బి. వి. కె. జూనియర్ కళాశాల ప్రాంగణం లో తే.11.12.2013ది. న కళాశాల సంగీత విభాగం పూర్వ విద్యార్ధుల సమ్మేళనం తో రూపొందించబడిన "సుగుణాభిరామం" (శ్రీ వాల్మీకి మహర్షి శ్లోకములతో, శ్రీ త్యాగరాజ స్వామి కృతులతో కూడిన శ్రీరాముని గుణ కీర్తనము) సి డి ఆవిష్కరణ సభ జరిగింది. కళాశాల సంగీత విభాగం ప్రధానాధ్యాపకురాలిగా పని చేస్తున్న శ్రీమతి నిష్ఠల కృష్ణవేణి గారి నేతృత్వంలో రూపుదిద్దుకున్నఈ సీడీ ఆవిష్కరణ కార్యక్రమ ముఖ్య అతిథి, కళాశాల వ్యవస్థాపక ప్రధానోపాధ్యాయులు శ్రీ పిళ్ళా రామారావుగారు మరియు కార్యక్రమ విశిష్ట అతిధి, శ్రీమతి మండ సుధారాణి (ఆకాశవాణి టాప్ గ్రేడ్ గాత్ర విద్వాంసురాలు) గారి చేతులమీదుగా జరిగింది. సభాధ్యక్షులుగా శ్రీ కె. రంగారావుగారు (కార్యదర్శి, భారతీయ విద్యా కేంద్రం), గౌరవ అతిథిగా శ్రీ డా. ఎమ్. వి. జె. ఎమ్. రాంప్రసాద్ గారు (ఎనస్థటిస్ట్, స్టీల్ ప్లాంట్ హాస్పిటల్) విచ్చేశారు / వ్యవహరించారు.శ్రీ పిళ్ళా రమణమూర్తి గారు సభను నిర్వహించారు .
ఈ శ్రీరామ గుణకీర్తనా గానంలో పాలుపంచుకొన్నకళాకారులు:
గాత్రం: శ్రీమతి ఆర్. కుసుమ కుమారి, శ్రీమతి ఐ. జగదంబ, శ్రీమతి డా. ఆర్. రమణి, శ్రీమతి ఎస్ వి సుబ్బలక్ష్మి, కుమారి కె. నిఖిత శ్రీవల్లి, కుమారి ఎన్. సి. సాయి సంతోషి,
వయొలిన్: కుమారి ఎమ్. శ్రీరమ్య, వీణ: శ్రీమతి నిష్ఠల కృష్ణవేణి, మృదంగం: శ్రీ మండపాక రవి, ఘటం: శ్రీ ఎమ్ . సూర్య ప్రసాదరావు, వ్యాఖ్యానం: శ్రీ పిళ్ళా రమణమూర్తి
రామో విగ్రహవాన్ ధర్మః. వాల్మీకి మహర్షి తన కావ్య కథా నాయకుడిలో ఉండాలనుకున్న పదహారు సుగుణాలను నారదుడికి చెప్పి అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగితే, నారదుడు అరవైనాలుగు సుగుణాలతో మూర్తీభవించిన దశరథ నందనుడైన శ్రీరాముని గురించి వర్ణించి, ఆతని కథని సంక్షిప్త రామాయణంగా గానం చేసి వెళ్ళాడు. అలాంటి ధర్మాదర్శ మూర్తి, శ్రీరామని చరిత్రను శ్రీమద్రామాయణంగా ఆరు కాండలతో, ఇరువదినాలుగు వేల శ్లోకాలతో భారతావనికి కడు రమణీయంగా అందించారు వాల్మీకి మహర్షి. నారదుని చేతనే ప్రశంసించబడి స్వరార్ణవం అనే సంగీత గ్రంధాన్ని బహుమతి గా పొందిన శ్రీ త్యాగరాజ స్వామి తనకీర్తనలలో శ్రీ రాముని సద్గుణ సంపదను వర్ణించారు. వారి రచనలు పదహారు కీర్తనలను ఏర్చి కూర్చి శ్రీరామ గుణగానం చేసి "సుగుణాభిరామం"గా పొందుపరచారు.
ఆవిష్కరణ సభ ముగిసిన పిదప మృదంగ విద్వాంసులు శ్రీ మండపాక రవి బృందం చే లయవిన్యాసం కార్యక్రమం ఆహుతులను అలరించింది . శ్రీ మావుడూరి సత్యనారాయణ శర్మ గారు వయొలిన్ పైన, శ్రీ ఎమ్ . సూర్య ప్రసాదరావు గారు ఘటం పైన , గొట్టిముక్కల వెంకటేష్ మోర్సింగ్ తోనూ సహకరించారు.