మాతాతగారి ఇంటిలో లైబ్రరీలో శ్రీ న్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య) గారి సంపాదకత్వం లో వస్తూండే 'బాల పుస్తకం' చదువుతూ వుండగా కనబడింది ఈ అశోకుడు నాటకం..! చిన్నపిల్లలు రేడియో నాటికలాగా కానీ, స్టేజీ మీద కానీ వేయడానికి అనువుగా చిన్న చిన్న డైలాగులతో ఉండేది. అశోకుడు..కలింగ దేశం మీద దండెత్తి యుద్ధం చేసి.. కళింగరాజు తో సహా చాలా మందిని తెగనరికి, అది విజయంగా భావిస్తాడు. స్మశానాన్ని తలపించే ఆ యుద్ధభూమిలో కొడుకు కోసం విలపిస్తూ వున్న ఒక ముసలి తల్లి కడుపుకోత చూసి విచలితుడై తానుచేసిన దుర్మార్గాన్ని అవగతం చేసుకొని పశ్చాత్తాపం చెందుతాడు. చండ అశోకుడల్లా పూర్తిగా మారిపోయి బౌద్ధ మతాన్ని పుచ్చుకొని బుద్ధుని సందేశాలను విశ్వ వ్యాప్తం చేసి ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తాడు.
(చిన్నపిల్లలకి ఇంత భారీ నాటకమా అనుకోకండి..చాలా భారీ గా చేసేసాను నా రాతలో(తో).. అప్పట్లో ఇంత ఇదిగా అనిపించలేదు.)
ఒక నాలుగయిదు సార్లు చదివాను. తెగ నచ్చేసింది. ఎంతంటే.. నాటకం లోకి అందునా అశోకుడి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేంతగా..!! మా తమ్ముడిలో నాకు కళింగరాజు కనిపించాడు. మేమిద్దరం కలిసి నాటకంలో డైలాగులు ఒకరి తరవాత ఒకరం చదువుతూ నిజంగా ఆ సీన్లో ఉన్నంతగా ఫీలైపోయే వాళ్ళం. మెల్లిగా ఈపుస్తకం స్కూలుకి కూడా తీసుకెళ్ళి మిగతా స్నేహితులని కూడా పోగేయ్యటం మొదలెట్టాను. స్క్రిప్ట్ ఎదురుగా వుండడంతో అయిడియాలకి అంతులేకుండా వుండేది. ఎలాగైనా ఈ నాటకం వేసి తీరాలని తీర్మానించుకున్నాం.
స్క్రిప్ట్ పుస్తకం నాది కాబట్టీ, నాటకం వెయ్యాలనే ఆలోచన నాదే కాబట్టీ..ఏం చెయ్యాలో అందరికీ నేనే చెప్పాలి కాబట్టీ, నేనే డైరెట్రు, ఎవరెవరికి ఏయే పాత్రలు ఇవ్వాలో కూడా నేనే చెప్తాను.! అశోకుడు పాత్రకి నేను తప్ప నా అంతవాడు లేడు అని మన ఫీలింగ్..! తరవాత కళింగ రాజుగా మా తమ్ముడూ, నాకు సేనాధిపతిగా మా ఫ్రెండ్ మార్టిన్ లూథర్, మిగిలిన కొన్ని పాత్రల్లో మా క్లాసు వాళ్ళు దాసరి, వేణుగోపాల్..మొదలైన వాళ్ళని తీసుకున్నాను. చివర్న వచ్చిచేరిన అందరికీ సైన్యం లో చోటిచ్చేసాను. మా తమ్ముడి క్లాసు వాళ్ళంతా వాడి సైన్యం..అంటే కళింగ సైన్యం. మేం నాటకం వేస్తున్నామనే కబురు స్కూల్ అంతా పాకిపోయింది. మా ఫ్రెండ్ ఒకడికి సైనికుడిగా వేషం ఇచ్చాను. వాడు వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి "మావాడు కళింగరాజు కానీ సైన్యాధ్యక్షుడిగా కానీ ఇస్తేనే వేస్తాడు.. లేకపొతే వెయ్యడు..!! " అని చెప్పించాడు. మేము పొమ్మన్నాం. అన్నిటికన్నా ముఖ్యమైన పాత్ర యుద్ధరంగం లో ముసలి అవ్వ పాత్ర. దానికి మా క్లాస్ మేట్ రాజేశ్వరి అనే అమ్మాయి ఇంటికి వెళ్లి మాట్లాడాను. సో.. పాత్రలన్నీ కుదిరి పోయినట్టే..!! ఇప్పుడు ఆయుధాల తయారీ లో పడ్డాం..!
ఒక వెదురు బుట్టలల్లే అతని దగ్గరికి నేను, మా ఫ్రెండ్ మార్టిన్ వెళ్లి, మేం అశోకుడు నాటకం వేస్తున్నాం... బల్లాలూ, బాణాలూ, చేసెయ్యాలి అని చెప్పేసాం...(డబ్బులు ఎంతివ్వాలి.. ఇలాంటివేవీ మాకప్పటికి తెలీదు.) ఆ పక్కనే మా క్లాసు మేటు ఒకడు ఉంటూంటాడు. అక్కడికి ఆడుకోటానికి అప్పుడప్పుడు వెళ్తూ వుండేవాళ్ళం. ఆ గుర్తు మీదేమో అతను మమ్మలి చూసి నవ్వేసి , ఇన్ని పుల్లలిచ్చి ఇవే బల్లేలకి వాడుకోండి అన్నాడు. కానీ మా ఆర్టు డైరెట్రు (అదీ నేనే..!!) కలాపోసనకి ఉత్తి పుల్లలు చాలవు కదా..!! అందుకు వాటికి మేము బల్లేలకి వుండే ములుకులు అట్టతో తయారు చేసుకొని దానికి గోల్డ్, సిల్వర్ కలర్లు వేసి రెడీ చేసుకున్నాం. దాసరి అనే ఫ్రెండ్ ఇంకోడు ఒక గద తయారుచేసి తెస్తానన్నాడు..! మా ఫ్రెండు వేణు.. అశోకుడి కత్తి తయారుచేసే బాధ్యత తీసుకున్నాడు. ఒక దళసరి అట్టని రెండడుగుల పొడవుతో కత్తి షేప్ లో కట్ చేసి దానికి సిగరెట్ పెట్టెల్లో ఉండే గోల్డ్ ఫాయిల్స్ తో కవర్ చేసి మాంచి రాజోచిత, వీరోచిత ఖడ్గాన్ని తయారుచేసి నాతో 'సెహబాష్ వేణూ..!!' అనిపించుకొన్నాడు. అసలే మనకి స్క్రిప్ట్ తోనే సగం అశోకుడు నాలో ఆవహించిన పరిస్థితి! కత్తి చేతపట్టేసరికీ..అశోకుడు పూర్తిగా పరకాయ ప్రవేశం చేసేసాడు. మొత్తానికి ఆయుధాలు కూడా సిద్ధం..!! (మా తమ్ముడు.. అదే.. కళింగ రాజు కత్తి మాత్రం తయారవలేదు. అది నేనే చేస్తానని చెప్పాను)
అన్నట్టు చెప్పడం మర్చిపోయాను..! స్పెషలెఫెక్టులు, మేకప్ కూడా ఆలోచించానండోయ్..!! యుద్ధరంగం సీను తరువాత వెంటనే ముసలి అవ్వ పాత్ర ప్రవేశం కదా..! అందుకు ఆవిడ మేకప్ తో రెడీ గా వుండాలి. నర్సుగారి నడిగి ఒక రోల్ దూది తెచ్చి విగ్గులాగ తయారుచేసి ఆ అమ్మాయ్ జుత్తుమీద కవర్ చేసి సిద్ధం చేసాను. అలాగే యుద్దం జరుగుతున్నప్పుడూ, జరిగిన తరువాతా సైనికులకి దెబ్బలు రక్తాలు బాగా కనబడాలి. అందుకని ముందే ఒక ఏర్పాటు చేసి ఉంచాను. అప్పట్లో ఇంజెక్షన్ సీసాలు రబ్బరు బిరడాలతో ఉండేవి. నర్సుగారి దగ్గరే అవికూడా అందరికీ తలా ఒకటి తీసుకొని దాన్ని ఎర్రటి రంగు నీళ్ళతో నింపి ప్రతీ ఒక్కరూ వాళ్ళ బొడ్డు దగ్గర పెట్టుకోవాలి. అవతల వాళ్ళు పొడవగానే వీళ్ళు కింద పడిపోయి ఆ రంగునీళ్ళు షర్టు తడిసేలాగ ఒంపుకోవాలి. లేటు లేకుండా యుద్ధం కూడా మొదలైపోయింది. కత్తులు బల్లాలతో యధాశక్తి యుద్ధం చేస్తున్నారందరూ. రంగు కూడా బాగానే పడుతోంది.
ఈ హడావిడిలో మాతమ్ముడికి (కళింగ రాజు కి) కత్తి చెయ్యడం మర్చిపోయాను. రిహార్సలే కదాని ఒక కర్ర ఏదైనా చూసుకొని పట్టుకోమన్నాను. ఒక దుడ్డుకర్ర తీసుకున్నాడు. మొదట మెల్లిమెల్లిగా మొదలైన యుద్ధం కాస్తా తీవ్రరూపం దాల్చింది. అవతల మా సైనికులు కూడా వీరోచితంగా పోరాడుతున్నారు. ఈ లోపల మాతమ్ముడు కూడా తన దుడ్డుకర్రతో నా అట్టకత్తిమీద ప్రతాపం చూపించసాగాడు. “మెల్లగా..మెల్లగా కొట్టు..!” అని నేను అరుస్తున్నామా తమ్ముడు కళింగరాజు పాత్రలో జీవించాడు. దెబ్బకి నా కత్తి పిడి నుంచీ వేరుపడి విరిగిపోయింది. సామ్రాట్ అశోకుడు యుద్ధ రంగంలో నిరాయుధుడిగా నిలబడిపోయాడు. ఇంకేముంది..!!?? మాతమ్ముడు ఆ రోజు జరిగిన కళింగ యుద్దంలో తనను విజేతగా ఫ్రకటించేసుకున్నాడు. నేను స్క్రిప్ట్ ప్రకారం అశోకుడు గెలవాలని ఛెప్పే లోపలే ఆ పక్షంలో విజయోత్సవాలు మొదలెట్టేశారు. నాటకం ఇంకా చాలా ఉందంటున్నా అసలది వినే మూడ్ లో లేరు. నాటకం అక్కడితో ముగిసిందన్నట్టుగా ఒకటే కేరింతలు. అవ్వ పాత్రధారిణి రాజేశ్వరి కూడా విగ్గు తీసేసి వీళ్ళతో జత కలిసింది. నాకు ఒళ్ళుమండుకొచ్చి ' పేకప్..’ చెప్పేసాను. అశోకుడు ఓడిపోయాడన్న బాధ ఏ ఒక్కరికీ లేదు... నాకు తప్ప..!! అందరూ ఉత్సాహంగా ఇంటిదారి పట్టారు. ఆ విధంగా మా మొదటి మరియు చివరిది అయిన అశోకుడు – కళింగరాజు నాటకం మొదటి అంకం లోనే కళింగరాజు అనూహ్య విజయంతో ముగిసింది.
కొస మెరుపు :
మా సైనిక మిత్రులందరూ చొక్కాల మీద రక్తపు మరకలతో ఇళ్ళు చేరారు. సహజంగానే వాళ్ళ అమ్మల చేత ’నడ్డిమీద చంప ’బడ్డారు. తరువాత నేనెప్పుడైనా వాళ్ళిళ్ళకి వెళితే ఆ రక్తం మరకల అయిడియా నీదేనా బాబూ అని మొదలెట్టి నాక్కూడా ఇన్ని అక్షింతలు వేసేవారు. అసలే నాటకం పూర్తిగా ఆడలే్దని నేనుబాధ పడుతూ వుంటే మళ్ళీ ఈ బాధేంటి అనుకుంటూ అక్కడినుంచీ జారుకొనేవాడిని.
అవండీ..! మా “ అశోకుడూ – కళింగ రాజూ ” నాటకం ముచ్చట్లు...!!
Good one
ReplyDeleteChala bagundi radhe. Very funny.
ReplyDeleteMee "nataka" yuddam taruvata tammudito "matala" yuddhamo "chetala" yuddamo jarigi untundani naa praghada vishwasamu. Dani gurinchi kuda chepte baguntundi.
Good narration.
ReplyDeleteTHANKS..
ReplyDeleteRadheshyam Katti Patti yudhame.. oohinchatam kastame. Ashokudu Kalinga Raju cheti lo oodipovatam choosthe, idi niroopincha baduthundi. Duddu karra tho Ashokudi Katti virigipovatam, natakam narration kallaku Kattinattundi. Kalinga yudham scene ... Navvu puttisthundi. Ha ha ha...
ReplyDeleteధన్యవాదాలు సాయి కుమారి..!
Delete- రాధేశ్యామ్
Wow. చాలా బాగుంది.
ReplyDeleteGood narration keep it up
ReplyDeleteRewinded memories
ReplyDeleteRamesh N