Sunday, December 26, 2010
శ్రీ పశుపతినాధేశ్వర దర్శనం
Friday, December 17, 2010
తంబురా శ్రుతి..!!

Tuesday, November 30, 2010
తనికెళ్ళ భరణి...పక్కన్నేను...!!

చెన్నై వెళ్ళడానికి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేస్తూ వుండగా..తనికెళ్ళ భరణి కనిపించారు..!!! సినిమా వాళ్ళలో ప్రత్యేకించి వీరాభిమానం లేదుకానీ (ఒక్క ఎన్టీయార్ తప్ప) భరణి గారి నటన లో వైవిధ్యం, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ లో టైమింగ్ నాకు చాలా నచ్చుతుంది. బ్లూ జీన్స్, ఎల్లో టీ - షర్టు వేసుకొని, laptop బాగ్ లాంటిది భుజాన తగిలించుకొని...తన ఫ్రెండ్ (అనుకుంటా )తో మాట్లాడుతూ.. సెక్యూరిటీ చెక్ కి వెళ్తున్నారు. ఒక పది మంది వెనుక గా నేనూ, మా ఫ్రెండ్ విజయ్ వున్నాం. నుదుట విభూతి పట్టీలతో నేను సినిమాల్లో చూసి ఊహించిన దాని కంటే చాలా different గా వున్నారు..!! వెళ్లి పలకరిద్దామా...వద్దా...అనే సందిగ్ధం లో పడ్డాను. సినిమా వాళ్ళు కదా..పలకరిస్తే లెవెలిచ్చేస్తారేమో..అని ఒకపక్క , ఆయన్ని ఎలాగైనా కలిసి మాట్లాడనే ఉత్సుకత ఒకపక్క...!! కానీ రెండోది కనబడకుండా మనసులో మూలగా చిన్న అహం / సంశయం.. ఆయన్ని సినిమా రంగానికి చెందినాయన గా మాత్రమే తెలిసిన మా ఫ్రెండ్ తో ఆయన గురించి చెప్తూ ( గుసగుసలే..) లైన్ తిరుగుతూ వుండగా ఒకరికొకరం ఎదురుపడ్డాం.
నేను చిన్ననవ్వు నవ్వి విష్ చేసాను... ఆయన కూడా పలకరించి సెక్యూరిటీ చెక్ కి వెళ్ళిపోయారు.. మా ఫ్రెండ్ ముందు చిన్న గర్వం ఫీల్ అయ్యాను.
మేము కూడా చెకింగ్ పూర్తి చేసుకొని lounge లోకి వెళ్ళాము. అక్కడ కాఫీ తాగుతూ వాళ్ళ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారు.(అన్నట్లు.. ఇందాక చెప్పడం మర్చిపోయాను..!! తనికెళ్ళ భరణి గారి తో పాటూ సుబ్బారావు గారనీ ఆయన కూడా వున్నారు. మాకు వైజాగ్ లో ఆయనతో కొద్దిగా పరిచయం ఉంది.) ఇంతలో సుబ్బారావుగారు నన్ను చూడడం, పలకరించడం తటస్థించింది. ఆయనదీ మాదీ ప్రొఫెషనల్ పరిచయం అవడం.. అదీ చాలా రోజుల తర్వాత కలవడం తో..కుశల ప్రశ్నలు అయ్యాకా..మాటల్లో ఆయన ఏదో పనిమీద భరణి గారితో కలిసి హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పారు. వెంటనే నేను ఆయన్ని అడిగాను 'మరి మమ్మల్నీపరిచయం చెయ్యండీ '. ఆయన భరణి గారి దగ్గరకి తీసుకెళ్ళారు. నేను పరిచయం చేసుకున్నాను..ఆయన కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆయన పక్కనే కూర్చున్నాను.
'మీ అభిమానినండీ..' అన్నాను.. 'సినిమాలలో అనితర సాధ్యమైన మీ నటన చూసి మీకు చాలా మంది మీకు అభిమానులౌతారు..! కానీ నేను మీ లోని రచయితనీ, సాహితీవేత్తని చూసి మీకు అభిమానినయ్యను.!!' ఇలా మొదలయ్యాయి మా మాటలు...!!
వారు రాసిన 'ఎందఱో మహానుభావులు' (మొదట 'హాసం' పత్రిక లో ధారావాహిక గా వచ్చి.. పుస్తకంగా మళ్ళీ ముద్రితమైనది.) నాకు చాలా నచ్చిన పుస్తకం. దానిలో అంతగా ప్రముఖులు కాని సంగీత విద్వాంసులను ఎందరినో పరిచయం చేసారు. ఆ పరిచయం కూడా రెండు మూడు పేజీలలో ఆ విద్వాంసుల జేవితంలోని ముఖ్యమైన ఘట్టాలని చిత్రిస్తూ , భరణి గారు చూపిన నాటకీయత, కథనంలో ఆ వడి..మనల్ని ఆగకుండా చదివేలా చేస్తాయి. ఇదే వారితో అంటే..'ఏదో.. కొంచం రిసెర్చ్ చేసి రాసాను లెండి...' అన్నారు..!! అలాగే వారు రాసిన 'ఆట గదరా శివా ' గురించి కూడా కొద్ది సేపు ముచ్చటించుకొని... మా ఫ్లయిట్లకి టైం అయిపోవడం తో..వారి దగ్గర సెలవు పుచ్చుకొని బయలుదేరిపోయాం...!
(మళ్ళీ ఇంటికి వచ్చిన వారానికి అనుకుంటా.. ' తనికెళ్ళ భరణి పాతికేళ్ళ సినీ ప్రస్థానం ' అంటూ సుమారు అన్ని పేపర్లూ చానెల్స్ లోనూ, వారితో ఇంటర్వ్యూలూ, ప్రత్యేక కథనాలూ వచ్చాయి ..! ఇంచుమించుగా అదే సమయంలో నేనాయన్ని కలవడం కాకతాళీయమైనా అదో మంచి ఫీలింగ్...!!) తీరా ఆయన వెళ్ళిపోయాక...బుర్రకి వెలిగింది.. ఆయన ఆటోగ్రాఫ్ కానీ, కలిసి ఫోటో అయినా తీసుకోలేదే అని..! అయ్యో అనుకున్నాను..! నన్ను బాగా ఫీలవనిచ్చి... మా చర్చకి కి మౌన ప్రేక్షకుడైన నా స్నేహితుడు విజయ్..తన సెల్ ఫోన్లో తీసిన ఫోటో చూపించి..నన్ను థ్రిల్ లో ముంచేశాడు. దటీజ్ మై ఫ్రెండ్ విజయ్...!!

Sunday, November 28, 2010
రాజకీయ ప్రేక్షకుడు..!!
forward it until it reaches the PM
అదీ విషయం!! అంతేనా అనేశారా..? చిన్న నవ్వు కూడా వచ్చిందా?? మావాడే.. సరీగా అర్ధం చేసుకోడు..! ఆవేశం ఎక్కువ..!!
అంతేనా.. అంటే ఇంకా వుందండీ..! అంటూ మరో ఇన్ని ఏకరువు పెడతాడు..!! ఇలాంటి చిన్న చిన్న విషయాలని భూతద్దం తో చూసి బుర్రపాడుచేసుకుంటాడు. ఈ sms చూసి నేను నవ్వొచ్చిందంటే.. వాడు బ్లడ్ బాయిల్ అయిపోతోందంటాడు..! PM గారు పాపం ఆయనే బోల్డు తలనెప్పుల్లో వుంటే ఇంకా ఇబ్బంది పెడతానంటాడు..వీడేం బాధ్యత గల పౌరుడండీ..!!
ఇప్పుడూ..
అట్టహాసంగా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది...'వెయ్యో పదో లంచం తీసుకుంటూ red handed గా పట్టుబడ్డ ఫలానా..ACB వలలో చిక్కిన వైనం..' మొహం దాచుకుంటూ.. కెమెరా కంట పడకుండా తప్పించుకొనే ప్రయత్నం లో ఉన్న సగటు ఉద్యోగి.. !! ఆ మొహం సరిగ్గా కనపడేలా చేతుల్ని అడ్డం తీసే అధికారులూ..!! రోజంతా అదే చూపిస్తారు..!!! ఇంకో పక్క లక్షల కోట్ల స్కాం లకు సూత్రధారులు..పాత్రధారులూ ఐన మన నాయకమ్మన్యులు..!! సాక్ష్యాలు అన్నీఎదురుగా కనిపిస్తున్నా...
బోరవిరుచుకొని మరీ 'నాకేమీ తెలీదు..ఇదంతా ప్రతిపక్షాల కుట్ర...' అని దబాయించేసి ( సారీ..ఉన్నమాట చెప్తే, అది 'నిజం' అవుతుంది కానీ.. దబాయింపు ఎందుకవుతుందీ?? అంచేత 'వక్కాణించి' అని చదూకోండి.. ) నవ్వుతూ..జోకులేస్తూ..కాలరెగరే
'కక్కుర్తి పడితే కడుపైనా నిండాలంటారు'... ఈ సామెత 'పై ఇద్దర్లో' మొదటాయనకి తెలిసినట్టు లేదు..బొత్తిగా మొహమాటం..!!
రెండో అతను ధర్మదాత !! తాను తినీ మరో పదిమందికి పెట్టే పుణ్యాత్ముడు..!! ఆ సామెతని పదిసార్లు చదూకొని మరీ తత్వం బోధపరుచున్న (స్వయం)కృషీవలుడు !! 'దేశాన్ని దోచేస్తున్నారో' యని అరవక్కర్లేదు కనీసం సణుగుడు వినిపించినా కూడా కారుదిగి మరీ ' చట్టం తన పని తాను చేసుకు పోతుంది..ఈ స్కాం తుదికంటా దర్యాప్తు జరిపించి..ఎంతటి వాడి మీదైనా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చే పెద్దమనిషి!!
దేశంలో ఇలాంటి మామూలు విషయాలకి ఆశ్చర్యపోయి, నోరెళ్ళబెట్టి, తెగాలోచించేసి, ఆవేశం తెచ్చుకోడం ప్రయోజకత్వం కాదురా అబ్బాయి అంటే మా వాడికి అర్ధం కాదేం...?? పాయింటు సరిగ్గా కాచ్ చేసినట్టు లేదు ..
బస్సు స్టాప్ లో జేబుకోడుతూ ఒక దొంగ దొరికాడనుకోండి..వాడిని అక్కడే స్తంభానిక్కట్టేసీ దేహశుద్ధి చేస్తాం..! కొన్నిప్రాంతాల్లో చచ్చేదాకా కొడతారు. అది మన జన్మహక్కు కదా..!! అదే ఏ MLA గారో, ముఖ్యమంత్రిగారో.. ఒక పెద్ద స్కాం చేసారనుకోండి..పాపం పదవి కూడా పోయిందనుకోండి..వారిని నెత్తి నెక్కించుకొని ఓటేసి మరీ వారిని మళ్ళీ ముఖ్యమంత్రి గానో కేంద్ర మంత్రి గానో..ప్రోమోట్ చేసేసి వారి ప్రయోజకత్వానికి..అంగీకార ముద్ర వేసేస్తాం. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంకా పెద్ద స్కాం చేసేసరికి.. చిన్న దెబ్బ మీద పెద్ద దెబ్బలాగా పాతది మర్చిపోతాం..!! ఈ పెద్దమనుషులంత గణిత శాస్త్ర వేత్తలు మరొకళ్ళు లేరు. అంకెల్లో ఒకదాని కంటే పెద్దది ఇంకోదాన్ని ఉపయోగం లోకి తెస్తున్నారు. కొత్త అంకె పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలా అని మన లెక్కెట్టుకొనే లోపల ఇంకా పెద్దది వాడుక లోకి తెచ్చేస్తున్నారు. ఈ తరహా applied mathematics మామూలు గణిత శాస్త్రవేత్తలకి చేత అవుతుందా చెప్పండి??
అయిదారేళ్ళ క్రితం 12 కోట్లు సోమ్ములుపోనాయి మరేటి సేత్తాం అంటూ మనకంటే ఎక్కువ ఆశ్చర్యం, అమాయకత్వం (ప్రెస్ మీట్ పెట్టి మరీ...) ఒలకబోసిన మంత్రి గారిని చూసి గుండెలు బాదేసుకున్నాడు మావాడు..!! ఇప్పుడీ లక్షా డెబ్భైఆరు వేల కోట్లు స్కాం చూసి ఏమైపోతాడో.. పాపం !!! నేనంటానూ...అయిదారేళ్ళలో 12 కోట్ల టర్నోవర్ ని, సున్నాలు చుట్టలేనంత స్థాయికి తీసుకెళ్లడం.. ఆహా!! ఏం ఘనత..ఏం అభివృద్ధి...!!!
ఇలాంటివి చూసీ జీర్ణించుకోలేక ఏదోరకంగా తన గొంతు విప్పాలనిపించీ బుల్లి తెర పంచాయితీకి (అదే మన TV Talk Show) వెళ్ళాడు. లోకల్ కాదండోయ్...నేషనలే!! అంత పేరున్నవాడు కాదు కాబట్టీ ప్రేక్షకుడిగా రానిచ్చారు. పానెల్ సభ్యులుగా ప్రముఖ రాజకీయ పార్టీల నుంచీ పేరెన్నిక గన్న పెద్దలూ, మేధావులూ..విచ్చేశారు. టాపిక్ మొదలైనదే ఆలస్యం.. అందరూ ఒకటే అరుపులూ, కేకలూ.. ఎవరేం మాట్లాడుతున్నారో ఏమీ అర్ధం కాలేదు. ఈలోగా బ్రేక్...! విపక్షం వాళ్ళు జరిగిన స్కాం గురించి అడిగితే మీకసలు అడిగే అర్హత లేదన్నారు...ఈ పక్షం వాళ్ళు! మీ నిర్వాకం ముందు మాదెంతని కడిగేశారు..! జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామని వీరంటే.. విషయం అంత పెద్దదేమీ కాదని తేల్చేసారు..!! (దీనికన్నా పెద్దది వండి వార్చడానికి రంగం అప్పటికే సిద్ధం అవుతోందేమో!!) ఒకవేళ చెయ్యవలసి వస్తే మీ హయాం లో జరిగినవన్నిటి మీదా దర్యాప్తు చేసినతర్వాత మా వంతంటారు..!! ఏంకర్ తన దగ్గరున్న సాక్ష్యాల లాంటి documents అన్నీ ఏకరువు పెడితే 'అవన్నీ కోర్టు, దర్యాప్తు సంస్థల పరిధి లో వున్నాయి కాబట్టీ' మాట్లాడకూడదంటారు. . రాజ్యాంగ వ్యవస్థని, చట్టాల్ని మరింత పటిష్టం చేయాలంటారు..మళ్ళీ ఇంకో బ్రేక్..!! తర్వాత ప్రేక్షకుల వంతు..ప్రశ్నలడిగారు...సమాధానం మాత్రం లేదు..! మావాడూ అడిగాడు... అందరూ ఘొల్లున నవ్వారు. మొహమాటానికి మావాడూ నవ్వాడు. అన్ని లక్షల కోట్ల వ్యవహారాన్నీ సింపుల్ గా నవ్వులతో ముగించి...గట్టిగా చప్పట్లు కొట్టేసారు...!! అందరికీ చెయ్యిచ్చి... స్వపక్షం, విపక్షం చెట్టా పట్టాలేసుకొని...వారి వారి వాక్పటిమని తలుచుకుంటూ గర్వంగా కారేక్కేసారు..!!! మనం మళ్ళీ మన అలవాటైన ప్రేక్షక పాత్ర లో జీవిస్తూ తరిస్తాం. *****
ఇప్పుడే ఇంకో SMS వచ్చింది :
Most of the 1st Class students get technical seats, become doctors and engineers.
some of the 2nd class, pass MBA become Administrators and controll the 1st class!
some of the 3rd class enter politics, become ministers and control them both..!!
and some of the failures join the under world and control them all....!!!
శుభం!
Sunday, October 31, 2010
శ్రీ వేంకటేశ్వర..!!
పై రచనను గమనిస్తే ఇది ఒక చిత్ర కవిత్వం గా బోధపడుతుంది.
మొత్తం పన్నెండు పాదాలు. ప్రతీ పాదం లోనూ ముప్పై ఆరు అక్షరాలు. పాదం మొదలూ చివరా ఒకే అక్షరం ఉంది.. మొత్తం పన్నెండు పాదాలూ కలిపి నిలువుగా మొదటి అక్షరాలను కలిపి చదివితే ' వేంకటేశ్వర' దర్శనమవుతుంది...! అలాగే చివరి అక్షరాలు కూడా...!! మధ్యలో స్వామి గురించిన ప్రశస్తి. ఆది మధ్యాంతరహితుడైన ఆ స్వామిని ఒక చిన్న కవిత లో ప్రత్యేకించి ఆది అంత్యాలలోదర్శించడం చిత్రం గా లేదూ..!!
ఇది మా పెదనాన్నగారు శ్రీ రుద్రావఝల రామకృష్ణా రావు గారి చిత్రమైన రచన. వారు భిలాయినగర్ వాస్తవ్యులు. అక్కడి స్టీల్ ప్లాంట్ లో సీనియర్ అక్కౌంట్స్ మేనేజరు గా పనిచేసి రిటైర్ అయ్యారు. భిలాయి లోనే స్థిరపడ్డారు. వారు తెలుగు గడ్డకి దూరంగా వున్నా తన రచనా వ్యాసంగం కొనసాగించిన సాహితీ వేత్త. తెలుగు, హిందీ ఇంగ్లీషు భాషలలో వారివి ఎన్నో రచనలు సుమారు అన్ని తెలుగు దిన, వార పత్రికల లోనూ అలాగే సప్తగిరి, మిహిర మొదలైన ఆధ్యాత్మిక పత్రికల లోనూ అచ్చయ్యాయి. వారు చాలా వ్యాసాలూ, శీర్షిక లూ, కధలూ కూడా వ్రాసి శ్రీ కాళీపట్నం రామారావు మొదలైన సాహిత్య దిగ్గజాల మెప్పు పొందారు. తన అనుభవం లోకి వచ్చిన చిన్నచిన్న సంఘటనలే ఇతివృత్తంగా తీసుకొని వాటిని రచనలుగా మలచడంలో దిట్ట.
(శ్రీ రుద్రావఝల రామకృష్ణా రావు ఈ అక్టోబర్ 22 కి డెబ్భై ఏడో వసంతం లోకి అడుగు పెట్టిన సందర్భంగా... ఆయురారోగ్యాలతో వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలనీ వారిపై శ్రీ వేంకటేశ్వర కృప ఎల్లప్పుడూ ఉండాలనీ ప్రార్ధిస్తూ...- కుటుంబ సభ్యులందరి తరఫునా ...- రాధేశ్యాం )