నా కొత్త బ్లాగు:
ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజు, శ్యామశాస్త్రి, అన్నమయ్య, పురందరదాసు, తూము నరసింహదాసు, రామదాసు వంటి మహనీయుల రచనలలోని వాగామృత ధార..!!
ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజు, శ్యామశాస్త్రి, అన్నమయ్య, పురందరదాసు, తూము నరసింహదాసు, రామదాసు వంటి మహనీయుల రచనలలోని వాగామృత ధార..!!
ఉపోద్ఘాతం..
మన వాగ్గేయకారుల రచనల్లో భక్తితత్వానికి అగ్రతాంబూలం లభించినా మానవత్వానికీ, విలువలకీ, సామాజిక స్పృహకీ అద్దం పట్టే వారి వ్యాఖ్యలు వారి రచనల్లో సందర్భానుసారంగా దొర్లిన సందర్భాలు కోకొల్లలు. మనిషి అవలక్షనాలనూ, కుల మతాల ముసుగులోనో, ఆచార వ్యవహారాల పేరుమీదో సాటి మనుషుల మీద పెత్తనం చెలాయించే వర్గం యొక్క కుత్సితాన్నీ, బయట పెడుతూనే మానవ శ్రేయస్సుకూ వారి వ్యక్తిత్వ వికాసానికీ దోహదపడే సూచనలెన్నో మన వాగ్గేయకారుల రచనల్లో మనకు కనిపిస్తాయి. అలాంటి అమృతతుల్యమైన పలుకులను, కీర్తనలనూ, అందరం పంచుకోవడమే ఈ బ్లాగ్ ముఖ్యోద్దేశం. కుల, మత, భాషా, ప్రాంతీయ, భాషా భేదాలకతీతంగా 'వసుధైక కుటుంబం' గా ప్రజలందరూ మెలగవలసిన అవసరం ఎంతైనా ఉంది.
"సూక్తులు తెలియనిదెవరికి!? ఈ అంశం మీద బ్లాగులెన్ని లేవు..!? మళ్ళీ ఇదంతా అవసరమా..!!??"
కుండెడు తియ్యటి నీళ్ళని, చారెడు ఉప్పుతో రుచి మార్పించెయ్యోచ్చు. కానీ అదే కుండెడు ఉప్పునీళ్ళని మళ్ళీ మునుపటి తీయదనానికి తేవడం దాదాపు అసాధ్యం..! కానీ దానికి మరో పది కుండలు మంచినీళ్ళు కలిపితే ఉప్పదనం రుచికి అందదు..!! అందుకే ఇలాంటి మాటలు ఎవరు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా తీయదనం పెరుగుతుందే గానీ తగ్గదు.
సూక్తులు అందరికీ తెలుసు. కానీ ఆచరణలో పెట్టటానికి మానవ కల్పితమైన అవరోధాలు 'అవసరార్ధం' అనో, 'ఈ ఒక్కసారికీ..!' అనో గడిపేస్తుంటాం. ఆ మనో దౌర్బల్యానికి విరుగుడు మనం ఒకటికి పదిసార్లు ఈ 'వాక్సుధా స్రవంతి' ని మననం చేసుకొంటూ ఉండడమే. తద్వారా ఆ విలువలను మన జీవనంలో ఆచరిస్తూ సత్సమాజ నిర్మాణానికి మనవంతు తోడ్పాటు నందించగలం. 'వాగ్గేయ సుధా స్రవంతి' ఆ లక్ష్యానికే ఉడతాభక్తిగా తనవంతు కృషి చేస్తుంది.
రెండునెలల క్రితం ప్రారంభించిన ఈ బ్లాగుని ఇప్పటికే చూస్తున్న వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ గారి సలహాలూ సూచనలకు సర్వదా కృతజ్ఞుడిని. పైన చెప్పుకున్నట్లు మన వాగ్గేయ కారులు తమ రచనలలో కేవలం సంగీతం మాత్రమే కాకుండా మానవాళిని ఉద్ధరించే విలువలనూ, మరియూ సామాజిక స్పృహనూ కూడా అందించారు. అటువంటి అనర్ఘ రత్నాలను గుదిగ్రుచ్చి వీలైనంత మందికి మీ అందరి సహకారం తో అందించాలనీ, తద్వారా విశ్వమానవ సౌభ్రాతృత్వం మనందరి మనస్సులో విరబూయాలనే ఆకాంక్షతో చేస్తున్న ప్రయత్నమే ఇది. ఈ బ్లాగులోకం లో ఎందఱో మహానుభావులు, మేధావులూ, పండితులూ వున్నారు. ఇక్కడ ప్రచురింపబడే కీర్తనలకు వ్యాఖ్యానం నా చిన్న బుర్రకి తట్టినంత వ్రాద్దామనే ప్రయత్నం. ఇంకా విపులంగా చెప్పగల్గే పెద్దలు తమదైన వ్యాఖ్యానాలను కామెంట్ల రూపం లో పంపి ఈ 'తత్వ శాస్త్రాన్ని' మరింతగా అర్ధం చేసుకోవడానికి తమ చేయూతనందిస్తారని ఆశిస్తూ..
- రాధేశ్యాం.