కోరాలో "ఈనాడు దినపత్రికలో 80 లలో మూడో పేజీలో కింద బొమ్మల కథలు వచ్చేవి. అవి చదివిన జ్ఞాపకం ఉందా మీకు? ఇప్పుడవి ఎక్కడైనా దొరుకుతాయా?" అన్న ప్రశ్నకు నేను వ్రాసిన సమాధానం:
80 లలో ఈనాడులో ప్రతి రోజూ అమర చిత్ర కథ వాళ్ళ పుస్తకాలన్ని(అప్పట్లో అలా అని తెలియదు) తెలుగులో అవే బొమ్మలతో వచ్చేవి సీరియల్ లాగా..! 30 - 32 రోజులు నడిచేది. చాలా పిచ్చిగా చదివేవాళ్ళం. పేపర్ రాగానే ముందు నేనంటే నేనని చదవడానికి కొట్టుకొనే వాళ్ళం. పేపర్ని నేలమీద పెట్టి ఎడమ చేత్తో మొదటి పేపర్ కుడిచేతి బాటమ్ కార్నర్ని పట్టుకొని పైకి ఎత్తి ఈ కామిక్ చదివేసి పేపర్ మా నాన్నగారికి ఇచ్చేసే వాళ్ళం. నెల పూర్తికాగానే క్రొత్త సీరియల్ మొదలయ్యేది. వెంటనే పాత నెల పేపర్లన్నిటిలో ఈ కామిక్ స్ట్రిప్‍ని కట్ జాగ్రత్తగా చేసి అన్నిపేజీలు ఒకే సైజుకి సరిచూసుకొని, పుస్తకాలలాగా కుట్టుకొని చాలా రోజులు చదువుకొనేవాళ్ళం. మా మామయ్యలు కూడా (మాకన్నా 6–7 యేళ్ళు పెద్దవాళ్ళు) ఇలాగే దాచుకునేవాళ్ళు. మేము వేసవి సెలవల్లో మా తాతగారింటికి వెళ్ళినపుడు వాళ్ళవద్ద ఉన్న పుస్తకాలు మేమూ మావి వాళ్ళూ తీసుకొని చదువుకొనేవాళ్ళం.
ఇది కాక ప్రతి ఆదివారం ఫాంటమ్ కామిక్ సీరియల్ తెలుగులో కామిక్ స్ట్రిప్ గా వచ్చేది. ఇప్పుడు మన ఆదివారం పుస్తకం సైజులో..! చాలా బావుండేది.
తరువాత భీమిలి నుంచి విశాఖపట్నానికి బస్సులో వెళ్తున్నప్పుడు RTC కాంప్లెక్సు లో బస్సు దిగినప్పుడల్లా అక్కడే ఎదురుగా ఉండే పుస్తకాల షాపుకి తప్పకుండా వెళ్ళేవాళ్ళం. అక్కడే మొదటిసారి ఈ అమరచిత్ర కథ పుస్తకాలు చూశాము. మేము ఈనాడులో బ్లాక్ అండ్ వైట్ లో పాకెట్ సైజులో చదివిన పుస్తకాలన్నీ A4 సైజులో రంగుల్లో కనిపించేసరికి మతిపోయింది. మా ఆనందానికి పట్టపగ్గాలు లేవు.
అప్పటివరకు మాదగ్గర ఉన్న పాకెట్ సైజు పుస్తకాలన్నీ రంగుల్లో, అంత పెద్ద సైజులో, అదీ తెలుగులో కనిపించేసరికి వెర్రెక్కిపోయి మానాన్నగారికి కొనమని అర్జీ పెట్టేసాము. ఆయనకూడా కాదనకుండా కొనేవారు. అలా ఎన్ని పుస్తకాలు కొన్నారో లెక్కలేదు. అదే సమయంలో టింకిల్ కూడా తెలుగులో మొట్టమొదటి సంచిక విడుదలైంది( ఆ మొట్టమొదటి తెలుగు టింకిల్ సంచికని మళ్ళీ చూసింది శ్రీ మట్టెగుంట వెంకట అప్పారావు గారింట్లో..! వారు కార్టూనిస్టు సురేఖ, రేఖాచిత్రం బ్లాగరుగా సుపరిచితులు. వారి గురించి, వారి దగ్గర ఉన్న పాత పుస్తకాల పాతర గురించి చెప్పాలంటే మాటలు చాలవు..!
నెలకి కనీసం రెండు మూడు సార్లు మేము విశాఖకు వచ్చేవాళ్ళం. వచ్చిన ప్రతిసారీ మూడు నాలుగు పుస్తకాలు కొనుక్కొనే వాళ్ళం. చందమామ ఇంటికే వచ్చేది. ఈ లెక్కన మా ఇంట్లో ఉన్న ఇనప ట్రంకుపెట్టె త్వరలోనే నిండిపోయింది. (మానాన్నగారికి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి ఎస్ బీ ఐ లో ఆఫీసర్ కావడం చేత, భీమిలి నుంచి వైజాగ్ బదిలీ అయి వస్తున్నప్పుడు, మా పుస్తకాలన్నీ ట్రంకులో సర్ధుకుంటే అది పూర్తిగా నిండిపోయింది.) అప్పటినుంచి బస్ కాంప్లెక్స్ కి వెళ్ళడం తగ్గిపోవడం, అలాగే 7–8 క్లాసులకి వచ్చేయడంతో ఈ కామిక్ పుస్తకాలు కొనడం తగ్గిపోయింది. చందమామ మాత్రం కొనుక్కొనే వాళ్ళం.
కాని, దురదృష్టం ఏమిటంటే పైన చెప్పిన పాత పుస్తకాలలో ఇప్పుడు నా దగ్గర ఒక్కటంటే ఒక్కటే ఉంది. అది చందమామల్లో వచ్చిన సీరియల్ తాలూకు పేజీలు వేరు చేసి కుట్టుకున్నది. ఆ సీరియల్స్ రెండూ ( గంధర్వ చక్రవర్తి కూతురూ[3], ఇద్దరు మోసగత్తెలూ[4]). అమర చిత్ర కథ, ఈనాడు కామిక్ స్ట్రిప్స్, ఇలాంటివి ఏవీ మిగల్లేదు. కొన్ని మా స్కూలు లైబ్రరీలకూ, మిగతా పుస్తకాలన్నీ మా కన్నా ఇంకా చిన్నపిల్లలకి పంచేసాము.
మేము చదివిన ఈ పుస్తకాలు, చందమామలు, మాకు మన భారతీయత గురించి ఆ మాత్రం తెలియడానికి దోహదం చేశాయి. మాకేకాదు భారతదేశంలో కనీసం రెండు తరాలని ప్రభావితం చేసి భారతీయ సంస్కృతి, చరిత్ర, మన వారసత్వ సంపదను గురించి తెలియజెప్పడంలో ఈ పుస్తకాలు ప్రముఖపాత్ర పోషించాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ఆపాత మధురాలైన ఆ పుస్తకాలు ఎలాగైనా దొరికితే బాగుణ్ణని చూసే వాళ్ళలో నేను మొదటివరుసలో ఉంటాను. ఎవరి వద్దనైనా ఉంటే తెలియజేయగలరు.
- రాధేశ్యామ్ రుద్రావఝల
తాజాగా:
మా పెదనాన్నగారి ఇంట్లో ఉన్న లైబ్రరీలో మా తమ్ముడు ఇవి వెతికి ఇచ్చాడు. ఈ క్రింది పుస్తకాలు మా మామయ్య సేకరించి కుట్టినవి. మొత్తం 4 సీరియల్స్ కలిపి ఒక పుస్తకంగా కుట్టాడు. ఆయన మాకిస్తే మేము మా తమ్ముడికి ఇచ్చాము.
- గాంధారి
- కన్నప్ప
- మైరావణ
- చిలుకరాజు
(పై నాలుగు పుస్తకాలూ స్కాన్ చేసి పెట్టాను. ఆసక్తి ఉన్నవాళ్ళు వాళ్ళ మెయిల్ ఐడి కామెంట్స్ లో ఉంచితే పంపగలను.)
ఇన్నాళ్ళ తరువాత (సుమారు 35 ఏళ్ళు) వాటిని చూడడం చాలా ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటివి చాలా పుస్తకాలు ఉండాలి (సుమారు ముప్పైకి పైగా) ఒక్కొక్కటిగా మాయమైపొయాయి. ఏమైపోయాయో తెలియదు. 😕😕😕
Please ail me
ReplyDeletemadebymaster@gmail.com
Please send me sir
ReplyDeleteourskrish@gmail.com
ushasreebr@gmail.com
ReplyDeletejvchoudary@gmail.com
ReplyDeleteపై నలుగురికీ పంపాను. Please check it out.
ReplyDeletePlease share the books with me. Mail id ap16aj55@yahoo.co.in
ReplyDelete