Showing posts with label పుస్తకాలు. Show all posts
Showing posts with label పుస్తకాలు. Show all posts

Sunday, January 27, 2013

'మిత్రనీతి' శతకము - 1934 లో వచ్చిన పుస్తకం (పీడీఎఫ్ రూపంలో)

దీని ముందు వ్రాసిన  'మిత్రనీతి' శతకము - 1934 లో వచ్చిన పుస్తకం  పోస్టు  చదివి, ఇది చదువగలరు.
ఆ పోస్టులో పరిచయం చేసుకున్న పుస్తకం ఈ పోస్టులో డౌన్లోడ్ చేసుకోండి.
ఒరిజినల్ పీడీఎఫ్ రూపం లో ఇక్కడ. మెరుగుపరచిన ప్రతి  ఇక్కడ  (శ్యామ్ నారాయణ్ గారి సౌజన్యం)  
ఫోటోల రూపం లో ఈ క్రింద:











 








మీకందరికీ ఈ పుస్తకం నచ్చుతుందని ఆశిస్తూ...
సెలవు. 
పూర్తిగా చదవండి...

'మిత్రనీతి' శతకము - 1934 లో వచ్చిన పుస్తకం

                మన తెలుగు సాహిత్యంలో శతకాలకి ఉన్నస్థానం మిత్రులకు తెలియంది కాదు. ఏదైనా ఒక మకుటము తో అంతమవుతూ వంద పద్యాలకు పైబడిన సాహిత్య విశేషాన్ని శతకమంటారు. సాధారణంగా శతకాలు వాటి మకుటాల తోనే పిలవబడి ప్రాచుర్యం పొందుతాయి. మనకు బాగా తెలిసిన శతకాలలో కృష్ణ శతకము, దాశరధీ శతకము మొదలైనవి భక్తితత్వాన్ని ప్రబోధిస్తే, సుమతీ, కుమారి, వేమన శతకములు మొదలైనవి చాలా సరళమైన భాషతో నీతిని ప్రబోధించే సామాజిక బాధ్యతను తలకెత్తుకొని, పండిత పామర జన రంజకంగా ఉండి జనుల నాలుకలపై తరతరాల పాటు నిలిచి ఉన్నాయి. ఇప్పుడు మనం పరిచయం చేసుకోబోతున్న పద్య శతకం కూడా ఈ రెండో కోవకే చెందుతుంది...!   
            మిత్రనీతి అనే ఈ చిన్ని పుస్తకం మన తెలుగు భాషలో మరుగున పడిపోయిన మరొక మంచి పద్యశతకము. "మిత్ర..!" అనే మకుటంతో ఈ శతకాన్ని వ్రాసినది శ్రీ  కొసరాజు రాఘవయ్య చౌదరి గారు (అప్పికట్ల, బాపట్ల తాలూకా,గుంటూరు జిల్లా). కాక్స్టన్ ప్రెస్, మద్రాసువారు 1934 లో ముద్రించబడిన ఈ పుస్తకానికి శ్రీ మునిమాణిక్యం నరసింహారావు(BA, Lit., మచిలీపట్నం) గారు పరిచయ వాక్యాలు వ్రాశారు. ప్రతీ పద్యం ఒక్కొక్క ఆణిముత్యం. నీతి వాక్యాలూ, సామెతలూ పెనవేసి పద్యాలను వ్రాశారు  శతక కర్త. బాల బాలికలకే కాకుండా పెద్దవారికి కూడా ప్రబోధాత్మకంగా ఉండే ఈ పుస్తకం ఇన్నిరోజులు తన వద్ద భద్రం గా దాచుకొని మన ముందుకు తెచ్చిన మా పెదనాన్నగారు శ్రీ రుద్రావఝల రామకృష్ణారావు గారు (ఆర్ ఆర్ కే రావు) ఈ పుస్తకాన్ని తనకు వచ్చిన అపూర్వ కానుక అంటారు. ఎందుకో వారి మాటల్లోనే :

 ************

                దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన క్రొత్త రోజులు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ ఒక ఉద్యమం లాగా నిష్ఠతో నిర్విరామంగా బాల బాలికలకూ, సంఘానికీ సేవ చేసేది. ప్రతీవారూ పాపభీతితో దైవభక్తితో  దేశభక్తి తో  న్యాయం, ధర్మం ఆలోచించి కష్టించి పనిచేసి వారివారి వృత్తులలో శాఖలలో ఎనలేని ఖ్యాతి గడించి,వారి ఆచరణ వాళ్ళ పైవారికి ప్రేరణగా వుండేవారు. ఈ రోజుల్లోలా లంచాలూ స్కాములు అంటే ఏమిటో తెలియని సత్యకాలపు మనుషులు. 

                విజయనగరంలో మావీధిలో ఒక స్కౌట్ ట్రూప్ ఉండేది. మేము కూడా స్కౌట్ గ్రూప్ కి వెళ్లి, ఫస్ట్ ఎయిడ్, సోషల్ సర్వీసు వంటి కార్యక్రమాలలో స్కూల్ సెలవురోజుల్లో ఉత్సాహం గా పని చేసేవాళ్ళం. మా వీధి స్కౌట్ టీచర్స్ ప్రతీ నేలా ఒక ప్రముఖ వ్యక్తిని పిలిచి, ఆయన చేత బాలబాలికలకు స్ఫూర్తిదాయకంగా ఏదైనా అంశం మీద ఉపన్యాసం ఇప్పించేవారు. తద్వారా చిన్ననాడే లబ్ధ ప్రతిష్టులైన ప్రముఖుల భావాలు కొంతవరకు ఆకళింపు చేసుకొనే అవకాశం కలిగేది.

                నెలవారీ కార్యక్రమాలలో భాగంగా ఇతర స్కౌట్ ట్రూప్స్ తో కలిపి పిల్లల మధ్య వకృత్వం, వ్యాసరచన లాంటి పోటీలు నిర్వహించేవారు. న్యాయ నిర్ణేతలుగా అప్పటి ప్రముఖులూ, విద్యావేత్తలూ  వచ్చేవారు. వారిలో  మేజిస్ట్రేట్, కాలేజీ ప్రిన్సిపాల్  మొదలైన వారు ఉండేవారు. డిబేట్  పోటీలో పిల్లల భావాలూ, భాష, నిర్భయంగా మనసులో మాట  స్పష్టంగా చెప్పడం మొదలైన అంశాల ఆధారంగా మూల్యాంకనం చేసి బహుమతులు ప్రకటించేవారు. 

                ఇలా ఒకసారి నేను IV ఫారం చదువుతున్న రోజుల్లో (అంటే సుమారు అరవై ఏళ్ళ క్రితం సంగతి), నేను కూడా వకృత్వ పోటీలో పాలుపంచుకున్నాను. పోటీదారు లందరిలోనూ నేనే చిన్నవాడిని. ఆ రోజుల్లో వయో వర్గీకరణ కూడా ఉండేది కాదు. మాకు ఇచ్చిన విషయం మీద నాకు తెలిసినంతలో నిర్భయంగా, తడుముకోకుండా, సూటిగా చెప్పాను. అందరిలో మాట్లాడాలంటే  నాకు జంకు లేకపోగా  ఉత్సాహంగా చెప్పాను. ప్రేక్షకులు చాలా మెచ్చుకున్నారు.

                ఆఖర్న జడ్జి గారు తమ వెలువరిస్తూ  ప్రకటిస్తూ నాకు మూడో బహుమతి ప్రకటించారు. ఆపోతీలో నాకు వచ్చిన బహుమతి బొబ్బిలి యుద్ధం నాటకం. వెంటనే ఒక కాలేజీ విద్యార్ధి లేచి ప్రథమ బహుమతి వచ్చిన వ్యక్తికన్నాఈ కుర్రవాడే బాగా చెప్పాడనీ, వయసులో చిన్నవాడైనా ఎంతో పరిణతి కనబరచాడనీ, ప్రథమ బహుమతికి అన్ని విధాలా అర్హుడనీ, ఇతనికి ప్రథమ బహుమతి  ఇవ్వడం సబబు గా ఉంటుందనీ నిర్ణయం మార్చమనీ ప్రతిపాదించాడు...! నిర్వాహకులు బహుమతి ప్రదానం జరిగిపోయినందువల్ల నిర్ణయం మార్చడం కుదరదనే సరికి, అదే క్షణంలో ఆ కాలేజీ విద్యార్ధి తన చేతిలో ఉన్న 'మిత్ర నీతి ' అనే నీతి శతక పుస్తకాన్ని నాకు బహుమతిగా తన తరఫున ఇచ్చాడు. ఆపుస్తకం మీద ఉన్న తన పేరు కొట్టివేసి, "   Book presented to R. Rama Krishna Rao of Kothapeta - VZM" అని వ్రాసి అదే వేదికమీద అందరి సమక్షం లో ఇచ్చాడు. 

                అప్పుడు న్యాయ నిర్ణేత లేచి ప్రసంగిస్తూ  తను మూడవ బహుమతి ప్రకటించిన కుర్రవాడు మొదటి బహుమతికి అర్హుడని సభికులు, శ్రోతలూ భావించి తన నిర్ణయాన్ని మార్చమని ప్రతిపాదించడం తనకు ఆనందం కలిగించిందనీ, నిజానికి ఆ పని తాను  మొదటే చేసి వుంటే  అది పక్షపాత వైఖరితో కూడుకున్నదని అనేవారేమోనని, కారణం ఆ కుర్రవాడు తన కుమారుడనీ, ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. 



కీ. శే. శ్రీ రుద్రావఝల నరసింహ మూర్తిగారు  
                అవును..!! ఆరోజు న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది మా నాన్నగారే..(కీ. శే. శ్రీ రుద్రావఝల నరసింహ మూర్తిగారు) !! వారు ఆరోజు వస్తారని నాకూ తెలియదు, నేను పాల్గొంటున్నాననే సంగతి వారికీ తెలియదు.  కాలేజి విద్యార్ధి ఇచ్చిన ఆపుస్తకం నాకు అపూర్వంగా అనిపించి ఇన్నాళ్ళూ భద్రంగా ఉంచుకున్నాను. అరవై ఏళ్ళు అయినా ఇప్పటికీ ఈ పుస్తకం లోని నీతి  పద్యాలని వల్లె వేసుకుంటూ ఉంటాను. నేటి విద్యా విధానంలో నీతి, ఆధ్యాత్మిక అంశాలూ చాలా వరకూ తక్కువైపోతుండడం తో విద్యార్ధులు భౌతికమైన విషయాలలో అభివృద్ధి చెందుతున్నా నైతికత విషయంలో వెనుకబడి పోతున్నారు. సరళ భాషలో  వ్రాయబడిన ఇలాంటి పుస్తకాలు ఇప్పటి తరానికి ఎంతైనా అవసరం. ప్రచారం కల్పించడం మన కర్తవ్యం.   
- రుద్రావఝల రామకృష్ణారావు, Block No.39 -A(BSP), Ruabanda Sector, భిలాయి - 6 
సెల్: 07587046455
వీరిదే ఇంకో చిత్రమైన రచనను ఇక్కడ చూడండి
 ************
                మిత్రనీతి  పుస్తకం వెల  అప్పట్లో రెండున్నర అణాలు. వేమన శతకం, సుమతీ శతకాలవలెనే  తేలికైన భాషలో వ్రాయబడింది. ఈ పుస్తకం ఇప్పుడు ఎక్కడా దొరకక పోవచ్చు. ఆరోజుల్లో ఈపుస్తకం మీద అభిప్రాయాలు వ్రాసిన వారిలో విద్వాన్  మోటుపల్లి రామానుజరావు, MA (సీనియర్ లెక్చరర్, పచ్చియప్ప కాలేజీ, మద్రాసు) గారితోపాటూ మద్రాసు, తిరుత్తని, చిత్తూరుల నుంచి కూడా ప్రముఖుల, విద్యావేత్తల అభిప్రాయాలు ఉన్నవి.
               
                ఆ పుస్తకం నుంచీ మచ్చుకి కొన్ని పద్యాలు:
                                ఆత్మదేశమందు అభిమానమేలేని 
                                                పురుషు డే జగాన పుట్టనేమి..?
                                గిట్టనేమి? యతని పుట్టువు భాగ్యంబు 
                                                అడవి గాయు వెన్నె లౌను మిత్ర..!
                                                        -----------------

                                శాంతముననె కార్య సాధనంబు లభించు
                                                శాంతముననె చాల సౌఖ్య మబ్బు
                                 శాంతమునకునేది సరిరాదు..! శాంతమే 
                                                 భూషణం బటండ్రు బుధులు మిత్ర..! 
                                                         -----------------

                                 చెమటనోడ్చి కష్ట జీవనం బనకుండ 
                                                పవలు రేయి కూడ  పాటు వడుము
                                  సేద్యము ననె సుఖము చేకూరు; గృషి సేయ 
                                                 కరవు కాటకాలు గలవె ? మిత్ర..!
                                                        -----------------

ఈ పుస్తకాన్ని స్కాన్ చేసి మీ అందరికీ  పంచుతాను.            
          
పూర్తిగా చదవండి...

Tuesday, December 4, 2012

ఆ రోజు రాత్రి ఏంజరిగిందంటే - భోపాల్ ఉదంతానికి 28 ఏళ్ళు..!


         
ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే రోజు డిసెంబరు రెండవ తేదీ అర్ధరాత్రి భోపాల్ నగరం నిద్రలో ఉన్న సమయం లో మృత్యువు  నిశ్శబ్దంగా అక్కడి పౌరులను శాశ్వత నిద్రలోకి జారేలా చేసింది. కర్మాగారాన్నినెలకొల్పడమే తప్ప విపత్తు నివారణ, ప్రజల భద్రత లాంటి విషయాలన లను గాలికొదిలేసిన యూనియన్ కార్బైడ్ కంపెనీ యాజమాన్యం, ప్రజలను ఎన్నికలలో పనికివచ్చే వనరులుగానే తప్ప మనుష్యులుగా చూడని, మానవత్వం మర్చిపోయిన ఆనాటి అర్జున్ సింగ్ సర్కారూ క్షమించరాని పాపానికి ఒడిగట్టారు. (అంతటి ఆపత్సమయంలో "పరిస్థితి" గురించి వాకబు చేసిన ఆ ముఖ్య మంత్రి, ప్రమాద స్థలంలో ఉన్న 'నగర పోలీస్ కమీషనర్’ ద్వారా ప్రజలు తలోదిక్కుకీ పారిపోతున్నారని తెలుసుకొని, ఆయనతో  "నీకు మతిపోయిందా..!! వారం రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు పారిపోతే మనకి ఓట్లు వెయ్యడానికి ఎవడు మిగుల్తాడు..?? వాళ్ళందరినీ ఇళ్ళల్లో తలుపులేసుకొని కూర్చోమను. కొంపలేం మునగట్లేదని చెప్పు..! వాళ్ళని ఇల్లుదాటి కదలనివ్వకు..!!" అని ఆజ్ఞాపించరట..!!) 
అర్జున్ సింగ్, నాటి ముఖ్యమంత్రి 

వారెన్ ఆండర్సన్
           ఆ ఘోరం జరిగిన రాత్రి మొదలుకొని కేసును నీరుగార్చడానికీ, మనచట్టంలోని లొసుగులని తెలియజెప్పి జరిగిన ఘోరానికి బాధ్యులైన వారిని దేశం దాటించడానికి, ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యధాశక్తి సహకరించాయి. ఆఖరికి నష్టపరిహారానికి కూడా ఆ ఫారిన్ కంపెనీ ముందు సాగిలపడి, ముందు అడిగిన దానికి కాకుండా వన్ టైం సెటిల్మెంట్ పేరుతో నామమాత్రపు సొమ్ముకి ఒప్పేసుకొని,  బాధితులను దారుణంగా మోసపుచ్చి, వారికి మొండిచెయ్యి చూపాయి. 

           యూనియన్ కార్బైడ్ సంస్థకి ప్రపంచ వ్యాప్తంగా పలురంగాలలో వ్యాపారాలు ఉండేవి. భోపాల్ లో వారి కంపెనీలో తయారవుతున్న"సెవిన్" అనే పురుగుమందుకి, ఎరువులకీ కావలసిన 'మిథైల్ ఐసో సైనేట్' (MIC) అనే విషవాయువును మన దేశం లోని బొంబాయి రేవుకి దిగుమతి చేసి, అక్కడి నుంచీ రోడ్డు మార్గం ద్వారా భోపాల్ దాకా తీసుకు వచ్చి ఇక్కడ నిల్వ చేసేవారు. ఇక్కడి డిమాండ్ కి తగ్గట్లు పురుగుమందులు తయారు చేసినన్నాళ్ళూ అవసరానికి కావలసిన పరిమాణంలో మాత్రమే నిల్వచేసేవారు. ఎప్పుడైతే కంపెనీ తమ వ్యాపారాభివృద్ధి పేరుతో ఉత్పత్తిని పెంచాలని నిర్నయించుకొన్నారో అప్పటినుంచీ ప్రమాణాల విశయంలో కంపెనీ పతనం ప్రారంభమైంది.  
           మొదట్లో ఉన్నత స్థాయి ప్రమాణాలతో నెలకొల్పి, నిర్వహణలో శ్రధ్ధ పెట్టిన (ఆ క్రెడిట్ పూర్తిగా అప్పటి సాంకేతిక నిపుణులదే తప్ప యాజమాన్యానిది కాదు) యూనియన్ కార్బైడ్ కంపెనీ, యాజమాన్యం  రానురాను బయటిదేశాల మార్కెట్ నీ, టర్నోవర్ నీ మనదేశపు సేల్స్ తో పోల్చి టార్గెట్ లని అందుకోలేక పోతున్నారనే నెపంతో (నిజానికి మన దేశం లో అప్పటికి వేపపిండి తప్ప రసాయనిక పురుగుమందులు  అంత మార్కెట్ లేదు..!), మేనేజ్ మెంట్ మార్చేశారు. కంపెనీ నెలకొల్పడానికి అహోరాత్రాలూ కష్టపడి పనిచేసిన నిబద్ధత కలిగిన సాంకేతిక నిపుణులని విధుల నుంచీ తప్పించి, ఇలాంటి విషవాయువులతో బొత్తిగా పరిచయం లేని, బ్యాటెరీ రంగం మార్కెటింగ్ లో మంచి ఫలితాలు సాధించిన వారిని తీసుకొచ్చి ఇక్కడి వ్యాపార నిర్వహణ వారి చేతుల్లో పెట్టారు.

           వీరికి కెమికల్స్, అందునా 'మిథైల్ ఐసో సైనేట్' లాంటి ప్రాణాంతక విషవాయువును హ్యాండిల్ చెయ్యడంలో ఉన్న ప్రమాదం గురించి అస్సలు తెలియదు. ఎప్పుడైతే డిమాండ్ ని మించి ఉత్పాదన పెరిగి, తయారైన సరుకు నిల్వ ఉండిపోసాగిందో, సహజమైన మార్కెటింగ్ సూత్రాన్ని పాటించి వారు ఉత్పత్తిని ఆపేశారు. దానితో 'మిథైల్ ఐసో సైనేడ్' వివియోగం ఆగిపోయింది. కంపెనీ వాళ్ళు వారి నష్టాన్ని కేవలం రూపాయలలోనే చూశారుగానీ, MIC నిల్వ చేయడంలో లోపం వల్ల  ఏదైనా ప్రమాదం జరిగితే దానివల్ల జరిగే నష్టం తరతరాల పాటూ మాయని మచ్చగా మిగులుతుందని ఊహించలేదు. MIC టాంకులలోకి చేరే ఎలాంటి మలినమైనా, చివరకు నీళ్ళు అయినా ఎమ్ ఐ సీ తో కలిసినప్పుడు జరిగే ఎక్సోథెర్మిక్ రియాక్షన్ వల్ల జరిగే ప్రమాదానికి ప్రాణాంతకం, భయంకరం లాంటి మాటలు చాలా చిన్నవి. తీరా ప్రమాదం జరిగిపోయిందని అర్ధమయ్యాక నిస్సహాయంగా చచ్చిపోవటమో, ప్రాణాలు అరచేత పెట్టుకొని పారిపోవడమో తప్ప, కనీసం తక్షణ నష్టనివారణకు చేపట్టవలసిన చర్యల గురించి కూడా అవగాహన లేని దిక్కు తోచని స్థితిలోకి కంపెనీ జారిపోయింది.  ఆ నాటి రాత్రి ఆ టాంకులలోకి నీరు చేరి ఏర్పడిన రసాయనిక చర్య మూలంగా విడుదలైన వాయువుల సాంద్రత ఎక్కువ అవటం చేత నేలకి దగ్గరగా చాలా తక్కువ ఎత్తులో కదిలే మేఘం లాగా అవి ప్రయాణించి, తమ మార్గంలోకి వచ్చిన ప్రతి ప్రాణినీ అత్యంత కిరాతకంగా హతమార్చాయి. 
ఆ నాటి పొరపాట్లకు, నిర్లక్ష్యానికీ మౌన సాక్షి.. యూనియన్ కార్బైడ్ ఇండియా , ప్రమాదం తరువాత..!
           ఇక్కడ తయారవుతున్న MIC ప్రపంచం లోనే అత్యంతప్రమాదకరమైన విషవాయువనీ, ప్రమాదం జరిగితే తీసుకోవలసిన చర్యల గురించి గానీ, బాధితులకు అందించ వలసిన వైద్యం గురించి కానీ, అక్కడి యంత్రాంగానికి ఎలాంటి సమాచారమూ లేదు. పైగా అది కంపెనీ పెట్టిన ఆరేళ్ళ వరకూ అంటే దాని ఉత్పత్తి భోపాల్ లోనే మొదలయ్యేవరకూ దానిని రోడ్డు మార్గం ద్వారా రెండు రాష్ట్రాలు దాటించి రహస్యంగా ఎలాంటి భద్రతలూ లేకుండా తెచ్చేవారనే విషయం బయటకు పొక్కనీయ లేదు. వారన్ ఆండర్సన్ లాంటి విదేశీ కంపెనీ యజమానుల దురాశా, సాంకేతికత తెలియని మేనేజర్ల పొదుపు చర్యలూ, ఫ్యాక్టరీ నెలకొల్పటానికి అనుమతుల కోసం పెట్టుకున్న దరఖాస్తులలోనూ, దరిమిలా జరిపిన కాలుష్య పరీక్షల ఫలితాలనూ తొక్కిపెట్టిన రహస్యాలూ, మానవ తప్పిదాలూ, నిర్లక్ష్యం, కొన్నితరాలకు చెందిన భోపాల్ నగర వాసుల జీవితాలలో ఒక భయంకరమైన పీడకలను మిగిల్చాయి. విచారకరమైన విషయం ఏమిటంటే, అంత భయంకరమైన అనుభవం చవి చూసి కూడా దాని నుంచీ పాఠాలు నేర్చుకోక పోవడం..! 

           డొమినిక్ లాపెయిర్, జేవియర్ మొరో ఫ్రెంచ్ లోనూ ఆంగ్లం (It was Five Past Midnight in Bhopal) లోనూ  వ్రాసిన ఈ పుస్తకానికి ’కస్తూరి’ గారి స్వేచ్చానువాదం ఆనాటి భోపాల్ ఉదంతాన్ని కళ్ళకు కట్టిస్తుంది. ఆనాటి రాత్రి జరిగిన సంఘటనకు పూర్వాపరాలు ఈ పుస్తకంలో చాలా విపులంగా సవివరంగా చర్చించబడ్డాయి. కేవలం ప్రమాదాన్నే కాక అక్కడ నివసించిన, ఎన్నో ఆశలతో ఆ ఫ్యాక్టరీ లో పనిచేయడానికి దూరప్రాంతాలనుంచీ వలస వచ్చిన వ్యక్తుల జీవితాల చిత్రణ, వారి ఎన్నో కలలు కన్న వారి జీవితాలకు ఆనాటి రాత్రి వ్రాసిన మరణ శాసనం, చదివిన ప్రతి పాఠకుడి హృదయాన్నీ కదిలిస్తుందనటంలో సందేహం లేదు. కొన్ని కొన్ని చోట్ల కళ్ళు  చెమ్మర్చక మానవు.
ఈ క్రింది లింక్ లో ఆ పుస్తకాన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆనాటి బాధిత కుటుంబాలకు ఇదేనా అశ్రు నివాళి.
ఈ పుస్తకాన్ని నేను చదివి మూడు నాలుగేళ్ళ పైనే అయింది. గుర్తున్నమేర  వివరాలు మీ ముందుంచాను. ఏవైనా తప్పులుంటే మన్నించ గలరు.

మరిన్ని ఫోటోలు ఈ క్రింది లింక్ లో : యాహు .కామ్  సౌజన్యంతో  
http://in.news.yahoo.com/photos/bhopal-tragedy-aftermath-slideshow/bhopal-tragedy-aftermath-photo-1350977517.html
పూర్తిగా చదవండి...

Thursday, February 9, 2012

ఈ మధ్య నేను చదివిన / చదువుతున్న పుస్తకాలు..

నా పుస్తకాల అలమర 
మధ్య నేను చదివిన / చదువుతున్న పుస్తకాలు

చదవటం పూర్తిచేసినవి :
  1. పండిత పరమేశ్వర శాస్త్రి గారి వీలునామా - గోపీచంద్
  2. క్లియోపాత్రా - ధనికొండ హనుమంతరావు
  3. పర్వ - ఎస్ ఎల్ భైరప్పగారి కన్నడ పుస్తకానికి అనువాదం
  4. వేయిపడగలు - విశ్వనాథ సత్యనారాయణ
  5. కౌంట్ అఫ్ మాంట్ క్రిస్టో - అనువాదం: సూరంపూడి సీతారాం 
  6. బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర - శ్రీరాం వి.
  7. ముక్కోతి కొమ్మచ్చి (ఒకటి, రెండు భాగాలు కూడా చదివేసాను) - ముళ్ళపూడి వెంకట రమణ
  8. The Alchemist - Paulo Coelho
  9. పరుసవేది - పై పుస్తకానికి తెలుగు అనువాదం
  10. హంస గీతం : చారిత్రక నవల - వివిన మూర్తి 
చదవటం మొదలుపెట్టి కొనసాగుతూ వున్నవి :
  1. భగవాన్ శ్రీ రమణ మహర్షి - చిక్కాల కృష్ణారావు
  2. శ్రీపాద రామాయణం - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
  3. అనుభవాలూ - జ్ఞాపకాలూనూ - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
  4. వంశీకి నచ్చిన కథలు - వంశీ
  5. వంశీ వెండితెర నవలలు : శంకరాభరణం, సీతాకోక చిలక, అన్వేషణ, శుభోయం కలిపి మొత్తం నాలుగు

  6. మహోన్నత మానవుడు - రాహుల్ సాంకృత్యాయన్
  7. Swamy and Friends - R K నారాయణ్
  8. Malgudi Days - R K నారాయణ్
  9. విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు - విశ్వనాథ సత్యనారాయణ
  10. మా పసలపూడి కథలు - వంశీ    
కొని, చదవడం ఇంకా మొదలుపెట్టనివి :
  1. హంపి నుంచీ హరప్పా దాకా - తిరుమల రామచంద్ర
  2. కృష్ణవేణి - రంగనాయకమ్మ
  3. ఓల్గా నుంచీ గంగకు - రాహుల్ సాంకృత్యాయన్
  4. లోపలి మనిషి - పి వి నరసింహారావు
  5. టంగుటూరి ప్రకాశం : స్వీయ చరిత్ర
  6. భారతీయ తత్వ శాస్త్రం : 4 భాగాలు - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 
  7. ఆంధ్ర మహా సావిత్రి - శ్రీ అరవింద మహర్షి : అనువాదం శ్రీ శార్వరి 
  8. మొట్టమొదటి కన్యాశుల్కం - బం.గో.రె (ఇది 'కన్యాశుల్కం' నాటకం మాత్రమే కాదు. దానిలో ఉన్న జాతీయాలు, మాండలీకాలు, పద ప్రయోగాలను గురించిన వివరణలతో ఉన్న Collectors Edition)
  9. కాళీ పట్నం రామారావు రచనలు
  10. దేవదాసు, పల్లీయులు, షావుకారు : శరత్ నవలలు    
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)