Thursday, June 16, 2011

"ఇక్కడ తాజా చేపలు అమ్మబడును.."

వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము తెలిసిన
మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ!

మనకు సలహాలిచ్చే వాళ్ళని చాలా మందినే చూస్తూ వుంటాం. ఇచ్చే వాళ్ళు కూడా అలవోకగా  ఇచ్చేస్తుంటారు.  అలాంటి సలహాలలో మనకు నిజంగా ఉపయోగపడేవి ఏవో ఎంచుకోవలసిన బాధ్యత మాత్రం మనదే.       



"అంతెందుకు..? ఇదిచాలు కదా...!!" అని ప్రశ్నించే ప్రతీ వాడినీ సమాధాన పరచడానికి పూనుకొంటే చివరికి ఏమైందో చిత్తగించండి..!!
ఒకడు చేపలు అమ్మే దుకాణం కొత్తగా పెట్టి బయట బోర్డు ఇలా పెట్టించాడు.."ఇక్కడ తాజా చేపలు అమ్మబడును.." ఒక ఆసామి వచ్చి బోర్డు చూసి.. "అబ్బాయ్..చేపలు ఎవడైనా తాజావే అమ్ముతాడు. నువ్వు ప్రత్యేకంగా 'తాజా' అని రాస్తే నిజంగా కావేమో అనుకుంటారు. మరి 'తాజా' ఎందుకు??" అని అడుగుతాడు. నిజమే కదా అని.. 'తాజా' చెరిపేస్తాడు. మిగిలింది " ఇక్కడ చేపలు అమ్మబడును.."
ఇంకొకతనొస్తాడు "అబ్బీ..చేపలు అమ్మేది ఇక్కడే కదా అప్పుడు ఇంకా 'ఇక్కడ' ఎందుకు??" అంటాడు. సర్లేమ్మని 'ఇక్కడ' చెరిపేస్తాడు. మిగిలింది ."చేపలు అమ్మబడును.." మరొక వ్యక్తి వచ్చి " నువ్వేమీ ఉచితంగా ఇవ్వవనీ..కొనుక్కోవాలని మాకు తెలుసు. ఇంకా 'అమ్మబడును' ఎందుకూ..??" అంటే.. 'అంతేకదా..!' అనుకోని మనవాడు 'అమ్మబడును' కూడా చెరిపేస్తాడు. మొత్తానికి బోర్డుమీద "చేపలు" మిగిలింది.
ఇంతలో అటుగా వెళ్తున్నఒక పెద్దావిడ.."నీ చేపల కంపు బజారు చివరికి వస్తోంది. మళ్ళీ 'చేపలు' అని రాయాలి కూడానా..?" అంటుంది ముక్కు మూసుకొంటూ..!మనవాడికి తిక్కరేగి అదికూడా చెరిపేసి ఖాళీ బోర్డు వంక చూసి 'అమ్మయ్య' అనుకుంటాడు. అప్పుడే షాపుకొచ్చినతను "అదేమిటయ్యా..బోర్డు అలా ఖాళీగా పెట్టేబదులూ నువ్వేమిటి అమ్ముతున్నావో రాయొచ్చు కదా ..!" అంటాడు కళ్ళజోడు సవరించుకొంటూ.. ఇంక ఇప్పుడేం  చెయ్యాలో తోచక తలపట్టుకోవడం మళ్ళీ మనవాడి వంతయ్యింది.
(చిన్నప్పుడు టింకిల్ పుస్తకం లో ఈ కథ చదివాను. గుర్తున్నంతవరకు వ్రాసాను.)
******
పంచతంత్రం నుంచీ మరో కథ:
ఒక ఊర్లో ఒక సాలెవాడుంటాడు. అతని మగ్గం విరిగిపోవడం చేత కొత్త మగ్గానికి కావలసిన కర్ర కోసం దగ్గరలోని అడవికి వెళ్తాడు. మంచి చేవ వున్నా చెట్టుని చూసి నరక బోతుండగా ఆ చెట్టుని ఆశ్రయించు వున్న ఒక యక్షుడు సాలెవానికి కనిపించి చెట్టుని నరకకుండా ఉండేందుకు ప్రతిగా ఏదైనా వరం కోరుకొమ్మని అడుగుతాడు.  అతడికి  ఏది  కోరుకోవాలో  తెలియక ఎవరినైనా సలహా అడిగి మళ్ళీ వస్తాను అని యక్షుడితో చెప్పి మళ్ళీ గ్రామంలోకి  వస్తాడు.  నేరుగా  తన  ఆప్త మిత్రుడి దగ్గరకు వెళ్లి విషయం చెప్పి సలహా అడుగుతాడు. విని  సంతోషించిన ఆ  మిత్రుడు  "ఏదైనా  దేశానికి  రాజుని చెయ్యమని" అడగమంటాడు. డబ్బు అధికారం వుంటే ప్రపంచం పాదాక్రాంత మవుతుంది అంటాడు. సాలెవాడు తన భార్యనికూడా అడుగుదాం ఏమంటుందో అనుకోని  తిన్నగా  ఇంటికి  వెళ్తాడు. విషయం విన్న  భార్య  "రాజ్యాలున్నాయి  కాబట్టే  అదిపోగోట్టుకొని  రాముడూ, ధర్మరాజూ అడవులపాలయ్యారానీ,
 రాజ్యాలుండి సుఖపడిన వాడెవ్వడూ లేదనీ అంటుంది. "దాని బదులూ ఇంకేదైనా అడుగుదాం. ప్రస్తుతం నువ్వు రోజుకి ఒక చీర నేసి అమ్మగా వచ్చే ఆదాయం మనకు సరిపోతోంది, కానీ ఏమీ మిగలడం లేదు. నీకేగానీ వెనుకవైపుకి ఇంకో రెండు చేతులూ, ఇంకో తలా వుంటే నువ్వు రోజుకి రెండు చీరలు నెయ్య గలుగు తావుకదా!" అంటుంది. మరింకేమీ ఆలోచించకుండా ఆ సాలెవాడు యక్షుడి దగ్గరకి పోయి ఇంకో తల ఇంకో జత చేతులూ అడిగి పుచ్చుకొని ఇంటిదారి పడతాడు ఆనందంగా..! కానీ ఈ విషయం తెలియని గ్రామస్తులు తమ గ్రామానికి చేటు చెయ్యడానికి ఏదో బ్రహ్మరాక్షసి వచ్చేస్తోందని భ్రమపడి కర్రలతో కొట్టి చంపేస్తారు.

సరైన సలహా ఎంచుకోకపోవడం ఒక్కొక్కసారి ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తుందో చూసారా.. 
'ప్రజాశక్తి' లో వచ్చిన ఈ ఆర్టికల్ కూడా చదవండి. వ్రాసినది శ్రీ డి.వెంకట్‌రెడ్డి గారు.   

No comments:

Post a Comment

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)