Thursday, June 9, 2011

హైదరాబాదులో పరుగో పరుగు..


మధ్య పిల్లల సెలవులు పురస్కరించుకొని హైదరాబాద్ ట్రిప్ వేసోచ్చాం..!ఎప్పుడు వెళ్ళినా బయటికెక్కడికీ వెళ్ళడానికి అవ్వట్లేదు. ఈసారి ఎలాగైనా వెళ్ళాలి అనుకోని వెళ్లాం. వెళ్ళడమంటే వెళ్ళాం గానీ,పిల్లలతో బయటికి వెళ్ళే సాహసం చెయ్యలేక పోయాం. ఒకటి ఎండలు..! రెండు ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా దూరం..!! ఫ్యామిలీని హైదరాబాదులో ఎక్కడికైనా తీసుకెళ్దామని అనుకుంటూండగానే నాల్గు రోజులు గడిచిపోయాయి. చుట్టాలిళ్ళు చూడడాలు అయిపోయింతరువాత.. ఇంక ఒక్కరోజే ఉంటున్నాం అనగా.. పిల్లల్ని, మా ఆవిడనీ, మా అక్కపిల్లలు ఇద్దరు, మా అన్నయ్య కూతురు,(వీళ్ళు ఇంజనీరింగ్, ఇంటర్ చదూతున్నారు.) మొత్తం ఏడుగురం టాక్సీ తీసుకొని ఊరిమీద పడ్డాం..! అక్కడినుంచీ మొదలైంది మా పరుగు.
రామంతాపూర్ లో బయలుదేరే సరికి సాయంత్రం నాలుగు. బయలుదేరింది.. చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యుజియం, ఎన్టీయార్ గార్డెన్స్, ఐ - మాక్స్ మొదలైనవి చూద్దామని..!! మొదట సాలార్జంగ్ కి వెళ్ళాము. నాలుగుంపావుకే టికెట్ కౌంటర్ క్లోజ్ చేసేస్తాడట. సరే అని గేటు బయటినుంచే చూపించేసి..గబగబా దానిగురించి నాకుతెలిసిన నాలుగు ముక్కలూ మా అమ్మాయికి చెప్పేసి..చార్మినార్ కి బయలుదేరాం. నేనుకూడా చార్మినార్ ఎప్పుడూ పైకెక్కలేదు. ఎంట్రీ టికెట్స్ తీసుకొని ఒక గైడుని కూడా పెట్టుకున్నాం. చార్మినార్ ఒక మినార్ లోపటినుంచీ.. మెట్లు ఎక్కించి సుమారు ఆరంతస్తుల ఎత్తున్న చార్మినార్ మొదటి అంతస్తుకి తీసుకెళ్ళాడు. ఒక్కొక్క మెట్టూ అడుగున్నర ఎత్తుండి వెడల్పు రెండున్నర అడుగులు కూడా లేదు. మా అబ్బాయిని ఎత్తుకొని మరీ ఎక్కాను. అక్కడినుంచీ చుట్టుపక్కల ప్రాంతాలు చూపించాడు మా గైడు. పిల్లలందరికీ బాగా నచ్చింది. మొత్తం టీం లో నేను మా అబ్బాయి(నాలుగేళ్ల వాడు) తప్ప మిగతా అందరూ ఆడాళ్ళే కదా..అందుకు చార్మినార్ తో పాటూ అక్కడ గాజుల షాపింగ్ ఇంకా నచ్చింది వాళ్లకి. దాంతో అక్కడే ఆరున్నరైపోయింది. అక్కడి నుంచి గోల్కొండ.
గోల్కొండ చేరేసరికీ ఏడు. ఆ చీకటిలో పరుగెత్తి మేము వెళ్ళే సరికే లైట్ అండ్ సౌండ్ షో మొదలైపోయింది. ఇదికూడా అందరం మొదటిసారి చూడడం. చాలా బాగుంది. అమితాబ్ బచ్చన్ కామెంటరీ, అక్కడక్కడ బాలమురళీ కృష్ణ రామదాసు కీర్తనలూ.. కవితా కృష్ణ మూర్తి అనుకుంటా..ఆవిడ జావళీలు..!
బయట కొచ్చేసరికీ ఎనిమిదిన్నర. మళ్ళీ పరుగు.. ఈసారి ఎన్టీయార్ గార్డెన్స్ కి.. అక్కడికెళ్ళేసరికే తోమ్మిదయిపోయింది. మళ్ళీ ఇవికూడా(ప్రసాద్స్ ఐ-మాక్స్ , ఎన్టీయార్ గార్డెన్స్, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు..) గేట్లే చూపించేసి మమ అనిపించేసాను. ఫైనల్ గా వచ్చి నెక్లేస్ రోడ్డు, ఈట్ స్ట్రీట్లో పడ్డాం. ఆత్మారాముడిని శాంతింపజేసి హైదరాబాదు దర్శన్ అయిందనిపించాను. మా అన్నయ్య, అక్క కూతుర్లని మళ్ళీ రామంతాపూర్ లో దించేసి మేము 'చందా నగర్' వెళ్లేసరికి రాత్రి పన్నెండు.
అలాగే బయలుదేరిపోతున్న రోజు ట్రైన్ టైంకి మూడుగంటల ముందు చందానగర్లో బయల్దేరి (రవీంద్రభారతి దగ్గరకి వచ్చేసరికి గంట టైము పట్టింది) పిల్లలకి బిర్లామందిర్, ప్లానటోరియం,సైన్సు మ్యుజియం కూడా
రెండుగంటల్లో (ఫాస్ట్ ఫార్వర్డ్ లో) చూపించేసాను..!!ఆ విధంగా మా హైదరాబాదు దర్శన్ ముగించి వైజాగు బయలుదేరడానికి సిద్దంగా వున్న రైలేక్కేసాం చివరినిమిషంలో..!!

సాలార్జంగ్ మ్యుజియం

9 comments:

 1. మీ భాగ్యనగర యాత్ర విశేషాలు, చిత్రాలు బాగున్నాయి!

  ReplyDelete
 2. కం//
  అరనిమిషము చూచుటకై
  తిరుపతి లో దర్శనముల తీరుగ ఇటులన్
  నగరము చూడగ ఉరకలు
  పరుగులు తీయుట వలనన ఫలితంబేమో?

  ReplyDelete
 3. బాగుందండి మీ హైదరాబాద్ పరుగు..! ఫోగ్రామ్‌లో అన్ని ఒకే సారి చూసేయాలని మరి చాలా దూరాలున్న ప్రాంతాలను వుంచుకొని కేవలం సాయింత్రం 4గంటలనుండి రాత్రి 9 గంటల లోపల చూడడం సాద్యం అయ్యే పనేనాండి..? మీ పరుగులేమో గాని మీరు తీసిన ఫోటోస్ మాత్రం చాలా క్లారిటీగా వున్నాయి. కలర్స్ కూడ చాలా బాగా వచ్చాయి..! ఏమి కెమెరా మోడల్ వాడారండి..?

  ReplyDelete
 4. @ తేజస్వి : ధన్యవాదాలు..
  @ పుష్యం (శ్యాం సుందర్) : మరేం చేస్తాం సార్! ఈసారి ఎలాగైనా చూపిస్తానని మాటిస్తిని..! మా వాళ్ళు నిరుత్సాహపడకుండా మేనేజ్ చేసేసా లెండి. కానీ మీ పద్యం మాత్రం చాలా బాగుందండీ..!! మీబ్లాగులో పద్యాలుకూడా చూసాను.. అవికూడా సూపర్. ప్రత్యేకించి 'లావొక్కింతయు లేదుర'
  @ కమల్ : <>..కదా..!! చివరాకర్న నాకూ అలాగే అనిపించింది..!! కానీ బయట పళ్ళేదు.. ;) . ఫోటోల విషయం: ధన్యవాదాలండీ.. అప్పుడు ఆకాశం కొంచం మబ్బు, కొంచం ఎండా కలగలుపుగా వుండడం చేత ఫోటోలు బాగానే వచ్చాయనుకుంటా..! నేను వాడిన కెమెరా కోడాక్ 12 మెగా పిక్సెల్.. మోడల్ నెంబర్ గుర్తులేదు.

  ReplyDelete
 5. హైదరాబాదులో మీ పరుగు బాగుంది..."మా పిల్లలకి హైదరాబాదు చూపా"నని చెప్పండి."హైదరాబాదులో ఏం చూపా"వంటే ఫోటోలు చూపండి..డిటైల్స్ చెప్పకండి..అప్పుడు మీ యాత్రకు ఓ సార్థకత... రాధేశ్యాంగారు! నిజం చెప్పాలంటే భాగ్యనగరంలో వున్నవారికి అన్నీ చూసే తీరికుండదు...చూడ్డానికెళ్ళేవారికి టైమ్ వుండదు.. ఏ నగరానికైనా అదే భాగ్యం.

  ReplyDelete
 6. @ పుష్యం: మీ పద్యం మీద మా మామయ్యగారు ప్రొ. బి.వి. ఎస్. మూర్తి గారి స్పందన:
  My dear Radsheshyam,

  Well, the Kanda padyam is interesting. It is a good attempt by the gentleman. I congratulate him and wish him a creditable passtime in this angle.
  He may see if he would like to make slight changes to further improve the poem both in prosody as also in the literarary angle. Of course I am not an expert to comment- only observation it is. Comaparing Hyderabad with Tirupati may not be fitting. Prasa in the third line may be arranged by using " itulee puramunu " instead of " itulan nagaramu".

  Fouth line also may be improved by changing as " Parugulu teeyuchu thirigina phalitambemo"

  Yes, commenting is easier than constructing.

  Regards,

  BVS MURTY

  ReplyDelete
 7. @రాధేశ్యాం,

  నా పద్యాన్ని మీ మామయ్యగారికి చూపించినందుకు ధన్యవాదాలు.

  B.V.S.మూర్తి గారు,

  శ్రమకోర్చి ప్రాసను సవరించి పద్యానికి మెరుగులు దిద్దినందుకు మీకు నా నెనరులు.

  ఇక తిరుపతి విషయానికి వస్తే, నేను హైదరాబాదుని తిరుపతితో పోల్చలేదని గమనించగలరు. నేను చూపిమిచదలచుకున్న పోలిక ఎక్కువ సమయం దొరకని తిరుపతి దర్శనానికి మరియు పరుగులు పెడుతూ తక్కువసమయంలో జరిగిన హైదరాబాదు దర్శనానికి మాత్రమే. అంతే కాకుండా తిరుపతి ప్రాసకి కూడా సరిపోయింది :-)

  కం//
  వ్రాసిన పద్యమునందున
  ప్రాసను సవరించి మంచి ప్రాసడి కొఱకై
  వాసివి సూచనలెన్నియొ
  చేసిన మీశ్రమకు నేను చేసెద ప్రణతుల్

  ప్రాసడి = prosody

  నమస్సులతో,
  పుష్యం

  ReplyDelete
 8. @రాధేశ్యాం,

  నా పద్యాన్ని మీ మామయ్యగారికి చూపించినందుకు ధన్యవాదాలు.

  B.V.S.మూర్తి గారు,

  శ్రమకోర్చి ప్రాసను సవరించి పద్యానికి మెరుగులు దిద్దినందుకు మీకు నా నెనరులు.

  ఇక తిరుపతి విషయానికి వస్తే, నేను హైదరాబాదుని తిరుపతితో పోల్చలేదని గమనించగలరు. నేను చూపిమిచదలచుకున్న పోలిక ఎక్కువ సమయం దొరకని తిరుపతి దర్శనానికి మరియు పరుగులు పెడుతూ తక్కువసమయంలో జరిగిన హైదరాబాదు దర్శనానికి మాత్రమే. అంతే కాకుండా తిరుపతి ప్రాసకి కూడా సరిపోయింది :-)

  కం//
  వ్రాసిన పద్యమునందున
  ప్రాసను సవరించి మంచి ప్రాసడి కొఱకై
  వాసివి సూచనలెన్నియొ
  చేసిన మీశ్రమకు నేను చేసెద ప్రణతుల్

  ప్రాసడి = prosody

  నమస్సులతో,
  పుష్యం

  ReplyDelete
 9. Small change in the poem:

  కం//
  వ్రాసిన పద్యమునందున
  ప్రాసను సవరించి మంచి ప్రాసడి కొఱకై
  వాసివి సూచనలెన్నియొ
  చేసిన శ్రీ మూర్తి గార్కి చేసెద ప్రణతుల్

  ReplyDelete

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)