చెన్నై వెళ్ళడానికి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేస్తూ వుండగా..తనికెళ్ళ భరణి కనిపించారు..!!! సినిమా వాళ్ళలో ప్రత్యేకించి వీరాభిమానం లేదుకానీ (ఒక్క ఎన్టీయార్ తప్ప) భరణి గారి నటన లో వైవిధ్యం, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ లో టైమింగ్ నాకు చాలా నచ్చుతుంది. బ్లూ జీన్స్, ఎల్లో టీ - షర్టు వేసుకొని, laptop బాగ్ లాంటిది భుజాన తగిలించుకొని...తన ఫ్రెండ్ (అనుకుంటా )తో మాట్లాడుతూ.. సెక్యూరిటీ చెక్ కి వెళ్తున్నారు. ఒక పది మంది వెనుక గా నేనూ, మా ఫ్రెండ్ విజయ్ వున్నాం. నుదుట విభూతి పట్టీలతో నేను సినిమాల్లో చూసి ఊహించిన దాని కంటే చాలా different గా వున్నారు..!! వెళ్లి పలకరిద్దామా...వద్దా...అనే సందిగ్ధం లో పడ్డాను. సినిమా వాళ్ళు కదా..పలకరిస్తే లెవెలిచ్చేస్తారేమో..అని ఒకపక్క , ఆయన్ని ఎలాగైనా కలిసి మాట్లాడనే ఉత్సుకత ఒకపక్క...!! కానీ రెండోది కనబడకుండా మనసులో మూలగా చిన్న అహం / సంశయం.. ఆయన్ని సినిమా రంగానికి చెందినాయన గా మాత్రమే తెలిసిన మా ఫ్రెండ్ తో ఆయన గురించి చెప్తూ ( గుసగుసలే..) లైన్ తిరుగుతూ వుండగా ఒకరికొకరం ఎదురుపడ్డాం.
నేను చిన్ననవ్వు నవ్వి విష్ చేసాను... ఆయన కూడా పలకరించి సెక్యూరిటీ చెక్ కి వెళ్ళిపోయారు.. మా ఫ్రెండ్ ముందు చిన్న గర్వం ఫీల్ అయ్యాను.
మేము కూడా చెకింగ్ పూర్తి చేసుకొని lounge లోకి వెళ్ళాము. అక్కడ కాఫీ తాగుతూ వాళ్ళ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారు.(అన్నట్లు.. ఇందాక చెప్పడం మర్చిపోయాను..!! తనికెళ్ళ భరణి గారి తో పాటూ సుబ్బారావు గారనీ ఆయన కూడా వున్నారు. మాకు వైజాగ్ లో ఆయనతో కొద్దిగా పరిచయం ఉంది.) ఇంతలో సుబ్బారావుగారు నన్ను చూడడం, పలకరించడం తటస్థించింది. ఆయనదీ మాదీ ప్రొఫెషనల్ పరిచయం అవడం.. అదీ చాలా రోజుల తర్వాత కలవడం తో..కుశల ప్రశ్నలు అయ్యాకా..మాటల్లో ఆయన ఏదో పనిమీద భరణి గారితో కలిసి హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పారు. వెంటనే నేను ఆయన్ని అడిగాను 'మరి మమ్మల్నీపరిచయం చెయ్యండీ '. ఆయన భరణి గారి దగ్గరకి తీసుకెళ్ళారు. నేను పరిచయం చేసుకున్నాను..ఆయన కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆయన పక్కనే కూర్చున్నాను.
'మీ అభిమానినండీ..' అన్నాను.. 'సినిమాలలో అనితర సాధ్యమైన మీ నటన చూసి మీకు చాలా మంది మీకు అభిమానులౌతారు..! కానీ నేను మీ లోని రచయితనీ, సాహితీవేత్తని చూసి మీకు అభిమానినయ్యను.!!' ఇలా మొదలయ్యాయి మా మాటలు...!!
వారు రాసిన 'ఎందఱో మహానుభావులు' (మొదట 'హాసం' పత్రిక లో ధారావాహిక గా వచ్చి.. పుస్తకంగా మళ్ళీ ముద్రితమైనది.) నాకు చాలా నచ్చిన పుస్తకం. దానిలో అంతగా ప్రముఖులు కాని సంగీత విద్వాంసులను ఎందరినో పరిచయం చేసారు. ఆ పరిచయం కూడా రెండు మూడు పేజీలలో ఆ విద్వాంసుల జేవితంలోని ముఖ్యమైన ఘట్టాలని చిత్రిస్తూ , భరణి గారు చూపిన నాటకీయత, కథనంలో ఆ వడి..మనల్ని ఆగకుండా చదివేలా చేస్తాయి. ఇదే వారితో అంటే..'ఏదో.. కొంచం రిసెర్చ్ చేసి రాసాను లెండి...' అన్నారు..!! అలాగే వారు రాసిన 'ఆట గదరా శివా ' గురించి కూడా కొద్ది సేపు ముచ్చటించుకొని... మా ఫ్లయిట్లకి టైం అయిపోవడం తో..వారి దగ్గర సెలవు పుచ్చుకొని బయలుదేరిపోయాం...!
(మళ్ళీ ఇంటికి వచ్చిన వారానికి అనుకుంటా.. ' తనికెళ్ళ భరణి పాతికేళ్ళ సినీ ప్రస్థానం ' అంటూ సుమారు అన్ని పేపర్లూ చానెల్స్ లోనూ, వారితో ఇంటర్వ్యూలూ, ప్రత్యేక కథనాలూ వచ్చాయి ..! ఇంచుమించుగా అదే సమయంలో నేనాయన్ని కలవడం కాకతాళీయమైనా అదో మంచి ఫీలింగ్...!!) తీరా ఆయన వెళ్ళిపోయాక...బుర్రకి వెలిగింది.. ఆయన ఆటోగ్రాఫ్ కానీ, కలిసి ఫోటో అయినా తీసుకోలేదే అని..! అయ్యో అనుకున్నాను..! నన్ను బాగా ఫీలవనిచ్చి... మా చర్చకి కి మౌన ప్రేక్షకుడైన నా స్నేహితుడు విజయ్..తన సెల్ ఫోన్లో తీసిన ఫోటో చూపించి..నన్ను థ్రిల్ లో ముంచేశాడు. దటీజ్ మై ఫ్రెండ్ విజయ్...!!