Sunday, January 27, 2013

'మిత్రనీతి' శతకము - 1934 లో వచ్చిన పుస్తకం (పీడీఎఫ్ రూపంలో)

దీని ముందు వ్రాసిన  'మిత్రనీతి' శతకము - 1934 లో వచ్చిన పుస్తకం  పోస్టు  చదివి, ఇది చదువగలరు.
ఆ పోస్టులో పరిచయం చేసుకున్న పుస్తకం ఈ పోస్టులో డౌన్లోడ్ చేసుకోండి.
ఒరిజినల్ పీడీఎఫ్ రూపం లో ఇక్కడ. మెరుగుపరచిన ప్రతి  ఇక్కడ  (శ్యామ్ నారాయణ్ గారి సౌజన్యం)  
ఫోటోల రూపం లో ఈ క్రింద: 
మీకందరికీ ఈ పుస్తకం నచ్చుతుందని ఆశిస్తూ...
సెలవు. 
పూర్తిగా చదవండి...

'మిత్రనీతి' శతకము - 1934 లో వచ్చిన పుస్తకం

                మన తెలుగు సాహిత్యంలో శతకాలకి ఉన్నస్థానం మిత్రులకు తెలియంది కాదు. ఏదైనా ఒక మకుటము తో అంతమవుతూ వంద పద్యాలకు పైబడిన సాహిత్య విశేషాన్ని శతకమంటారు. సాధారణంగా శతకాలు వాటి మకుటాల తోనే పిలవబడి ప్రాచుర్యం పొందుతాయి. మనకు బాగా తెలిసిన శతకాలలో కృష్ణ శతకము, దాశరధీ శతకము మొదలైనవి భక్తితత్వాన్ని ప్రబోధిస్తే, సుమతీ, కుమారి, వేమన శతకములు మొదలైనవి చాలా సరళమైన భాషతో నీతిని ప్రబోధించే సామాజిక బాధ్యతను తలకెత్తుకొని, పండిత పామర జన రంజకంగా ఉండి జనుల నాలుకలపై తరతరాల పాటు నిలిచి ఉన్నాయి. ఇప్పుడు మనం పరిచయం చేసుకోబోతున్న పద్య శతకం కూడా ఈ రెండో కోవకే చెందుతుంది...!   
            మిత్రనీతి అనే ఈ చిన్ని పుస్తకం మన తెలుగు భాషలో మరుగున పడిపోయిన మరొక మంచి పద్యశతకము. "మిత్ర..!" అనే మకుటంతో ఈ శతకాన్ని వ్రాసినది శ్రీ  కొసరాజు రాఘవయ్య చౌదరి గారు (అప్పికట్ల, బాపట్ల తాలూకా,గుంటూరు జిల్లా). కాక్స్టన్ ప్రెస్, మద్రాసువారు 1934 లో ముద్రించబడిన ఈ పుస్తకానికి శ్రీ మునిమాణిక్యం నరసింహారావు(BA, Lit., మచిలీపట్నం) గారు పరిచయ వాక్యాలు వ్రాశారు. ప్రతీ పద్యం ఒక్కొక్క ఆణిముత్యం. నీతి వాక్యాలూ, సామెతలూ పెనవేసి పద్యాలను వ్రాశారు  శతక కర్త. బాల బాలికలకే కాకుండా పెద్దవారికి కూడా ప్రబోధాత్మకంగా ఉండే ఈ పుస్తకం ఇన్నిరోజులు తన వద్ద భద్రం గా దాచుకొని మన ముందుకు తెచ్చిన మా పెదనాన్నగారు శ్రీ రుద్రావఝల రామకృష్ణారావు గారు (ఆర్ ఆర్ కే రావు) ఈ పుస్తకాన్ని తనకు వచ్చిన అపూర్వ కానుక అంటారు. ఎందుకో వారి మాటల్లోనే :

 ************

                దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన క్రొత్త రోజులు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ ఒక ఉద్యమం లాగా నిష్ఠతో నిర్విరామంగా బాల బాలికలకూ, సంఘానికీ సేవ చేసేది. ప్రతీవారూ పాపభీతితో దైవభక్తితో  దేశభక్తి తో  న్యాయం, ధర్మం ఆలోచించి కష్టించి పనిచేసి వారివారి వృత్తులలో శాఖలలో ఎనలేని ఖ్యాతి గడించి,వారి ఆచరణ వాళ్ళ పైవారికి ప్రేరణగా వుండేవారు. ఈ రోజుల్లోలా లంచాలూ స్కాములు అంటే ఏమిటో తెలియని సత్యకాలపు మనుషులు. 

                విజయనగరంలో మావీధిలో ఒక స్కౌట్ ట్రూప్ ఉండేది. మేము కూడా స్కౌట్ గ్రూప్ కి వెళ్లి, ఫస్ట్ ఎయిడ్, సోషల్ సర్వీసు వంటి కార్యక్రమాలలో స్కూల్ సెలవురోజుల్లో ఉత్సాహం గా పని చేసేవాళ్ళం. మా వీధి స్కౌట్ టీచర్స్ ప్రతీ నేలా ఒక ప్రముఖ వ్యక్తిని పిలిచి, ఆయన చేత బాలబాలికలకు స్ఫూర్తిదాయకంగా ఏదైనా అంశం మీద ఉపన్యాసం ఇప్పించేవారు. తద్వారా చిన్ననాడే లబ్ధ ప్రతిష్టులైన ప్రముఖుల భావాలు కొంతవరకు ఆకళింపు చేసుకొనే అవకాశం కలిగేది.

                నెలవారీ కార్యక్రమాలలో భాగంగా ఇతర స్కౌట్ ట్రూప్స్ తో కలిపి పిల్లల మధ్య వకృత్వం, వ్యాసరచన లాంటి పోటీలు నిర్వహించేవారు. న్యాయ నిర్ణేతలుగా అప్పటి ప్రముఖులూ, విద్యావేత్తలూ  వచ్చేవారు. వారిలో  మేజిస్ట్రేట్, కాలేజీ ప్రిన్సిపాల్  మొదలైన వారు ఉండేవారు. డిబేట్  పోటీలో పిల్లల భావాలూ, భాష, నిర్భయంగా మనసులో మాట  స్పష్టంగా చెప్పడం మొదలైన అంశాల ఆధారంగా మూల్యాంకనం చేసి బహుమతులు ప్రకటించేవారు. 

                ఇలా ఒకసారి నేను IV ఫారం చదువుతున్న రోజుల్లో (అంటే సుమారు అరవై ఏళ్ళ క్రితం సంగతి), నేను కూడా వకృత్వ పోటీలో పాలుపంచుకున్నాను. పోటీదారు లందరిలోనూ నేనే చిన్నవాడిని. ఆ రోజుల్లో వయో వర్గీకరణ కూడా ఉండేది కాదు. మాకు ఇచ్చిన విషయం మీద నాకు తెలిసినంతలో నిర్భయంగా, తడుముకోకుండా, సూటిగా చెప్పాను. అందరిలో మాట్లాడాలంటే  నాకు జంకు లేకపోగా  ఉత్సాహంగా చెప్పాను. ప్రేక్షకులు చాలా మెచ్చుకున్నారు.

                ఆఖర్న జడ్జి గారు తమ వెలువరిస్తూ  ప్రకటిస్తూ నాకు మూడో బహుమతి ప్రకటించారు. ఆపోతీలో నాకు వచ్చిన బహుమతి బొబ్బిలి యుద్ధం నాటకం. వెంటనే ఒక కాలేజీ విద్యార్ధి లేచి ప్రథమ బహుమతి వచ్చిన వ్యక్తికన్నాఈ కుర్రవాడే బాగా చెప్పాడనీ, వయసులో చిన్నవాడైనా ఎంతో పరిణతి కనబరచాడనీ, ప్రథమ బహుమతికి అన్ని విధాలా అర్హుడనీ, ఇతనికి ప్రథమ బహుమతి  ఇవ్వడం సబబు గా ఉంటుందనీ నిర్ణయం మార్చమనీ ప్రతిపాదించాడు...! నిర్వాహకులు బహుమతి ప్రదానం జరిగిపోయినందువల్ల నిర్ణయం మార్చడం కుదరదనే సరికి, అదే క్షణంలో ఆ కాలేజీ విద్యార్ధి తన చేతిలో ఉన్న 'మిత్ర నీతి ' అనే నీతి శతక పుస్తకాన్ని నాకు బహుమతిగా తన తరఫున ఇచ్చాడు. ఆపుస్తకం మీద ఉన్న తన పేరు కొట్టివేసి, "   Book presented to R. Rama Krishna Rao of Kothapeta - VZM" అని వ్రాసి అదే వేదికమీద అందరి సమక్షం లో ఇచ్చాడు. 

                అప్పుడు న్యాయ నిర్ణేత లేచి ప్రసంగిస్తూ  తను మూడవ బహుమతి ప్రకటించిన కుర్రవాడు మొదటి బహుమతికి అర్హుడని సభికులు, శ్రోతలూ భావించి తన నిర్ణయాన్ని మార్చమని ప్రతిపాదించడం తనకు ఆనందం కలిగించిందనీ, నిజానికి ఆ పని తాను  మొదటే చేసి వుంటే  అది పక్షపాత వైఖరితో కూడుకున్నదని అనేవారేమోనని, కారణం ఆ కుర్రవాడు తన కుమారుడనీ, ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. కీ. శే. శ్రీ రుద్రావఝల నరసింహ మూర్తిగారు  
                అవును..!! ఆరోజు న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది మా నాన్నగారే..(కీ. శే. శ్రీ రుద్రావఝల నరసింహ మూర్తిగారు) !! వారు ఆరోజు వస్తారని నాకూ తెలియదు, నేను పాల్గొంటున్నాననే సంగతి వారికీ తెలియదు.  కాలేజి విద్యార్ధి ఇచ్చిన ఆపుస్తకం నాకు అపూర్వంగా అనిపించి ఇన్నాళ్ళూ భద్రంగా ఉంచుకున్నాను. అరవై ఏళ్ళు అయినా ఇప్పటికీ ఈ పుస్తకం లోని నీతి  పద్యాలని వల్లె వేసుకుంటూ ఉంటాను. నేటి విద్యా విధానంలో నీతి, ఆధ్యాత్మిక అంశాలూ చాలా వరకూ తక్కువైపోతుండడం తో విద్యార్ధులు భౌతికమైన విషయాలలో అభివృద్ధి చెందుతున్నా నైతికత విషయంలో వెనుకబడి పోతున్నారు. సరళ భాషలో  వ్రాయబడిన ఇలాంటి పుస్తకాలు ఇప్పటి తరానికి ఎంతైనా అవసరం. ప్రచారం కల్పించడం మన కర్తవ్యం.   
- రుద్రావఝల రామకృష్ణారావు, Block No.39 -A(BSP), Ruabanda Sector, భిలాయి - 6 
సెల్: 07587046455
వీరిదే ఇంకో చిత్రమైన రచనను ఇక్కడ చూడండి
 ************
                మిత్రనీతి  పుస్తకం వెల  అప్పట్లో రెండున్నర అణాలు. వేమన శతకం, సుమతీ శతకాలవలెనే  తేలికైన భాషలో వ్రాయబడింది. ఈ పుస్తకం ఇప్పుడు ఎక్కడా దొరకక పోవచ్చు. ఆరోజుల్లో ఈపుస్తకం మీద అభిప్రాయాలు వ్రాసిన వారిలో విద్వాన్  మోటుపల్లి రామానుజరావు, MA (సీనియర్ లెక్చరర్, పచ్చియప్ప కాలేజీ, మద్రాసు) గారితోపాటూ మద్రాసు, తిరుత్తని, చిత్తూరుల నుంచి కూడా ప్రముఖుల, విద్యావేత్తల అభిప్రాయాలు ఉన్నవి.
               
                ఆ పుస్తకం నుంచీ మచ్చుకి కొన్ని పద్యాలు:
                                ఆత్మదేశమందు అభిమానమేలేని 
                                                పురుషు డే జగాన పుట్టనేమి..?
                                గిట్టనేమి? యతని పుట్టువు భాగ్యంబు 
                                                అడవి గాయు వెన్నె లౌను మిత్ర..!
                                                        -----------------

                                శాంతముననె కార్య సాధనంబు లభించు
                                                శాంతముననె చాల సౌఖ్య మబ్బు
                                 శాంతమునకునేది సరిరాదు..! శాంతమే 
                                                 భూషణం బటండ్రు బుధులు మిత్ర..! 
                                                         -----------------

                                 చెమటనోడ్చి కష్ట జీవనం బనకుండ 
                                                పవలు రేయి కూడ  పాటు వడుము
                                  సేద్యము ననె సుఖము చేకూరు; గృషి సేయ 
                                                 కరవు కాటకాలు గలవె ? మిత్ర..!
                                                        -----------------

ఈ పుస్తకాన్ని స్కాన్ చేసి మీ అందరికీ  పంచుతాను.            
          
పూర్తిగా చదవండి...

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)