Sunday, July 10, 2016

పద్యంతో తలచుకున్న అక్షరాన్ని కనిపెట్టడం

జ్యోతి వలబోజు గారి బ్లాగులో ఈ పద్యం కళ్ళబడింది. శ్రీ దీపాల పిచ్చయ్య  శాస్త్రి గారు వ్రాసినదట
1. అరిభయంకర చక్రకరి రక్షసాగర
చాయ శ్రీ కర్బుర సాటియుగళ

2. నాళీక సన్నిభ నయన యండజ వాహ
వాణీశ జనక వైభవ బిడౌజ!

4. రాజీవ మందిరా రమణ బుధద్రక్ష
వరజటి స్తుత శౌరి వాసుదేవ!

8. భూరి కృపాకర బొబ్బిలి పురపాల
పాప భుజంగమ పరమ గరుడ

16. దోష శైలేశ శశిద్రక్ష** ద్రుహిణ హేళి
(’శశిద్రక్ష’ కు సవరణ క్రింది వ్యాఖ్యలో పొందుపరచడమైనది. గమనించగలరు)


ఇప్పుడు తెలుగులో ఉన్న 56 అక్షరాల్లో ఏదైనా ఒకటి మనసులో తలుచుకోండి.. తర్వాత పైన పద్యంలో ఆ అక్షరం ఏయే పాదాలలో ఉందో చెప్పండి చాలు.. మీరు అనుకున్న అక్షరం నేను చెప్తాను..
తలుచుకోవడంలో కొన్ని నియమాలు పాటించాలి.
అచ్చుల్లో 'అ' మాత్రమే తలుచుకోవాలి. హల్లుల్లో ఙ్, ఞ్, మాత్రం వదిలేయాలి. 
న - ణ, ల - ళ, ర - ఱ లకు తేడా ఉండదు. 
ఒక అక్షరం గుణింతాలు అన్ని ఒకటే అక్షరం కిందే భావించాలి.
ఈ ప్రహేళికకు పరిష్కార వాక్యం ఇది.. 

అన్నయ్య తోటి విస్సాప్రగడ కామరాజు భాషించు హేళి దాక్షిణ్యశాలి

అ - 1
న్న - 2
య్య - 3
తో - 4
టి - 5
వి - 6
స్సా - 7
ప్ర - 8
గ - 9
డ - 10
కా - 11
మ - 12
రా - 13
జు - 14
భా - 15
షిం - 16
చు - 17
హే - 18
ళి – 19
దా – 20
క్షి - 21
ణ్య- 22
శా - 23
లి - 24


ఎదుట వ్యక్తి తలుచుకున్న అక్షరం ఉన్న పాదాల నంబర్లను కూడగా వచ్చిన నంబరును ఈ వాక్యంలో చూసుకుని దానిపక్కన ఉన్న అక్షరం చెప్పండి అంతే...ఉదా... ఎదుట వ్యక్తి 'ర' అనుకున్నాడనుకోండి. అది 1, 4, 8, పాదాలలో ఉంది. ఆ నంబర్లను కూడితే 13 వస్తుంది. పైన పైన పరిష్కార వాక్యంలో 13 పక్కన ఉన్న అక్షరం ర... ఈజీగా ఉంది కదా..!
ఇంతవరకు జ్యోతి వలబోజు గారి బ్లాగులో ఉన్నదే..! అయితే వారిచ్చిన పద్యంలో నేను గమనించింది ఇది:

16 నెం. కు ఎదురుగా ఉన్న పాదం లో రెండు వాక్యాలు ఉండాలేమో అనుకుంటున్నాను. ఉదా. కి చ తలుచుకున్నా మనుకోండి. పరిష్కార వాక్యం ప్రకారం 17వ అక్షరం ’చ’. కానీ మీరిచ్చిన సీస పద్యం లో ’చ’ కేవలం ఒకటవ పాదం లో మాత్రమే ఉంది. అదే 16వ పాదం లో ఇంకో వాక్యం ఉండి, దానిలో’చ’ కలిగి ఉంటే 1+16 =17 లెక్క సరిపోయేది.
శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి పద్యం పూర్తిగా ఎవరి వద్దనైనా ఉంటే క్రింది వ్యాఖ్యల ద్వారా తెలుపగలరు.
పూర్తిగా చదవండి...

Tuesday, May 6, 2014

మా కేదార్ నాథ్ యాత్ర..!

                    కేదార్ నాథ్ యాత్రికుల వెతలు చూస్తే గుండె బరువెక్కని భారతీయ హృదయం ఉండదు. తమ తోటివారిని కళ్ళముందే పోగొట్టుకొని బ్రతుకుజీవుడా అంటూ ఒడ్డు చేరుకున్న జీవచ్చావాలను చూస్తే  కడుపు తరుక్కుపోయింది. ప్రకృతి అందాలకు కొలువై దేవభూమిగా గణుతికెక్కిన ఉత్తరాఖండ్ ప్రళయకాల రుద్రుని తాండవానికి చిగురుటాకువలె వణికిపోయింది. మరుభూమిగా మిగిలిపోయింది.

                    2008 మే లో మా మామయ్య శ్రీ శ్రీనివాస్ కుటుంబం, మా తాతగారు, అమ్మమ్మ గారూ, మిగతా బంధుగణం కలసి కేదారనాథ్, బదరీ నాథ్, యాత్రకు ప్లాన్ చేశారు. వాళ్ళు మొత్తం 16 మంది. ఢిల్లీ నుంచి బయలుదేరి, హరిద్వార్, ఋషీకేశ్ మీదుగా ద్వి - ధామ యాత్ర ( గంగోత్రి, యమునోత్రి కూడా కలిపితే చార్ధామ్ యాత్ర అవుతుంది) చేసి మళ్ళీ ఢిల్లీ కి బయలుదేరిన నాటినుంచి ఆరవ రోజుకి వచ్చేటట్టు ' సదరన్ ట్రావెల్స్ ' లో బుక్ చేసుకున్నారు. అప్పటికి మా నాన్నగారూ, అమ్మ అమెరికాలో మా తమ్ముడి వద్ద ఉన్నారు. వాళ్లకి విషయం తెలిసి వీళ్ళుకూడా  బయలుదేరడానికి సిధ్ధపడ్డారు. నాకు ఫోన్ చేసి టిక్కెట్లు తియ్యమని అడిగేసరికి, సరే అని తీసేశాను. మే లో బయలుదేరాలి. మావాళ్ళు అమెరికా నుంచి ఏప్రెల్ లో వచ్చారు. మా రెండో సంతానం కృష్ణ ప్రీతమ్ కు అప్పటికి మూడునెలలు. మాశ్రీమతి ఎలాగూ వాళ్ళ నాన్నగారి ఇంట్లోనే ఉంది ఇంకా. దాంతో ముందు అనుకోకపోయినా మా పేరెంట్స్ ని ఒంటరిగా పంపించడం ఇష్టంలేక (మా మామయ్య వాళ్ళు ఉన్నా, వాళ్ళు బయల్దేరుతున్న బృందంలో మూడోవంతు అంటే 14 మంది చిన్నపిల్లలూ, వృద్ధులూనూ..!) అప్పటికప్పుడు టిక్కెట్లు కొనుక్కొని నేనూ బయల్దేరాను. మా ముగ్గురితో కలిపి యాత్రకు వెళ్తున్న వాళ్ళం మొత్తం 19 మందిమి. ఢిల్లీ నుంచి బయల్దేరే మా 25 సీటర్ బస్సులో శ్రీకాకుళం నుంచి వచ్చిన జంటలు రెండు కాక మరో జంట ఉన్నారు. చిట్టచివరి సీటు నాదే.


                    ఢిల్లీ నుంచి తొలిరోజు రాత్రి బయల్దేరి తెల్లవారేసరికి హరిద్వార్ చేరుకున్నాం. అక్కడ హడావిడిగా స్నానాదికాలూ, టిఫిన్లు, ముగించి బయల్దేరి ఋషీకేశ్ కి మధ్యాహ్నం అవుతూ ఉండగా చేరుకున్నాం. శ్రీ శివానంద ఆశ్రమం, రామ్ ఝూలా, స్వర్గ ఆశ్రమం, గీతా ఆశ్రమం, లక్ష్మణ్ ఝూలా, లను దర్శించి భోజనం చేసి, శ్రీనగర్ కు ప్రయాణమయ్యాం. త్రోవలో మేం చూసిన ప్రకృతి రమణీయత, పచ్చదనం, అనుభవించిన కాలుష్య రహిత వాతావరణం, ప్రశాంతత మమ్మల్ని పరవశుల్ని చేసింది. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము. మొత్తం బృందంలో వయస్సులో చిన్నవాళ్ళు  మా మామయ్య పిల్లలు , అందరిలోకీ పెద్దలు మా తాతగారూ, అమ్మమ్మ కూడా ఆ ఉత్సాహాన్నీ ఉల్లాసాన్నీ సమానంగా అనుభవించారు. ఆ రాత్రికి మేము క్షేమంగా శ్రీనగర్ చేరాం. షెడ్యూల్ ప్రకారం మేము ఆరోజు సాయంత్రానికి గౌరీకుండ్ చేరుకొని శ్రీనగర్ లో బస చేసి, ప్రొద్దున్నే గౌరికుండ్ చేరుకోవాల్సి ఉంది. కానీ ఆ ఊరికి (శ్రీనగర్) చేరే రోడ్డు, విరిగిన కొండచరియల మూలంగా మూసుకుపోవడం తో, ఆ రాత్రి రోడ్డు మీదే బస్సులో గడపవలసి వచ్చింది. ఇక్కడినుంచి మా ప్రయాణం సస్పెన్సు థ్రిల్లర్ ను తలపించింది.







 






 

 


                    తెల్లవారకుండానే బయల్దేరి నేరుగా 'గౌరీకుండ్' కి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాం. రోడ్డుకు ఒకపక్క కొండ, మరోపక్క 500 అడుగుల లోయ, లోయ వెంబడి పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నగంగమ్మ..! చుట్టూ కాటుకని తలపించేలాంటి కటిక చీకటి..!  వీటన్నిటికీ తోడు ఎముకలు కోరికే చలి.

                గౌరీ కుండ్ అనేది 'సహజ సిద్ధ ఉష్ణ జల కుండం'. చుట్టూ అంత చలిగా ఉన్నాఈ స్నాన వాటికలో మాత్రం వేడినీరు మరుగులెత్తిపోతూ ఉంటుంది. ఒక గుడ్డలో బియ్యాన్నికట్టి ఆనీళ్ళలో పది నిముషాల సేపు ఉంచితే ఉడికిపోయి అన్నం గా మారిపోవడం చూస్తాం. చుట్టూ గడగడ లాడించే చలి మధ్యలో ఇలాంటి వేడినీటి స్నానం మన ప్రయాణ బడలికని ఎగరగొట్టి నూతనోత్సాహాన్ని నింపుతుంది. అక్కడ స్నానాలు చేసి కేదారేశ్వరుడి దర్శనానికి సమాయత్తమయ్యాం. గౌరీకుండ్ నుంచి కేదార్ నాథ్ ఆలయం పద్నాలుగు కిలోమీటర్ల ప్రమాద భరితమైన నడక దారి. నడవలేనివారి కోసం గుర్రాలూ, డోలీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళే కాలిబాట పాదాల దగ్గర ఒక విశాలమైన స్థలంలో వందలాదిగా గుర్రాలూ, ఇసకవేస్తే రాలనట్టుగా మనుషులు...! అన్నీటోకెన్ పద్ధతిలో ముందస్తు చెల్లింపుల ద్వారా  "రానూ - పోనూ" కలిపి ఛార్జి చెయ్యబడతాయి. అయితే ఈ ప్రయాణానికి ఒక్కొక్క ప్రయాణ సాధనం తీసుకొనే సమయం  ఒక్కక్క రకంగా ఉంటుంది. కొండ దిగువన అంత జనాభా చూశాకా మేమందరం డోలీల మీదే కొండపైకి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాం. ఒక్కొక్కరికీ ఒక్కో డోలీ, ఒక డోలీని  నలుగురు వ్యక్తులు మోస్తారు. కొండపైకి చేరడానికి సుమారు మూడుగంటల సమయం పడుతుందన్నారు. నేను మా ముగ్గురు డోలీల వాళ్ళనీ పిలిచి మేము ముగ్గురం ఒకేసారి మీదకు వెళ్లాలనీ, మధ్య మధ్యలో ఆగుతూ ఒకరినొకరు గమనించుకుంటూ వెళ్లాలని చెబితే సరేనన్నారు. అలాగే కొండపైకి వెళ్తున్నకొద్దీ ఆక్సిజన్  అందడం కష్ట మవుతుందనీ, పోర్టబుల్ ఆక్సిజన్ సిలెండర్లు వెంటతీసుకు వెళ్లాలనీ మా గైడు మాకు చెప్పి మా చేత కొనిపించాడు. వాడే అవసరం రాకపోతే నామమాత్రపు రుసుము తీసుకొని సిలెండర్లు వెనక్కి తీసుకుంటారు. మార్గమధ్యంలో వర్షం పడే అవకాశం ఉంటుందని రెయిన్ కోట్లూ, చలికి స్వెట్టర్లూ, లాంటి ముందు జాగ్రత్తలు, సరంజామా తో బయల్దేరాం.








********

Kedarnth / Badrinath Slideshow: Citraalu’s trip to 2 cities including Rishikesh was created with TripAdvisor TripWow!
పూర్తిగా చదవండి...

Sunday, January 26, 2014

విశాఖపట్నంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు Video

విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు వైభవంగా జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాలలో గానం చేసిన చిరంజీవులు :
గోరుగంతుల శ్రుతి, రుద్రావఝల లక్ష్మీ కృష్ణ ప్రియ, వెన్నేటి భవ్య, పి. మనీష
మృదంగం: చి. శ్రీకర్ , వయొలిన్: కుమారి చాగంటి రమ్య కిరణ్మయి
గానం చేసిన కీర్తనలు:
  1. అనాధుడను గాను              రాగం: జింగ్లా                           తాళం: ఆది
  2. పలుకు కండ చక్కెర            రాగం: నవరస కన్నడ             తాళం: ఆది 
  3. ననుగన్న తల్లి                     రాగం: సింధు కన్నడ              తాళం: ఆది
  4. వరలీల గాన లోల                రాగం: శంకరాభరణం              తాళం: ఆది
చిన్నారు లందరికీ శుభాకాంక్షలు . 


పూర్తిగా చదవండి...

Sunday, December 22, 2013

"సుగుణాభిరామం" సి డి ఆవిష్కరణ.


బి. వి. కె. జూనియర్ కళాశాల ప్రాంగణం లో తే.11.12.2013ది. న కళాశాల సంగీత విభాగం పూర్వ విద్యార్ధుల సమ్మేళనం తో రూపొందించబడిన "సుగుణాభిరామం" (శ్రీ వాల్మీకి మహర్షి శ్లోకములతో, శ్రీ త్యాగరాజ స్వామి  కృతులతో కూడిన శ్రీరాముని గుణ కీర్తనము) సి డి ఆవిష్కరణ సభ జరిగింది. కళాశాల సంగీత విభాగం ప్రధానాధ్యాపకురాలిగా పని చేస్తున్న శ్రీమతి నిష్ఠల కృష్ణవేణి గారి నేతృత్వంలో రూపుదిద్దుకున్నఈ సీడీ ఆవిష్కరణ  కార్యక్రమ ముఖ్య అతిథి, కళాశాల వ్యవస్థాపక ప్రధానోపాధ్యాయులు శ్రీ పిళ్ళా రామారావుగారు మరియు కార్యక్రమ విశిష్ట అతిధి,  శ్రీమతి మండ సుధారాణి (ఆకాశవాణి టాప్ గ్రేడ్ గాత్ర విద్వాంసురాలు) గారి చేతులమీదుగా జరిగింది. సభాధ్యక్షులుగా శ్రీ కె. రంగారావుగారు (కార్యదర్శి, భారతీయ విద్యా కేంద్రం), గౌరవ అతిథిగా శ్రీ డా. ఎమ్. వి. జె. ఎమ్. రాంప్రసాద్ గారు (ఎనస్థటిస్ట్, స్టీల్ ప్లాంట్ హాస్పిటల్) విచ్చేశారు / వ్యవహరించారు.శ్రీ పిళ్ళా రమణమూర్తి గారు సభను నిర్వహించారు . 
ఈ శ్రీరామ గుణకీర్తనా గానంలో పాలుపంచుకొన్నకళాకారులు:  
గాత్రం: శ్రీమతి ఆర్. కుసుమ కుమారి, శ్రీమతి ఐ. జగదంబ, శ్రీమతి డా. ఆర్. రమణి, శ్రీమతి ఎస్ వి సుబ్బలక్ష్మి, కుమారి కె. నిఖిత శ్రీవల్లి, కుమారి ఎన్. సి. సాయి సంతోషి, 
వయొలిన్: కుమారి ఎమ్. శ్రీరమ్య, వీణ: శ్రీమతి నిష్ఠల కృష్ణవేణి, మృదంగం: శ్రీ మండపాక రవి, ఘటం: శ్రీ ఎమ్ . సూర్య ప్రసాదరావు, వ్యాఖ్యానం: శ్రీ పిళ్ళా రమణమూర్తి 


రామో విగ్రహవాన్ ధర్మః. వాల్మీకి మహర్షి తన కావ్య కథా నాయకుడిలో ఉండాలనుకున్న పదహారు సుగుణాలను నారదుడికి చెప్పి అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగితే, నారదుడు అరవైనాలుగు సుగుణాలతో మూర్తీభవించిన దశరథ నందనుడైన శ్రీరాముని గురించి వర్ణించి, ఆతని కథని సంక్షిప్త రామాయణంగా గానం చేసి వెళ్ళాడు. అలాంటి ధర్మాదర్శ మూర్తి, శ్రీరామని చరిత్రను శ్రీమద్రామాయణంగా ఆరు కాండలతో, ఇరువదినాలుగు వేల శ్లోకాలతో భారతావనికి కడు రమణీయంగా అందించారు వాల్మీకి మహర్షి. నారదుని చేతనే ప్రశంసించబడి స్వరార్ణవం అనే సంగీత గ్రంధాన్ని బహుమతి గా పొందిన శ్రీ త్యాగరాజ స్వామి తనకీర్తనలలో శ్రీ రాముని సద్గుణ సంపదను వర్ణించారు. వారి రచనలు పదహారు కీర్తనలను ఏర్చి కూర్చి శ్రీరామ గుణగానం చేసి "సుగుణాభిరామం"గా  పొందుపరచారు. 

ఆవిష్కరణ సభ ముగిసిన పిదప మృదంగ విద్వాంసులు శ్రీ మండపాక రవి బృందం చే లయవిన్యాసం కార్యక్రమం ఆహుతులను అలరించింది . శ్రీ మావుడూరి సత్యనారాయణ శర్మ గారు వయొలిన్ పైన, శ్రీ ఎమ్ . సూర్య ప్రసాదరావు గారు ఘటం పైన , గొట్టిముక్కల వెంకటేష్ మోర్సింగ్ తోనూ సహకరించారు.
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)