Saturday, April 6, 2013

మత్తకోకిల వృత్తమందున మున్ను వ్రాసిన పద్యమూ..!

పద్యాల నడక మీద శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారి వివరణాత్మకమైన వ్యాసం (ఛందస్సు తో నడక - 3) చూసాక చాలా బోల్డు ఇన్స్పిరేషన్ వచ్చేసి నేనూ ప్రయత్నించాను. ముఖ్యంగా ఆయన చెప్పిన'తాన తానన  తాన తానన  తా తానన  తాననా' నడక వినగానే మొదట స్ఫురించినది :
అల్లు రామలింగయ్య మీద చిత్రీకరింపబడిన పాట:  'అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమె భామినీ' 
నేను వ్రాసినది పంపితే వారు దోషాలు ఎత్తి చూపి సరిదిద్దుకోవడానికి సహకరించారు.
******************************
  1. కామేశ్వర రావు గారికి,
    మీ వివరణ చాలా బాగుంది. ధన్యవాదాలు. నాకు ’తాన తానన తాన తాన’ మీటరే సులువనిపించింది.
    నేనుకూడా ప్రయత్నించాను(మొట్టమొదటి సారి). మీ అభిప్రాయం తెలుపగలరు:

    నిండు పున్నమి రాత్రి వేళల నాదు వీనుల విందుగా
    గండుకోయిల కూసినట్టయి గానమేదని చూడగా
    పండు వెన్నెల మోము గల మా పాప నిద్దుర చెదరగా
    దిండు సర్దుచు జోలపాడు మదీయ శ్రీమతి! చూడగా


  2. మత్తకోకిల వృత్తమందున మునుపు వ్రాసిన పద్యమూ
    చిత్తమందున తలపుకొచ్చుట చిత్రమూ బహు చిత్రమూ
    వృత్తవివరణ చాలబాగుగ విశదపరచిన భైరవా..
    కొత్త నాకిది తప్పులున్నచొ కాయుమో కామేశ్వరా..!


  3. ప్రాసయతులన నాకు దెలియదు పట్టులేనిది సత్యము
    గ్రాసమిప్పుడు నాదు మెదడుకు గట్టిగా నే పూనగా
    దోస వేసిన చందమున పద్దెములనే నే కూర్చగా
    దోసమున్నచొ పెద్దమనసుతొ దిద్దిపెట్టు కవీశ్వరా..!


  4. రాధేశ్యామ్ గారూ,
    చాలా సంతోషమండి. మత్తకోకిల నడకని చక్కగా పట్టుకున్నారు!
    అయితే మీ పద్యాలు కచ్చితమైన మత్తకోకిల వృత్తంలో ఉన్నవని చెప్పలేము, సరిగ్గా అలాగే ఉండే మాత్రాఛందస్సులో ఉన్నాయి. ఈ తేడా తెలియాలంటే తర్వాతి టపా "ఛందస్సుతో నడక - 4" చదవండి. :-)
    కామేశ్వర రావు గారూ, మీ సత్వర స్పందనకు ధన్యవాదాలు.
    "ఛందస్సుతో నడక - 4" చదివాను. మత్తకోకిల నన్ను గట్టిగానే ఆవహించింది. నా పద్యాలు కొద్దిగా సరిచేసాను(అని అనుకొంటున్నాను). చదివి మీ అభిప్రాయం చెప్పగలరు.

    నిండు పున్నమి రాత్రి వేళల నాదు వీనుల విందుగా
    గండుకోయిల కూసినట్టయి గానమేదని చూడగా
    పండు వెన్నెల సాటిరాగల పాప నిద్దుర పుచ్చగా
    దిండు సర్దుచు జోలపాడెడు దల్లియేగద కోయిలా!

    మత్తకోకిల వృత్తమందున మున్ను వ్రాసిన పద్యమూ
    చిత్తమందు తలంపుకొచ్చుటె చిత్రమూ బహు చిత్రమూ
    వృత్తలక్షణ మర్మమెల్లను వ్యక్తపర్చిన యొజ్జవే ..
    కొత్త నాకిది తప్పులున్నచొ కోపగింపక గావవే!

    ప్రాసయతులన నాకు దెల్వదు పట్టులేనిది సత్యమూ
    గ్రాసమిప్పుడు నాదు మేథకు పట్టువచ్చుట తథ్యమూ
    దోశ క్రొత్తగ వేయురీతిగ తెల్గు పద్దెము కూర్చగా
    దోసమున్నచొ, నీకు మ్రొక్కెద, దిద్దిపెట్టు కవీశ్వరా..!


    శ్రీ గురుభ్యోనమః
    ప్రణామాలతో
    రాధేశ్యామ్
    మళ్ళీ తప్పింది..ఈసారి ఇది చూడండి గురువుగారూ..!
    ప్రాసయన్నది నాకుదెల్వదు పట్టులేనిది సత్యమూ
    గ్రాసమిప్పుడు నాదుమేథకు పట్టువచ్చుట తథ్యమూ 
    దోశ కొత్తగ వేయురీతిగ దెల్గుపద్దెము కూర్చగా
    దోసమున్నచొ, నీకు మొక్కెద, దిద్దిపెట్టు కవీశ్వరా..! 
    రాధేశ్యామ్ గారూ,
    బాగున్నాయండి. ఇప్పుడు మత్తకోకిల గణాలన్నీ సరిపోయాయి. దోశలు తిప్పడం బాగా వచ్చినట్ట! :-) మొదటి పద్యంలో భావం కూడా చాలా బాగుంది. అన్ని పద్యాలలోనూ ప్రాస కూడా సరిపోయింది. కొన్ని చోట్ల యతులు మాత్రం సరిపోలేదు. యతిలో అచ్చు మైత్రి, హల్లు మైత్రి అని రెండుంటాయి. ఇంచుమించు అన్నిచోట్లా హల్లు మైత్రి కుదిరింది కాని అచ్చు మైత్రి కుదరలేదు. యతి గురించి వివరణ యిక్కడ చూడండి:
     
    వామ్మో..! ఇన్నున్నాయంటే చిక్కుపడకపోదునే..!!
    అయిననూ ప్రయత్నించెదను..!! :)
    మీ సలహాలకు ధన్యవాదాలండీ..చాలా నేర్చుకోగలుగుతున్నాను. 
     
    వృత్త లక్షణం ప్రకారం యతి సరిపోలేదని అన్నాను కాని, పద్యాలు చదువుకోడానికి చక్కగా ఉన్నాయి. కాబట్టి వీటిని మార్చనవసరం లేదు. కొత్తగా వ్రాసేటప్పుడు యతి గురించి దృష్టిలో ఉంచుకుంటే సరిపోతుంది. నా ఉద్దేశంలో నడక చక్కగా కుదిరి, మంచి భావాలతో వ్రాయగలిస్తే అవి మంచి పద్యాలే, యతి సరిపోకపోయినా.. 
    మరి మార్చక్కర్లేదన్నారు, ఇహ ఇబ్బంది పెట్టను..!
    ధన్యవాదాలు గురువుగారూ..! నేనప్పుడే మీరిచ్చిన లింకుతో డా. ఫణీంద్ర గారి బ్లాగరమథనానికి పూనుకొనేశా..!!
     - రాధేశ్యామ్
     ******************************
    తెలుగు పద్యం బ్లాగు నడుపుతున్న శ్రీ భైరవభట్ల కామేశ్వరరావుగారికి, వారి బ్లాగులో 'సులువుగా పద్యం వ్రాయండి ... ' శీర్షిక నడుపుతున్న డా. ఆచార్య ఫణీంద్ర గారికి, పద్యమంజూష బ్లాగు నడుపుతున్నటేకుమళ్ళ వేంకటప్పయ్య గారికీ నా నమస్సులు..! పద్య రచనా  నియమాలను, తత్సంబంధమైన ఎన్నో ఆసక్తికరమైన  విశేషాలను  ఔత్సాహికులకు సులభ గ్రాహ్యంగా అందిస్తున్న వీరూ, వీరివంటి మరెందరో మహానుభావులకు వందనాలర్పిస్తున్నాను.   
     
పూర్తిగా చదవండి...

Monday, April 1, 2013

తి తి దే సమర్పిస్తున్న 'నాదనీరాజనం' కార్యక్రమంలో నామ సంకీర్తనం - ప్రసార సమయం


తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పిస్తున్న నాదనీరాజనం కార్యక్రమం లో నా శ్రీమతి రుద్రావఝల కుసుమ కుమారి మరియు బృందం 'నామసంకీర్తన' గానం చేశారు. కార్యక్రమం ఈనెల 18వ తేదీన సాయంత్రం జరిగింది.  ఆరోజు శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల చివరి రోజు కావడంతో SVBC చానెల్ లో వీరి నామ సంకీర్తన ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించలేదు. ఈరోజు ప్రసారం అవుతుందట ...!
ప్రసార సమయం : 
ఈరోజు (తే. 1.04.13) మధ్యాహ్నం 3:00 గం నుంచి 4:00 గం వరకు
 ******************************************
ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారు ఈక్రింది లింక్ ను ప్రసార సమయం లో క్లిక్ చేస్తే ప్రసారం అప్పటికప్పుడే చూడవచ్చు.
http://www.yupptv.com/svbc_channel_live.html (పూర్తి కార్యక్రమం)
పాల్గొన్న కళాకారులు:
శ్రీమతి రుద్రావఝల కుసుమకుమారి, శ్రీమతి సుబ్బలక్ష్మి సోమయాజుల, కుమారి మండ ప్రత్యూష శ్రుతి రవళి, చి. కృష్ణప్రియ, చి. విష్ణుప్రియ, చి. శ్రుతి, చి. భవ్య, గాయత్రి, ప్రశాంతి, కామేశ్వరి, మనోహర్ 
వాద్య సహకారం: వయొలిన్: శ్రీ హెచ్.  రామ్ చరణ్, మృదంగం: జయదీప్, వేణువు: శ్రీ శైలపతి భరద్వాజ్
బృందం లోని కళాకారులంతా ప్రముఖ గాత్ర సంగీత విదుషీమణి శ్రీమతి మండ సుధారాణి గారి శిష్య ప్రశిష్యులే..!
 


కుమారి మండ ప్రత్యూష శ్రుతి రవళి, కుమారి కామేశ్వరి, శ్రీమతి కుసుమకుమారి, కుమారి గాయత్రి, శ్రీమతి సుబ్బలక్ష్మి సోమయాజుల




చి. శ్రుతి, చి. కృష్ణప్రియ,  ప్రశాంతి
చి. విష్ణుప్రియ, మనోహర్, చి. భవ్య,
శ్రీయుతులు శైలపతి భరద్వాజ్, రామ్ చరణ్ 
శ్రీ జయదీప్









*****************************************
కార్యక్రమం తరువాత తి తి దేవస్థానం వారు కళాకారులందరికీ ప్రసాదాలు ఇచ్చి , శ్రీవారి దర్శన భాగ్యం కలిగించారు. కులశేఖర పడి(గర్భాలయపు గడప) వరకు తీసుకువెళ్ళి, స్వామివారికి హారతి ఇచ్చారు. ఆహా..అద్భుతమైన దర్శనం..! 
ప్రముఖ వాయులీన విద్వాంసురాలు కన్యాకుమారి గారు కూడా అనుకోకుండా ఆరోజు ఆలయం లో కలిశారు. వారితో పాటే మాకూ స్వామి దర్శనం జరిగింది. 
ఓం నమో వేంకటేశాయ .. !!
*******************

పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)