Tuesday, May 10, 2011

'త్రిభువన విజయము' అను విశిష్ట సాంస్కృతిక కార్యక్రమం - కళాభారతి, విశాఖపట్నం లో


పై కార్యక్రమం ఈరోజే..!! గమనించగలరు.తక్కువ వ్యవధిలో తెలియ పరచినందుకు క్షంతవ్యుడిని. అందరూ ఆహ్వానితులే..!!
పూర్తిగా చదవండి...

Sunday, May 8, 2011

నా బ్లాగు ప్రారంభించి రెండేళ్ళు..!!

నా బ్లాగు ప్రారంభించి మొన్న మే రెండవ తేదీకి రెండేళ్ళు. చప్పట్లు...!!
ఆలస్యంగా కేక్ కటింగ్ పెట్టానేంటి అనేనా మీ సందేహం..? కారణాలు చెప్పి ఇంకా టైమెందుకు వేస్టు గానీ.. పాయింటుకొచ్చేస్తున్నా..!!

కోడి బర్త్ డే ఎప్పుడు చేసుకోవాలి..?? గుడ్డుగా భూమ్మీద పడినప్పుడా.. లేక పొదగబడి పిల్లగా నేలమీద కాలు మోపినప్పుడా..!?
నిజానికి మే 2009లోనే బ్లాగ్ పెట్టినా సుమారు ఒక సంవత్సర కాలం ఏరకమైన రాతలూ లేకుండానే గడిపేశాను. అప్పుడప్పుడు చిన్నచిన్నవి ఏవో రాసినా అవి నా బ్లాగు పేరుకి తగ్గట్టే నిజంగా సొంతఘోషే..!! ( ఈ సంవత్సర కాలం లో నేను వ్రాసినవి ఆరు మాత్రమే..!!)
అయితే ఈ సమయంలో నేను చాలా బ్లాగులు చూసేవాడిని. ఒకరోజు శ్రీ కప్పగంతు శివరాం ప్రసాదు గారి ’మన తెలుగు చందమామ' బ్లాగు కనపడింది..! తెగ నచ్చేసింది..!! అన్నన్ని సంగతులెలా రాయగలరో అర్ధమయ్యేదికాదు. వారి పోస్టులు క్రమం తప్పకుండా చూస్తూండే వాడిని. వారి పోస్టు ఒకదానికి నేను పెట్టిన వ్యాఖ్యకి వారు రిప్లై వ్రాసారు. దానితో మొదలైన మా ఈ-మెయిల్ సంభాషణ కొన్నాళ్ళు కొనసాగింది. ప్రతీ మెయిల్ లోనూ ఏమైనా వ్రాయమని చాలా ప్రోత్సహిస్తూ ఉండేవారు. నాకే ధైర్యం చాలేది కాదు. ఒకరోజు అనుకోకుండా వారి బ్లాగ్ లో మా ఈ-మెయిల్ సంభాషణ ప్రచురించారు.
'మనతెలుగు చందమామ' బ్లాగు లో నేను.. నా రాతలు..!!
ఆ రోజు నా ఆనందానికి అవధుల్లేవు. ఏదో కథల పోటీలో ఫస్టు ఒచ్చినంత ఆనందం వేసింది. ఆ ఉత్సాహంతో చాలా రోజులు గడిపేశాను..!! కానీ ఏదైనా వ్రాద్దామని కూర్చుంటే పెన్ను కదలందే..!! అక్కడికి సరిగ్గా నాలుగునెలల తరువాత ( నా బ్లాగ్ మొదలెట్టిన సంవత్సరానికి..) నా ఈ కృత్యాద్యవస్థనే 'ఏదో రాయాలనే కోరిక..!!' అంటూ మొదలెడితే మినీ కవితలా వచ్చింది. ఇదేదో బాగానే ఉందనుకొని ఆ రోజే కూడలి, మాలిక మొదలైన అగ్రిగేటర్ లకి నా బ్లాగుని జత చేసి గుడ్డు దశ దాటి పిల్లగా బ్లాగు ప్రపంచం లో కాలుపెట్టాను..!! అప్పటినుంచీ ఈ రెండవ సంవత్సర కాలం లో 36 పోస్టులు వ్రాసాను. నామీద అభిమానంతో నాకు 'మన తెలుగు చందమామ' లో సహరచయితగా చోటిచ్చి ఆదరించిన శ్రీ శివరామ ప్రసాదుగారికి సర్వదా కృతజ్ఞుడిని. నేను వ్రాసిన కొన్నిచందమామ జ్ఞాపకాలూ, వడ్డాది పాపయ్య గారి మీద వ్యాసాలూ వారి బ్లాగు లో ప్రచురించి వారందించిన ప్రోత్సాహం మరువలేనిది. అలాగే వారి సాహిత్య అభిమాని, రేడియో అభిమాని, మొదలైన బ్లాగులు ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పాల్సి వస్తే అది ముంజేతి కంకణానికి అద్దం చూపించినట్టే..!! వారి వ్యాఖ్యలు గానీ వ్యాసాలూ గానీ ఎంత సూటిగా ఉంటాయో అంతే నిర్మాణాత్మకం గానూ వుంటాయి. వారు నాకెప్పటికీ గురుతుల్యులు.

అలాగే శ్రీ యమ్వీ అప్పారావు ( సురేఖ) గారు..!! బ్లాగు ద్వారానే మొదలైన వారిపరిచయం చాలా ఆత్మీయమైన స్నేహం గా పరిణమించింది. వారు మా ఇంటికి వచ్చారు. నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు నేను కూడా వారి ఇంటికి వెళ్లాను. బాపూ రమణల వీరాభిమాని. ఈవయసులో కూడా (ఆమాట అననివ్వరు) వారు ఒక పక్క వారి రేఖా చిత్రం బ్లాగులో కనీసం రెండురోజులకొక ఆర్టికల్ వ్రాస్తారు.., హాసం క్లబ్ ని రాజమండ్రి లో స్థాపించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.., పత్రికల్లో కడుపుబ్బా నవ్వించే కార్టూన్లు గీస్తారు. వీరి కార్టూన్ల పుస్తకం 'సురేఖార్టూన్లు' కి ముందుమాట స్వర్గీయ ముళ్ళ పూడి వారు వ్రాసారంటే ఆ క్వాలిటీ ఎలాంటిదో తెలుస్తుంది. చందమామలూ మొదలైన పుస్తకాలతో వుండే వారి లైబ్రరీ ఒక మ్యూజియం ని తలపిస్తుందంటే నమ్మండి. ఈయన దగ్గర వున్న ఇంకో ప్రతేకత ఏమిటంటే ఈ మధ్య కొత్తగా వస్తున్న స్క్రాప్ బుక్స్( ఒక పుస్తకం లో ఏదో ఒక విషయానికి సంబంధించి పత్రికల్లో పడే ఆర్టికల్స్, ఫోటోలూ సేకరించడం) ని వారు వారి చిన్నప్పటినుంచీ సొంతంగా తయారు చేసుకొని అందంగా తీర్చి దిద్దుతున్నారు. బాపూ రమణల మీదే 14 పుస్తకాలు, రాజమండ్రి నగరం యొక్క సాంస్కృతిక వారసత్వ సంపదని ప్రతిబింబించే పుస్తకాలూ చూస్తే మనకాశ్చర్యం కలుగక మానదు.

పై ఇద్దరు పెద్దలూ నాకెపుడూ స్ఫూర్తి ప్రదాతలుగా వుంటారు. వారికి ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని సింహాచలేశుడు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామిని ప్రార్ధిస్తున్నాను. నాకున్న కొద్దిపాటి అభిరుచికీ వారి ప్రోత్సాహాన్ని జతచేసి సలహాలూ సూచనలూ అందించే మా పెదనాన్నగారు శ్రీ రుద్రావఝల రామ కృష్ణా రావుగారూ, మరియు మా అత్త డా. సుమన్ లత గారికీ నా కృతఙ్ఞతలు. అలాగే నా బ్లాగు 'పోస్టులకు' వారివ్యాఖ్యల తోరణాలు కట్టిన చదువరులూ, బ్లాగు మిత్రులందరికీ ధన్యవాదాలు.

మరో పోస్టుతో మీ ముందుంటాను.
అంతవరకూ సె'లవ్'
పూర్తిగా చదవండి...

Thursday, May 5, 2011

హైదరాబాదులో బాపు బొమ్మల ప్రదర్శన


బాపు బొమ్మల కొలువు :
మిత్రుడు శ్రీ కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు ఈ-మెయిల్ ద్వారా ఆహ్వానాన్ని పంపించారు.

కార్యక్రమం వివరాలు ఆహ్వానపత్రం మీద వున్నాయి.

అది
మీ అందరితో పంచుకోవడానికి ఇక్కడప్రచురిస్తున్నాను.


పూర్తిగా చదవండి...

Wednesday, May 4, 2011

పాదరక్షల విన్నపం


ఇది మా పెదనాన్నగారు శ్రీ రుద్రావఝల రామకృష్ణా రావు గారి రచన. వారు భిలాయినగర్ వాస్తవ్యులు. అక్కడి స్టీల్ ప్లాంట్ లో సీనియర్ అక్కౌంట్స్ మేనేజరు గా పనిచేసి రిటైర్ అయ్యారు. భిలాయి లోనే స్థిరపడ్డారు. వారు తెలుగు గడ్డకి దూరంగా వున్నా తన రచనా వ్యాసంగం కొనసాగించిన సాహితీ వేత్త. తెలుగు, హిందీ ఇంగ్లీషు భాషలలో వారివి ఎన్నో రచనలు సుమారు అన్ని తెలుగు దిన, వార పత్రికల లోనూ అలాగే సప్తగిరి, మిహిర మొదలైన ఆధ్యాత్మిక పత్రికల లోనూ అచ్చయ్యాయి. వారు చాలా వ్యాసాలూ, శీర్షిక లూ, కధలూ కూడా వ్రాసి శ్రీ కాళీపట్నం రామారావు మొదలైన సాహిత్య దిగ్గజాల మెప్పు పొందారు. తన అనుభవం లోకి వచ్చిన చిన్నచిన్న సంఘటనలే ఇతివృత్తంగా తీసుకొని వాటిని రచనలుగా మలచడంలో దిట్ట.
ఈ క్రింది రచన విశాఖపట్నం నుంచి ప్రచురితమయ్యే 'మిహిర' ఆధ్యాత్మిక మాస పత్రిక లో అచ్చయ్యింది.


వీరిదే ఇంకో చిత్రమైన రచనను ఇక్కడ చూడండి
(మొన్నటి మే రెండవ తేదీ తో నా బ్లాగు ప్రారంభించి రెండేళ్ళు గడిచింది.)
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)