Saturday, May 5, 2012

ఊరు పేర్లతో తమాషా వాక్యాలు..!!

రేడియో అన్నయ్య గా పేరుకెక్కిన న్యాయపతి రాఘవరావుగారు ’బాల’ అనే పిల్లల మాస పత్రిక నడిపేవారు. దానిలో కొన్నిశీర్షికలు తమాషాగా ఉండేవి. దానిలో ఒకటి ఈ క్రింద వ్రాయబోయేది.
ఏదో ఒక వాక్యం ఇచ్చి దానిలో దాగి ఉన్న ఊరుపేరు చెప్పాలి.
ఉదా.              భోజన భీమ..! డోలు వాయించక..!!                             భీమడోలు
           హాత్ కాకి..! నా డబ్బా ఎత్తుకుపోయింది.                       కాకినాడ
ఇవి రెండూ చిన్నప్పుడు ’బాల’ లోనే చదివాను. మిగతావి ఏవీ గుర్తులేవు. పోనీ కొత్తగా ఏవైనా పుట్టిద్దామని కొంచం ప్రయత్నిస్తే ఈ క్రింది వాక్యాలు వచ్చాయి:
 • కడపటి వార్తలందే సమయానికి ఇండియా స్కోరు మూడువందలు దాటింది..!            
 • ఏదీ..! అమలా…!! పురందర దాసు కీర్తన ఒకటి పాడు..!!!                                  
 • నేను చెప్పిన మాట విను..! కొండమీదకు నడిచి వెళ్ళి మొక్కు చెల్లించుకో..!             
 • భలేవాడివి హనుమ..! కొండ మీద మూలికలు తెమ్మంటే కొండనే మోసుకొచ్చేశావే..!       
 • మాన్యం లెక్క చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మింగెయ్యడానికి ఈ దేవుడి గుడి వాడబ్బసొమ్మేం కాదు..!
 • పార్వతి, పురంధేశ్వరి ఒకే ఈడు వాళ్ళు.                                                         
 • శమంతకమణి ఆమెతండ్రికి సూర్యుడిచ్చిన వరం..! గల్ గల్  మంటూ అదెక్కడుంటే అక్కడ ధనలక్ష్మి నాట్యమాడుతోంది.
 • నీకు ఏది కావాలో అది మదిలో కోరు..! కొండ మీద వెలసిన అమ్మోరి మీద భారం వదులు..!! 
 • వినాయక చవితి రోజున గరిక (గడ్డి) తో చేసే పూజ కి చాలా ప్రాశస్త్యం ఉంది. 
 • శ్రీశైల పుణ్య క్షేత్రంలో జరిగే అన్ని ఉత్సవాలు  అక్కడి చెంచులకు చాలా ప్రత్యేకం. అందుకని గిరి పుత్ర్రులు వారి సంప్రదాయ నృత్యాలతో స్వామిని సేవిస్తారు. 
 • ఆ గ్రామంలో గట్టిగా ఇరవై గడపలు కూడా లేవు.                                              
 • అరిగిపోయిన రికార్డులా హోరు పెట్టేబదులూ చెప్పదలచుకున్నదేదో సూటిగా చెప్పరాదూ..!! 
 • Elephant’s Husband City (ఇది మా అమ్మగారు చెప్పారు) జవాబు: గజపతినగరం 
 పై వాక్యాలలో ఊరుపేర్లు చెప్పుకోవాలి. చాలా సులువుగా చెప్పెయ్యగలరు. జవాబులు వేరేగా వ్రాయవలసిన  అవసరం ఉందనుకోను. ఎవరికైనా తెలియకపోతే అప్పుడు చెప్తాను. 

12 comments:

 1. హాయ్ హాయ్ నాకు భలే నచ్చేసింది! చాలా బాగున్నాయండీ! ఆ పత్రిక గురించి వినడం ఇదే మొదలు! ఇహ మీ ప్రయత్నం చాలా బాగుంది!

  ReplyDelete
  Replies
  1. రసజ్ఞ గారూ,
   మీరు బాల పత్రిక గురించి వినలేదా..! చంపేసారండీ..! చిన్నప్పుడు మేం తెగ పిచ్చిగా చదివేవాళ్ళం. చందమామ కన్నా ముందర మొదలెట్టిన పత్రిక. బాపు, వడ్డాది పాపయ్య గార్లు మొదటి బొమ్మలు దానిలోనే వేసేవారు.
   రచన శాయి గారు పాత సంచికల లోంచీ కొన్ని సెలెక్టు చేసి నాలుగు పుస్తకాల సెట్ గా రిలీజ్ చేసారు. ఆయన వద్ద ఇప్పటికీ కాపీలు ఇంకా ఉన్నాయి.
   బాలజ్యోతి, బాలమిత్ర, బాలభారతి, ఈపేర్లన్నిటికీ మాతృక అదేనేమో..!!

   Delete
  2. చిన్నప్పుడు బాల లోనే చదివిన ఒక నాటకం స్నేహితులతో కలసి వేసాం. ఆ అనుభవాలు వ్రాసాను. చదవండి..!
   http://radhemadhavi.blogspot.in/2011/04/blog-post.html
   మీ స్పందనకి థాంక్స్..!

   Delete
 2. వెలమకన్ని ఒంటేలుSunday, May 06, 2012 3:24:00 PM

  కడప
  అమలాపురం
  హనుమకొండ
  గుడివాడ
  పార్వతీపురం
  వరంగల్‌
  కోరుకొండ
  నగరి
  కనిగిరి
  వైగడప
  లాహోరు

  ReplyDelete
  Replies
  1. వైగడప అనే ఊరు నిజంగా ఉందా.. మీ ఊహ మాత్రమేనా..!
   ఆవాక్యంలో ఉన్నది ’ఆగ్రా’ అండీ..!

   Delete
 3. వెలమకన్ని ఒంటేలుSunday, May 06, 2012 3:38:00 PM

  ఒకటి తప్పయింది. మిహతావన్నీ కరెక్టేకదా

  ReplyDelete
 4. అన్నీ ఖర్రెక్ట్ సార్..! నూటికి తొంభై తొమ్మిది మార్కులు..!
  ధన్యవాదాలు.

  ReplyDelete
 5. మీరు వ్రాసిన ఊరిపేర్ల వాఖ్యాలు చాలా సరదాగావున్నాయి. అవును మా చిన్నతనంలో బాలలో ఇలాటి గమ్మత్తులెన్నో వుండేవి.
  బాపుగారు , రమణగారు వారి బొమ్మలు, రచనలు "బాల" తోనే 1945 లో ప్రారంభించారు. వపాగారి బొమ్మతో "లటుకు-చిటుకు"
  శీర్షిక భలే సరదాగావుండేది. రచన శాయిగారి పుణ్యమా అని ఆనాటి "బాల" ను మరోసారి చూసి చదువుకొనే భాగ్యం కలిగింది.

  ReplyDelete
 6. THANKS.. మీరెన్ని ఊహించగలిగారు..??

  ReplyDelete

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)