Thursday, September 16, 2010

ఏదో రాయాలనే కోరిక..

ఏదో
రాయాలనే కోరిక..
****

ఏదైనా చదవగానే నాకూ రాయాలనే కోరిక...

ఏదో ఒక కధ, వ్యాఖ్య, కవిత లేదా శీర్షిక..

ఏం రాయాలో ఎలా రాయాలో తెలియక...



మనసులోని ఆలోచనలు కుదురుకోక..

కుదురుకున్న ఆలోచనలకు రూపం రాక..

వచ్చిన రూపాన్ని అక్షరబద్ధం చెయ్యలేక..




రాద్దామని కూర్చుంటే మొదలుపెట్టలేక..

ఎంత కిందా మీదా పడ్డా బుర్రకేం తోచక..

అందరూ రాసేసే సులువు అర్ధం కాక...




పోనీ మానేద్దామంటే మనసొప్పక...

అలాగని మనసోప్పే సాకు దొరకక...

అవస్థపడుతున్న నాకో దారి కానరాక...




పెన్ను మూసేసి పేజీని తెల్లగానే వదిలేశాక...

ఏమైనా రాయాలనే కోరిక ఇంకా చావక...

నిన్నట్లాగే అనుకుంటా..."రేపు వ్రాసెద గాక!!"

18 comments:

  1. నాలాటి ఔత్సాహికులైన రచయితలు (గజ ఈతగాళ్ళు = గజం అంటే మూడడుగుల దూరంమాత్రమే ఈదగలిగే వాళ్ళు అన్నట్టు. . ఔత్సాహికులైన అంటే ఉత్సాహం మాత్రమే ఉన్నవాళ్ళు అన్నమాట) ఎప్పుడూ పడే ఇబ్బందే పైన రాసేను. "ఓస్ ఇంతేనా.. ఇలా నేనూ రాయగలను కదా!! " అని చదువరికి అనిపించే లాగా ఉండడం ఉత్తమ రచనకి ఉండే లక్షణం. పై మాటలు మహాకవి శ్రీ శ్రీ ఏదో సభలో చెప్పారట. సరిగ్గా అలాంటి మంచి రచనలు చదివిన తరువాత వచ్చేఅవస్థకి అక్షర రూపమే ఇది.

    ReplyDelete
  2. hi ...chaaala baagundi..good going.manasulo vunna maatalaki akshara roopam andarau ivvaleru.adi kondarike saadhyam.alaanti kondarilo okarni ilaa kalusovadam chaala aanadam ga vundi.ippudippude chiguristunna ee kavita...kusumam marinta vikasinchi maha vrukhamai....marinni leta kusumaalaku praanamposi,oopirini ,prostsaahaanni ivvalani aasistu...abhinandana la to..........sumana.

    ReplyDelete
  3. @సుమన.. ధన్యవాదాలు..
    బ్లాగ్ చూస్తూ ఉండండి... - రాధేశ్యాం

    ReplyDelete
  4. రాదే , కవిత్వం బాగుంది. గజ ఈతగాళ్ళు అంటే : గజం లోతున కూడా ఈదగలిగేవాళ్ళు అని అర్థం. గజం దూరం అని కాదు. :-)

    ReplyDelete
  5. రాదే! ఇది చదువు ... ఎలా ఉంది?

    ఏదైనా చదవగానే నాకూ రాయాలనే కోరిక ...
    ఏదో ఒక గ్రంథం , నవల , లేదా పీఠిక ...
    ఏం రాయాలో , ఎందుకు రాయాలో తెలిసీ తెలియక ...

    తలపై ఆలోచనలు ఎప్పటికీ ఆగక ...
    ఆగిన ఆలోచనలను చెక్కలేక ...
    చెక్కిన ఆలోచనలను కలంలోకి తేలేక ...

    రాద్దామని కూర్చుంటే ఎప్పటికీ లేవలేక...
    ఎంత అటు తిరిగి ఇటు తిరిగినా మదికేం తట్టక ...
    కొందరు రాసేసే మెలకువలు అర్థం అయ్యీ అవ్వక...

    మానేద్దామని అస్సలనిపించక ...
    అనిపిస్తే మానేసే సాకు దొరకక ...
    కష్టపడుతున్న నాకో వెలుగు కనబడక ...

    పెన్ను తెరిచి పేజీని నింపి , చింపి వదిలేశాక ...
    ఏమైనా రాయాలనే కోరిక ఇంక ఎప్పటికీ వదలక ..
    ఎప్పట్లాగే అనుకుంటా ... "మరల వ్రాసెద గాక"


    అప్పటివరకు పాడుకుంటా నా మనసనే తూనీగ తో ...
    తూ... నీ... గ... తూనీగా ఎందాక పరిగెడతావే ... రావే నా వంకా ...

    ReplyDelete
  6. చందు..
    బాగుంది.. కానీ నాచురల్లీ నాదే నాకు నచ్చింది.. హ హ్హ..
    ఇదికూడా చూడు..

    ఆలసించక..
    మడమ త్రిప్పక..
    ఇంక మనమా కోరిక
    మనసులలో దాచుకోక
    పేజీని తెల్లగా వదిలెయ్యక..
    అలాగని రాసింది చింపెయ్యక..
    ఎక్కువాలోచించక ముందు వెనక..
    మొదలుపెట్టాలి వ్రాయటం మనమింక..

    ReplyDelete
  7. వ్రాయాలి వ్రాయాలి కవిత్వం ఎప్పటికైనా మనమింక ...
    పీకల్లోతుగా మునిగి ఆలోచించింది చాలింక ...
    లేదంటే వేస్తాం మనం నిండైన మునక ...
    అదిగో అల్లదిగో వాస్తవమనే నౌక ...
    మనకు ఏనాటికీ అది అందక ...
    తప్పదు పట్టుకోవాలింక ...
    కవిత్వమనే కుక్క తోక ...
    మరి ఆలసించక ...
    ఈదు ఇక ...

    ReplyDelete
  8. హ్హ..హ్హ..హ్హా..ఇది నిజంగా కత్తిలా వుంది. చాలా బాగుంది.
    thanks.

    ReplyDelete
  9. Aaha..yennallindi ilaanti kavitalu vinaka....
    veyistunnaru maa manasulni kavita saagamlo munaka..
    Telakunda andulone vundipote kanaka...
    yedo baagaane vundela vundi ee krongotta nadaka...
    raayagalana leda ani konchemkooda aalochinchaka...
    yedo raasestunna nenu kooda mimmalni choosaaka..
    ee madhya andaru antunnattu ga abbo.. keka...
    yela vundo cheppandi bottiga mohamaata padaka...
    ippatikidi chaalemo..vuntaanika...

    ReplyDelete
  10. @ సుమన.. చాలా బాగుంది..
    ఇది తెలుగులో చదివితే వున్న మజాయే వేరు..
    అందుకే మనందరి కోసం తెలుగులో..
    "ఆహ..ఎన్నాళ్ళయింది ఇలాంటి కవితలు వినక ....
    వేయిస్తున్నారు మా మనసుల్ని కవితా సాగరంలో మునక ..
    తేలకుండా అందులోనే ఉండిపోతే కనక ...
    ఏదో బాగానే ఉండేలా వుంది ఈ క్రొంగొత్త నడక ...
    రాయగలనా లేదా అని కొంచెంకూడా ఆలోచించక ...
    ఏదో రాసేస్తున్నా నేను కూడా మిమ్మల్ని చూసాక ..
    ఈ మధ్య అందరు అంటున్నట్టుగా అబ్బో.. కేక...
    ఎలా వుందో చెప్పండి బొత్తిగా మొహమాటపడక ...
    ఇప్పటికిది చాలేమో.. వుంటానిక..."

    ఒరిజినల్ కాన్సెప్ట్ ని ఇంతగా విస్తరించి అదే అంత్య ప్రాస తో రాస్తున్నారు.. చాలా సంతోషం.
    ధన్యవాదాలతో
    - రాధేశ్యాం

    ReplyDelete
  11. అందరూ రాస్తే ఇంకా
    చదివేవాళ్ళు ఎవరు ఇంక
    అందుకే నేను ముగిస్తున్నానింక
    దీనికంటే ఉత్తమం లేదింక.

    ReplyDelete
  12. shyaam, madhavi.. thank you for sending the blog link..keep going..good luck..
    chandru..you rock too

    ReplyDelete
  13. రాధేశ్యాం-చంద్రశేఖర్ ఏచూరి
    మీరిద్దరూ ఎక్కువ పదాలనుంది తక్కువ పదాలకూ, తక్కువ పదాల నుండి ఎక్కువ పదాలకూ మాటల పొందికతో అల్లిని కవిత లాంటి ప్రయోగం బాగున్నది.

    కవిత్యమనే కుక్క తోక??

    దీని బదులుగా
    "....
    తప్పదు పట్టుకోవాలింక ...
    ఆలోచనలనే మన తోక
    మరి ఆలసించక
    ఈదు ఇక ... "

    కవిత్వాన్ని కుక్క తోకతో పోల్చటం నప్పటం లేదన్న ఉద్దేశ్యంతో పై మార్పు సూచించాను.

    ReplyDelete
  14. శివరాం గారూ, కవితలో మీ సూచనకి ధన్యవాదాలు..
    వరుస పాదాలలో అక్షర సంఖ్య క్రమంగా పెరగడం, తగ్గడం అనుకోకుండా వచ్చింది. నేను పెంచుతూ పొతే మా చందు తగ్గిస్తూ వచ్చాడు.
    సందర్భం వచ్చింది కాబట్టి...
    ఇలాంటి విన్యాసమే అక్షరాల సంఖ్య తగ్గినా పెరిగినా వచ్చే పదం కూడా అర్ధవంతం గా వుండే పద బంధాలని లేదా ప్రయోగాలని గోపుచ్ఛ యతి అని, శ్రోతోవహ యతి అని అంటారు. కర్నాటక సంగీతం లో ఈ పద్ధతిని 'పల్లవులు' పాడేటప్పుడు విరివిగా వాడతారు. కొన్ని కీర్తనలలో కూడా ఈ ప్రయోగం కనిపిస్తుంది. ఉదా: ఆనందభైరవి రాగం లో దీక్షితార్ కృతి ' త్యాగరాజ యోగవైభవం - అగరాజ యోగ వైభవం - రాజయోగ వైభవం - యోగ వైభవం - వైభవం - భవం - వం ' అనే ప్రయోగం గోపుచ్ఛ యతి లోనూ ( ఆవు తోక మొదట్లో లావుగానూ పోనుపోనూ సన్నబడినట్లు), ' శం - ప్రకాశం - స్వరూప ప్రకాశం - తత్త్వ స్వరూప ప్రకాశం - సకల తత్త్వ స్వరూప ప్రకాశం - శివ శక్త్యాది సకల తత్త్వ స్వరూప ప్రకాశం' అనే ప్రయోగం శ్రోతోవహ యతి (నది మొదట్లో సన్నగా ఉండి పోనుపోనూ వెడల్పు అయినట్లు)లోనూ వున్నాయి. మృదంగ యతి అని కూడా ఇంకోటి వుందట. ఆది అంత్యాలలో తక్కువ అక్షరాలు, మధ్యలో ఎక్కువ అక్షరాలతో ఉండేదాన్ని అంటారుట.
    అలాగే మేము చిన్నప్పుడు ఒక పద బంధాన్ని ఈ రకం గా సరదాకి ప్రాక్టిసు చేసేవాళ్ళం. 'బాల' పుస్తకం లో వాళ్ళ చిన్నప్పుడు పడిందని మా పెదనాన్నగారు నేర్పించారు.
    అది:
    ది ధీ మలక పోతరాజు - ధిమలక పోతరాజు - మలక పోతరాజు - లకపోతరాజు - కపోతరాజు - పోతరాజు - తరాజు - రాజు - జు ..!! అలాగే...
    జు - రాజు - తరాజు - పోతరాజు - కపోతరాజు - లకపోతరాజు - మలక పోతరాజు - ధిమలక పోతరాజు - ది ధీ మలక పోతరాజు..!!
    ఎవరు స్పీడుగా చెప్తే వాళ్లకి చాక్లెట్ ఇచ్చేవారు.

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)