Thursday, August 30, 2012

ఊలూకం లేక గుడ్లగూబ కథ

మా ఇంటి మేడ మీద గత నాలుగు రోజులుగా రాత్రి అయ్యేసరికి దర్శనమిస్తున్న గుడ్లగూబలు ఇవి. పొద్దున్న ఉండట్లేదు. ఎక్కడికి వెళ్తాయో తెలీదు. కానీ రాత్రి చీకటి పడగానే మళ్ళీ ప్రత్యక్షం అవుతున్నాయి. మా పిల్లలు గబ్బిలాలు అని ఒకసారి, గుడ్లగూబలు అని ఒకసారి అంటూ ఉంటే పెద్ద పట్టించుకోలేదు. నిన్న మా నాన్నగారు కూడా చెబితే చూసాను. గుడ్లగూబలు అంటే చిన్నప్పుడు చదివిన చందమామ సీరియల్ తోకచుక్క లో చతుర్నేత్రుడి బంటు ఊలూకుడి లాగా నల్లని శరీరంతో, చింత నిప్పుల్లా మెరిసే కళ్ళతో,  దిక్కులు పిక్కటిల్లేలా కూత పెట్టే భయంకరమైన రూపమే తట్టే నాకు ఇవి చాలా అమాయకంగా కనిపించాయి. రెండు పక్షులు, ఎత్తు సుమారు 12 నుంచీ పదిహేను అంగుళాల  పైనే ఎత్తు తో ఉన్నాయి.  ఎగిరినప్పుడు వాటి రెక్కల అంచుల వరకూ సుమారు మూడడుగుల పైనే ఉంటుంది. పైగా చాలా నిశ్శబ్దం గా ఉన్నాయి.
సాధారణంగా ఒళ్ళంతా మట్టి రంగు ఈకలతో లైట్ బ్రౌన్ కలర్ లో చిన్నప్పుడు ఎప్పుడో చూసిన గుడ్లగూబలకు భిన్నంగా ఇవి ముందరి భాగం అంతా తెల్ల ఈకలతో ప్రత్యేకంగా కనిపించాయి.  వెంటనే ఫోటోలు తీయటానికి ప్రయత్నించాను. బయట బాగా మబ్బు పట్టి కొంచం వర్షం కూడా పడుతూ ఉండడం తో చాలా చీకటి గా ఉంది. ఇంతలో మా మాటలూ, మా పిల్లల అరుపులతో అవి మాఇంటి మీదనుంచీ, పక్క వాళ్ళ మేడమీద వాలాయి. అప్పుడే ఫోటో తీశాను. దూరం గా వుండడం తో ఫోటోలు సరిగ్గా రాలేదు.

మాఇంట్లో కనిపించిన గూబలతో పోలిన గుడ్లగూబలని గూగిలీకరించి పేరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే  కనిపించిన ఫోటో ఇది:
వీటిలో చాలా రకాలు వున్నాయిట. దగ్గరగా పోలినవి రెండు రకాలు కనిపించాయి. ఒకటి Common Barn Owl, రెండు Masked  Owl.  మాకు కనిపించినవి ఏవో ఖచ్చితంగా తెలియలేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.

నేను తీసిన ఫోటోలు:


సాధారణంగా చెట్లు ఎక్కువగా ఉండే పల్లెటూర్లలోనూ, పొలాల్లోనూ కనిపించే ఈ పక్షులు ఎలకలనీ, చిన్న చిన్న కోడిపిల్లల్నీ తిని బ్రతుకుతాయి. అలాంటిది ఇవి చెట్లన్నవే కనిపించని, మనుష్యులుండే హౌసింగ్ కాలనీలలోకి వచ్చేస్తున్నాయంటే, వాటి పరిస్థితి  అర్ధం చేసుకోవచ్చు. వికిపీడియా లో  చూస్తే ఈ ప్రాణులను కొన్ని దేశాలలో అంతరించి పోతున్న జాతులలో చేర్చారట. కానీ మనం ఇంకా వీటి గురించిన విషయాలో చాలా భయాలూ, భ్రమలతో ఉంటున్నాం. ఇవి ఇంటిమీద వాలితే మంచిది కాదని, దాని అరుపు వింటే అరిష్ఠమనీ (నిజానికి వాటి అరుపు వినగానే చంపెయ్యడానికి సిద్ధపడే మనుషుల నుంచి వాటికే అరిష్టం.. అంతేకానీ మనుషులకి కాదు) ఇలా చాలా అశాస్త్రీయమైన మూఢ నమ్మకాలతో వాటి మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్నాం. 
ఇది ఎలాంటిదంటే ఎవరో చేతబడి, బాణామతి లాంటివి చేస్తున్నారనే అర్ధం లేని అనుమానాలతో సాటి మనుషులని కూడా ఆలోచించకుండా వాళ్ళ పళ్ళు పీకడం, గాయ పరచడం, చంపెయ్యడం ఎంత అనాగరికమో ఇదీ అంతే. మనుషులు కాబట్టీ వార్తల్లోకి వస్తారు. వీటికి వార్తల్లోకి వచ్చే అంత  ప్రాముఖ్యం లేదు. అంతే తేడా..!    

నేను ఇవాళ పొద్దున్నే మా విశాఖపట్నం 'జూ' అసిస్టెంట్ క్యురేటర్ శ్రీ మహాలక్ష్మి నాయుడు గారితో మాట్లాడాను. వారు ఈ పక్షుల 'రకం' గుర్తించడానికి నిపుణుడైన వ్యక్తిని పంపుతానన్నారు. అలాగే ఈరోజు రాత్రి అవసరమైతే వాటిని జాగ్రత్తగా పట్టుకొని జూకు తరలించే ఏర్పాటు కూడా చేస్తామన్నారు.  చూడాలి ఏం జరుగుతుందో..!!


ఇవి మా విశాఖపట్నం జూలో నిద్రావస్థలో ఉన్న బార్న్ఔల్ రకానికి చెందిన గుడ్లగూబలు. వీటికి గల ప్రత్యేకత ఏమిటంటే వాటి ముఖం చుట్టూ ఉన్న హృదయాకారపు రింగు..!! అదే మాస్క్ డ్  ఔల్ రకానికి చెందిన పక్షికి ఆ రింగు కొంత భిన్నం గా ఉంటుంది.
(ది  హిందూ పత్రిక సౌజన్యం తో) 

అప్ డేటెడ్ సమాచారం
ఆ పక్షులకి కొంత దగ్గరగా వెళ్ళి ఫొటోలు తీశాను :

పూర్తిగా చదవండి...

Wednesday, August 1, 2012

మా పూరీ - భువనేశ్వర్ యాత్రా విశేషాలు

(ఈ పోస్టు చాలా రోజులైంది మొదలుపెట్టి..! పూర్తి  చెయ్యడానికి ఇప్పటికి వీలు చిక్కలేదు. కాలదోషం పట్టినా పోస్టు చేశాను ఏమనుకోకండి..!)
మా పూరీ - భువనేశ్వర్ యాత్రా విశేషాలు (మొదటి రోజు - పార్ట్ 1)
ఎప్పటినుంచో పూరీ కోణార్క్ చూద్దామనుకుంటున్నాం, ఎలాగూ పిల్లలకి సెలవలే కదాని బయల్దేరాం. భువనేశ్వర్, పూరీ, కోణార్క్ లు చూడడానికి 3Nights and 4Days టూరిస్టు ప్యాకేజీ ఇంటర్నెట్ లో బుక్ చేసుకొన్నాం. టూర్ మొత్తానికి  ఏసీ కారు మనతో కూడా ఉంటుంది కదాని సమ్మర్ అయినా ధైర్యం చేసాం..!  వీకెండ్ కలిసొచ్చేటట్టు శుక్ర వారం బయలుదేరి, మంగళవారం ఫ్రొద్దున్నే తిరిగివచ్చేటట్లు ప్లాన్ చేసుకొన్నాం. 
భువనేశ్వర్ కి విశాఖపట్నం నుంచీ విమానంలో చేరుకోవడంతో మా టూర్ మొదటిరోజు ప్రారంభమయింది. ఎయిర్ పోర్ట్ కి మా గైడు కమ్ డ్రైవర్ వచ్చి రిసీవ్ చేసుకొన్నాడు. పదిన్నర కి ఎయిర్ పోర్ట్ బయట కాలు పెట్టడం తోనే అక్కడి ఎండ, వేడి, ఊక్కపోత అనుభవం లోకి వచ్చాయి. ఏసీ కారు లో కూర్చోగానే ప్రాణం లేచొచ్చింది. తిన్నగా హొటెల్ లో చెక్-ఇన్ చేసి అరగంటలో మళ్ళీ రోడ్డెక్కాం. ఆరోజు కార్యక్రమం నందన్ కానన్ జూ, బొటానికల్ గార్డెన్, ట్రైబల్ మ్యూజియం, ఖండగిరి-ఉదయగిరి హెరిటేజ్ సైట్, మళ్ళీ భువనేశ్వర్ లో రాత్రి బస.  
బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని మొట్టమొదట నందన్ కానన్ జూ కి వెళ్ళాం. డ్రైవర్ మమ్మల్ని గేటు దగ్గర వదిలేసి ఈ జూలో తెల్ల పులులూ, సింహాల సఫారీలు ప్రధాన ఆకర్షణ. ఎంట్రెన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళక ముందే గైడ్ నంటూ ఒక వ్యక్తి వెంటపడ్డాడు. ఇవి చూపిస్తాను అవి చూపిస్తానంటూ ఒకటే రొద పెట్టసాగాడు( పైగా వెయిటింగ్ టైమ్ లేకుండా..!). నేను అక్కర్లేదు పొమ్మని అక్కడి సమాచార కేంద్రం లో వివరాలు కనుక్కొంటే వాళ్ళు చెప్పిన సంగతులు ఇవి: లోపల తిరగడానికి మనకార్లు తీసుకెళ్ళకూడదట. బ్యాటరీ తో నడిచే ప్రత్యేకమైన వాహనాలు ఏర్పాటు చేసారట. అదికాక సఫారీకి వేరే బస్సు ఉంటుందట. వాటికి టిక్కెట్లు తీసుకోవడానికి జూ లోపలే మళ్ళీ క్యూలు ఉంటాయట. పైగా గంటకి ఒకటి వస్తుందిట.. అందుకని ఆయా వాహనాలు వచ్చేంత వరకూ వేచి ఉండాలిట. అర్రె.. అతడిని అనవసరంగా పొమ్మన్నానే..! అనుకుని తలతిప్పేసరికి అతను అక్కడే ఉన్నాడు మమ్మల్నే గమనిస్తూ..!! సరే కానిమ్మని అతనిని ఫాలో అయిపోయాం. మమ్మల్ని చెట్టునీడలో కూర్చోపెట్టి అతను వెళ్ళి బ్యాటరీ వాహనానికి క్యూలో నించున్నాడు. కౌంటర్ లో అడిగితే గంట సేపు ఆగాలన్నాడు బండి కోసం. ఈలోపల సఫారీకి వెళ్ళిపోవచ్చని, మమ్మల్ని ఆ లైనులో నిలబెట్టాడు మా గైడు. పదినిముషాలలో బస్సు వచ్చింది. 


తెల్లపులులూ, సింహాల సఫారీ లోకి వెళ్ళాము. సఫారీలో జంతువుల్ని చూడ్డానికి వచ్చిన వారిని  బస్సులో (బోనులోఉంచి జంతువుల్ని స్వేచ్చ గా వదిలేస్తారుఎండవేడికి అవి బయటకు రావట్లేదుట ప్రతీరోజూ..!! లక్కీ గా ఆరోజు మాకు తెల్లపులులూ , జీబ్రా, సింహాలూ కనిపించాయి. అప్పుడు బాటరీ తో నడిచే వాహనం ఎక్కి మిగిలిన జూ చూశాం. పిల్లలకి చాలా నచ్చింది. అక్కడే ఉన్న బొటనికల్ గార్డెన్ లో కూడా కొంతసేపు గడిపాం.
 

అక్కడి నుంచీ బయల్దేరి ఖండగిరి - ఉదయగిరి చేరుకొనే త్రోవలో ఒరిస్సా ప్రభుత్వం నెలకొల్పిన ట్రైబల్ మ్యుజియం చూసాం.  ముందు అబ్బా..! ఏం చూస్తాంలే అనుకున్నా(ఎందుకంటే అంతకు ముందే అరుకు లో చూసాం) ఎలాగూ త్రోవే కదా అని వెళ్ళాం.   


కానీ మేం వెళ్లేసరికి అది క్లోజ్ చేసేసే టైం అయిపొయింది. ఆవిషయం మాకు తెలీదు. మేమే ఆరోజుకి లాస్ట్ ఎంట్రీ..!! లోపలి వెళ్ళాక అది చాలా నచ్చింది. అరుకు మ్యూజియం కన్నా చాలా బాగుంది. ప్రదర్శన కు ఉంచిన వస్తువులు కూడా ఎంతో ఆసక్తికరం గా ఉన్నాయి. ట్రైబల్స్ (ఈ మాటకు తెలుగు పదం తట్టట్లేదు) వాడే విల్లు బాణాలు, కత్తులు మొదలైన వేటకి వాడే వస్తువులూ, ఆయుధాలతో పాటూ, వారి సాంస్కృతిక, వారసత్వ, కళా రూపాలను కూడా ప్రదర్శనకి ఉంచారు. వారి సంగీత పరికరాలూ, చిత్రకళ, వ్యవసాయానికి వాడే పనిముట్లూ, వంటకి వాడే గిన్నెలూ గరిటెలు, వారి దుస్తులూ, అలంకరణ సామాన్లూ, ఆభరణాలూ ఒకటేమిటి..గిరిజన జీవన శైలిని ప్రతిబింబించే ప్రతీ వస్తువూ ఆయా విభాగాలకి అనుగుణంగా అమర్చబడి ఉన్నాయి. కానీ వాటి లోనే వారి సామాజిక హోదాకి  అద్దం  పట్టే విధంగా డిజైన్లలోనూ, ఆకారాలలోనూ, మెటీరియల్ లోనూ ప్రస్ఫుటమైన తేడాలు ఉండడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.
మ్యూజియం నుండీ బయటకు వచ్చినతరువాత ఆరుబయలులో ఆ ప్రాంతపు ప్రజల గృహనిర్మాణ పద్దతులు, ప్రార్ధనా స్థలాలకూ కూడా నకళ్ళు నిర్మించారు. బయట తప్ప లోపల ఫోటోలు తీయటానికి అనుమతించలేదు. కానీ అక్కడి ఉద్యోగులు చాలా ఓపిగ్గా అన్ని వివరాలు చెబుతూ చూపించారు (సమయం దాటిపోయినా సరే). తీరికగా చూస్తే కనీసం రెండు గంటలైనా పడుతుంది. వారిని మరి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మేము వారికి కలిగించిన అసౌకర్యానికి మన్నించమని, ధన్యవాదాలు చెప్పి  బయటకు వచ్చేశాం.
        అప్పటికి ఎండ తగ్గి చల్లబడింది. అక్కడినుంచి ఖండగిరి - ఉదయగిరికి పది నిముషాలలో చేరుకొన్నాం. అవి అశోకుడూ, కళింగ యుద్ధం నాటి కన్నా ముందరే నిర్మించ బడిన ఏకశిలా జైన గుహాలయాలు. ద్రవిడ, ఒరిస్సా ఆలయ నిర్మాణ శైలులు (Dravidian and Orissan Styles of Architecture) పూర్తిగా రూపు దిద్దుకోక ముందరి నిర్మాణాలు. 


 మా అబ్బాయికి టూర్ మొత్తం మీద బాగా నచ్చిన ఈ ప్లేస్ గురించి వచ్చే పోస్టు లో...!! 
పూర్తిగా చదవండి...

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)