Friday, December 20, 2019

చిరుతను కనిపెట్టగలరా..!?


కందము.
చూచితి చిరుతను; గుట్టుగ/
వేచెను తా నీడనుండి వేటాడుటకున్/
నీచుని తలపుల వోలెను/
దాచుక యా క్రూర మృగము తన రూపు తగన్!

- రాధేశ్యామ్ రుద్రావఝల
(27.07.2019)
పూర్తిగా చదవండి...

Friday, October 18, 2019

నా విజయవాడ ప్రయాణం..!!


Related image

2018 అక్టోబరు నెల ఆఖరు వారంలో ఒకనాటి రాత్రి VSKP LTT EXP లో విశాఖపట్నంనుండి విజయవాడ వెళ్ళడానికి బయలుదేరాను. నాది 2nd AC కోచ్. విశాఖలో నేను ట్రైన్ ఎక్కే సరికి 11.00 దాటింది. బెజవాడలో పొద్దున్న ఆరుంపావు కరెక్ట్ టైము..! విశాఖలో నేను ఎక్కే సరికే అంతా సర్దుకొని పడుకుండి పోవడానికి సిద్ధమౌతున్నారు. నాది అప్పర్ బెర్త్..! సరే లెమ్మని, ఎవరితోనూ మాట కలపకుండా హాయిగా పైకెక్కి పడుకోవడానికి ఉపక్రమించాను.
మామూలుగా రగ్గు, దానిమీద దుప్పటి పరచుకొని మరో దుప్పటి కప్పుకుంటాను (రగ్గులు నెలల తరబడి ఉతకరు అని ఎన్నోసార్లు విన్నాను, వాటిని ఎంతబాగా టాయ్‍లెట్ల దగ్గర, ప్లాట్‍ఫారాల మీద దొర్లిస్తారో కళ్ళారా చూసాను, అందుకని చచ్చినా కప్పుకోను). కాని ఆరోజు కోచ్ లో బాగా చలిగా ఉండడంతో చాలా సేపు నిద్రపట్టక బెర్త్ మీద దొర్లుతూనే ఉన్నాను. మిగతా వాళ్ళని చూస్తే అందరూ రగ్గుల్లో ముసుగుతన్ని పడుకున్నారు. నేను ఆ చలి భరించలేక అర్ధరాత్రి దాటాక అటెండెంట్ కోసం వెదికి, విఫలమై టి.టి కనిపిస్తే అతగాడిమీద ఫైర్ అయిపోయాను..! ఇది రైలు పెట్టా, మార్చురీయా.. అంటూ..!! ఎవర్నైనా పంపుతానన్నాడు కాని ఎవడూ రాలేదు.    
సుమారు 3.30 అవుతూంటే ఇక లాభంలేదని పై దుప్పటి మీద రగ్గు కప్పుకొని పడుకున్నాను. ఆ పడుకోవడం గాఢంగా నిద్ర పట్టేసింది. ఎప్పుడూ నేను 5.00 – 5.30 మధ్యలో లేచిపోతాను. ఎప్పటినుంచో అదే అలవాటు. ఈ ట్రైన్ 6.15 కి కదా అని అలారం కూడా పెట్టుకోలేదు. అదే నా కొంప ముంచింది. విజయవాడ స్టేషన్ వచ్చే టైముకి బాగా నిద్ర పట్టేసింది. స్టేషన్ దాటిపోయాక మెలకువ వచ్చింది. తెలివొచ్చి చూస్తే చుట్టూ నిశ్శబ్దం..! నా కుపే అంతా ఖాళీగా ఉంది. ఒక్క ఉదుటన క్రిందికి దిగి చూద్దును కదా ట్రైన్ చాలా వేగంగా వెళ్ళిపోతోంది. విజయవాడ ఇంకా రావాలో దాటిపోయిందో అర్థం కాలేదు. మిగతా కోచ్ లో చాలా పలచగా ఉన్నారు జనం, ఆ ఉన్న కొద్దిమందీ పడుకొని ఉన్నారు. ఫోన్ లో సిగ్నల్ లేదు. ఎవర్ని అడగాలా అని అనుకుంటూ ఫోన్ లో సిగ్నల్ రాగానే చూస్తే గుండె గుభేల్ మంది. విజయవాడ ఆరున్నరకి వదిలేసి ఇప్పుడు కాజీపేట దిశగా పరుగులు పెడుతోంది ట్రైన్. ఏంచెయ్యాలో తెలియలేదు. సామాను పట్టుకొని గేట్ దగ్గరకి వెళ్ళిపోయాను.
VSKP LTT EXP విజయవాడ దాటితే మళ్ళీ నెక్స్ట్ హాల్ట్ కాజీపేట అని చూపిస్తోంది. నాకేమో విజయవాడలో మీటింగ్ ఉంది. ఇంక చూసుకో.. గేట్ దగ్గర నిలబడి ఎక్కడ స్లోఐతే అక్కడ దూకేద్దామని కాసుకు కూర్చున్నాను. ట్రైన్ ఎక్కడా అస్సలు ఆగలేదు, స్లో అవలేదు..
అప్పుడు కనబడ్డాడు మా టి.టి..! ఇతడు విజయవాడలో ఎక్కాడు. మాకోచ్ లోకి అదే రావడం..!! నావాలకం చూసి సంగతేంటని అడిగి అప్పుడు తాపీగా చెపాడు.. ప్రొద్దున్న ఆరు గంటలకే విజయవాడ చేరిన బండి, అరగంట ఆగిందిట. ఒకరిద్దరు దిగారు కూడానట..! ఐనా నాకు తెలివి రాలేదు. సరిగ్గా స్టేషన్ దాటిన 20-25 ని. లకి తెలివొచ్చింది. విజయవాడలో నా బెర్త్ లోకి ఎవరూ రాలేదు. టి.టి, అటెండర్‍లకి నేనేమీ చెప్పలేదు, అక్కడ ఎవ్వరూ జాయినవ్వక పోవడంతో వాళ్ళూ నన్ను గమనించలేదు, లేపలేదు..!
ఒక రెండున్నర గంటల ప్రయాణం తరువాత మధిర స్టేషన్ దగ్గర కొంచం స్లో అయింది. ప్లాట్ ఫాం పక్కనుంచే వెళ్తోందని దూకబోయేసరికి టి.టి. వచ్చి అలాంటి సాహసాలు చెయ్యొద్దని చెప్పాడు. ఆ స్పీడుకి దొర్లి ట్రైన్ కిందకి వచ్చేసిన వాళ్ళని చూసామన్నాడు. ఎందుకంత రిస్కని విరమించుకొని మళ్ళీ వెళ్ళి సీటులో కూర్చున్నాను. మరి కొంత దూరం పోయాక బోనకల్లు అనే ఊరి దగ్గర సిగ్నల్ లేక ట్రాక్ మీదే ఆగింది ట్రైన్. చుట్టూ పొలాలు ఉన్నా, రోడ్డు ఏదో కాస్త దగ్గరలోనే కనిపిస్తోంది..! సరే ఏదైతే అయ్యిందని నా స్ట్రాలీ బ్యాగ్‍తో పాటు అక్కడ దిగిపోయాను.
దగ్గరే అనుకున్న రోడ్డు ట్రాకు పక్కన కంకర రాళ్ళకుప్పల మీదా, తుప్పలకి అడ్డంబడి, అరగంట నడిస్తేగాని రాలేదు. బ్యాగు లో లాప్ టాప్, షూస్, మీటింగ్ కి కావలసిన డ్రాయింగ్స్, బట్టలు, - ప్రతి సారీ తీసుకెళ్ళేవే - ప్లాట్‍ఫారం పైన చక్రాల  మీద లాగుతూ చాలా సౌకర్యవంతంగా ఉంది అనుకున్నది కాస్తా ట్రాకు పక్కన రాళ్ళమీద ఎత్తుకొని నడుస్తూ ఉంటే దాని బరువెంతో చేతులకి బాగా తెలిసొచ్చింది. తీరా రోడ్డు చేరాక అది మట్టి రోడ్డు, దుమ్ము మయం..!!
ఆ మట్టి రోడ్డు నుంచి ఊరి సెంటర్ కి ఇంకో పావుగంట పెట్టి ఈడ్చుకుంటూ నడిచి మొత్తానికి బస్టాప్ చేరాను.
అక్కడకి ఖమ్మం నుంచి రావాలట బస్సులు..! ఎంతకీ రావు..! బెజవాడకి టాక్సీలు ఏమైనా ఉంటాయేమోనని ఆరాతీస్తే రెండున్నర వేలవుతుందన్నాడు..!! వేలే..!!? రూపాయలే..!!?? అమ్మయ్యో అనుకొని.. ఆఖరికి ఒక ఆటో వాడితో మాట్లాడితే ఇంకాస్త పై జంక్షన్‍కి హైవే దాకా వెళితే అక్కడికి బస్సులొస్తాయని, రెండు వందలు ఇమ్మన్నాడు. బేరమాడితే నన్ను  ₹150/- అడిగాడు, ఇంకా మరో ఇద్దరు ముగ్గుర్ని కూడా ఎక్కించుకోనివ్వాలన్నాడు. సరే ఏదో ఒకటి ఏడూ అని ఆ ఆటో ఎక్కి కూర్చున్నాను. అది మొదలు.. వాడు మనిషి కనబడగానే ఆటో ఆపేసి త్రోవలో ఊళ్ళపేర్లు చెప్పి అరవడం మొదలు పెట్టాడు. అలా జనాలని ఎక్కిస్తూ, దింపుతూ షేర్ ఆటో టిక్కెట్లన్నీ కిట్టుబాటు చేసుకొని వాడు చెప్పిన ఆ చిలకల్లు అనే ఇంకో ఊరికి చేర్చాడు. అది హైవే కి ఆనుకొని ఉంది. బస్సుల ఫ్రీక్వెన్సీ కాస్త ఎక్కువ అన్నారు.
ఒక అరగంట వెయిట్ చేస్తే మొత్తానికి RTC వాళ్ళది ఏదో పాసింజర్ బస్సు వస్తే అదెక్కి సుమారు 12:30 దాటాక చేరాను బెజవాడ..!
విజయవాడ పోలీస్ కమిషనర్ తో మీటింగ్..! అదృష్టవశాత్తూ ప్రత్యేకించి టైమ్ తీసుకోలేదు కలవడానికి. బెజవాడ చేరాక ఫోన్ చేస్తే మధ్యాహ్నం మూడు గంటలకి రమ్మన్నారు. మొత్తానికి మీటింగ్ బాగానే జరిగింది. ఆయన DGP దగ్గరకి కూడా సాయంత్రం తీసుకెళ్ళి నా డిజైన్ explain చేయించారు. ఆయనతో ఒక నలభై ఐదు నిముషాలు ప్రెజెంటేషన్.. అదికూడా బాగా జరిగింది. He was impressed and approved our proposal and design..!
ఆ విధంగా చివరికి కథ సుఖాంతమైంది. 😊😇👍
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)