Thursday, March 3, 2022

బ్రహ్మానందంగారి కారులో నేను..!


మీకు ఎప్పుడైనా హాస్యనటుడు బ్రహ్మానందంగారి కారు ఎక్కే అవకాశం వచ్చిందా..!?

నమ్మండి నమ్మకపొండి..! నాకొచ్చింది.

నేను ఇంటర్ పూర్తయి ఆర్కిటెక్చర్ లో జాయిన్ అయిన మొదటి సంవత్సరం..! అప్పటికి ఇంకా మాకాలనీలో రోడ్డు మీద క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం సాయంత్రాలలో..! ఒకరోజు అలాగే ఆడుకుంటూ ఉండగా మా పక్కనే ఒక తెల్ల అంబాసిడర్ కారు ఆగింది. కారులో వెనుక సీటులో ఇద్దరు కూర్చున్నారు. ఎడమచేతి వైపు ఉన్నతను కారు కిటికీలోంచి తల బయటకిపెట్టి ఒక అడ్రెస్ ఏదో చూపించి ఎక్కడ అని అడిగారు. మా కాలనీకి ఒక అరకిలోమీటర్ దూరంలో ఉన్న మరో కాలనీ అడ్రెస్ అది. నేను ఎలా వెళ్ళాలో చెబితే, ఒక్కసారి కూడా వచ్చి చూపించగలవా, మళ్ళీ ఇక్కడే దింపేస్తాం అని అడిగారు.

సరే దాందేముంది అని కారు ఎక్కాను. ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నాను. తీరా తలతిప్పి చూస్తే డ్రైవర్ వెనుక సీట్లో, నాకు cross గా… మీరు నమ్మండి నమ్మకపొండి… None other than the great బ్రహ్మానందం..! నాకు మతిపోయింది. అలా చూస్తూ ఉండిపోయాను. వాళ్ళు అడిగిన Address కి యాంత్రికంగా తీసుకుపోయాను. శ్రీ బ్రహ్మానందం గారు ఆ ఇంటి గేట్ దగ్గర దిగి లోపలికి వెళ్ళిపోయారు. నేను, ఇందాక నన్ను పిలిచి అడ్రెస్ అడిగిన రెండో వ్యక్తి,, కారు డ్రైవరు.. మిగిలాం, రోడ్డు మీద కారు దిగి..! వారు అప్పటికే అహనాపెళ్ళంట, ఇత్యాది చిత్రాల సూపర్ హిట్లతో మంచి కమెడియన్ గా తెరమీద జోరు మీద ఉన్నారు. అంతకు ముందే దూరదర్శన్ లో వారి మిమిక్రీ కార్యక్రమాలు కూడా ఒకటి రెండు చూసి ఉన్నాను.

ఇక చూస్కోండి..! నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు.

బ్రహ్మానందం గారు కదండీ..! ఇలా వచ్చారేమిటీ, ఏదైనా షూటింగా, అంటూ ఆ రెండో వ్యక్తిని ఏవేవో ప్రశ్నలతో దంచేశాను. ఆయన చాలా ఓపిగ్గా ఔను బాబూ, షూటింగ్ కే వచ్చాం. ఇది వాళ్ళ చుట్టాలెవరిదో ఇల్లు..! పది నిమిషాలలో వచ్చేస్తారు అని, అంటూ నన్నెక్కడైనా చూశావా అని అడిగారు..!

"లేదండీ, గుర్తులేదు..!" అన్నాను. నేనింకా బ్రహ్మానందం కారెక్కాను అన్న షాక్ లోంచి ఇంకా తేరుకోలేదు. ఓహో, అని క్షణం ఆగి,

" సినిమాలు చూస్తావా..?" అని అడిగారు.

"చాలా తక్కువండీ" అన్నాను కాస్త విసుగ్గా, ఆ యింట్లోకి తొంగి చూస్తూ..!
" అహ నా పెళ్ళంట సినిమా చూశావా..?" మళ్ళీ ఆయనే అడిగారు.
"ఆఁ, చూశానండీ, దాన్లో బ్రహ్మానందంగారు కడుపుబ్బా నవ్వించారు కదండీ" అన్నాను.
ఆయన కూడా చిన్నగా నవ్వుతూ ఆఖరి సీను గుర్తుందా అని అడిగారు. "అక్కడ ఐతే అసలు సీట్లలోంచి దొర్లిపోయేటట్టు నవ్వొచ్చింది." అప్పటికే అది తలుచుకొని నవ్వేస్తున్నాను నేను.
"ఆ సీన్లో బ్రహ్మానందం ప్రక్కన చేరి ఆయన ఏదో కష్టపడి కష్టపడి చెప్తే అంతా అయ్యాక.. వినబళ్ళా అంటూ ఉంటాడు..!?"

అయ్యబాబోయ్ ఆ సీను.. అంటూ మరింత గట్టిగా నవ్వుతున్న వాడిని బాక్ గ్రౌండ్ లో గ్లాసు పగిలిన సౌండ్ వచ్చి,

నవ్వు సడన్ గా ఆపేసి, "మీరు.. మీరే కదండీ..!" అన్నాను..! "సారీ సర్, గుర్తు పట్టలేకపోయాను.., ఎక్కడో చూసినట్టు ఉంది అనుకుంటున్నాను కానీ తట్టలేదండీ..! వెరీ సారీ అండీ" అంటూ తెగ ఇదై పోయి.., "ఇంతకూ మీ పేరు గుర్తు లేదండీ" అనిన్నీ అన్నాను. "పరవాలేదండీ, నన్ను గుండు హనుమంతరావు అంటారు..!" అన్నారు.!


 

చాలా మొహమాటం వేసింది అలా మర్చిపోయినందుకు.

మళ్ళీ నన్ను తెచ్చి మా వీధి చివర్న దించేసి వెళ్ళిపోయారు.

ఆ తరువాత మరోసారి (అప్పటికి నేను ఆర్కిటెక్ట్ గా ప్రాక్టీసు చేస్తూ 15 years పైనే అవుతోంది. అంటే నేటికి సుమారు 10 years క్రితమన్నమాట) ఏదో ప్రాజెక్ట్ పని మీద విశాఖనుంచి హైదరాబాద్ విమానంలో వెళ్తూ ఉంటే నా సీటు శ్రీ గుండు హనుమంతరావు గారి ప్రక్కనే వచ్చింది. వారిపక్కన విండో సీటులో గీతా సింగ్ గారు మంచి నిద్రలో ఉన్నారు.

పై స్టోరీ అంతా వారి చెప్తే హాయిగా నవ్వేశారు..!

వాళ్ళిద్దరితో నేను ఫ్లైట్ లో తీసుకున్న ఫోటో ఉండాలి. ప్రస్తుతం కనబడలేదు.

ఇప్పుడే తెలిసింది శ్రీ గుండు హనుమంతరావుగారు 2018 ఫిబ్రవరి 19 న స్వర్గస్తులయ్యారని..! వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను.

1 comment:

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)