మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
గత ఏడాది ఇదే రోజున (శ్రీ రామ నవమి) మా పెదవాల్తేరు స్టేట్ బ్యాంకు కాలనీ వాసులం ఎస్.బీ.ఐ. పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో శ్రీ రామ నవమి ఉత్సవాలు ఘనం గా జరుపుకున్నాం. స్థానిక టి.టి.డి. కళ్యాణ మండపంలో సీతారామ కళ్యాణం శ్రీ పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యం లో జరిగింది.
ఈ కార్యక్రమానికి అంకురార్పణ "శ్రీ రామ కోటిమహా మంత్ర జప యజ్ఞం" తో రెండునెలల క్రితం జరిగింది. ఈ మహా యజ్ఞం లో పాల్గొన దలచిన అందరికీ 'దీక్షా బంధనం' కట్టారు. ఎవరింట్లో వాళ్ళు ఎవరికి వీలైనన్నిసార్లు రామ నామ జపం చేశారు. అలాగే మా కాలనీకే చెందిన శ్రీ కవిరాయని వి. ఎల్. ఎన్. శర్మ గారు వారి ఇంటిని ఈ రెండున్నర నెలలూ ఈ మహత్కార్యానికై ప్రత్యేకించి, హనుమ, లక్ష్మణ, సీతా సమేతంగా వేంచేసిన శ్రీ రామ దివ్య సుందర విగ్రహాల పూజాదికాలూ, వేదపండితుల ఆతిధ్యమూ, దగ్గరుండి చూసుకొన్నారు.
ఆనంద మానంద మాయెనూ.. రామయ్య పెళ్లికొడుకాయెనూ, మన సీతమ్మ పెళ్లి కూతురాయెనూ..!! |
అమ్మయ్య.. ఏర్పాట్లు పూర్తికావచ్చాయి..!! |
మేం రెడీ..!మొదలు పెట్టొచ్చా ఇంక..!! |
తక్కువేమి మనకూ.. రాముండొక్కడుండు వరకూ..!! |
శ్రీరామ నవమి రోజు కళ్యాణం అంగరంగ వైభోగంగా జరిగింది. టి.టి.డి. కళ్యాణ మండపం పూర్తిగా నిండిపోయింది. టి టి డి వాళ్ళు ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన 'కోలాటం' చాలా బాగుంది.కళ్యాణానికి ముందు మా శ్రీమతి మాధవి, తన శిష్యులు (మా అమ్మాయి కృష్ణప్రియ కూడా తనవద్దే సంగీతం నేర్చుకొంటోంది) రాముడి మీద కీర్తనలు పాడారు. వాళ్ళ తరువాత నేను కూడా రెండు పాటలు పాడాను.
ఈ లింక్ నొక్కి 'కోలాటం' వీడియో చూడండి
కళ్యాణం అంతా ముగిసిన తరువాత నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకొన్నాను. ఆమె పేరు సీతా మహా లక్ష్మమ్మ గారు. ఎనభై పైబడ్డ వయసులో రామకోటి వ్రాయడం పూర్తిచేసిన ధన్యాత్మురాలు. లక్ష నామాలు వ్రాయగల పుస్తకాలు ఒక వందకు పైగా వ్రాసారుట. మొత్తంగా వ్రాయటానికి సుమారు10 ఏళ్ళు సమయం పట్టిందిట. వ్రాయడం పూర్తి చేసి ఏడాది అవుతోందని చెప్పారు. శ్రీ పరిపూర్ణానంద స్వామివారి చేతుల మీదుగా సత్కరించ బడ్డారు. అలాగే దీక్షా కంకణం ధరించి, శ్రీరామ నామ మహా మంత్ర జప యజ్ఞం లో పాలుపంచుకొన్న వారందరికీ జ్ఞాపికలు బహూకరించారు.
ఈ సంవత్సరం కూడా శ్రీ KVLN శర్మ గారి ఆధ్వర్యం లోనే రామ నవమి - వసంత నవరాత్రి ఉత్సవాలు 'నందన' నామ ఉగాది రోజు ప్రారంభమయ్యాయి. రేపు శ్రీరామ కళ్యాణంతో ముగియనున్నాయి. మా కాలనీ లోనే ఉన్నపార్కులో స్వామివారి కల్యాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరొక్కసారి మీ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలతో....సెలవు.
****************
మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు పాడిన ఈ కీర్తనలు వినండి.
ఇవి వారి తాతగారైన శ్రీ ప్రయాగ రంగదాసు గారి కృతులు..!!
*******
మీపై సదా రామకృపావర్షం కురియాలని కోరుకుంటున్నాను జైశ్రీరాం
ReplyDeleteదుర్గేశ్వర గారూ,
Deleteధన్యవాదాలు..
అందగాడు రామయ్య... అందాలభామ సీతమ్మ వారి కళ్యాణం ఎన్నిసార్లు చూసినా... ఎందరు చేసినా రంగరంగ వైభోగమే.. చాలా బాగా వ్రాసారు.. రామకోటి వ్రాసిన ఆ మహాతల్లికి శతథా వందనాలు.. చాయాచిత్రాలు బాగున్నాయి.. మీ అందరికీ శ్రీరామానుగ్రహప్రాప్తి కలగాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను.
ReplyDelete