Saturday, September 25, 2010

భగవద్గీత - అర్జున విషాద యోగం 'బుర్రకథ' -1

నేను ఆరవ తరగతి విశాఖపట్నం లో శ్రీ శాంతి ఆశ్రమం స్కూల్ లో చదువుకున్నాను. మాతమ్ముడు రామ్ మనోహర్ శ్యాం అయిదవ తరగతి చదివే వాడు. స్కూల్ ఆవరణ లో బోల్డు చెట్లు ఉండేవి..మామిడి, పనస, జామ , వేప, చింత ..ఇంకా చాలా ! చెట్ల కిందే పాఠాలు..!! వారాంతాలలో భజనలు..!!చాలా కోలాహలం గా వుండేది.
రోజుల్లో మా పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏదైనా ప్రోగ్రాం చేద్దామనుకున్నారు మా ప్రిన్సిపాల్ గారు ( వీరిని ఈమధ్యే ట్రైన్ లో కలిసాము) శ్రీ Ch. కృష్ణమూర్తి మాష్టారు...అంతకు ముందెప్పుడూ చెయ్యలేదుట..అదే మొదలు. మేమూ ఇంకా జాయిన్ ఐన కొత్త. మేము అప్పటి వరకు భీమిలి saint anns స్కూల్ లో చదువుతూ అకడెమిక్ ఇయర్ సగంలో వచ్చాం. మంచి స్కూల్ నుంచి వచ్చారు.. బాగా చదువుతున్నారు అనే సదభిప్రాయం వుండేది మామీద. పైగా చిన్న చిన్న పాటలూ అవీ పాడేవాళ్ళం. అంచేత మా ఇద్దర్నీ ఇంకొక సహాధ్యాయి బి శ్రీనివాస్ ని ( ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు) కలిపి బృందం గా తయారు చేసి మాకు "భగవద్గీత - అర్జున విషాద యోగం" బుర్రకథ నేర్పిస్తాం.. పాడాలి.. అన్నారు. మా హిందీ మాష్టారు మాకు ట్రైనింగ్. రోజూ క్లాసులు అయిపోయాక ఒక అరగంట extra ఉండి నేర్చుకోవాలి. ఆయనది మాంచి నిండిన రూపం..తెల్ల గ్లాస్గో షరాయి, లాల్చీ వేసుకొని వచ్చేవారు.. కొంచం ఎర్రగా వుండేవారు. హార్మోనియం చాలా బాగా వాయించేవారు..వాయిస్తూ నేర్పించేటప్పుడు ఒక రకమైన ట్రాన్స్ లో వుండేవారు. చాలా హుషారుగా చెప్పేవారు. (బాధాకరమైన విషయం: అప్పట్లో మాష్టార్లని హిందీ మాష్టారు.. తెలుగు మేష్టారూ.. అనేగానీ పేర్లు చెప్పడం అలవాటు లేకపోవడం తో ఆయన పేరు మర్చిపోయాను... ) మాకూ చాలా సరదాగా కొత్తకొత్తగా వుండేది. కధ కూడా తొందరగానే వచ్చేసింది.
దంతా బాగానే ఉంది గానీ.. మేము ఇలా నేర్చుకుంటున్నట్లు మా ఇంట్లో చెప్పలేదు. మా అమ్మగారు మా చదువుల మీ చాలా శ్రద్ధ కనబరిచేవారు. ఆవిడకి తెలిస్తే ఎక్కడ తిడతారో అని భయంగావుండేది. ఒకరోజు తెలియనే తెలిసింది. ఏంజరిగిందంటే : మా మేష్టారు మమ్మల్ని ఒక డ్రామా కంపెనీ కి తీసుకు వెళ్లి మాకు తంబుర, తలపాగాలు, చిడతలూ, చిన్న మద్దెల లాంటిది ఒకటి..అన్నీ మా సైజు లో తీసుకొని.. వాటితో పాటూ మమ్మల్ని ఇంటికి పంపించేసారు. మా 'బుర్ర'కథ రామకీర్తన అనేరసకందాయం లో పడింది. మా అమ్మ స్కూల్ కి వచ్చి మా మాష్టారితో మాట్లాడేరు. మొత్తం మా రిహార్సల్ అంతా చూసేరు . సంతోషంగా ఒప్పుకున్నారు.
మొత్తానికి మా ప్రోగ్రాం రోజు వచ్చింది. అప్పటికి మా ఇరుగు పోరుగులకీ చుట్టాలకీ తెలిసి అంత మందీ చూడడానికి వచ్చేరు. మా మామ్మగారు కూడా శ్రమకోర్చి వచ్చారు. మాకు మేకప్ అదీ చేసి ప్రక్క వాద్యాలు: హార్మోనియం - మా మాష్టారూ, తబలా కి ఇంకో అతన్నీ కూడా స్కూల్ వాళ్ళే arrange చేసి పాడించారు. వచ్చిన జనాన్ని చూసి మా ప్రిన్సిపాల్ గారు, మా మాష్టార్లందరూ చాలా హ్యాపీ. అలా మా మొదటి స్టేజి ప్రదర్శన దిగ్విజయంగా ముగిసింది.
**********
ఇప్పుడు ఏదైనా స్కూల్ anniversary అంటే... మొత్తం స్కూల్ లో వున్న పిల్లలందరినీ (అన్ని క్లాసులూ.. అన్ని సెక్షన్లూ) డబ్బులు తీసుకొని, costumes కి వేరేగా collect చేసి 40 -50 తో గ్రూప్ డాన్సు లు చేయించి..ఫుల్ సౌండ్స్, లైట్స్ తో పిల్లల్ని, పేరెంట్స్ ని కూడా బెంబేలేత్తిస్తున్నారు.
**********
కానీ ఆ ప్రోగ్రాం రికార్డింగ్ కానీ, ఒక ఫోటో కానీ జ్ఞాపకానికి ఒక్కటీ లేదు..ప్చ్ ..ఆశ్చర్యంగా చిన్నప్పుడు రాసుకున్న దాని స్క్రిప్ట్ మాత్రం పాతికేళ్ళ తరువాత నిన్ననే దొరికింది. ఆ సంగతులు వచ్చే పోస్ట్ లో ...
- సశేషం

No comments:

Post a Comment

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)