(ఈ పోస్టు చాలా రోజులైంది మొదలుపెట్టి..! పూర్తి చెయ్యడానికి ఇప్పటికి వీలు చిక్కలేదు. కాలదోషం పట్టినా పోస్టు చేశాను ఏమనుకోకండి..!)
మా పూరీ - భువనేశ్వర్ యాత్రా విశేషాలు (మొదటి రోజు - పార్ట్ 1)
మా పూరీ - భువనేశ్వర్ యాత్రా విశేషాలు (మొదటి రోజు - పార్ట్ 1)
ఎప్పటినుంచో
పూరీ కోణార్క్ చూద్దామనుకుంటున్నాం, ఎలాగూ పిల్లలకి సెలవలే కదాని బయల్దేరాం. భువనేశ్వర్,
పూరీ, కోణార్క్ లు చూడడానికి 3Nights and 4Days టూరిస్టు ప్యాకేజీ ఇంటర్నెట్ లో బుక్
చేసుకొన్నాం. టూర్ మొత్తానికి ఏసీ కారు మనతో కూడా ఉంటుంది కదాని సమ్మర్ అయినా ధైర్యం చేసాం..! వీకెండ్ కలిసొచ్చేటట్టు శుక్ర వారం బయలుదేరి, మంగళవారం
ఫ్రొద్దున్నే తిరిగివచ్చేటట్లు ప్లాన్ చేసుకొన్నాం.
భువనేశ్వర్
కి విశాఖపట్నం నుంచీ విమానంలో చేరుకోవడంతో మా టూర్ మొదటిరోజు ప్రారంభమయింది. ఎయిర్
పోర్ట్ కి మా గైడు కమ్ డ్రైవర్ వచ్చి రిసీవ్ చేసుకొన్నాడు. పదిన్నర కి ఎయిర్ పోర్ట్
బయట కాలు పెట్టడం తోనే అక్కడి ఎండ, వేడి, ఊక్కపోత అనుభవం లోకి వచ్చాయి. ఏసీ కారు లో
కూర్చోగానే ప్రాణం లేచొచ్చింది. తిన్నగా హొటెల్ లో చెక్-ఇన్ చేసి అరగంటలో మళ్ళీ రోడ్డెక్కాం.
ఆరోజు కార్యక్రమం నందన్ కానన్ జూ, బొటానికల్ గార్డెన్, ట్రైబల్ మ్యూజియం, ఖండగిరి-ఉదయగిరి
హెరిటేజ్ సైట్, మళ్ళీ భువనేశ్వర్ లో రాత్రి బస.
అక్కడి నుంచీ బయల్దేరి ఖండగిరి - ఉదయగిరి చేరుకొనే త్రోవలో ఒరిస్సా ప్రభుత్వం నెలకొల్పిన ట్రైబల్ మ్యుజియం చూసాం. ముందు అబ్బా..! ఏం చూస్తాంలే అనుకున్నా(ఎందుకంటే అంతకు ముందే అరుకు లో చూసాం) ఎలాగూ త్రోవే కదా అని వెళ్ళాం.
కానీ మేం వెళ్లేసరికి అది క్లోజ్ చేసేసే టైం అయిపొయింది. ఆవిషయం మాకు తెలీదు. మేమే ఆరోజుకి లాస్ట్ ఎంట్రీ..!! లోపలి వెళ్ళాక అది చాలా నచ్చింది. అరుకు మ్యూజియం కన్నా చాలా బాగుంది. ప్రదర్శన కు ఉంచిన వస్తువులు కూడా ఎంతో ఆసక్తికరం గా ఉన్నాయి. ట్రైబల్స్ (ఈ మాటకు తెలుగు పదం తట్టట్లేదు) వాడే విల్లు బాణాలు, కత్తులు మొదలైన వేటకి వాడే వస్తువులూ, ఆయుధాలతో పాటూ, వారి సాంస్కృతిక, వారసత్వ, కళా రూపాలను కూడా ప్రదర్శనకి ఉంచారు. వారి సంగీత పరికరాలూ, చిత్రకళ, వ్యవసాయానికి వాడే పనిముట్లూ, వంటకి వాడే గిన్నెలూ గరిటెలు, వారి దుస్తులూ, అలంకరణ సామాన్లూ, ఆభరణాలూ ఒకటేమిటి..గిరిజన జీవన శైలిని ప్రతిబింబించే ప్రతీ వస్తువూ ఆయా విభాగాలకి అనుగుణంగా అమర్చబడి ఉన్నాయి. కానీ వాటి లోనే వారి సామాజిక హోదాకి అద్దం పట్టే విధంగా డిజైన్లలోనూ, ఆకారాలలోనూ, మెటీరియల్ లోనూ ప్రస్ఫుటమైన తేడాలు ఉండడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.
మ్యూజియం నుండీ బయటకు వచ్చినతరువాత ఆరుబయలులో ఆ ప్రాంతపు ప్రజల గృహనిర్మాణ పద్దతులు, ప్రార్ధనా స్థలాలకూ కూడా నకళ్ళు నిర్మించారు. బయట తప్ప లోపల ఫోటోలు తీయటానికి అనుమతించలేదు. కానీ అక్కడి ఉద్యోగులు చాలా ఓపిగ్గా అన్ని వివరాలు చెబుతూ చూపించారు (సమయం దాటిపోయినా సరే). తీరికగా చూస్తే కనీసం రెండు గంటలైనా పడుతుంది. వారిని మరి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మేము వారికి కలిగించిన అసౌకర్యానికి మన్నించమని, ధన్యవాదాలు చెప్పి బయటకు వచ్చేశాం.
అప్పటికి ఎండ తగ్గి చల్లబడింది. అక్కడినుంచి ఖండగిరి - ఉదయగిరికి పది నిముషాలలో చేరుకొన్నాం. అవి అశోకుడూ, కళింగ యుద్ధం నాటి కన్నా ముందరే నిర్మించ బడిన ఏకశిలా జైన గుహాలయాలు. ద్రవిడ, ఒరిస్సా ఆలయ నిర్మాణ శైలులు (Dravidian and Orissan Styles of Architecture) పూర్తిగా రూపు దిద్దుకోక ముందరి నిర్మాణాలు.
మా అబ్బాయికి టూర్ మొత్తం మీద బాగా నచ్చిన ఈ ప్లేస్ గురించి వచ్చే పోస్టు లో...!!
mee tourne chaala chakaga plan cheasukunnaru good
ReplyDelete