Friday, April 22, 2011

తమిళనాడు దర్శన్..(ఖర్చు, శ్రమ లేకుండా)

యాత్రా స్థలాలు చూడడం మీ హాబీయా..?? మీరేప్పుడైనా రామేశ్వరం లోని రామనాధేశ్వర స్వామి ఆలయం చూసారా..?? మధుర మీనాక్షి ఆలయం, కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్, తిరువణ్నామలై లోని అరుణాచలేశ్వర స్వామి కోవెల, కరైకుడి లోని చెట్టినాడ్ పాలస్...??? పిల్లలకి సెలవులు మొదలయ్యాయని ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చెయ్యమని మీ శ్రీమతి పోరుపెడుతున్నారా..!!?? నిజంగా బోల్డు తంటాలు పడి వెళ్తాం. వెళ్ళినా మన గైడు పెట్టే హడావిడి వల్లనో, దృష్టి పిల్లలమీద వుండడం వల్లనో, ఏదో చూసామనే తప్ప ఆ శిల్పకళని తనివితీరా చూడలేం. కొన్నిచోట్ల క్యు లైన్ల కోసమో, శిల్పాలు ముట్టుకొంటే పాడైపోతాయనే భావనతో బారికేడ్లు కట్టడం వల్ల దగ్గరగా వెళ్లి చూడలేం. ఇవన్నీ మన కళ్ళ ముందు మన కంప్యూటర్ లో దర్శన మిస్తే..!! మనం ఏ డిటైల్ కావలిస్తే దానిని జూమ్ చేసి చూసుకో గలిగితే..!! అద్భుతంగా వుంటుంది కదూ..!!
View360, చెన్నై వారు మనకి ఆ అవకాశాన్ని కలిగిస్తున్నారు. తంజావూరు లోని బృహదీశ్వరాలయం లో నిలబడి మనం తలతిప్పి కుడి, ఎడమలకూ, ముందూ వెనుకలకూ, అలాగే తల ఎత్తి పైకీ, మన కాళ్ళదగ్గర నేలనూ కూడా చూడగలం. తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాలూ, చర్చిలూ, కోటలూ, రాజభవంతులూ, అభయారణ్యాలూ జలపాతాలూ మొదలైనవి 360 డిగ్రీలు చూడగలిగేలా రూపొందించారు. మొదట http://view360.in/index.html కి వెళ్లి గూగుల్ మ్యాపు లో ఏది చూద్డామనుకున్తున్నారో అక్కడ క్లిక్ చెయ్యండి. వెంటనే ఆ స్థలం లేదా నిర్మాణం యొక్క 360 డిగ్రీ దృశ్యం కనబడుతుంది. ఇక ఫుల్ స్క్రీన్ చేసుకొని మీకు కావలసిన దాన్ని జూమ్ చేసుకొని చూసుకోవడమే.
మరింకెందుకాలస్యం..?? ఈ సెలవల్లో మీ కుటుంబానికి తమిళనాడు అంతా తిప్పి తీసుకొచ్చేయ్యండి. రైలు రిజర్వేషన్లూ, కాళ్ళు నొప్పులూ లేకుండా ఒక్క గంటలోనే..! త్వరపడండి..!!
కొన్ని లింకులు:

, బృహదీశ్వరాలయం-గంగైకొండ చోళపురం

వివేకానంద రాక్ మెమోరియల్
మీనాక్షి ఆలయం - మదురై
తిరువణ్నామలై లోని అరుణాచలేశ్వర స్వామి కోవెల

****************************************************************************
courtesy:
http://view360.in/index.html
M/s. View360, Chennai, Tamilnadu. INDIA
+91 98400 88276
e-mail: info@view360.in

పూర్తిగా చదవండి...

Sunday, April 10, 2011

కాకినాడ లో జరిగిన రాష్ట్ర స్థాయి శాస్త్రీయ సంగీత పోటీలు..


మా అమ్మాయి చి. కృష్ణప్రియకి కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి శాస్త్రీయ సంగీత పోటీలో జూనియర్స్ విభాగంలో ప్రైజ్ వచ్చింది.


ప్రత్యేక బహుమతి రూ. 800/- ఒక వర్ణం, ఒక కీర్తన పాడింది. న్యూస్ ఐటెం 'ఈనాడు - కాకినాడ ఎడిషన్' లో పడింది. పేరు పొరపాటుగా కృష్ణప్రియ బదులు "చిన్నారి శ్రీలత" అని పడింది. పాటకూడా అప్ లోడ్ చేద్దామని అనుకుంటూ ఉండగానే రెండు నెలలు గడిచిపోయాయి. మొత్తానికి చెయ్యనే లేదు.

పూర్తిగా చదవండి...

Friday, April 8, 2011

“ అశోకుడు – కళింగ రాజు ” నాటకం

మేము భీమిలీ లో ఉండేటప్పటి సంగతి...!! సెయింట్ ఆన్స్ పాఠశాలలో నేను నాలుగూ, మాతమ్ముడు మూడు చదువుతూ వుండేవాళ్ళం. చందమామ కథలు బాగా చదువుతున్న రోజులవి. అలాగే జానపద పౌరాణిక చిత్రాలోస్తే తప్పకుండా చూడాల్సిందే.(అప్పట్లో నేను మామూలు సినిమా ఏదైనా చూడడానికి వెళ్ళాలంటే భయంతో వణికిపోయే వాడినిట..పౌరాణికాలకి బాధలేదు). ఇంట్లో వేసవి సెలవలకి ఆటలన్నీ.. నేపధ్యం లోనే ఉండేవి. (అట్టలతో చేసిన) కత్తి యుద్ధాలూ, వెదురు పుల్లలతో చేసిన బాణాలతో ఎక్కువగా ఆడేవాళ్ళం.

మాతాతగారి ఇంటిలో లైబ్రరీలో శ్రీ న్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య) గారి సంపాదకత్వం లో వస్తూండే 'బాల పుస్తకం' చదువుతూ వుండగా కనబడింది అశోకుడు నాటకం..! చిన్నపిల్లలు రేడియో నాటికలాగా కానీ, స్టేజీ మీద కానీ వేయడానికి అనువుగా చిన్న చిన్న డైలాగులతో ఉండేది. అశోకుడు..కలింగ దేశం మీద దండెత్తి యుద్ధం చేసి.. కళింగరాజు తో సహా చాలా మందిని తెగనరికి, అది విజయంగా భావిస్తాడు. స్మశానాన్ని తలపించే యుద్ధభూమిలో కొడుకు కోసం విలపిస్తూ వున్న ఒక ముసలి తల్లి కడుపుకోత చూసి విచలితుడై తానుచేసిన దుర్మార్గాన్ని అవగతం చేసుకొని పశ్చాత్తాపం చెందుతాడు. చండ అశోకుడల్లా పూర్తిగా మారిపోయి బౌద్ధ మతాన్ని పుచ్చుకొని బుద్ధుని సందేశాలను విశ్వ వ్యాప్తం చేసి ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తాడు.


(చిన్నపిల్లలకి ఇంత భారీ నాటకమా అనుకోకండి..చాలా భారీ గా చేసేసాను నా రాతలో(తో).. అప్పట్లో ఇంత ఇదిగా అనిపించలేదు.)





ఒక నాలుగయిదు సార్లు చదివాను. తెగ నచ్చేసింది. ఎంతంటే.. నాటకం లోకి అందునా అశోకుడి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేంతగా..!! మా తమ్ముడిలో నాకు కళింగరాజు కనిపించాడు. మేమిద్దరం కలిసి నాటకంలో డైలాగులు ఒకరి తరవాత ఒకరం చదువుతూ నిజంగా సీన్లో ఉన్నంతగా ఫీలైపోయే వాళ్ళం. మెల్లిగా ఈపుస్తకం స్కూలుకి కూడా తీసుకెళ్ళి మిగతా స్నేహితులని కూడా పోగేయ్యటం మొదలెట్టాను. స్క్రిప్ట్ ఎదురుగా వుండడంతో అయిడియాలకి అంతులేకుండా వుండేది. ఎలాగైనా నాటకం వేసి తీరాలని తీర్మానించుకున్నాం.



స్క్రిప్ట్ పుస్తకం నాది కాబట్టీ, నాటకం వెయ్యాలనే ఆలోచన నాదే కాబట్టీ..ఏం చెయ్యాలో అందరికీ నేనే చెప్పాలి కాబట్టీ, నేనే డైరెట్రు, ఎవరెవరికి ఏయే పాత్రలు ఇవ్వాలో కూడా నేనే చెప్తాను.! అశోకుడు పాత్రకి నేను తప్ప నా అంతవాడు లేడు అని మన ఫీలింగ్..! తరవాత కళింగ రాజుగా మా తమ్ముడూ, నాకు సేనాధిపతిగా మా ఫ్రెండ్ మార్టిన్ లూథర్, మిగిలిన కొన్ని పాత్రల్లో మా క్లాసు వాళ్ళు దాసరి, వేణుగోపాల్..మొదలైన వాళ్ళని తీసుకున్నాను. చివర్న వచ్చిచేరిన అందరికీ సైన్యం లో చోటిచ్చేసాను. మా తమ్ముడి క్లాసు వాళ్ళంతా వాడి సైన్యం..అంటే కళింగ సైన్యం. మేం నాటకం వేస్తున్నామనే కబురు స్కూల్ అంతా పాకిపోయింది. మా ఫ్రెండ్ ఒకడికి సైనికుడిగా వేషం ఇచ్చాను. వాడు వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి "మావాడు కళింగరాజు కానీ సైన్యాధ్యక్షుడిగా కానీ ఇస్తేనే వేస్తాడు.. లేకపొతే వెయ్యడు..!! " అని చెప్పించాడు. మేము పొమ్మన్నాం. అన్నిటికన్నా ముఖ్యమైన పాత్ర యుద్ధరంగం లో ముసలి అవ్వ పాత్ర. దానికి మా క్లాస్ మేట్ రాజేశ్వరి అనే అమ్మాయి ఇంటికి వెళ్లి మాట్లాడాను. సో.. పాత్రలన్నీ కుదిరి పోయినట్టే..!! ఇప్పుడు ఆయుధాల తయారీ లో పడ్డాం..!




ఒక వెదురు బుట్టలల్లే అతని దగ్గరికి నేను, మా ఫ్రెండ్ మార్టిన్ వెళ్లి, మేం అశోకుడు నాటకం వేస్తున్నాం... బల్లాలూ, బాణాలూ, చేసెయ్యాలి అని చెప్పేసాం...(డబ్బులు ఎంతివ్వాలి.. ఇలాంటివేవీ మాకప్పటికి తెలీదు.) పక్కనే మా క్లాసు మేటు ఒకడు ఉంటూంటాడు. అక్కడికి ఆడుకోటానికి అప్పుడప్పుడు వెళ్తూ వుండేవాళ్ళం. గుర్తు మీదేమో అతను మమ్మలి చూసి నవ్వేసి , ఇన్ని పుల్లలిచ్చి ఇవే బల్లేలకి వాడుకోండి అన్నాడు. కానీ మా ఆర్టు డైరెట్రు (అదీ నేనే..!!) కలాపోసనకి ఉత్తి పుల్లలు చాలవు కదా..!! అందుకు వాటికి మేము బల్లేలకి వుండే ములుకులు అట్టతో తయారు చేసుకొని దానికి గోల్డ్, సిల్వర్ కలర్లు వేసి రెడీ చేసుకున్నాం. దాసరి అనే ఫ్రెండ్ ఇంకోడు ఒక గద తయారుచేసి తెస్తానన్నాడు..! మా ఫ్రెండు వేణు.. అశోకుడి కత్తి తయారుచేసే బాధ్యత తీసుకున్నాడు. ఒక దళసరి అట్టని రెండడుగుల పొడవుతో కత్తి షేప్ లో కట్ చేసి దానికి సిగరెట్ పెట్టెల్లో ఉండే గోల్డ్ ఫాయిల్స్ తో కవర్ చేసి మాంచి రాజోచిత, వీరోచిత ఖడ్గాన్ని తయారుచేసి నాతో 'సెహబాష్ వేణూ..!!' అనిపించుకొన్నాడు. అసలే మనకి స్క్రిప్ట్ తోనే సగం అశోకుడు నాలో ఆవహించిన పరిస్థితి! కత్తి చేతపట్టేసరికీ..అశోకుడు పూర్తిగా పరకాయ ప్రవేశం చేసేసాడు. మొత్తానికి ఆయుధాలు కూడా సిద్ధం..!! (మా తమ్ముడు.. అదే.. కళింగ రాజు కత్తి మాత్రం తయారవలేదు. అది నేనే చేస్తానని చెప్పాను)



ఇప్పుడు లోకేషన్స్..! (రిహార్సల్స్ కే లెండి..! ఇదంతా ఒక ఆటలాగా సాగింది. మేము అసలు నాటకం ఎక్కడ వేస్తామో, ఎలావేస్తామో.. ఏమీ అనుకోలేదు. నిజానికి అప్పటికి తెలీదు.) మా ఫ్రెండ్ మార్టిన్ లూథర్ వాళ్ళ అమ్మగారు భీమిలి హాస్పిటల్ లో హెడ్ నర్సుగా పనిచేసేవారు. ఆ హాస్పిటల్ కి చుట్టూ బోల్డు ఖాళీ స్థలం వుండేది. పెద్ద పెద్ద చెట్లూ, పొదలూ గుట్టలతో భీమిలి నరసింహ స్వామి కోవెల ఉండే కొండకి ఆనుకొని ఉండేది. రణరంగానికి పెర్ఫెక్ట్ లొకేషన్. మన నాటకం లో కూడా మొదటి అంకం యుద్ధరంగమే మరి..! అందువల్ల మా నాటకం ఒక సెలవు రోజు చూసుకొని అక్కడే ’అలా మొదలైంది...!’ ఎవరికీ సీన్లు చెప్పవలసిన అవసరం లేకపోయింది. నేనూ మాతమ్ముడూ చెరో పక్షం. ముఖ్య పాత్రలకి స్క్రిప్ట్ తెలుసు. మిగతా వాళ్ళందరూ సైనికులూ..ఆయుధాలతో ఉన్నారు. అంచేత వాళ్ళకేమీ చెప్పక్కర్లేదు. వదిల్తే యుద్ధం చెయ్యడానికి సిద్ధం గా వున్నారు. ఎవరి క్లాసు వాళ్ళు ఆయా పక్షాలతో ఆయుధాలు తీసుకొని చేరిపోయారు.


అన్నట్టు చెప్పడం మర్చిపోయాను..! స్పెషలెఫెక్టులు, మేకప్ కూడా ఆలోచించానండోయ్..!! యుద్ధరంగం సీను తరువాత వెంటనే ముసలి అవ్వ పాత్ర ప్రవేశం కదా..! అందుకు ఆవిడ మేకప్ తో రెడీ గా వుండాలి. నర్సుగారి నడిగి ఒక రోల్ దూది తెచ్చి విగ్గులాగ తయారుచేసి ఆ అమ్మాయ్ జుత్తుమీద కవర్ చేసి సిద్ధం చేసాను. అలాగే యుద్దం జరుగుతున్నప్పుడూ, జరిగిన తరువాతా సైనికులకి దెబ్బలు రక్తాలు బాగా కనబడాలి. అందుకని ముందే ఒక ఏర్పాటు చేసి ఉంచాను. అప్పట్లో ఇంజెక్షన్ సీసాలు రబ్బరు బిరడాలతో ఉండేవి. నర్సుగారి దగ్గరే అవికూడా అందరికీ తలా ఒకటి తీసుకొని దాన్ని ఎర్రటి రంగు నీళ్ళతో నింపి ప్రతీ ఒక్కరూ వాళ్ళ బొడ్డు దగ్గర పెట్టుకోవాలి. అవతల వాళ్ళు పొడవగానే వీళ్ళు కింద పడిపోయి ఆ రంగునీళ్ళు షర్టు తడిసేలాగ ఒంపుకోవాలి. లేటు లేకుండా యుద్ధం కూడా మొదలైపోయింది. కత్తులు బల్లాలతో యధాశక్తి యుద్ధం చేస్తున్నారందరూ. రంగు కూడా బాగానే పడుతోంది.




ఈ హడావిడిలో మాతమ్ముడికి (కళింగ రాజు కి) కత్తి చెయ్యడం మర్చిపోయాను. రిహార్సలే కదాని ఒక కర్ర ఏదైనా చూసుకొని పట్టుకోమన్నాను. ఒక దుడ్డుకర్ర తీసుకున్నాడు. మొదట మెల్లిమెల్లిగా మొదలైన యుద్ధం కాస్తా తీవ్రరూపం దాల్చింది. అవతల మా సైనికులు కూడా వీరోచితంగా పోరాడుతున్నారు. ఈ లోపల మాతమ్ముడు కూడా తన దుడ్డుకర్రతో నా అట్టకత్తిమీద ప్రతాపం చూపించసాగాడు. “మెల్లగా..మెల్లగా కొట్టు..!” అని నేను అరుస్తున్నామా తమ్ముడు కళింగరాజు పాత్రలో జీవించాడు. దెబ్బకి నా కత్తి పిడి నుంచీ వేరుపడి విరిగిపోయింది. సామ్రాట్ అశోకుడు యుద్ధ రంగంలో నిరాయుధుడిగా నిలబడిపోయాడు. ఇంకేముంది..!!?? మాతమ్ముడు ఆ రోజు జరిగిన కళింగ యుద్దంలో తనను విజేతగా ఫ్రకటించేసుకున్నాడు. నేను స్క్రిప్ట్ ప్రకారం అశోకుడు గెలవాలని ఛెప్పే లోపలే ఆ పక్షంలో విజయోత్సవాలు మొదలెట్టేశారు. నాటకం ఇంకా చాలా ఉందంటున్నా అసలది వినే మూడ్ లో లేరు. నాటకం అక్కడితో ముగిసిందన్నట్టుగా ఒకటే కేరింతలు. అవ్వ పాత్రధారిణి రాజేశ్వరి కూడా విగ్గు తీసేసి వీళ్ళతో జత కలిసింది. నాకు ఒళ్ళుమండుకొచ్చి ' పేకప్..’ చెప్పేసాను. అశోకుడు ఓడిపోయాడన్న బాధ ఏ ఒక్కరికీ లేదు... నాకు తప్ప..!! అందరూ ఉత్సాహంగా ఇంటిదారి పట్టారు. ఆ విధంగా మా మొదటి మరియు చివరిది అయిన అశోకుడు – కళింగరాజు నాటకం మొదటి అంకం లోనే కళింగరాజు అనూహ్య విజయంతో ముగిసింది.


కొస మెరుపు :


మా సైనిక మిత్రులందరూ చొక్కాల మీద రక్తపు మరకలతో ఇళ్ళు చేరారు. సహజంగానే వాళ్ళ అమ్మల చేత ’నడ్డిమీద చంప ’బడ్డారు. తరువాత నేనెప్పుడైనా వాళ్ళిళ్ళకి వెళితే ఆ రక్తం మరకల అయిడియా నీదేనా బాబూ అని మొదలెట్టి నాక్కూడా ఇన్ని అక్షింతలు వేసేవారు. అసలే నాటకం పూర్తిగా ఆడలే్దని నేనుబాధ పడుతూ వుంటే మళ్ళీ ఈ బాధేంటి అనుకుంటూ అక్కడినుంచీ జారుకొనేవాడిని.


అవండీ..! మా “ అశోకుడూ – కళింగ రాజూ ” నాటకం ముచ్చట్లు...!!


అసలు కధకి ఫోటోలు లేవు..!! పైనున్నవన్నీ గూగుల్ నుంచీ దింపిన అరువు సరుకే..!! గూగుల్ వాళ్ళు పదికాలాల పాటూ చల్లగా వుండాలి.

పూర్తిగా చదవండి...

Sunday, April 3, 2011

ఉగాది vs English New Year



బ్లాగు మిత్రులందరికీ శ్రీ 'ఖర' శుభకర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

హ్యాపీ న్యూ ఇయర్ అనే మాట వినగానే నేడు చాలా మందికి మనసులో మెదిలేది జనవరి ఒకటవ తేది.

కానీ సంవత్సరారంభం.. యుగ + ఆది.. ఉగాది ఇప్పుడు కేవలం వేపపువ్వు తినే పండుగగా మాత్రమే భావించబడుతోంది..! ఖగోళ శాస్త్ర రీత్యా ప్రత్యేకత లేని జనవరి ఒకటినే ఇప్పుడందరూ క్రొత్త సంవత్సరాదిగా జరుపుకుంటున్నారు.

డిసెంబరు 31..! "విష్ యూ హ్యాప్పీ న్యూ ఇయర్..!!" అంటూ ఉత్సాహం ఉరకలు వేసే యువకులూ, యువతులూ, హర్షాతిరేకాల మధ్య పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే రోజు..!!! రాత్రి అంతా విందు వినోదాలతో కాలక్షేపం చేస్తూ, గడియారం 12 గంటలు కొట్టగానే..అందరూ ఒక్కసారిగా హ్యాపీ న్యూ ఇయర్ అనే గావుకేకలతో మారుమ్రోగే రోజు..!! కానీ డేటు మారగానే రోజుమారిందని అనుకుంటే కొత్త రోజు.. మొట్టమొదటే చేస్తున్నపని..పిచ్చెక్కినట్టు..గావుకేకలతో..రోడ్లమీదకెక్కి..వీరంగం చెయ్యడం..!! పబ్బుల్లో మందుకొడుతూ ఎంజాయ్ చేస్తున్నామనే భ్రమలో చిందులేయ్యడం..! బైకుల మీద విన్యాసాలతో మిగిలినవారిని బెదర గొట్టడం...ఖర్మం చాలకపోతే కాలో చెయ్యో విరగ్గొట్టుకోవడం...రాత్రి రెండుకో..లేదా మూడు కొట్టాకో ఇంటికొచ్చాక తెల్లారి 10 - 11 గంటల వరకు పడుకోవడం. మొత్తానికి కొత్తసంవత్సరానికి మొదటి రోజు(సంవత్సరాది) గా భావించే జనవరి ఒకటిన ఎక్కువమంది రోజు మొదలెట్టే తీరు ఇది.

ఇక ఉగాది రోజు కార్యక్రమం చూద్దాం..!!

సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని కొత్తబట్టలు ధరించి కొత్తరోజుకి ఆహ్వానం పలుకుతాం. ఉగాది పచ్చడి తిని ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకొంటాం. ఆలయాలకి వెళ్లి దైవదర్శనం చేసుకొని, పంచాంగ శ్రవణం వింటాం. ఇళ్ళన్నీ బంధుమిత్రుల తో కళకళ లాడుతూ వుంటాయి. వంటింటిలో ఇల్లాళ్ళు చేసే పిండి వంటల ఘుమఘుమలతో ఇంట్లో పిల్లలు పిల్లుల్లా వంటింటి లోకి వెళ్ళడం..."ఇంకా నైవేద్యం పెట్టలేదు..ఫొండి బయటికి..!" అని అమ్మలు కసురుకుంటే బుంగమూతి పెట్టుకొని తాతయ్య దగ్గరకో నాన్న దగ్గరకో చేరడం..!! మధ్యాహ్నం సహపంక్తి భోజనాల దగ్గర హడావిడైతే చెప్పే అక్కరలేదు..!

’న్యూ ఇయర్స్ డే’ కీ, ఉగాదికీ పండుగ జరుపుకొనే సందర్భం ఒకటే అయినా జరుపుకొనే విధానంలో ఇంత వ్యత్యాసానికి కారణం ఆ పండుగల యొక్క సాంస్కృతిక నేపధ్యమేననేది సుస్పష్టం.

ఇవన్నీ ఇలా వుంటే ఉగాది నాటి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ముద్రించిన కరపత్రాలు ఒక ఆలయం లో పంచారు. అది తీసుకొని రెండేళ్ళ పైనే అవుతోంది. క్రింది ఫోటోల పైన నొక్కి చదవండి.




పాశ్చాత్య పోకడల సుడిగుండం లో కొట్టుకుపోతూ మన సంస్కృతి సంప్రదాయాలను పూర్తిగా మర్చిపోతున్నాం. విదేశీ / పాశ్చాత్య సంస్కృతి లోని మంచి విషయాలను అనుసరించడానికి ప్రయత్నిస్తే బాగుణ్ణు. విదేశీ మోజులో పడి వారు చేసుకొనే ప్రతీ 'దినాన్నీ' మనం కూడా ఆయా 'దినాలుగా' (గుడ్డిగా) అనుస()రిస్తున్నాం. కానీ తరతరాలుగా మన జీవన విధానాలూ, ఆచారాలు ప్రాతిపదికగా జరుపుకొనే మన పండుగలను మర్చిపోతున్నాం. ఇవన్నీ'మల్టి నేషనల్ కంపెనీలు' తమ ఉత్పత్తులని అమ్ముకోవడానికి చేసే 'మార్కెటింగ్ స్ట్రాటెజీస్' అని కొందరు సంప్రదాయవాదులు చేసే వాదనలో నిజం లేకపోలేదు..! ఏదేమైనా వెర్రితలలు వేస్తున్న పెడ ధోరణుల నుంచీ బయటపడి మన సంస్కృతిని కాపాడుకొనే దిశగా అడుగులు వెయ్యాలి. మన పండుగలను కూడా విదేశీ 'దినాలకన్నా' ఎంత దివ్యంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవచ్చో న(యు)వతరానికి తెలియ జెప్పాలి. ఆ ఆనందం అనుభవం లోకి వచ్చిన నాడు మన పండుగలను మరింత శోభాయమానంగా జరిపించడంలో వారే ముందుంటారు.

పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)