ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే రోజు డిసెంబరు రెండవ తేదీ అర్ధరాత్రి భోపాల్ నగరం నిద్రలో ఉన్న సమయం లో మృత్యువు నిశ్శబ్దంగా అక్కడి పౌరులను శాశ్వత నిద్రలోకి జారేలా చేసింది. కర్మాగారాన్నినెలకొల్పడమే తప్ప విపత్తు నివారణ, ప్రజల భద్రత లాంటి విషయాలను లను గాలికొదిలేసిన యూనియన్ కార్బైడ్ కంపెనీ యాజమాన్యం, ప్రజలను ఎన్నికలలో పనికివచ్చే వనరులుగానే తప్ప మనుష్యులుగా చూడని, మానవత్వం మర్చిపోయిన ఆనాటి అర్జున్ సింగ్ సర్కారూ క్షమించరాని పాపానికి ఒడిగట్టారు. (అంతటి ఆపత్సమయంలో "పరిస్థితి" గురించి వాకబు చేసిన ఆ ముఖ్య మంత్రి, ప్రమాద స్థలంలో ఉన్న 'నగర పోలీస్ కమీషనర్’ ద్వారా ప్రజలు తలోదిక్కుకీ పారిపోతున్నారని తెలుసుకొని, ఆయనతో "నీకు మతిపోయిందా..!! వారం రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు పారిపోతే మనకి ఓట్లు వెయ్యడానికి ఎవడు మిగుల్తాడు..?? వాళ్ళందరినీ ఇళ్ళల్లో తలుపులేసుకొని కూర్చోమను. కొంపలేం మునగట్లేదని చెప్పు..! వాళ్ళని ఇల్లుదాటి కదలనివ్వకు..!!" అని ఆజ్ఞాపించరట..!!)
అర్జున్ సింగ్, నాటి ముఖ్యమంత్రి |
వారెన్ ఆండర్సన్ |
ఆ ఘోరం జరిగిన రాత్రి మొదలుకొని కేసును నీరుగార్చడానికీ, మనచట్టంలోని లొసుగులని తెలియజెప్పి జరిగిన ఘోరానికి బాధ్యులైన వారిని దేశం దాటించడానికి, ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యధాశక్తి సహకరించాయి. ఆఖరికి నష్టపరిహారానికి కూడా ఆ ఫారిన్ కంపెనీ ముందు సాగిలపడి, ముందు అడిగిన దానికి కాకుండా వన్ టైం సెటిల్మెంట్ పేరుతో నామమాత్రపు సొమ్ముకి ఒప్పేసుకొని, బాధితులను దారుణంగా మోసపుచ్చి, వారికి మొండిచెయ్యి చూపాయి.
యూనియన్ కార్బైడ్ సంస్థకి ప్రపంచ వ్యాప్తంగా పలురంగాలలో వ్యాపారాలు ఉండేవి. భోపాల్ లో వారి కంపెనీలో తయారవుతున్న"సెవిన్" అనే పురుగుమందుకి, ఎరువులకీ
కావలసిన 'మిథైల్ ఐసో సైనేట్' (MIC) అనే విషవాయువును మన దేశం లోని బొంబాయి రేవుకి
దిగుమతి చేసి, అక్కడి నుంచీ రోడ్డు మార్గం ద్వారా భోపాల్ దాకా తీసుకు వచ్చి ఇక్కడ నిల్వ చేసేవారు. ఇక్కడి డిమాండ్ కి తగ్గట్లు పురుగుమందులు తయారు చేసినన్నాళ్ళూ అవసరానికి కావలసిన పరిమాణంలో మాత్రమే నిల్వచేసేవారు. ఎప్పుడైతే కంపెనీ తమ వ్యాపారాభివృద్ధి పేరుతో ఉత్పత్తిని పెంచాలని నిర్నయించుకొన్నారో అప్పటినుంచీ ప్రమాణాల విశయంలో కంపెనీ పతనం ప్రారంభమైంది.
మొదట్లో ఉన్నత స్థాయి ప్రమాణాలతో నెలకొల్పి, నిర్వహణలో శ్రధ్ధ పెట్టిన (ఆ క్రెడిట్ పూర్తిగా అప్పటి సాంకేతిక నిపుణులదే తప్ప యాజమాన్యానిది కాదు) యూనియన్ కార్బైడ్ కంపెనీ, యాజమాన్యం రానురాను బయటిదేశాల మార్కెట్ నీ, టర్నోవర్ నీ మనదేశపు సేల్స్ తో పోల్చి టార్గెట్ లని అందుకోలేక పోతున్నారనే నెపంతో (నిజానికి మన దేశం లో అప్పటికి వేపపిండి తప్ప రసాయనిక పురుగుమందులు అంత మార్కెట్ లేదు..!), మేనేజ్ మెంట్ మార్చేశారు. కంపెనీ నెలకొల్పడానికి అహోరాత్రాలూ కష్టపడి పనిచేసిన నిబద్ధత కలిగిన సాంకేతిక నిపుణులని విధుల నుంచీ తప్పించి, ఇలాంటి విషవాయువులతో బొత్తిగా పరిచయం లేని, బ్యాటెరీ రంగం మార్కెటింగ్ లో మంచి ఫలితాలు సాధించిన వారిని తీసుకొచ్చి ఇక్కడి వ్యాపార నిర్వహణ వారి చేతుల్లో పెట్టారు.
వీరికి కెమికల్స్, అందునా 'మిథైల్ ఐసో సైనేట్' లాంటి ప్రాణాంతక విషవాయువును హ్యాండిల్ చెయ్యడంలో ఉన్న ప్రమాదం గురించి అస్సలు తెలియదు. ఎప్పుడైతే డిమాండ్ ని మించి ఉత్పాదన పెరిగి, తయారైన సరుకు నిల్వ ఉండిపోసాగిందో, సహజమైన మార్కెటింగ్ సూత్రాన్ని పాటించి వారు ఉత్పత్తిని ఆపేశారు. దానితో 'మిథైల్ ఐసో సైనేడ్' వివియోగం ఆగిపోయింది. కంపెనీ వాళ్ళు వారి నష్టాన్ని కేవలం రూపాయలలోనే చూశారుగానీ, MIC నిల్వ చేయడంలో లోపం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దానివల్ల జరిగే నష్టం తరతరాల పాటూ మాయని మచ్చగా మిగులుతుందని ఊహించలేదు. MIC టాంకులలోకి చేరే ఎలాంటి మలినమైనా, చివరకు నీళ్ళు అయినా ఎమ్ ఐ సీ తో కలిసినప్పుడు జరిగే ఎక్సోథెర్మిక్ రియాక్షన్ వల్ల జరిగే ప్రమాదానికి ప్రాణాంతకం, భయంకరం లాంటి మాటలు చాలా చిన్నవి. తీరా ప్రమాదం జరిగిపోయిందని అర్ధమయ్యాక నిస్సహాయంగా చచ్చిపోవటమో, ప్రాణాలు అరచేత పెట్టుకొని పారిపోవడమో తప్ప, కనీసం తక్షణ నష్టనివారణకు చేపట్టవలసిన చర్యల గురించి కూడా అవగాహన లేని దిక్కు తోచని స్థితిలోకి కంపెనీ జారిపోయింది. ఆ నాటి రాత్రి ఆ టాంకులలోకి నీరు చేరి ఏర్పడిన రసాయనిక చర్య మూలంగా విడుదలైన వాయువుల సాంద్రత ఎక్కువ అవటం చేత నేలకి దగ్గరగా చాలా తక్కువ ఎత్తులో కదిలే మేఘం లాగా అవి ప్రయాణించి, తమ మార్గంలోకి వచ్చిన ప్రతి ప్రాణినీ అత్యంత కిరాతకంగా హతమార్చాయి.
ఆ నాటి పొరపాట్లకు, నిర్లక్ష్యానికీ మౌన సాక్షి.. యూనియన్ కార్బైడ్ ఇండియా , ప్రమాదం తరువాత..! |
ఇక్కడ తయారవుతున్న MIC ప్రపంచం లోనే అత్యంతప్రమాదకరమైన విషవాయువనీ, ప్రమాదం జరిగితే తీసుకోవలసిన చర్యల గురించి గానీ, బాధితులకు అందించ వలసిన వైద్యం గురించి కానీ, అక్కడి యంత్రాంగానికి ఎలాంటి సమాచారమూ లేదు. పైగా అది కంపెనీ పెట్టిన ఆరేళ్ళ వరకూ అంటే దాని ఉత్పత్తి భోపాల్ లోనే మొదలయ్యేవరకూ దానిని రోడ్డు మార్గం ద్వారా రెండు రాష్ట్రాలు దాటించి రహస్యంగా ఎలాంటి భద్రతలూ లేకుండా తెచ్చేవారనే విషయం బయటకు పొక్కనీయ లేదు. వారన్ ఆండర్సన్ లాంటి విదేశీ కంపెనీ యజమానుల దురాశా, సాంకేతికత తెలియని మేనేజర్ల పొదుపు చర్యలూ,
ఫ్యాక్టరీ నెలకొల్పటానికి అనుమతుల కోసం పెట్టుకున్న దరఖాస్తులలోనూ, దరిమిలా
జరిపిన కాలుష్య పరీక్షల ఫలితాలనూ తొక్కిపెట్టిన రహస్యాలూ, మానవ తప్పిదాలూ, నిర్లక్ష్యం, కొన్నితరాలకు చెందిన భోపాల్ నగర వాసుల జీవితాలలో ఒక భయంకరమైన పీడకలను మిగిల్చాయి. విచారకరమైన విషయం ఏమిటంటే, అంత భయంకరమైన అనుభవం చవి చూసి కూడా దాని నుంచీ పాఠాలు నేర్చుకోక పోవడం..!
డొమినిక్ లాపెయిర్, జేవియర్ మొరో ఫ్రెంచ్ లోనూ ఆంగ్లం (It was Five Past Midnight in Bhopal) లోనూ వ్రాసిన ఈ పుస్తకానికి ’కస్తూరి’ గారి స్వేచ్చానువాదం ఆనాటి భోపాల్ ఉదంతాన్ని కళ్ళకు కట్టిస్తుంది. ఆనాటి రాత్రి జరిగిన సంఘటనకు పూర్వాపరాలు ఈ పుస్తకంలో చాలా విపులంగా సవివరంగా చర్చించబడ్డాయి. కేవలం ప్రమాదాన్నే కాక అక్కడ నివసించిన, ఎన్నో ఆశలతో ఆ ఫ్యాక్టరీ లో పనిచేయడానికి దూరప్రాంతాలనుంచీ వలస వచ్చిన వ్యక్తుల జీవితాల చిత్రణ, వారి ఎన్నో కలలు కన్న వారి జీవితాలకు ఆనాటి రాత్రి వ్రాసిన మరణ శాసనం, చదివిన ప్రతి పాఠకుడి హృదయాన్నీ కదిలిస్తుందనటంలో సందేహం లేదు. కొన్ని కొన్ని చోట్ల కళ్ళు చెమ్మర్చక మానవు.
ఈ క్రింది లింక్ లో ఆ పుస్తకాన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆనాటి బాధిత కుటుంబాలకు ఇదేనా అశ్రు నివాళి. ఈ పుస్తకాన్ని నేను చదివి మూడు నాలుగేళ్ళ పైనే అయింది. గుర్తున్నమేర వివరాలు మీ ముందుంచాను. ఏవైనా తప్పులుంటే మన్నించ గలరు.
మరిన్ని ఫోటోలు ఈ క్రింది లింక్ లో : యాహు .కామ్ సౌజన్యంతో
http://in.news.yahoo.com/photos/bhopal-tragedy-aftermath-slideshow/bhopal-tragedy-aftermath-photo-1350977517.html
చాలా బాధాకరం..
ReplyDeleteచాలా భయంకరమైన సంఘటన. పుస్తకం లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteఈదేశంలో మనుషులప్రాణాలంటే ఎంతచులకనభావనో దానికి నిదర్శనం ఇది
ReplyDeleteచాలా దారుణం. భారతీయుడి ప్రాణాలు అంటే ఎంత నిర్లక్షం. మన పాలకులకు ఓటు వేయాలొ వధ్ధొ తెలియటమ్ లేదు. భారతీయురాలి గా గర్వచపడె నేను బాధ తో, సిగ్గు తో తల వంచుకుంటు నాను.
ReplyDeleteచాలా బాధాకరం
ReplyDelete