Monday, April 23, 2012

ఈఫిల్ టవర్ డ్రాయింగ్ లు,నిర్మాణం లో ఉన్నప్పుడు తీసిన ఫోటోలూ, విశేషాలు..!

ఈఫిల్ టవర్ డ్రాయింగ్ లు,నిర్మాణం లో ఉన్నప్పుడు తీసిన ఫోటోలూ,  విశేషాలు..!

ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటిగా ప్రసిద్దికెక్కిన ఈఫిల్ టవర్ దాని నిర్మాణ సమయం లోనూ తరువాతా కూడా ఎన్నో విశేషాలను మూట గట్టుకొంది. 
పారిస్ నగరం లో 1889 లో జరిగిన ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎగ్జిబిషన్ కి గుర్తుగా నిలచేటట్టు ఒక కట్టడాన్ని నిర్మించాలని తలపోశారు. పైగా ఫ్రెంచ్ విప్లవం శతాబ్ది ఉత్సవం కూడా తోడయ్యింది. అందువల్ల కట్టబోయే నిర్మాణం  చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. పారిశ్రామిక రంగంలో ఫ్రెంచ్ వారి  ప్రగతిని ప్రతిబింబించేలా ఉండాలనుకొన్నారు. చాలా డిజైన్లు పరిగణనలోకి వచ్చినా చివరకు ఇప్పటి ఈఫిల్ టవర్ కు ఆమోదం లభించింది. అప్పటికే ఉక్కు నిర్మాణాలను కట్టడం లో పేరుకెక్కిన Gustave Eiffel పారిస్ కు మాత్రమే కాక ఫ్రాన్స్ యావత్తూ తలమానికంగా భావించబోయే ఈ టవర్ నిర్మాణాన్ని చేపట్టాడు. ఈ కట్టడం వల్ల రాబోయే లాభ నష్టాలన్నిటికీ బాధ్యత వహించి మరీ రంగం లోకి దిగాడు. ప్రభుత్వం వారు అతనికి ఇవ్వబోయేది కేవలం కావలసిన భూమి, మరియు మొత్తం ఖర్చులో పదోవంతూ మాత్రమే. ప్రతిఫలంగా 20 ఏళ్ళ పాటూ ఆ కట్టడం మీద వచ్చే ఆదాయాన్ని, Eiffel అనుభవించవచ్చు. 20  ఏళ్ళ తరువాత మాత్రం ఈ కట్టడాన్ని కూల్చేసి భూమిని ప్రభుత్వపరం చేసెయ్యాలి. ఒప్పందం ఇంత కఠినంగా ఉన్నా తన డిజైను మీద నమ్మకంతో ముందుకే వెళ్ళాడు Eiffel. మొత్తం నిర్మాణాన్ని రెండేళ్ళ పైన రెండు నెలలలో పూర్తి చేసాడు.

వికీ పీడియా సౌజన్యంతో 


Washington Monument
టవర్ కి సంబంధించిన డిజైన్లు 1884 లోనే పూర్తిపోయినా అది అందరి ఆమోదం పొందడానికి గానూ Eiffel  ఎంతగానో కష్టపడవలసి వచ్చింది. 324 మీటర్ల ఎత్తైన ఈ టవర్ అప్పటివరకూ ఎత్తైన టవర్ గా పేరుపొందిన Washington Monument (ఈ మానవనిర్మిత రాతి కట్టడం ఎత్తు 169 మీటర్లు..అంటే ఈఫిల్ టవర్ కట్టబోయే ఎత్తులో సగం మాత్రమే..!! వివిధ కారణాలవల్ల ఇది పూర్తవడానికి 35 ఏళ్ళకు పైగా సమయం పట్టింది. దానిలో 23  ఏళ్ళ పాటూ పని నిలిపివేశారు.) రికార్డును అధిగమించడమే  కాకుండా తన రికార్డును మరో 41  ఏళ్ల పాటూ  పదిలంగా ఉంచుకుంది. ఈఫిల్ టవర్ ని అదే షేపులో రాతితో కట్టి ఉంటే దానిబరువుకు అదే కుప్పకూలి ఉండేది...! అందుకే Wrought Iron ని వాడి దాని బరువుని పదివేల టన్నులకే(!!) పరిమితం చేసారు. 
ఈఫిల్ టవర్ నిర్మాణం లో ఉన్నప్పుడు తీసిన ఫోటోలూ, డ్రాయింగ్ లు కొన్ని  ఈ స్లైడ్ షో లో చూడండి.


టవర్ మొదటి అంతస్తు లోని రెస్టారెంట్
అయితే ఈఫిల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకించిన వాళ్ళూ లేకపోలేదు.కట్టడం  పూర్తయిన  తరువాత మాత్రం  మనసు  మార్చుకొని  అనుకూల  వర్గం  లో  చేరిన  వాళ్ళే  ఎక్కువ. అయితే మొదటినుంచీ వ్యతిరేకిస్తూ వచ్చిన ఒక పేరు మోసిన ఇంజినీరు మాత్రం ఈఫిల్ టవర్ లో ఉన్న రెస్టారెంటుకే వచ్చి రోజూ భోంచేసే వాడట. అదేమిటని కారణం అడిగిన వాళ్లకి " ఛిఛీ.. ఈ దరిద్రాన్ని భోజనం చేస్తూ కూడా చూడాలా..కానీ పారిసు నగరం మొత్తం మీద ఈ టవరు కనబడని చోటు ఇదొక్కటే మిగిలింద"నే వాడట..!!  
ఎడమ నుంచి కుడికి ఆల్వా ఎడిసన్, ఈఫిల్ గారి కూతురు, ఈఫిల్
తనపేరు మీదుగా కట్టిన టవర్ లో పై అంతస్తులో ఒకచిన్న కాబిన్ కట్టుకోవడానికి అనుమతి సంపాదించిన ఈఫిల్, టవర్ సందర్శించడానికి వచ్చే ప్రముఖులతో ఇష్టా గోష్టి జరిపేవాడట. అక్కడ ప్రముఖ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ తో ఈఫిల్ కలిసిన సన్నివేశాన్ని మైనపు బొమ్మలతో పునర్నిర్మించి ఇప్పటికీ సజీవం గా ఉంచారు.



పైన కనిపిస్తున్నది ఈఫిల్ టవర్ వెస్ట్ పిల్లర్. ఈ పిల్లర్స్ నాలుగూ తూర్పు,పడమర ఉత్తర దక్షిణ దిశలను చూస్తూ ఉంటాయి. So the sides of Eiffel Tower are ORIENTED at an angle of 45 degrees to true north.
 
ఈఫిల్ టవర్ ని పారిస్ లోని వీధి చిత్రకారులు రకరకాలుగా గీసి అమ్ముతూ ఉంటారు. అవి చూడండి.
 
ఈఫిల్ టవర్ రెండవ అంతస్తులోని వ్యుయింగ్ డెక్ చుట్టూ టవర్ నుంచి ప్రపంచం లోని వివిధ ప్రధాన నగరాలకు గల దూరాన్ని సూచిస్తూ బానర్ పెట్టారు. సహజం గానే  ప్రతీ సందర్శకుడికీ ఇది చాలా ఆసక్తికరంగా మారింది. నేనుకూడా మన దేశం లోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, హైదరాబాద్ మొదలైన ఊర్లు కనబడేటట్లు ఫోటోలు తీశాను.


మా టిక్కెట్టు... చిట్టచివరి అంతస్తుకు వెళ్ళడానికి..
రెండేళ్ళ నిర్మాణ కాలంలో ఒకే ఒక్క వ్యక్తి మృత్యువాత  పడ్డాడట..! అలాగే తాను తయారుచేసిన పారాశూట్ ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించబోయి ఆస్ట్రియా దేశస్తుడైన ఒక టైలర్ మొదటి అంతస్తు (సుమారు 60మీటర్ల ఎత్తు)నుంచి కిందకు దూకాడు. పారాశూట్ తెరుచుకోకపోవడంతో నేలకి గుద్దుకొని చనిపోయాడు. శవపరీక్ష చేస్తే తెలినదేమంటే నేలని తాకక ముందే అతని ప్రాణాలు గాల్లో కలసిపోయాయట..!! ఆ వీడియో  ఇక్కడ చూడండి..

ఇంకో చిత్రమైన సంగతి.. ఈఫిల్ టవర్ పాత ఇనప తుక్కు సామాన్లు కొనే వాళ్లకి అమ్ముడుపోయింది. ఆశ్చర్యకరంగా నెల  వ్యవధిలో రెండుసార్లు..!! విక్టర్ లస్టిగ్(Victor Lustig ) అనే ఘరానా మోసగాడు 1925 లో మొదటిసారి విజయవంతంగా అమ్మేసి డబ్బులు పట్టుకొని ఉడాయించాడు. నెలరోజుల్లోపే మళ్ళీ పారిస్ కి వచ్చి మరోసారి అమ్మబోయే టప్పుడు అనూహ్యం గా పట్టుబడ్డాడు. 
 
పారిస్ వాసులు 'ఐరన్ లేడీ' అని ముద్దుగా పిలుచుకొనే ఈఫిల్ టవర్ కట్టినప్పటినుండీ ఎందరో ఔత్సాహికులకి సెంటర్ అఫ్ అట్రాక్షన్ అయి ఇప్పటికీ చాలా మంది సందర్శకులకి చూడగానే సంభ్రమం కలిగిస్తూ.. మరో రెండేళ్లలో 125 వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. 
(కొంత సమాచారం వికి పీడియా సౌజన్యం తో) 
Updated on Mr. SNKR's Comment 





6 comments:

  1. !! రాధేశ్యాం !!గారు చాలా మంచి విషయం తెలియపరచినారు మీకు చాలా చాలా ధన్యవాదములు

    ReplyDelete
  2. ఈఫిల్ టవర్ కట్టడం పూర్తి అయిన సంవత్సరం పొరపాటుగా 1989 అని వ్రాసాను. నిజానికి అది 1889 వ సంవత్సరం. పొరపాటు సరిదిద్దాను.

    ఈ పోస్టు ఇప్పటికి 200 మందికి పైగా చూసారు. కానీ ఒక్కరి కంట కూడా పడకపోవడం విశేషం. లేదా చూసి కూడా ఊరుకున్నారో..!! :)

    ReplyDelete
  3. dear Radheshyam garu, wonderful research. kudos to you. i am sorry i was not knowing how to use telugu script here and so i am writing this in english. please forgive me. I hope you will continue enlighten us all with more revelations of this kind. any information of how taj mahal was contructed? any pics?

    ReplyDelete
  4. సార్..! నమస్కారం..! నా బ్లాగులోకి మీకు సుస్వాగతం.
    తాజ్ మహల్ గురించి కూడా నా దగ్గర కొంత సమాచారం ఉండాలి. వీలుని బట్టీ త్వరలో అప్లోడ్ చేస్తాను. మీనుంచి ఇలాగే మరిన్ని సలహాలూ సూచనలూ ఆశిస్తూ..
    ధన్యవాదాలతో..
    రాధేశ్యామ్

    ReplyDelete
  5. /So the sides of Eiffel Tower are tilted at an angle of 45 degrees to true north./

    అన్ని పక్కలా ఉత్తరదృవం దిశగా 45 డిగ్రీలు ఒరిగిందా!!! నాలుగువైపులా ఒకే దిశగా ఒరిగితే అది ఈపాటికి నేలనంటి వుండాల్సింది కాదా?! ఓసారి సరి సరిచూసుకో గలరు.

    ReplyDelete
  6. @SNKR:
    సరిచేసాను గమనించండి.
    ధన్యవాదాలు.
    //ఓసారి సరి సరిచూసుకో గలరు// :))

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)