Sunday, January 25, 2026

మా వేసవి సెలవుల కాలక్షేప నాటకప్రదర్శనం

మళ్ళీ మా చిన్నప్పటి నాటకం ముచ్చట మరొకటి. ఇది మేము 5 - 6  చదువుతున్నప్పటి సంగతి: 

మా చిన్నప్పుడు నాటకాల పిచ్చి మామూలుగా ఉండేది కాదు. అన్ని నాటకాల్లోనూ అట్ట కిరీటాలు, భుజకీర్తులూ, ధనుర్బాణాలు తప్పనిసరి. కొండొకచో, నడుస్తున్నప్పుడు నేలమీద జీరాడుతూ ఉండే ఎర్రటి శాలువ, మెడకు ముడివేసి, వీపు మీద..!(దా.వీ.శూ. కర్ణ లో ఎన్టీవోడిని గుర్తు చేసుకోండి)

నాకు చిన్నప్పటి నుంచి, క్రాఫ్ట్ వర్క్ అంటే చాలా ఆసక్తి ఉండేది. అందుకని సెలవులు రాగానే అట్టలతో కిరీటాలు దండ కడియాలు చేసేవాడిని. నాకు మోడల్, హీరో.. అన్నీ మా తమ్ముడు. ఎందుకంటే నేను దర్శకుడిగా fix అయిపోయాను. (ముందు వ్రాసిన మా అశోకుడు - కళింగ రాజు నాటకంలో కూడా) 

అదే టైం లో మా నాన్నగారు టేప్ రికార్డర్ కొని ఒక పది క్యాసెట్లు కూడా కొన్నారు. వాటిల్లో ఘంటసాల భగవద్గీత కూడా ఉంది. ఆ క్యాసెట్లని అటూ ఇటూ అరగ్గొట్టి మొత్తానికి మొదటి నాలుగు అధ్యాయాలూ పూర్తిగా, శ్లోకం తాత్పర్యంతో సహా చెప్పడం నేర్చుకున్నాను. మాతమ్ముడికి కూడా వచ్చే ఉంటుంది.

ఆ సంవత్సరం *వేసవి సెలవల్లో*(మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి) భగవద్గీత నాటకం వేద్దామని అనుకున్నాం. డైలాగులకు ఏముంది, భగవద్గీత పాడేసుకుందాం అనుకున్నాం. నేను కృష్ణుడు, మాతమ్ముడు అర్జునుడు. అసలే కురుక్షేత్ర సంగ్రామం, పైగా మా తమ్ముడు యుద్ధానికి వెళ్తున్నాడు. అందుకని, ఈసారి వాడికి కిరీటాలు, దండకడియాలు, భూజ కీర్తులతో పాటు కవచం కూడా ఉండాలి అని డిసైడ్ చేశాను.

అట్టమీద కవచం బొమ్మ గీసి, దాన్ని జాగ్రత్తగా కత్తిరించి, ఆ కవచాన్ని వాడి ఛాతీ కి బిగించి, వెనకనుంచి వీపు మీదుగా మొలత్రాడు తాళ్ళను కట్టి ముడి వేశాను. అప్పటికే బాణాలు చెయ్యడంలో సిద్ధహస్తుణ్ని కాబట్టి మంచి చేవగల చీపురుపుల్లలతో ధనుర్బాణాలు వెంటనే అమరి పోయాయి. బాణాలు కవచానికి గుచ్చుకుని అలాగే నిలబడుతున్నాయి అని ధృవీకరించుకోడానికి వాడిమీద  రెండు మూడు బాణాలు కూడా వేసి చూసాను. అంతా బాగుంది. బాణాలు పెట్టుకోవటానికి తూణీరము, అన్నీ తయారు చేసి వాడికి కట్టడం మొదలుపెట్టాను. 

ఇక మేకప్..! కిరీటం, మిగతా అలంకరణలు బాగానే కట్టించుకున్నాడు. అట్ట కవచం దగ్గరకి వచ్చేసరికి ఒకటే కదులుతూ, నా ఏకాగ్రతకు భంగం కలిగిస్తున్నాడు. పాపం వేసవికాలం, ఉక్కపోత. నేను కదలకుండా నుంచో అని గట్టిగా గదమాయించే సరికి పాపం ఊరుకున్నాడు. 

వాడి అలంకరణ అయ్యాక నేను ఒక తలపాగా చుట్టి, నెమలి పింఛం పెట్టుకొని, ఒక చేతిలో  ఫ్లూట్, మరో చేతిలో విష్ణు చక్రం పట్టుకొని, తెల్లకృష్ణుడిగా వేషం కట్టాను. ఇక భగవద్గీత శ్లోకాలు పాడుకోవడమే తరువాయి..! 

మరి రథం కావాలి కదా, ఇంట్లో ఉన్న పాత చెక్క కుర్చీ ని బోర్లించి (అంటే నాలుగు కాళ్ళు పైకి చూస్తున్నట్టు, చెక్క కుర్చీ..చేతులు, back rest ఆధారంగా కుర్చీ నిలబడినట్టు ఊహించుకోవాలి), దానిమీద మానాన్న గారి పంచ, దుప్పటీ కలిపి చుట్టి, ఆ నాలుగు కాళ్ళ మధ్యలో మాతమ్ముణ్ణి నిలబెట్టి, ఆ ముందు నేను స్టూల్ వేసుకొని కూర్చొని, ఇద్దరం పార్థాయ ప్రతిబోధితాం పాడుకున్నాం. నేను రథం నడిపినట్టు, మావాడు సోదరులను, బంధువులను, మిత్రులను చూస్తూ రణరంగం మధ్యలోకి వచ్చినట్టు ఊహించుకున్నాం.(రథం కదలదు కాబట్టి..😄)

ఆ మధ్యకి వచ్చాక.. Next dialoge మా తమ్ముడు, *నకాంక్షే విజయం కృష్ణా..* అంటూ..! అప్పుడు నేను  *అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే..* అంటూ అందుకున్నాను.. అభయ హస్తం తో..! మా తమ్ముడిని రాములవారి పాదాల దగ్గర ఆంజనేయుడు కూర్చున్నట్టు ముకుళిత హస్తాలతో కూర్చోపెట్టి.. ఒక్కొక్క పద్యం, దాని తాత్పర్యం తన్మయత్వంతో పాడుతూ పోతున్నాను. 
మొదటి అధ్యాయం పూర్తయింది. (గమనించవలసింది ఏమిటంటే మాతమ్ముడికి మరేమీ డైలాగులు లేవు. అలా కదలకుండా కూర్చోవడమే.) మా తమ్ముడు full make-up లో ఉన్నాడు కదా, ఆ కవచాలు కిరీటాలు గుచ్చుకుంటూ అసహనంగా కదులుతున్నాడు. నేను నా గాన ప్రవాహానికి భంగం కలుగుతోందని.. కదలకు అని వారిస్తూ, హెచ్చరిస్తూ, గదమాయిస్తూ నా గానామృతాన్ని వాడి చెవుల్లో కూరేస్తున్నాను. ఒకటి పూర్తయి మరో మూడధ్యాయాలు పాడాలి నేను ఇంకా. 

వాడు చూసాడు చూసాడు.. ఓపిక నశించి నేను కట్టిన కవచాలు, కిరీటాలు తెంపేసి, చింపేసి లేచిపోయాడు. 

ఆ తరువాత, నా విశ్వరూప సందర్శనం, కురుక్షేత్ర సంగ్రామం మాత్రం నిరాఘాటంగా జరిగిపోయింది. ఎవరి మధ్య జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా..!! 😄😄😄

No comments:

Post a Comment

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)