Showing posts with label శ్రీరామ నవమి. Show all posts
Showing posts with label శ్రీరామ నవమి. Show all posts

Saturday, April 7, 2012

సంక్షిప్త రామాయణాలు - సంకలనం


రామాయణ మహాకావ్యం ఎన్ని సార్లు విన్నావినాలనిపిస్తుంది. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలని పిస్తుంది. ఆ కావ్య మాధుర్యం అలాంటిది. సంస్కృతం లో వాల్మీకి మహర్షి వ్రాసిన ఈ కావ్యం, వివిధ భాషలలోకి అనువదించబడింది.  రంగనాధ రామాయణం, భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, విశ్వనాథ వారి  రామాయణ కల్ప వృక్షం...ఇలా చాలా మంది రామాయణాన్ని తమ శైలి లో రచించి చరితార్ధులైనారు.

ఈ బొమ్మ నేను గీసిందే..! ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు..!!
అలాగే రామాయణ కావ్య రచనలో విన్యాసాలు చేసిన కవులు కూడా ఉన్నారు.  సాహిత్య జగత్తు లో శాశ్వత స్థానాన్ని పొందిన నిరోష్ఠ్య రామాయణం అను దశరథ రాజ నందన చరిత్ర (గమనించండి ఈ పేరు పలికేటపుడు పెదవులు కలవటం లేదు.. అదే ఈ కావ్యం ప్రత్యేకత -నిర్+ఓష్ఠ్యము (పెదవుల సాయంతో పలికే పదాలు లేనిది), రాఘవ పాండవీయం (ద్వ్యర్థి కావ్యం, ఈ పద్యాలలో రామాయణార్థం, భారతార్థమూ కూడా ఉంటాయట), యాదవ రాఘవ పాండవీయం (ముందర దానిలాగే ఇది త్యర్థి కావ్యం) లాంటివి ఈ కోవకే చెందుతాయి. (ఈ పుస్తకాలు కావలసిన వారు లింకులు నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు)

అలాకాక రామాయణ మహా కావ్యం మొత్తాన్ని క్లుప్తంగా చాలా తక్కువ పద్యాలలోనో, కొన్ని శ్లోకాలలోనో, వ్రాయబడినవి కూడా పూర్తి కావ్యమంత రమ్యం గానూ ఉండడం అవి చదివిన ప్రతి ఒక్కరికీ అనుభవం లోకి వచ్చే విషయమే. అలాంటి సంక్షిప్త రామాయణాలను ఒక సారి తలచుకోవడమే ఈ టపా ఉద్దేశ్యం. (వెనుకటికెవరో మూడుముక్కల్లో రామాయణం చెప్తానని 'కట్టే..! కొట్టే..! తెచ్చే..!' అన్నాడట ఇక్కడ చెప్పబోయేది అలాంటిది కాదులెండి.)


antaryamin.wordpress.com సౌజన్యంతో
వాల్మీకి మహర్షి కొన్ని లక్షణాలను నారదుడి ముందు ఏకరువు పెట్టి ఆ లక్షణాలతో మూర్తీభవించిన వ్యక్తి ఈ కాలం లో ఎవరైనా వున్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా నారదుడు రామాయణాన్ని క్లుప్తంగా వాల్మీకి మహర్షికి ఉపదేశించి శ్రీ రామ కథను విస్తరించి వ్రాయమని చెబుతాడు. అదే నూరు శ్లోకాలతో కూడిన మొట్ట మొదటి సంక్షిప్త రామాయణం. పూర్తి కావ్యం లో ఇరవై నాలుగు వేలకు పైగా శ్లోకాలున్నాయట.

ఇక ఇంకొన్నిచూద్దాం.
********************************
ఏక శ్లోకీ రామాయణం:
(దీని మూలం ఏదో, ఎవరు వ్రాశారో తెలియలేదు)
ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్ |
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ ||
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ |
పశ్చాద్రావణకుంభకర్ణహననం చేతద్ధి రామాయణమ్ ||
 
********************************
నామ రామాయణం:
 నూట ఎనిమిది సార్లు రామ నామం వచ్చేటట్లు సంస్కృతంలో శ్రీ లక్ష్మణా చార్యుల వారిచే వ్రాయబడింది.
ఈ లింక్ నొక్కి ఆ రచన యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాలను చూడండి.
 లక్ష్మణాచార్య కృత నామ రామాయణం - తాత్పర్యము
********************************
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గళం నుంచీ రాగమాలికగా జాలువారిన ఇంకొక కీర్తన
భావయామి రఘు రామం భవ్య సుగుణ ఆరామం - ఈ కీర్తన మహారాజ స్వాతి తిరునాళ్ రచన.  దీనిలో ఆరు చరణాలలో ఆరు కాండలు వర్ణించ బడ్డాయి. పల్లవి సావేరి లోనూ, చరణాలు వరుసగా నాటకురంజి, ధన్యాసి, మోహన , ముఖారి, పూర్వికల్యాణి, మధ్యమావతి రాగాలలో స్వరపరచ బడ్డాయి.   
********************************
ఒక పుస్తకం వెనుక అట్ట మీద ప్రచురితమైంది ఈ సీస మాలికా రామాయణం. ఎవరు వ్రాశారో తెలీదు. అది మా పెదనాన్నగారు వ్రాసుకొని దాచి ఉంచారు. (నా టైపింగ్ లో ఏమైనా తప్పులుంటే తెలిసిన వారు సరిదిద్దవచ్చు.)


సీ. భాను వంశమందు ప్రభుడవై జన్మించి
                         అఖిల విద్యలెల్ల నభ్యసించి
orgvalmikiramayana.blogspot.com సౌజన్యంతో 
     తాటకి మర్దించి తపసి యాగము గాచి
                         శిలను శాపము మాన్పి స్త్రీని జేసి
     శివుని శాపము విరచి సీతను పెండ్లాడి
                         పరశురాముని త్రాణ భంగపరచి
     తండ్రి వాక్యము కొరకు తమ్మునితోగూడి
                         వైదేహి తోడను వనము కరగి

    ఖర దూషణాదుల ఖండించి రాక్షస
                        మారీచ మృగముల మడియ జేసి
     లంకకు రాజైన రావణాసురుడొచ్చి
                        సతిని గొని పోవంగ సంభ్రముడిగి
     సుగ్రీవు కనుగొని సుముఖుడవై యపుడు
                        వాలిని వధియించి వరుసతోడ
     రాజ్య మాతనికిచ్చి రాజుగా చేబట్టి 
                        కిష్కింధ యేలించి కీర్తి వడసి

గీ.  వాయు సుతు చేత జానకి వార్త దెలిసి తర్లి సేతువు బంధించి త్వరగ దాటి
     రావణానుజ కభయంబు రయము నొసగి ఘోర రణమందు రావణు కూలవేసి
     అతని తమ్ముని రాజుగా నమరజేసి సతిని చేకొని సురలెల్ల సన్నుతింప
     రాజ్యమేలితి పట్టాభి రామువగుచు రామ తారక దశరధ రాజ తనయ..! 

********************************
ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు
చేరి వినవె శౌరి చరితము గౌరీ
సుకుమారి గిరివర కుమారి.. అంటూ సాగే ఈ కీర్తన బాలకాండను వర్ణిస్తుంది.
చేరి వినవె శౌరి, చరితము-గౌరి, సుకుమారి గిరివరకుమారీ
పై లింకులో ఆ కీర్తన పూర్తి పాఠం, అలాగే దాని విశేషాలూ చూడొచ్చు
శ్రీసద్గుణాన్వితా సీతాద్రిసుత వినవే - కౌశేయ, వాసున... ( అయోధ్య కాండ) ఇలా అన్ని కాండలూ వర్ణించబడ్డాయి.)
********************************
ఇక సినిమా పాటల విషయానికొస్తే 'లవకుశ' లో రామాయణ కథ లవకుశులు పాడిన వరుస పాటల్లో రామ కథను వినరయ్యా.. అంటూ బాలకాండ తో మొదలుపెట్టి,  శ్రీ రామ పట్టాభిషేకం వరకూ కనిపిస్తుంది. కొన్ని పాటలు కొసరాజు, సదాశివబ్రహ్మం గార్లు వ్రాసినా రామాయణ కథా గీతాలు మాత్రం సముద్రాల రాఘవాచార్య గారే వ్రాశారు. రామాయణ వర్ణన తో వచ్చిన అన్ని సినిమా పాటల లోనూ ఇవి తలామానికం అనడం లో ఎలాంటి సందేహమూ లేదు. సముద్రాల వారి సాహిత్యం, ఘంటసాల గారి సంగీతం, సుశీల, పి. లీల గార్ల గాత్రం ఈ పాటలను అజరామరం చేశాయి. ఈ లింక్ లో ఆపాటలు చదవొచ్చు.., వినొచ్చు..!!
http://geetalu.blogspot.in/search/label/లవకుశ
ఇవి కాక రాముడి పుట్టుకనొక్కటే వర్ణించే కీర్తన మరొకటి వుంది. అది ప్రయాగ రంగాదాసుగారి కీర్తన. వీరు శ్రీ బాలమురళికృష్ణ తాతగారు. అది ఈ క్రింది లింక్ లో చూడవచ్చు.
రాముడుద్భవించినాడు రఘుకులంబున (గాత్రం: డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ) 
********************************
గుడిలో ప్రసాదం పెట్టేటప్పుడు ఒకసారి జీడిపలుకులు తగుల్తాయి. మరొకసారి ఏలకుల ఘుమ ఘుమలు, మరొక సారి కిస్మిస్ లు, మరొకసారి కమ్మటి నేతి వాసన... ఇలా దేని రుచి దానిదే కదా...!! అన్నిటిలోనూ ప్రసాదపు అసలురుచి అయిన తీపి మారదు. కలకండ ఎంత కొంచం తిన్నా దాని తీయదనంలో ఎటువంటి లోటూ ఉండదుకదా..!! అలాగే రామాయణ మహా కావ్యాన్ని పూర్తిగా చదువలేని వారికి ఈ సంక్షిప్త రామాయణాలు మొత్తం కావ్యాన్ని చదివిన అనుభూతిని కలిగిస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కో రకమైన అందం. ఆ రుచి అనుభవించి తీరవలసిందే..!
తెలుగులో  మరింకేమైనా  సంక్షిప్త రామాయణాలు ఇంకెవరికైనా తెలిస్తే అందరితో పంచుకోవలసినది గా మనవి.
********************************
శ్లో. కూజంతం రామ రామేతి మథురం మథురాక్షరం |
     ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ||
శ్లో. శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
     సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ||
( పైన నేను వాడిన బ్లాగు లింకుల యజమానులకి పేరు పేరునా ధన్యవాదాలు. ఆయా విషయాలమీద వారి వివరణ, దానికి వారు పడ్డ శ్రమ రెండూ మెచ్చుకోదగ్గవే. ..!)

    

 
పూర్తిగా చదవండి...

Sunday, April 1, 2012

మా కాలనీలో శ్రీ రామ నవమి ఉత్సవాలు..మరియు బాలమురళి కృష్ణ కీర్తనలు..!!

మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
గత ఏడాది ఇదే రోజున (శ్రీ రామ నవమి) మా పెదవాల్తేరు స్టేట్ బ్యాంకు కాలనీ వాసులం ఎస్.బీ.ఐ. పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో శ్రీ రామ నవమి ఉత్సవాలు ఘనం గా జరుపుకున్నాం. స్థానిక టి.టి.డి. కళ్యాణ మండపంలో సీతారామ కళ్యాణం శ్రీ పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యం లో జరిగింది.
ఈ కార్యక్రమానికి అంకురార్పణ "శ్రీ రామ కోటిమహా మంత్ర జప యజ్ఞం" తో రెండునెలల క్రితం జరిగింది. ఈ మహా యజ్ఞం లో పాల్గొన దలచిన అందరికీ 'దీక్షా బంధనం' కట్టారు. ఎవరింట్లో వాళ్ళు ఎవరికి వీలైనన్నిసార్లు రామ నామ జపం చేశారు. అలాగే మా కాలనీకే చెందిన శ్రీ కవిరాయని వి. ఎల్. ఎన్. శర్మ గారు వారి ఇంటిని ఈ రెండున్నర నెలలూ ఈ మహత్కార్యానికై ప్రత్యేకించి, హనుమ, లక్ష్మణ, సీతా సమేతంగా వేంచేసిన శ్రీ రామ దివ్య సుందర విగ్రహాల పూజాదికాలూ, వేదపండితుల ఆతిధ్యమూ, దగ్గరుండి చూసుకొన్నారు.
ఆనంద మానంద మాయెనూ.. రామయ్య పెళ్లికొడుకాయెనూ, మన సీతమ్మ పెళ్లి కూతురాయెనూ..!!
అమ్మయ్య.. ఏర్పాట్లు పూర్తికావచ్చాయి..!!
మేం రెడీ..!మొదలు పెట్టొచ్చా ఇంక..!!
తక్కువేమి మనకూ.. రాముండొక్కడుండు వరకూ..!!

శ్రీరామ నవమి రోజు కళ్యాణం అంగరంగ వైభోగంగా జరిగింది. టి.టి.డి. కళ్యాణ మండపం పూర్తిగా నిండిపోయింది. టి టి డి వాళ్ళు ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన 'కోలాటం' చాలా బాగుంది.కళ్యాణానికి ముందు మా శ్రీమతి మాధవి, తన శిష్యులు (మా అమ్మాయి కృష్ణప్రియ కూడా తనవద్దే సంగీతం నేర్చుకొంటోంది) రాముడి మీద కీర్తనలు పాడారు. వాళ్ళ తరువాత నేను కూడా రెండు పాటలు పాడాను.
ఈ లింక్ నొక్కి  'కోలాటం' వీడియో చూడండి

  కళ్యాణం అంతా ముగిసిన తరువాత నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకొన్నాను. ఆమె పేరు సీతా మహా లక్ష్మమ్మ గారు. ఎనభై పైబడ్డ వయసులో రామకోటి వ్రాయడం పూర్తిచేసిన ధన్యాత్మురాలు. లక్ష నామాలు వ్రాయగల పుస్తకాలు ఒక వందకు పైగా వ్రాసారుట. మొత్తంగా వ్రాయటానికి సుమారు10 ఏళ్ళు సమయం పట్టిందిట.  వ్రాయడం పూర్తి చేసి ఏడాది అవుతోందని చెప్పారు. శ్రీ పరిపూర్ణానంద స్వామివారి చేతుల మీదుగా సత్కరించ బడ్డారు. అలాగే దీక్షా కంకణం ధరించి, శ్రీరామ నామ మహా మంత్ర జప యజ్ఞం లో పాలుపంచుకొన్న వారందరికీ జ్ఞాపికలు బహూకరించారు.

ఈ సంవత్సరం కూడా శ్రీ KVLN శర్మ గారి ఆధ్వర్యం లోనే రామ నవమి - వసంత నవరాత్రి ఉత్సవాలు 'నందన' నామ ఉగాది రోజు ప్రారంభమయ్యాయి. రేపు శ్రీరామ కళ్యాణంతో ముగియనున్నాయి. మా కాలనీ లోనే ఉన్నపార్కులో స్వామివారి కల్యాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరొక్కసారి మీ అందరికీ  శ్రీరామ నవమి శుభాకాంక్షలతో....సెలవు.

****************
మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు పాడిన ఈ కీర్తనలు వినండి. 
ఇవి వారి తాతగారైన శ్రీ ప్రయాగ రంగదాసు గారి కృతులు..!!
రామ రామ యనరాదా రఘుపతి రక్షకుడని వినలేదా
*******
 




పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)