హైదరాబాదులో వినాయక చవితి ఎంత కోలాహలం గా చేస్తారో మనకి తెలియంది కాదు. చూడముచ్చటైన గణేశ ప్రతిమలు రోడ్డుప్రక్కన ఉన్నచిన్నచిన్నగుడిశలలోని కళాకారుల చేతిలో ప్రాణం పోసుకుంటాయి. ఇక్కడి నుంచి విగ్రహాలు ఇతర ప్రాంతాలకి కూడా ఎగుమతి అవుతాయి. రేపు జరగబోయే గణపతి నవరాత్రి మహోత్సవాలకి కొలువుతీరడానికి సిద్ధంగా ఉన్న అలాంటి విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకొంటున్న తరుణంలో తీసిన ఫోటోలు ఇవి. (విశాఖపట్నం నుంచి తెలిసిన వాళ్ళు కొందరు హైదరాబాద్ వెళ్లి ఒక పదిహేడడుగుల భారీ విగ్రహం తెచ్చుకున్నారు. విగ్రహాల కోసం తిరుగుతూ నచ్చిన విగ్రహాల ఫోటోలు తీసారు. ఆ ఫోటోలు క్రింద చూడండి.
విఘ్నేశ్వరుడి విగ్రహ తయారీలో తుది మెరుగులు:
ఇక్కడి దాకా పోతపోసే అచ్చులుంటాయి కాబట్టీ ఒక రకం గా పని సులువే. కానీ ఇకపై ఉండేదంతా చేతితోనే చెయ్యాలి. అన్ని విగ్రహాల మీదా ఒకేరకమైన శ్రద్ధ చూపాలి. ఆహార్యం, అలంకరణ, ఆభూషణాలూ అన్నీ ముఖ్యమైనవే..!కళాకారుడి పనితనం తెలిసేది ఈ చివరి అంకంలోనే. ఒక్క మాటలో చెప్పాలంటే విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ.
మరింత పెద్ద విగ్రహాలు - ఎత్తు ముప్పై అడుగుల పైమాటే..!!
కానీ ఈవిగ్రహాలలో చాలా వరకు ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారుచెయ్యబడినవేనట. ఈసారి ప్రజలలో కూడా మట్టి విగ్రహాల వాడకంలో మంచి చైతన్యం వచ్చింది. అక్కడక్కడ ఇంకా కొందరు మాత్రం పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నూ, రసాయన పదార్ధాలు కలిసిన రంగులనూ వాడుతున్నారు. అయితే విశాఖపట్నం లో తయారవుతున్న రెండు అతి భారీ విగ్రహాలు మాత్రం పర్యావరణానికి అస్సలు హానిచేయని రీతిలో పూర్తిగా మట్టితోనే తయారయి "మట్టితో భారీ విగ్రహాలను తయారు చెయ్యడం సాధ్యమేనా..?" లాంటి అనుమానాలను పటాపంచలు చేసాయి. రెండిటి లో ఒకటి 117 అడుగులు (గాజువాక) కాగా రెండోది (ఎం.వీ.పీ. కోలనీ) 95 అడుగుల పొడవు.
క్రింద వీడియో చూడండి.
మట్టి విగ్రహాలు దొరికే స్థలాలూ, మరియు ఇతర వివరాల కోసం ఈ క్రింద చూపించిన లింకుల పై నొక్కండి.
వినాయక చవితి శుభాకాంక్షలు.