Saturday, March 24, 2012

వడ్డాది పాపయ్యగారి 'నక్షత్ర బాల' లు..! (నక్షత్రాలకు స్త్రీ రూపాలు)


క్రితం పోస్ట్ (వడ్డాది పాపయ్య గారి రాగ కన్యకలు..! రాగాలకు వపా గారు చిత్రించిన స్త్రీ మూర్తులు..!!) లో  వడ్డాది పాపయ్య (వపా) గారు రూపమిచ్చిన రాగ కన్యకల గురించి ముచ్చటించుకొన్నాం. ఇప్పుడు వారు గీసిన 'నక్షత్ర బాల' లను చూడండి. ఇవి కూడా యువ మాస పత్రికలలో వచ్చినవే..!

నాగ కన్యలు అని మన వాళ్ళు సినిమాలలో చూపించేటప్పుడు ఆహార్యం నాగ ముద్రలతో ఉన్నట్లు, వపా గారి ఈ 'నక్షత్ర బాల' ల ఆహార్యం లో పంచ శీర్షాలతో కూడిన తెల్లటి నక్షత్రాలు కనిపిస్తాయి. జాగ్రత్త గా చూస్తే ఆ నక్షత్ర సంబంధమైన లక్షణాలను ఆ యువతి లో గమనిస్తాం. పాపయ్య గారు ఆ నక్షత్రాల రాశులనో లేక పేరులోని అర్థాన్నో సింబాలిక్ గా ఉండేటట్టు ఊహించి ఈ చిత్రాలను గీశారనుకుంటాను.

[మన  ప్రాచీన  సంప్రదాయాల ప్రకారం (వాటిని జ్యోతిశ్శాస్త్రం అనాలో లేక ఖగోళ శాస్త్రం అనాలో తెలియలేదు..! బహుశ పంచాంగం అనాలేమో..!!) నక్షత్రాలు 27 .. అశ్విని, భరణి, కృత్తిక, మొదలైనవి. ప్రతీ నక్షత్రానికీ నాలుగేసి  పాదాలు. అలాగే రాశులు మేషం, వృషభం మొదలుగా గలవి..12. నాలుగు పాదాలతో కూడిన ఇరవై ఏడు నక్షత్రాలని( 27  x  4 = 108 ) పన్నెండు రాసులలోకి విభజిస్తే ఈ క్రింది విధంగా భాగించ బడతాయి.

అశ్వని భరణి కృత్తికా పాదో - మేషం 
కృత్తికాత్త్రయం రోహిణి మృగశిరార్థం - వృషభం 
మృగశిరార్థం ఆర్ద్రా పునర్వసుస్త్రయో - మిధునం
పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాన్తం - కర్కాటకం 
మఖ పుబ్భా ఉత్తరాపాదం - సింహం 
ఉత్తరస్త్రయో హస్త చిత్రార్థం - కన్య 
చిత్రార్థం స్వాతి విశాఖత్త్రయో - తుల 
విశాఖపాదో అనూరాధా జ్యేష్టాంతం - వృశ్చికం 
మూల పూర్వాషాడ ఉత్తరాషాడ పాదో - ధనుః 
ఉత్తరాషాడత్త్రయో శ్రవణం ధానిష్ఠార్థం - మకరం 
ధనిష్ఠార్థం శతభిషం పూర్వాభాద్రత్త్రయో - కుంభం 
పూర్వాభాద్రపాదో ఉత్తరాభాద్ర రేవత్యాంతం - మీనం ]


పై శ్లోకం, దాని అర్థం http://jyotishavidyarthi.blogspot.in/2011/12/blog-post.html నుండి తీసుకొన్నాను. వారికి నా ధన్యవాదాలు.

రోహిణి 
'రోహిణి' వృషభ రాశికి చెందిన నక్షత్రం. వృషభానికి మల్లె  పొడుగాటి చెవులూ-కొమ్ములను తలపించే కేశాలంకరణ, మామూలుగా కన్నా కొంచం పొడవైన మెడ గమనించండి.
ఆశ్లేష 
 'ఆశ్లేష' కర్కాటక రాశికి చెందినది. ఈ నక్షత్ర సుందరి నడుము మీద   కర్కాటకం (పీత) గమనించండి.మఖ 

మఖ నక్షత్రం సింహరాశిలోకి వస్తుంది. ఈ అమ్మాయి నిలబడిన తీరు, ముఖం చుట్టూ పరుచుకున్నజుట్టు సింహాన్ని తలపించటంలేదూ..!!
హస్త  
అలాగే హస్త నక్షత్రం..!! 'హస్త' అంటే చెయ్యి తో పాటూ ఏనుగు కూడా కదా.. అందుకే ఏనుగు ముఖం కూడా కనబడేటట్టు వేసారు
చిత్ర 
'చిత్ర' నక్షత్ర బాలను (వ్యావహారికం లో 'చిత్త') చిత్రకారిణి లాగా  గీశారు
స్వాతి 


   
 స్వాతి చినుకులు 
ముత్యపు చిప్పలలో పడి 
ముత్యాలుగా మారతాయంటాం కదా..!! అందుకేనేమో..చిత్రంలో ముత్యపు చిప్ప, దానిలో ముత్యాలూ, మధ్యలో 'స్వాతి'

విశాఖ
ఇక 'విశాఖ' సుందరి విషయానికొస్తే..రెండు చేతులలో బరువులుంచుకొని బేరీజు వేస్తున్నట్టు ( త్రాసులో తూకం వేస్తున్నట్టు) వేశారు. ఈ నక్షత్రం లో మొదటి మూడు పాదాలు తుల రాశి , ఒక పాదం వృశ్చికం..
(సుందరి కొప్పులో ఏముందో చూడండి)

శ్రవణం 
 .

   
 

శ్రవణం అందరికీ తెలిసినదే... విష్ణువు నక్షత్రం. రాశి మకరం. అందుకేనేమో ఈ యువతి రూప కల్పనలో విష్ణువాంశ చూపారు. కుడి చేతిలో చక్రం ధరించి ఎడమ చేతితో క్రిందనున్న మకరాన్ని (మొసలి) చూపుతోంది.


 

పూర్వాభాద్ర
ధనిష్ఠ 
శతభిషం 
ఇక పొతే 'ధనిష్ఠ', 'శతభిషం'  కుంభరాశికి చెందిన నక్షత్రాలు.. 'పూర్వాభాద్ర' యొక్క రాశి మీనం.
ఈ అమ్మాయికి కుడి వైపు చేపను చిత్రించారు.

వడ్డాది పాపయ్యగారి ఈ నక్షత్ర చిత్రాల్నీనక్షత్రాలూ - రాశులకు సంబంధించిన పైన చెప్పిన వివరాలనూ పోల్చితే నాకు కనిపించిన, అనిపించిన విషయాలను వ్రాశాను. అవి ఎంతవరకూ సహేతుకమో, ఈ విషయాల పైన పట్టున్న విజ్ఞులెవరైనా చెప్పాల్సిందిగా మనవి.
పూర్తిగా చదవండి...

Friday, March 23, 2012

శ్రీ 'నందన' నామ సంవత్సర ఉగాదిబ్లాగు మిత్రులందరికీ 
శ్రీ 'నందన' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఉగాది పర్వదినాన గడచిన 'ఖర' నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ “నందన” నామ సంవత్సరానికి 
నిండు మనసుతో స్వాగతం పలుకుదాం..!

హ్యాపీ న్యూ ఇయర్ అనే మాట వినగానే నేడు చాలా మందికి మనసులో మెదిలేది జనవరి ఒకటవ తేది.
కానీ సంవత్సరారంభం.. యుగ + ఆది.. ఉగాది ఇప్పుడు కేవలం వేపపువ్వు తినే పండుగగా మాత్రమే భావించబడుతోంది..! ఖగోళ శాస్త్ర రీత్యా ప్రత్యేకత లేని జనవరి ఒకటినే ఇప్పుడందరూ క్రొత్త సంవత్సరాదిగా జరుపుకుంటున్నారు.

డిసెంబరు 31..! "విష్ యూ హ్యాప్పీ న్యూ ఇయర్..!!" అంటూ ఉత్సాహం ఉరకలు వేసే యువకులూ, యువతులూ, హర్షాతిరేకాల మధ్య పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే రోజు..!!! రాత్రి అంతా విందు వినోదాలతో కాలక్షేపం చేస్తూ, గడియారం 12 గంటలు కొట్టగానే..అందరూ ఒక్కసారిగా హ్యాపీ న్యూ ఇయర్ అనే గావుకేకలతో మారుమ్రోగే రోజు..!! కానీ డేటు మారగానే రోజుమారిందని అనుకుంటే కొత్త రోజు.. మొట్టమొదటే చేస్తున్నపని..పిచ్చెక్కినట్టు..గావుకేకలతో..రోడ్లమీదకెక్కి..వీరంగం చెయ్యడం..!! పబ్బుల్లో మందుకొడుతూ ఎంజాయ్ చేస్తున్నామనే భ్రమలో చిందులేయ్యడం..! బైకుల మీద విన్యాసాలతో మిగిలినవారిని బెదర గొట్టడం...ఖర్మం చాలకపోతే కాలో చెయ్యో విరగ్గొట్టుకోవడం...రాత్రి రెండుకో..లేదా మూడు కొట్టాకో ఇంటికొచ్చాక తెల్లారి 10 - 11 గంటల వరకు పడుకోవడం. మొత్తానికి కొత్తసంవత్సరానికి మొదటి రోజు(సంవత్సరాది) గా భావించే జనవరి ఒకటిన ఎక్కువమంది రోజు మొదలెట్టే తీరు ఇది.

ఇక ఉగాది రోజు కార్యక్రమం చూద్దాం..!!

సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని కొత్తబట్టలు ధరించి కొత్తరోజుకి ఆహ్వానం పలుకుతాం. ఉగాది పచ్చడి తిని ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకొంటాం. ఆలయాలకి వెళ్లి దైవదర్శనం చేసుకొని, పంచాంగ శ్రవణం వింటాం. ఇళ్ళన్నీ బంధుమిత్రుల తో కళకళ లాడుతూ వుంటాయి. వంటింటిలో ఇల్లాళ్ళు చేసే పిండి వంటల ఘుమఘుమలతో ఇంట్లో పిల్లలు పిల్లుల్లా వంటింటి లోకి వెళ్ళడం..."ఇంకా నైవేద్యం పెట్టలేదు..ఫొండి బయటికి..!" అని అమ్మలు కసురుకుంటే బుంగమూతి పెట్టుకొని తాతయ్య దగ్గరకో నాన్న దగ్గరకో చేరడం..!! మధ్యాహ్నం సహపంక్తి భోజనాల దగ్గర హడావిడైతే చెప్పే అక్కరలేదు..!

’న్యూ ఇయర్స్ డే’ కీ, ఉగాదికీ పండుగ జరుపుకొనే సందర్భం ఒకటే అయినా జరుపుకొనే విధానంలో ఇంత వ్యత్యాసానికి కారణం ఆ పండుగల యొక్క సాంస్కృతిక నేపధ్యమేననేది సుస్పష్టం.

ఇవన్నీ ఇలా వుంటే ఉగాది నాటి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ముద్రించిన కరపత్రాలు ఒక ఆలయం లో పంచారు. అది తీసుకొని రెండేళ్ళ పైనే అవుతోంది. క్రింది ఫోటోల పైన నొక్కి చదవండి.
పాశ్చాత్య పోకడల సుడిగుండం లో కొట్టుకుపోతూ మన సంస్కృతి సంప్రదాయాలను పూర్తిగా మర్చిపోతున్నాం. విదేశీ / పాశ్చాత్య సంస్కృతి లోని మంచి విషయాలను అనుసరించడానికి ప్రయత్నిస్తే బాగుణ్ణు. విదేశీ మోజులో పడి వారు చేసుకొనే ప్రతీ 'దినాన్నీ' మనం కూడా ఆయా 'దినాలుగా' (గుడ్డిగా) అనుస()రిస్తున్నాం. కానీ తరతరాలుగా మన జీవన విధానాలూ, ఆచారాలు ప్రాతిపదికగా జరుపుకొనే మన పండుగలను మర్చిపోతున్నాం. ఇవన్నీ'మల్టి నేషనల్ కంపెనీలు' తమ ఉత్పత్తులని అమ్ముకోవడానికి చేసే 'మార్కెటింగ్ స్ట్రాటెజీస్' అని కొందరు సంప్రదాయవాదులు చేసే వాదనలో నిజం లేకపోలేదు..! ఏదేమైనా వెర్రితలలు వేస్తున్న పెడ ధోరణుల నుంచీ బయటపడి మన సంస్కృతిని కాపాడుకొనే దిశగా అడుగులు వెయ్యాలి. మన పండుగలను కూడా విదేశీ 'దినాలకన్నా' ఎంత దివ్యంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవచ్చో న(యు)వతరానికి తెలియ జెప్పాలి. ఆ ఆనందం అనుభవం లోకి వచ్చిన నాడు మన పండుగలను మరింత శోభాయమానంగా జరిపించడంలో వారే ముందుంటారు.

పూర్తిగా చదవండి...

Sunday, March 18, 2012

వడ్డాది పాపయ్య గారి రాగ కన్యకలు..! రాగాలకు వపా గారు చిత్రించిన స్త్రీ మూర్తులు..!!

               వడ్డాది పాపయ్యగారి కుంచె నుండి జాలువారిన రాగ కన్యకలు..! కర్నాటక హిందూస్తానీలో పేరొందిన కొన్ని రాగాలను తీసుకొని ఆయా రాగాలకు వపా గారు చిత్రించిన ఈ స్త్రీ మూర్తులు యువ మాసపత్రికలో 1980 - 81 లో ప్రచురిత మయ్యాయి..!! ఇంకొన్ని కూడా గీసారేమో తెలియాల్సి వుంది.  ఇప్పటివరకు లభ్యమవుతున్న వారి పెయింటింగ్స్ లో రాగాల పేర్లతో ఉన్న ఈ క్రింది బొమ్మలు అన్నీ మన బ్లాగు మిత్రుల సౌకర్యార్థం ఒక దగ్గర ఉంచాను. యువ లో వారి పెయింటింగ్స్ కొన్ని ప్రత్యేకమైన శీర్షికలతో వచ్చాయి. కొన్ని నక్షత్రాలకు కూడా వారి చిత్రణలో, రూపమిచ్చారు. 
              అయితే వపా గారు రాగాల పేర్లతో చిత్రించిన ఈ చిత్రాలు  చూస్తే వాటి పేరుని బట్టీ, దానికి సరిపోయే సన్నివేశాన్ని చిత్రించినట్టు కనిపిస్తోంది. జన రంజని - జనాన్ని రంజింపజేసేది (సినిమా తారలా అనిపిస్తోందినాకు.. అక్కడ చూపించిన జనం సినిమా హాలులో కూర్చున్నట్టుంది), కదన కుతూహలం - యుద్ధానికి తరలుతున్న సైనికుడు తన ప్రియురాలికి వీడ్కోలు పలికే సన్నివేశం. భాగేశ్వరి రాగానికి శివుడి అర్థనారీశ్వర రూపాన్ని చిత్రించిన తీరు చూడండి. అలాగే శివరంజని, అమీర్ కల్యాణి...!!
             క్రొత్తగా సంగీతం నేర్చుకొనే వారు మొట్టమొదట అభ్యాసం చేసే సరళీ స్వరాలూ, జంటస్వరాలూ, అలంకారాలూ వంటివి మాయామాళవ గౌళ రాగం లోనే వుంటాయి. అందుకే ప్రథమ పూజలందుకొనే గణపతికి కైమోడ్పులిస్తున్నచిన్నారిని (ఎదురుగా చిన్న పియానో / హార్మోనియం తో సహా) చిత్రించినట్టున్నారు.  
            యమునా కళ్యాణికి - యమునాతీరంలో గోపికలూ, ఆలమందలూ, రాధ తో విహరిస్తున్న కృష్ణుడిని చిత్రించారు. అలాగే శ్రీ రాగానికి లక్ష్మీదేవి విష్ణువుని వరించే సన్నివేశాన్నిచిత్రించారు. (శ్రీ - అంటే లక్ష్మి కదా..!) సన్నివేశాన్ని జాగ్రత్తగా చూస్తే క్షీరసాగర మథనం లో ఉద్భవించిన లక్ష్మీ దేవి, ఆసనం గా పద్మం, ఉరకలెత్తుతున్న సముద్రం, అప్పుడే పాల సముద్రం లోంచీ పుట్టిన చంద్రుడు కనిపిస్తారు.  
                    'కీరవాణి' రాగానికి రతీ మన్మధులని గీస్తూ emphasis వాహనమైన చిలకకి ఇచ్చారు. అలాగే 'సారంగ' రాగానికి గీసిన బొమ్మలో జింక బొమ్మ ప్రాముఖ్యత అర్థం కాలేదు. అలాగే మిగిలిన రాగాల పేర్లకీ ఈ చిత్రాలకీ వున్నసంబంధాన్ని తెలిసిన వారెవరైనా ఇంకాస్త వివరిస్తారని ఆశిస్తున్నాను.  
కన్నడ - శహన
బేహాగ్ - మలయ మారుతం
జన రంజని
శ్రీరంజని
మేఘ రంజని


రంజని
కీరవాణి


సారంగ
ముఖారి
భాగేశ్వరి
కదనకుతూహలం


శివరంజని - హిందోళ
సోహిని - మేఘరంజని - మాల్కోస్
కాంభోజి - కాపి
జయజయవంతి - అహిర్ భైరవి
మేఘ మల్హార్
చారుకేశి
కేదార గౌళ 
మాయామాళవగౌళ 
యమునా కల్యాణి 
యమునా కల్యాణి
అమీర్ కల్యాణి
శ్రీ రాగం
మాల్కోస్


************************************
వపా గారి నక్షత్ర బాలలు మరో పోస్టులో..!! 
పై ఫోటోలు హైదరాబాద్ కు చెందిన శ్రీ శ్యాం నారాయణ్ గారి సౌజన్యంతో...! వారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.


పూర్తిగా చదవండి...

Monday, March 12, 2012

స్మృతిపథంలో అమరగాయకుడు ఘంటసాల - విశేష సంచిక

స్మృతిపథం లో అమరగాయకుడు ఘంటసాల - విశేష సంచిక పేరుతో విడుదలైన ఈ పుస్తకం ఘంటసాల వారి స్మృత్యర్ధం విజయనగరంలోని వారి అభిమానుల చేత ముద్రించబడింది. సాంబశివరావు గారి సంపాదకత్వంలోఅచ్చయిన ఈ పుస్తకం ఇదివరకు ఘంటసాల వారి సంస్మరణలో వివిధ పత్రికల లో వచ్చిన వ్యాసాలూ, ఘంటసాల గురించి ప్రముఖుల అభిప్రాయాలూ మొదలైనవి గుదిగ్రుచ్చబడిన పదహారు పేజీల చిన్ని పుస్తకం. అమూల్యమైన ఈ పుస్తకం వెల  రూ. 10/-.  
ఈ పుస్తకం నాకు మా బంధువుల ద్వారా వచ్చింది. చాలా పత్రికలనుంచీ సేకరించిన ఈ వ్యాసాలు జే. వి. రాఘవులు, ఆచార్య ఆత్రేయ, కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ మొదలైన వారు వ్రాసారు. విజయ చిత్ర, ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ఘంటసాల వారి జీవితవిశేషాలతో వచ్చిన వ్యాసాలూ కూడా వున్నాయి. అన్నిటికంటే ఘంటసాల వారే తమ గురువుగారైన శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారి గురించి వ్రాసిన వ్యాసం కూడా పొందుపరచ  బడింది..! ఇన్నిటిని ఒకే చోట కూర్చిన సంపాదకుల శ్రమకు జోహార్లు. అయితే ఈ పుస్తకం మీద అది విడుదలైన తేదీ, ముద్రించబడిన సందర్భం కూడా ఉండి వుంటే ఇంకా బాగుండేది.  
 
 

 
 
 

ఇవి 'స్మృతిపథం లో అమరగాయకుడు ఘంటసాల - విశేష సంచిక' లోని కొన్ని పేజీలు మాత్రమే..!!   
మొత్తం పుస్తకం (16 పేజీలు )పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది లింక్ నొక్కండి. 
*************
( శ్రీ రాజేంద్ర కుమార్ గారు ఈ ఫైల్ డౌన్లోడ్ అవటం లేదని అన్నారు. పై లింక్ నొక్కితే కనబడే పేజి లో ఈ క్రింది మెసేజ్ కనిపించిన చోట here మీద నొక్కండి. 
Sorry, we are unable to retrieve the document for viewing because it is too large.
You can also try to download the original document by clicking here
అప్పుడు డైరెక్ట్ గా డౌన్లోడ్ అవుతుంది. ) 
*************
 అలాగే ఘంటసాల గారి అరుదైన చిత్రాలు డౌన్లోడ్ చేసుకోడానికి ఈ లింక్ నొక్కండి.


పూర్తిగా చదవండి...

Sunday, March 4, 2012

ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో తెలుగు టైపింగ్ చెయ్యడం ఎలా??

ఫోన్స్ లో ఈ మధ్య స్మార్ట్ ఫోన్స్, టచ్ ఫోన్స్ చాలా విరివిగా వాడుతున్నారు. ఇంటర్నెట్ కూడా ఫోన్లలో అందుబాటులో ఉండడంతో  మనం eeమనం  ప్రత్యేకించి ఫోన్ మీద తెలుగు ఫాంట్ చూడాలనుకొనే వారు ఆ సదుపాయాన్ని తమ ఫోన్లు లేదా టాబ్లెట్ లు కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారా పొందవచ్చు. ఇంతకు ముందు ఇదే బ్లాగులో ఆండ్రాయిడ్ ఫోనులో తెలుగు స్క్రిప్ట్ చూడడం ఎలాగో తెలుసుకున్నాం. ఇప్పుడు మీ ఆ మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ లో తెలుగు టైపు చెయ్యడం ఎలాగో తెలుసుకుందాం.
నేను వాడుతున్న Xperia x10i (Sony Ericsson)
సింపుల్ గా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
1. Download multiLing keyboard app and myAlpha app from the  Android Market.
2. Now open multiLing keyboard app. You will see options page.
3. Now click on 1(enable MultiLing) and tick the box against multiling keyboard.
4. Now click on 2(swich to IME to multiLing) again click on multiling key board)
5. Now click on 4 (enable languages). scroll down untill you see telugu, and then click on that. plese note that you have to install MyAlpha by now. లేకపొతే ఆ భాషలన్నీ ఉత్తి డబ్బాలు గా కనబడతాయి.
6. come back to the main menu.                           
7. now open myalpha to type anything in telugu.    

అంతే ...!!! myAlpha app లోనే ఆప్షన్ లో చూస్తే మీరు టైపు చేసిన దాన్ని ఏం చెయ్యాలన్నా(ఈ-మెయిల్ గానీ, కాపీ, పేస్ట్ లాంటివి గానీ) చెయ్యొచ్చు.

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు బ్లాగులో ఈ వివరాలు వున్నాయి. శ్రీధర్ గారు  దానిలో వీడియో ట్యుటోరియల్ ఉంచారు. దాని లింక్ సేవ్ చెయ్యడం మర్చిపోయాను. కానీ నా మొబైల్ లోనూ టాబ్లెట్ లోనూ ఆ సెట్టింగ్స్ మార్చుకొన్నాను. నాకు గుర్తున్నంత వరకూ ఏం చెయ్యాలో స్టెప్స్ రూపం లో వ్రాసాను.
 నల్లమోతు శ్రీధర్ గారికి మనందరి తరఫునా ధన్యవాదాలు చెబుతూ,
సెలవు.

షరా: ఎవరికైనా ఈ విషయం లో డౌట్ లు ఏమైనా వుంటే అడగడానికి మొహమాట పడకండి. ఆండ్రాయిడ్ ఫోనుల వరకే మీ ప్రశ్నలు పరిమితం చెయ్యమని మనవి.  
ఈ విషయమే కాక కంప్యుటర్లకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు బ్లాగు చూడండి.
పూర్తిగా చదవండి...

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)