విశాఖపట్నం లో ఈఫిల్ టవర్ ఏమిటా అని డౌట్ పడుతున్నారు కదా..!! పైగా ఒకటి కాదు రెండు. ఒక వెల్డింగ్ షాప్ అతను (ఆయనే యజమాని)ఈ అపురూప కట్టడాన్ని తన వర్క్ షాప్ లో తయారు చేసారు. మొదట నాలుగున్నర అడుగుల ఎత్తులో బుజ్జి ఈఫిల్ టవర్ ని తయారుచెయ్యడానికి 28 గంటల సమయం పట్టిందిట. రెండోది ఎనిమిదడుగులకు పైగా ఎత్తు వచ్చేట్టు ఈసారి 23 గంటల్లోనే మళ్ళీ తయారు చేసారు. కేవలం ఈఫిల్ టవర్ కి సంబంధించిన ఫోటోలను చూసి తయారుచేసారట. ఆ shape, proportions, దానికి సంబంధించిన technical drawings ఏమీ లేకుండా అంత ఖచ్చితంగా చేయడం గొప్పే కదా..!!
విశాఖపట్నం లో పెదవాల్తేరు లోని 'విశాఖ ఐ హాస్పిటల్' డౌన్ దిగి వెళ్తున్నవారందరికీ రోడ్డు పక్కనే వున్న 20 అడుగుల డైనోసార్లూ, 30 అడుగుల డ్రాగన్లూ కనిపించి ఒకింత ఆశ్చర్యానికి గురిచేయ్యక మానవు. అన్నీ ఐరన్ ఫ్రేము తో చేసినవే..! అయితే ఇవేవీ ఏదో ఆర్డర్ మీద చేసినవి కాకపోవడం విశేషం. ఆ షాప్ యజమానీ, స్వతహాగా వర్కర్ కూడా ఐన శ్రీ రమేష్.. ఈ వింతల సృష్టి కర్త. కేవలం తన అభిరుచినీ, సృజననీ మేళవించి చేసే కళా రూపాలే ఇవన్నీ..! ఇష్టపడి చేసే పని కష్టమనిపించదు కదా..!! అదే తన విజయ రహస్యం కూడా. ఇలాటివి చెయ్యడానికి ఖర్చు అవుతుంది కానీ, పని పూర్తయ్యాక వచ్చే తృప్తి (job satisfaction) ముందు ఆ ఖర్చు దిగదుడుపే అంటాడు. దారిన పోయే ఎందరినో..ఒక్క క్షణం ఆ షాపు వైపు చూసేలా చేసే ఈ కళా రూపాల సృష్టి కర్త రమేష్ ను తప్పక అభినందించాలి.
దీనిని పిల్లలు ఎక్కగలిగే సైజులో చెయ్యాలని అతని లక్ష్యం, సంకల్పం! అతని మాటల్లో చెప్పాలంటే కిందనున్న ఆర్చ్ హైట్ పదడుగులు వచ్చేలా చేస్తారట.అంటే మొత్తం పొడవు సుమారు తొంభై అడుగుల పైమాటే..!! త్వరలోనే శ్రీ రమేష్ తప్పక విజయం సాధిస్తారని ఆశిద్దాం.