మా ఇంటి మేడ మీద గత నాలుగు రోజులుగా రాత్రి అయ్యేసరికి దర్శనమిస్తున్న గుడ్లగూబలు ఇవి. పొద్దున్న ఉండట్లేదు. ఎక్కడికి వెళ్తాయో తెలీదు. కానీ రాత్రి చీకటి పడగానే మళ్ళీ ప్రత్యక్షం అవుతున్నాయి. మా పిల్లలు గబ్బిలాలు అని ఒకసారి, గుడ్లగూబలు అని ఒకసారి అంటూ ఉంటే పెద్ద పట్టించుకోలేదు. నిన్న మా నాన్నగారు కూడా చెబితే చూసాను. గుడ్లగూబలు అంటే చిన్నప్పుడు చదివిన చందమామ సీరియల్ తోకచుక్క లో చతుర్నేత్రుడి బంటు ఊలూకుడి లాగా నల్లని శరీరంతో, చింత నిప్పుల్లా మెరిసే కళ్ళతో, దిక్కులు పిక్కటిల్లేలా కూత పెట్టే భయంకరమైన రూపమే తట్టే నాకు ఇవి చాలా అమాయకంగా కనిపించాయి. రెండు పక్షులు, ఎత్తు సుమారు 12 నుంచీ పదిహేను అంగుళాల పైనే ఎత్తు తో ఉన్నాయి. ఎగిరినప్పుడు వాటి రెక్కల అంచుల వరకూ సుమారు మూడడుగుల పైనే ఉంటుంది. పైగా చాలా నిశ్శబ్దం గా ఉన్నాయి.
సాధారణంగా ఒళ్ళంతా మట్టి రంగు ఈకలతో లైట్ బ్రౌన్ కలర్ లో చిన్నప్పుడు ఎప్పుడో చూసిన గుడ్లగూబలకు భిన్నంగా ఇవి ముందరి భాగం అంతా తెల్ల ఈకలతో ప్రత్యేకంగా కనిపించాయి. వెంటనే ఫోటోలు తీయటానికి ప్రయత్నించాను. బయట బాగా మబ్బు పట్టి కొంచం వర్షం కూడా పడుతూ ఉండడం తో చాలా చీకటి గా ఉంది. ఇంతలో మా మాటలూ, మా పిల్లల అరుపులతో అవి మాఇంటి మీదనుంచీ, పక్క వాళ్ళ మేడమీద వాలాయి. అప్పుడే ఫోటో తీశాను. దూరం గా వుండడం తో ఫోటోలు సరిగ్గా రాలేదు.
మాఇంట్లో కనిపించిన గూబలతో పోలిన గుడ్లగూబలని గూగిలీకరించి పేరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే కనిపించిన ఫోటో ఇది:
వీటిలో చాలా రకాలు వున్నాయిట. దగ్గరగా పోలినవి రెండు రకాలు కనిపించాయి. ఒకటి Common Barn Owl, రెండు Masked Owl. మాకు కనిపించినవి ఏవో ఖచ్చితంగా తెలియలేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.
నేను తీసిన ఫోటోలు:
సాధారణంగా చెట్లు ఎక్కువగా ఉండే పల్లెటూర్లలోనూ, పొలాల్లోనూ కనిపించే ఈ పక్షులు ఎలకలనీ, చిన్న చిన్న కోడిపిల్లల్నీ తిని బ్రతుకుతాయి. అలాంటిది ఇవి చెట్లన్నవే కనిపించని, మనుష్యులుండే హౌసింగ్ కాలనీలలోకి వచ్చేస్తున్నాయంటే, వాటి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వికిపీడియా లో చూస్తే ఈ ప్రాణులను కొన్ని దేశాలలో అంతరించి పోతున్న జాతులలో చేర్చారట. కానీ మనం ఇంకా వీటి గురించిన విషయాలో చాలా భయాలూ, భ్రమలతో ఉంటున్నాం. ఇవి ఇంటిమీద వాలితే మంచిది కాదని, దాని అరుపు వింటే అరిష్ఠమనీ (నిజానికి వాటి అరుపు వినగానే చంపెయ్యడానికి సిద్ధపడే మనుషుల నుంచి వాటికే అరిష్టం.. అంతేకానీ మనుషులకి కాదు) ఇలా చాలా అశాస్త్రీయమైన మూఢ నమ్మకాలతో వాటి మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్నాం.
ఇది ఎలాంటిదంటే ఎవరో చేతబడి, బాణామతి లాంటివి చేస్తున్నారనే అర్ధం లేని అనుమానాలతో సాటి మనుషులని కూడా ఆలోచించకుండా వాళ్ళ పళ్ళు పీకడం, గాయ పరచడం, చంపెయ్యడం ఎంత అనాగరికమో ఇదీ అంతే. మనుషులు కాబట్టీ వార్తల్లోకి వస్తారు. వీటికి వార్తల్లోకి వచ్చే అంత ప్రాముఖ్యం లేదు. అంతే తేడా..!
నేను ఇవాళ పొద్దున్నే మా విశాఖపట్నం 'జూ' అసిస్టెంట్ క్యురేటర్ శ్రీ మహాలక్ష్మి నాయుడు గారితో మాట్లాడాను. వారు ఈ పక్షుల 'రకం' గుర్తించడానికి నిపుణుడైన వ్యక్తిని పంపుతానన్నారు. అలాగే ఈరోజు రాత్రి అవసరమైతే వాటిని జాగ్రత్తగా పట్టుకొని జూకు తరలించే ఏర్పాటు కూడా చేస్తామన్నారు. చూడాలి ఏం జరుగుతుందో..!!
ఇవి మా విశాఖపట్నం జూలో నిద్రావస్థలో ఉన్న బార్న్ఔల్ రకానికి చెందిన గుడ్లగూబలు. వీటికి గల ప్రత్యేకత ఏమిటంటే వాటి ముఖం చుట్టూ ఉన్న హృదయాకారపు రింగు..!! అదే మాస్క్ డ్ ఔల్ రకానికి చెందిన పక్షికి ఆ రింగు కొంత భిన్నం గా ఉంటుంది.