం చుట్టూ ఉన్న హృదయాకారపు రింగు..!! అదే మాస్క్ డ్  ఔల్ రకానికి చెందిన పక్షికి ఆ రింగు కొంత భిన్నం గా ఉంటుంది.
(ది  హిందూ పత్రిక సౌజన్యం తో) 

అప్ డేటెడ్ సమాచారం
ఆ పక్షులకి కొంత దగ్గరగా వెళ్ళి ఫొటోలు తీశాను :

13 comments:

  1. gudlagooba gurinchi chaala bagaa cheppav intrasting gaa vunnadi


    ReplyDelete
  2. సాఫీగా సాగే సంభాషణ లాగా కధనం సాగింది మీతో మాట్లాడుతున్నట్లు గ ఉంది వ్యాసం ఇంకా కొన్ని విషయాలు వ్రాయండి

    ReplyDelete
  3. ధన్యవాదాలు baluma77 గారూ..!! దసరా శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. Sir..inthaki em jarigindhi? aa pakshulanu Zoo ki appaginchara? vishayalu rayandi.please

    ReplyDelete
    Replies
    1. @shashank:
      అబ్బే..! అలాంటిదేమీ లేదండీ .. !
      ఆయన పంపిస్తానన్న వ్యక్తి ఎంతకీ రాకపోయేసరికి జూ క్యూరేటర్ కే రెండుసార్లు ఫోన్ చేశాను. ఆ సారు ఈ వ్యక్తి నెంబరు ఇచ్చి మాట్లాడమన్నారు. ఈయనతో (జూవాలజిస్ట్) మాట్లాడితే రాత్రికి మళ్ళీ వస్తే చెప్పమన్నారు. వచ్చినతరువాత చెప్తే టేప్ రికార్డర్ లో పెద్ద శబ్దం తో పాటలు పెట్టమన్నారు. ఎందుకంటే వాటిని తరిమెయ్యడానికట..! అప్పుడు మళ్ళీ ఆయనకీ ఈ గుడ్లగూబల గురించి నేను గమనించిన విషయాలు చెప్పి ఒకసారి వచ్చి చూసి నిర్దారణ చెయ్యమని రిక్వెస్ట్ చేశాను. బాగా పొద్దు పోయింది కదా రేపు వస్తానన్నారు. మర్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే బయట ఉన్నాను.., ఫోటోలు తీసి పంపమన్నారు. పంపాను..! "కొంచం స్పెషల్ గానే ఉన్నాయండీ ..! ఇంకొంచం స్పష్టంగా తీసి పంపగలరా..?" అని అడిగారు (అంతకంటే బాగా రావాలంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని పెట్టాలి). ట్రై చేస్తానన్నాను..! ఆయన పొద్దున్న తప్ప రారు, గుడ్లగూబలు బాగా రాత్రి అయితేనే కానీ రావు..! ఇలాగ ఈ ప్రహసనం వారం రోజుల పాటూ కొనసాగింది . ఆఖరికి గూబలే కరుణించి మా ఇంటికి రావడం మానేశాయి.. ! అమ్మయ్య అని అందరం ఉపిరి పీల్చుకున్నాము .. ! అయితే వాటి బ్రీడ్ ఏమన్నది స్పష్టంగా తెలియలేదు.., నా రీసెర్చ్ వృధా గా పోయిందన్న బాధ మాత్రం నాకు మిగిలిపోయింది .. ! :)
      ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు.

      Delete
    2. gudla guba ni thakithe em avuthundii

      Delete
    3. gudla guba ni thakithe em avuthundi


      Delete
  5. Edi manishini touch chesi velithe emi shakanam

    ReplyDelete
    Replies
    1. మనిషి వాటిని తాకుతున్నంత దగ్గరగా, వాటి ఆవాసంలోకి వెళ్ళాడని..! అంతే..!! 😃

      Delete
  6. ప్రభుత్వోద్యోగులు వచ్చేస్థారని ఎలా అనుకున్నారు🤔

    ReplyDelete
  7. ఇది వ్రాసింది పదేళ్ళ క్రిందట కదండీ..!? అప్పట్లో అలానే అనుకున్నానండీ..!

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)