Friday, April 1, 2011

అన్నమయ్య సంకీర్తనా సౌరభం (508 వ వర్ధంతి సందర్భంగా)


వేదంబులు పౌరాణిక


వాదంబులు, వరకవిత్వ వాణీ


వీణా నాదంబులు, కృత సుజనా


హ్లాదంబులు, తాళ్ళపాక అన్నయ పదముల్


- తాళ్ళపాక చిన తిరుమలాచార్యుడు.

తనరచనలలో వేదవేదాంగోపనిషత్పురాణేతిహాసాల సారాన్ని కడురమణీయమైన భాషలో శ్రీ వేంకటేశ్వర తత్వంగా నిక్షిప్తం చేసి మనకందించారు తాళ్ళపాక ఆన్నమయ్య. ముప్పది రెండువేలకు పైగా సంకీర్తనలు రచించిన అన్నమాచార్యులవారు తన పదాలలో అనన్యమైన భక్తితత్వం, రక్తి, ముక్తి, ఉత్కృష్టమైన శృంగారం, పరమోత్కృష్టమైన ఆధ్యాత్మ చింతన, వైరాగ్యము, సామాజిక స్పృహ మొదలైనవి రంగరించారు. వారిపదాలలో వివిధ జానపదరీతులు, ఆకాలపు మాండలీకాలు, భాషలతో పాటు సుసంపన్నమైన శాస్త్రీయత గోచరిస్తుంది.(సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరచిన కీర్తనలతో 1994 జూన్ లో ముద్రించిన “అన్నమయ్య పద సౌరభం” పుస్తకానికి నేను గీసిన ముఖచిత్రం)


కర్ణాటక సంగీతానికి పదము – సంకీర్తన – భజన అనే సాంప్రదాయాలను అందించింది తాళ్ళపాకవారే..!! సంగీతపరంగాచూస్తే పల్లవి, అనుపల్లవి, చరణం గా విచ్ఛేదన చేసి ఒక సంగీత ప్రక్రియను కల్పించి, విస్తరించిన మొదటి వాగ్గేయకారుడైన అన్నమయ్య పద కవితా పితామహుడనీ, సంకీర్తనాచార్యుడనీ కీర్తించబడ్డాడు. ( సంగీత త్రిమూర్తులుగా పిలువబడే త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు ఇదేవరుసలో కృతులు రచించిన సంగతి జగద్విదితం.)


స్థూలంగా అన్నమయ్య సంకీర్తనలను ఆధ్యాత్మ(భక్తి) – శృంగార సంకీర్తనలుగా విభజించవచ్చు. శృంగార సంకీర్తనల సంఖ్యే ఎక్కువైనా అనన్య పరమేశ్వరచింతన తో కూడిన ఆధ్యాత్మికత కే ప్రాధాన్యమిచ్చాడు అన్నమయ్య. అందులోని భక్తిపారవశ్యం ఎటువంటిదంటే ఆతడు విష్ణువైనా, వేణుగోపాలుడైనా, ఆంజనేయుడైనా, అహోబిల నారసింహుడైనా, రాముడైనా, శ్రీరంగ విఠలుడైనా అందరూ ఆయనకు వేంకటేశ్వరులే. వేంకటేశ్వర మకుటంతో రచించిన పదకుసుమాలను శ్రీవారి పాదాలకు సభక్తికంగా సమర్పిస్తూ...”మమ్మల్ని రక్షించటానికి ఒక్క సంకీర్తన చాలదూ..! తక్కినవి నీ భండారంలో దాచుకోవయ్యా..!!” అంటూ స్వరార్చన చేశారు.


సంగీత, సాహిత్య, ఆధ్యాత్మ, శృంగార శిఖరాగ్రాన నిలచిన ఆరచనలను తరువాతి తరాలకందించాలనే ముందుచూపుతో వాటిని రాగిరేకులపై చెక్కించి తిరుమలలో ఆనంద నిలయుడైన శ్రీనివాసుని ఆలయప్రాంగణంలోనే సంకీర్తనా భాండాగారాన్ని నెలకొల్పిభద్రపరచిన పెదతిరుమలాచార్యుడు, సాళువ నరసింహరాయలు మున్నగు వారికి ఈ జాతి ఎంతగానో ఋణపడివుంది. ఈ సంగీత సాహిత్య భాండాగారాన్ని ఏ పరమోద్దేశంతో నెలకొల్పారో అది శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారి కృషి ఫలితంగా నెరవేరింది. అప్పటికే కొన్నిరాగిరేకులు అహోబిలానికి, మరికొన్ని తంజావూరు వరకు తరలిపొయాయని చెబుతారు. ఇంకొన్ని తస్కరించబడినాయంటారు. “ రాగంవిని కరిగిపోలేని జాతి రాగిని కరిగించుకున్న” దంటారు. మొత్తానికి 14,328 పదాలు మాత్రమే మనకు లభ్యమయ్యాయి. ఆరచనల సాహిత్య సౌరభం మాత్రమే మనం దక్కించుకోగలిగాం. అజరామరమైన ఆ సాహిత్యానికి తావి అద్దిన సంగీతంలోని సరిగమల మధురిమలు మనకందకపొవడం దురదృష్టం. దీనికి కారణాలనేకం.


వారి కాలానికి మన కర్ణాటక సంగీతానికి ఇప్పుడున్నంత విస్తృతి, నిర్మాణం లేకపోయినప్పటికీ తాళ్ళపాకవారు అనేక అపురూపమైన రాగాలను వాడారు. వారు వాడిన కొన్ని అపురూప రాగాలు: ఆబాలి, అమరసింధు, కొండమలహరి, తెలుగు కాంభోజి, దేసాళం, ముఖారి, పంతు, బౌళి, రామక్రియ. పాల్కురికి సొమనాథుడు పేర్కొన్న నూట ఎనిమిది రాగాలలో 20 రాగాలు మాత్రమే వాడినట్లు తెలుస్తోంది. అలాగే ఈనాడు ప్రఖ్యాతిలో వుండి, వారు వాడని కొన్ని ముఖ్య రాగాలు: మోహన, కల్యాణి, ఆనంద భైరవి, ఖరహరప్రియ మొదలైనవి. సుమారు ఒక పదిరాగాలు అన్నమయ్య తరచుగా ఉపయోగించినట్లు తెలుస్తోంది. అవి: ఆహిరి, సామంతం, శ్రీరాగం, ముఖారి, పాడి, బౌళి, శంకరాభరణం, రామక్రియ, కాంభోజి, వరాళి, భైరవి, సాళంగ నాట.


అన్నమయ్య ప్రయోగించినవీ, ఈనాడు మనకు లభ్యం కానివీ కొన్ని రాగాలున్నాయి..!! అవి – తెలుగు కాంభోజి, కొండ మలహరి, ద్రావిడ భైరవి, దేసాళం, అమరసింధు, రాయగౌళ, సారణి మొదలైనవి. అలాగే సంస్కృతంలో వారు రచించిన “సంకీర్తన లక్షణమ్” మనకు అలభ్యం. దానికి చినతిరుమలాచార్యుల తెలుగు అనువాదం ప్రకారం – అన్నమయ్య దేశిమార్గ తాళాలూ, దరువులూ, జక్కులరేకులు, యేల లు, గొబ్బిళ్ళు, చందమామ పదాలూ మొదలైనవాటి లక్షణాలు వ్రాసారు. ఈనాడు మనం సంగీతంలో వాడుతున్న అనేక ప్రక్రియలకు మూల పురుషుడు అన్నమయ్యే..!!


అన్నమాచార్యుల వారి పాటలను చెక్కించిన రాగిరేకులపైనే అయా పాటలు ఏయేరాగాల్లో పాడుకొవాలో సూచింపబడియున్నవి. కానీ కర్ణపరంపర లేకపొవడంతో త్యాగరాజాది వాగ్గేయకారుల కృతుల సంగీత స్వరూపాలవలె మనకు అన్నమయ్య పాటల సంగీత స్వరూపాలు మనకు దక్కలేదు. అవి శాశ్వతంగా లుప్తమైనాయి.


అయితే వారి రచనలు ఎంతో రచనా వైరుధ్యముతో – కొన్ని జానపద సంగీత పోకడలతోనూ, కొన్ని విలంబ కాలమునకు అనువైనవిగానూ, కొన్ని కేవలమూ సుగమ భక్తి సంగీత ఛాయలలో పాడుకొనుటకు అనువుగా వున్నవి. వీటిలో ఆయా వర్గములకు అనుసరణీయములైన విధంగా సాహిత్య భావాలనెరిగి స్వర రచన చేసినవారిలో శ్రీమాన్ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు, శ్రీ మంచాళ జగన్నాధరావుగారు ఆద్యులు. వీరు అన్నమయ్య సంకీర్తనను సూచిత రాగాల్లోనే స్వరపరిచే ప్రయత్నం చేసారు. వారి తరువాత ఆ అమర సాహిత్యాన్ని మృదు మధురమైన తమ సంగీతఝరితో జోడించి శ్రోతలను సంగీతపు జల్లు లో మునిగించి మురిపించిన కీశే సంగీత విద్వన్మణి, భారత రత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, డా మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గార్లను ముందుగా స్మరించుకోవడం భావ్యం. సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు, పశుపతి గారు, శ్రీమతి శోభరాజు గారు, శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మొదలైనవారు ఆసంకీర్తనలను తమదైన శైలిలో స్వరపరచి గానం చేసారు. అన్నమయ్య సంకీర్తనలు జనబాహుళ్యానికి చేరువ కావటానికి వాటిలోని అద్భుతమైన సాహిత్య సంపదతో పాటు, ఆత్మానందాన్ని కలిగించే కర్ణపేయమైన సంగీత సౌందర్యం కూడా దోహదం చేసింది.


ఫైన పేర్కొన్నవారేకాక మరెందరో మహానుభావులు అన్నమయ్య సాహిత్యానికి తమదైన శైలిలో సంగీత సుధలను అద్ది ఆ అమృత ధారలను వారనుభవించి, మనకు పంచి తరింపజేసారు. అన్నమయ్య కీర్తనలు ఏడింటిని కూర్చి వాటిని ”’సప్తగిరి సంకీర్తనలు” గా సామూహిక గానం చేస్తూ తాళ్ళపాక అన్నమాచార్య ఆరాధనలు చేసే సాంప్రదాయాన్ని కూడా ఏర్పరచారు. ( కానీ కొన్ని జనరంజకమైన కీర్తనలకు కూడా మళ్ళీ కొత్తగా బాణీలు కట్టే బదులు మరిన్ని కొత్త పాటలను తీసుకొని స్వరపరచడం వల్ల ఫ్రజలకు మరిన్ని పాటలు విని తద్వారా ఆ సాహిత్యాన్ని మరింతగా ఆస్వాదించే అవకాశం కలుగుతుంది.)చివరగా చెప్పాలంటే అన్నమయ్య సంకీర్తనా సారం ...


సంగీత సాహిత్య నృత్య గానాలతో పరిఢవిల్లే ఒక బృందావనం..!


అక్కడ నిరంతరం విలసిల్లేది శ్రీ వేంకటేశ్వర తత్వం..!!


ఆ పూతోటలో పూచే ప్రతి పుష్పం నుంచీ జాలువారేది సాహితీ మందార మకరందం..!!


పరిమళించేది – సాహిత్య సౌరభం..!! కనిపించేది – శృంగార రసామృత వర్షిణికి వుప్పొంగి ఆడే మయూర నృత్యం..!!


వినిపించేది – ఆధ్యాత్మ సంగీత వసంతానికి మైమరచి పాడే మత్త కోయిలల గానం..!!!


అన్నమయ్య తాను ఆడి, పాడి, అనుభవించి, నర్తించిన ఆ బృందావనంలో విడిది చేసిన వారెవరికైనా లభించేది అనంత కరుణాంతరంగుడైన ఆ వేంకటేశ్వరుని కృపా కటాక్ష వీక్షణాలే..!


అన్నమయ్య చెప్పినట్టు:


ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు..! అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి కన్నట్లూ...!!


కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని..! తలచెదరు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు..!! తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు..!అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుండనుచు!!


సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు..! దరిశెనములు నిను నానా విధులను తలపుల కొలదుల భజింతురు..!! సిరుల మిము యే నల్పబుద్ధి తలచినవారికి అల్పంబవుదువు..! గరిమల మిము యే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు!!


నీవలన కొరతేలేదుమరి నీరుకొలది తామెరవు..! ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు..!! శ్రీ వేంకటపతి నీవైతే చేకొనియున్న దైవమని.. నీవలెనే నీశరణనెదను ఇదియే పరతత్వము నాకు..!! ఎంత మాత్రమున


ఉపయుక్త గ్రంధాలు : 1. శ్రీ పప్పు వేణుగోపాలరావు గారి " కర్నాటక సంగీతములో ఆంధ్రుల పాత్ర" 2. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి "శ్రీ అన్నమాచార్య సంకీర్తన స్వర సంపుటి"4 comments:

 1. రాధేశ్యాం గారూ,

  చాలా బాగా వ్రాశారు. మీరు బొమ్మలు కూడా వేస్తారని ఇప్పుడే తెలిసింది. బొమ్మ బాగున్నది. నాకు చాలా కాలంగా ఒక ఆలోచన ఉన్నది. కర్నాటిక్ సంగీత పంథాలో, ఎందరో మహానుభావులు తయారుచేసిన సంగీత పద్ధతిలో వారి సంగీత బాణీలో వారే రచించిన కీర్తనలలోని సామాజిక విషయాలు అంటే మనిషి ఎలా బతకాలి, ఎలా బతకకూడదు వంటి విషయాలను స్పృసించిన కీర్తనలను లోక ప్రసిద్ధం చేస్తే బాగుంటుంది. కృతులను, కీర్తనలను వ్రాయగాలవారు, ఈనాడు మనం బాధపడుతున్న లంచగొండి తనం, రాజకీయ నాయకులు వంటి వాటి గురించి వ్రాసి ఆలపించే అవకాశం కలిగించగలిగితే {అలా అని కామ్రేడ్లు వ్రాసే ఎబ్బెట్టుగా ఉండే కడుపు మంట పాటలు కాదు} మన సంగీత విధానం ప్రజలకు బాగా దగ్గిరవుతుందని నా అభిప్రాయం.

  ReplyDelete
 2. ధన్యవాదాలు శివ గారూ..!
  ప్రతీసారి లాగే చాలా నిర్మాణాత్మకమైన వ్యాఖ్య పంపించారు. మరో బ్లాగు పోస్ట్ కి అయిడియా ఇచ్చారు గురువుగారూ..!! మీరన్నట్టు మన వాగ్గేయకారులందరి కీర్తనల్లోనూ సామాజిక స్పృహ, వ్యక్తిత్వ వికాసం లాంటివి పుష్కలంగా వున్నాయి. మా అత్త డా. సుమన్ లత గారిని గురించి ఇంతకుముందొకసారి పరిచయం చేసాను నా బ్లాగు లొనే.. ఆవిడ వాగ్గేయకారుల పాటలలో వ్యక్తిత్వ వికాసం గురించి సొదాహరణ ప్రసంగాలు కూడా చేశారు.

  అభినందనలతో
  రాధేశ్యామ్

  ReplyDelete
 3. చాలా బావుంది. ఈ పుస్తకం నా దగ్గర ఉన్నది. బొమ్మ మీరే గీశారా? చాలా సంతోషం!!

  ReplyDelete
 4. @ కొత్తపాళీ గారూ..
  ఆ బొమ్మ నేనే వేసానండీ..! పుస్తకం రెండో పేజీలోనూ శ్రీ నేదునూరి గారి ముందు మాటలోనూ నాపేరు వేశారు.
  మీ అభిమానానికి నెనర్లు..

  ReplyDelete

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)