
ఆద్యంతం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే ఈ సినిమా చిన్నప్పుడెప్పుడో చూశాను. ఒక నాలుగేళ్ల క్రితం సీడీ షాపులో కనిపించి రెండు వీసీడీల ప్యాక్ ని కొన్నాను. తరువాత మళ్ళీ ఎక్కడెక్కడో తిరిగి ఈ పండగలకి మళ్ళీ నా వద్దకు చేరింది.
![]() |
అదే కాలేజీ లో చదువుతున్న రామారావు (చంద్ర మోహన్) ఇతన్ని తెగ ఏడిపిస్తూ ఉంటాడు. చరిత్ర అంటే చచ్చేంత ఎలెర్జీ..! ఇతని తండ్రి (పీ ఎల్ నారాయణ) తన కొడుకుని ఎలాగైనా చరిత్రలో గోల్డ్ మెడల్ సాధించాలంటూ తుపాకీ పుచ్చుకొని మరీ వెంటపెట్టి వేధిస్తూ ఉంటాడు. అతని తల్లిది (రాధాకుమారి) చిత్రమైన బలహీనత. గుడ్డ కనబడితే చాలు దాన్ని ఇచ్చేసి స్టీలు గిన్నెగా మార్చుకొందే నిద్ర పట్టదు. ఇంట్లో కనపడ్డ ప్రతీ బట్టనీ స్టీల్ సామాన్లవాడికి ఇచ్చేసి ఏ చెంచా నో చెంబు నో తీసుకొని తృప్తి పడుతూ ఉంటుంది. ఆ స్టీలు సామాన్ల వాడు కూడా ఈ ఇంటి చూరునే విడవకుండా పట్టుకు వేళ్ళాడుతూ ఆ ఇంటి యజమానికి బీపీనీ పెంచుతూ మనకు కామెడీనీ పంచుతూ సినిమా చివరి దాకా ఉంటాడు.

షా.వా.: "ఒక క్వార్టరు బీరూ , రెండు సోడాలూనా..! డబ్బులిలా వేస్ట్ చెయ్యకండి సార్..! పక్కనే హోటలుంది రెండిడ్లీ ఓ కాఫీ తాగండి..!!" అంటూ ఉచిత సలహా పారేస్తాడు)
ఒక వెర్రి నవ్వు నవ్వి బయటకు వచ్చేసిన రామారావు అంత రాత్రి వేళ ఒక గుట్ట మీదకి వెళ్తున్న గోపాలరావు మాష్టార్ని చూస్తాడు. క్యూరియాసిటీ కొద్దీ అతన్ని అనుసరించిన రామారావు, ప్రొఫెసర్ గారు కొన్ని తాళ పత్రాలూ, ఓ కోతి శవమూ బయటకి తీసి అండర్లైన్ చేసిపెట్టుకున్న మంత్రాలు చదివి పరకాయప్రవేశం ద్వారా కోతి శరీరం లోకి ప్రవేశించడం చూస్తాడు. అదను చూసి ఇతనూ అవే మంత్రాలు చదివి ప్రొఫెసర్ గారి శరీరం లోకి దూరిపోతాడు. కోతి శరీరంతో కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి, వెనక్కి వచ్చిన ప్రొఫెసర్ గారితో "తన శరీరంతో పరీక్షరాసి గోల్డు మెడల్ కొట్టమనీ, అప్పుడు మీ శరీరాన్ని మీకిచ్చేస్తాననీ" బేరం పెడతాడు. విధిలేని పరిస్థితిలో రామారావు శరీరాన్ని తొడుక్కుంటాడు గోపాల్రావు మేష్టారు...!
ఆ సినిమాలోని screen shots చూడండి:
అది మొదలు మనకి నవ్వుల విందు..!
పొరపాటున వేరే శరీరాల్లో ఉన్నామన్న సంగతి మర్చిపోయి తమ తమ పాత ఇళ్ళకి వెళ్లి చిక్కుల్లో పడతారు ఇద్దరూ..! దాంతో రాజీకొచ్చి గోపాల్రావుగారి ఇంటికి ఆయన శరీరంలో ఉన్న రామారావు, రామారావు ఇంటికి అతని శరీరంతో గోపాల్రావు మేష్టారూ వెళ్తారు. కొత్త వాతావరణం, పరిసరాలతో ఇద్దరూ ఇబ్బంది పడతారు. శరీరాలైతే మారాయిగానీ వ్యక్తిత్వాలూ , అలవాట్లూ మారవుకదా ..!! ఇంట్లో వారి కుటుంబ సభ్యులు కూడా హటాత్తుగా వారిలో వచ్చిన మార్పుకి తికమక పడతారు.
ఇలా ఉండగా గోపాల్రావు శరీరంలో ఉన్న రామారావుకి, అప్పటివరకూ వన్ సైడెడ్ గా ఉన్న ప్రేమ రెండో వైపు నుంచీ కూడా మొగ్గ తొడిగిందని తెలుసుకొని, ఎంత తొందరగా తన శరీరంలోకి మారిపోదామా అని తెగ ఇదైపోతూ ఉంటాడు. కానీ రామారావు శరీరంలోని గోపాలరావు మేష్టారికి తన పిల్లల అసలు వ్యవహారాలు కళ్ళబడి తన నమ్మకపు పొరలు తొలగిపోవడంతో కనువిప్పు కలుగుతుంది. దాంతో "పరీక్షలైపోయాయి గనక శరీరాలు మార్చేసుకుందా"మంటూ రామారావు వెంటపడుతున్నా తన సమస్యలు తీరేదాకా తిరిగి పాత శరీరాల్లోకి మారేది లేదని తెగేసి చెప్పేస్తాడు. మొదట అపార్ధం చేసుకున్న రామారావు తను తొడుక్కున్న గోపాల్రావు శరీరాన్ని ఎన్ని ఇక్కట్ల పాలు చెయ్యాలో, ఎన్ని వెకిలి వేషాలు వేస్తే ఆ శరీరానికి చెడ్డ పేరు వస్తుందో అన్నీ చేస్తాడు. కానీ తరువాత మేష్టారి కష్టాన్ని, బాధనీ అర్ధం చేసుకున్నాక ఆయనకు సాయంగా నిలిచి వారి కుటుంబాన్ని నిలబెడతాడు.

ఈ లోగా శారదతో రామారావు పెళ్ళికి వాళ్ళ నాన్న(పీ ఎల్ నారాయణ) ఒప్పుకొని పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. రామారావు శరీరంతోఉన్న గోపాల్రావు మేష్టారికే పెళ్ళికొడుకుని చెయ్యడం, ఊరేగింపూ లాంటి తంతులన్నీ జరిపించేస్తూ ఉంటే అసలు రామారావు మరింత ఉడికిపోతూ ఉంటాడు. చివరకి ఈ పెళ్లి ఊరేగింపుకి ఒక శవం ఎదుర్రావడంతో ఆ శవాన్నే వాహకం గా చేసుకొని శరీరాలు మార్చుకుంటారు మన రావూ - గోపాల్రావులు. రామారావుకి శారదతోనూ, అలాగే మేష్టారి కూతురికి ఆమె ప్రేమించిన యువకుడితోనూ పెళ్ళిళ్ళు జరగడంతో శుభం కార్డు పడుతుంది.
ఈ సినిమాలో కామెడీ ట్రాక్ అంటూ సెపరేట్ గా కాక కథలో అంతర్భాగం గా ఉంటుంది. జంధ్యాల గారి సినిమాల్లో అది కామనే అనుకోండి..! కానీ రావు గోపాలరావూ, చంద్రమోహన్ వాళ్ళ ఒరిజినల్ కారెక్టర్ లో కన్నా శరీరాలు మార్చుకున్నాక అవతల వాళ్ళ బాడీలాంగ్వేజ్, మేనరిజం లతో పండించిన హాస్యం సూపర్బ్..! ఇద్దరిలోకీ రావుగోపాల్రావే (పాత్ర పరంగా స్కోప్ కూడా ఉండడంతో) అద్భుతంగా పోషించాడు. అలాగే కాలేజి లైబ్రేరియన్ మంగతాయారు గా గోపాల్రావుకి రీసెర్చి లో సాయపడుతూ, తాళపత్రాలు ఇచ్చే పాత్రలో శ్రీలక్ష్మి, 'L' బోర్డు తో TVS మోపెడ్ నడుపుతూ అడ్డొచ్చిన వాళ్ళని గుద్దేస్తూ ఉంటుంది. ఆమె బండి నడుపుతూ ఉంటే వెనకాతలే ఇంకో అతను ను పరిగెడుతూ ఉంటాడు. స్టాండు వెయ్యడానికీ, పడిపోతే లేపదానికీ అన్నమాట.
ఇక పొట్టి ప్రసాద్, రావుగోపాలరావు బావమరిది. అతనికి తన బావదగ్గర మస్కా కొట్టి డబ్బులు లాగేస్తూ ఉంటాడు. అతని దగ్గర అతని మేనల్లుడు వాటా కొట్టేస్తాడు (పోలీసుల పేరు చెప్పి భయపెట్టి..!). అతడు సరిగ్గా ఈ వ్యవహారంలో ఉండగా శ్రీలక్ష్మి ఎదురుపడుతుంది. (శ్రీలక్ష్మికీ, పొట్టిప్రసాద్ కీ ఎత్తులో సుమారు అడుగు తేడా ఉంటుంది). ఆ సీన్లో శ్రీలక్ష్మిని మొదట ఆడ పోలీసుగా భావించి వినయం నటించే పొట్టిప్రసాద్, ఆవిడ లైబ్రేరియన్ అని తెలిసే సరికి ఒకసారి ఎగాదిగా చూసి, రెండు మెట్లు ఎక్కి ఎత్తు సరిచూసుకొని మరీ, "వెళ్ళెళ్ళవమ్మా..!" అంటూ దబాయిస్తాడు. నటీనటుల శరీర సౌష్ఠవాన్ని కూడా సహజమైన హాస్యానికి వస్తువుగా తీసుకోగలిగే చాతుర్యం జంధ్యాలకే చెల్లు..! ( ముఖ్యంగా మరొకర్ని నొప్పించేటట్టు కాకుండా..!)
సినిమా మొత్తం మీద బెస్ట్ కామెడీ అని చెప్పగలిగేది.. రామారావు(చంద్రమోహన్) తల్లిదండ్రులు ఫోర్జరీ సాంబమూర్తి (పీ ఎల్ నారాయణ), స్టీలు సీతాలక్ష్మి(రాధాకుమారి), మరియు స్టీలు సామాన్లవాడు ఈ ముగ్గురి మధ్యా నడిచే సన్నివేశాలు..!! ఆ సంభాషణలూ, వాళ్ళ టైమింగ్ చూస్తే మనకి పొట్ట చెక్కలవ్వడం ఖాయం..!! సినిమా మొదట్లో పంచ, లాల్చీ, కండువాలతో కనిపించే ఫోర్జరీ సాంబమూర్తి సినిమా నడుస్తున్న కొద్దీ ఒక్కొక్క వస్త్ర విశేషాన్నీ కోల్పోయి చివరకొచ్చేసరికీ బొందులాగూ తో మిగుల్తాడు. అదే ఆ స్టీలు సామాన్ల వాడు ఒక్కొక్కటిగా చొప్పున చివరికోచ్చేసరికీ ఆ పట్టుపంచ, లాల్చీ, కండువాల వేషం తో ఇంటి యజమానితో పోటీ అన్నట్లు ఇతగాడు తయారైపోతాడు. దానికి అతడు చెప్పే లాజిక్ నవ్వు తెప్పిస్తుంది. పెద్దవారింటికి వచ్చేటప్పుడు ( పాత బట్టలకి స్టీల్ సామాన్ల మార్పిడికే అనుకోండి..) చింకి బట్టలతో వస్తే ఏం బాగుంటుంది.. అంటాడు. అలాగే బట్ట చూపిస్తే చాలు అది వెంటనే తన ఒంటికి చుట్టేసుకొని, స్టీలు చెంచానో, గరిటో, ఇస్తానంటూ బేరాలు మొదలెడతాడు. కొసమెరుపేంటంటే వాడు ఈ ఇంటి యజమానితో వాడి కష్టం చెప్పుకుంటాడు. ఈమధ్య వాళ్ళ ఆవిడ క్రొత్తగా ప్లాస్టిక్ వస్తువులంటే పది చచ్చిపోతోందనీ, కన్ను చాటయితే ఒంటిమీద ఉన్న గుడ్డలు సైతం ఒలిచేసి ఆ బట్టల్ని ఇచ్చి ప్లాస్టిక్ డబ్బాలు, చెంచాలు మార్చుకొని ఇల్లంతా ప్లాస్టిక్ మాయం చేసేస్తోంది అంటూ వాపోతాడు. పాపం ఫోర్జరీ సాంబమూర్తికి నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు.

గోపాలరావు శరీరం లో ఉన్న రామారావు, తను గోపాలరావు కాదనీ, రామారావుననీ మేష్టారి కుటుంబాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. అతని కొక్కిరాయి చేష్టలకి హడలెత్తిన పిల్లలు ఒక మెంటల్ డాక్టర్ని(సుత్తివేలు) తెస్తారు. తీరా చూస్తే అతడు డాక్టరు కాదుకదా అక్కడ తచ్చాడుతున్న పేషెంటు..! చిన్న పాత్రే అయినా చాలా చక్కగా మెప్పిస్తాడు సుత్తి వేలు..! మళ్ళీ చివరన కనిపించే శవం పాత్ర కూడా సుత్తి వేలు చేతే వేయించారు జంధ్యాల. ఒకే వ్యక్తి రెండు వేర్వేరు పాత్రలు వేసినా ఎక్కడా ఆ విషయమే స్ఫురణకి రాదు.
మొత్తంగా సినిమా ప్రతీ సీనులోనూ హాస్యాన్ని రంగరించి, ఎక్కడా వడి తగ్గకుండా, బోరు కొట్టకుండా కథ నడుపుతూ జంధ్యాల గారు అద్భుతంగా వండి వడ్డించిన చక్కని చిత్రం రావూ - గోపాల్రావూ
Sir, ee movie ekkada download chesukovalo cheppagalara. ? links emanna unte naku mail cheyagalara ? sureshthaatipati@gmail.com
ReplyDeletenenu chala chotla vethikaanu kaani dorakaledu. dvds kuda dorakaledu.
youtube lo full movie ledu.
please send me either link / torrent / any other .
:suresh
సురేష్ గారూ,
ReplyDeleteనాకు కూడా దాని లింకులు ఏమీ కనిపించలేదు. నాదగ్గర ఉన్న వీసీడీ నే అప్ లోడ్ చెయ్యడానికి ప్రయత్నిస్తాను. తప్పక చూడవలసిన చాలా మంచి సినిమా..!!
rao gopalrao movie gurinchi raasina post teesesarenti ? emaindi. :Suresh
ReplyDelete@ suresh.. I have improvised it sir..!
shyam gaaru meeru RAOGOPALARAO cinema gurinchi baagaa cheppaaru abhinandanalu
ReplyDeleteఈ సినిమా గురించి వినటమే కాని చూశే అవకాశం రాలేదు, డి వి డి లేదా వి సి డి కూడా ఎక్కడా కనపడలేదు, ఈ సారి విజయవాడ వెళ్ళినప్పుడు వెతికి కొనాలి.
ReplyDeleteమంచి సినిమా గురించి వ్రాసినందుకు ధన్యవాదాలు.
ఈచ్ కింది లింక్ లొ ఈ చిత్రాన్ని చూడొచ్చు..
ReplyDeletehttps://www.youtube.com/watch?v=irA8gw0S41o