Sunday, April 3, 2011

ఉగాది vs English New Year



బ్లాగు మిత్రులందరికీ శ్రీ 'ఖర' శుభకర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

హ్యాపీ న్యూ ఇయర్ అనే మాట వినగానే నేడు చాలా మందికి మనసులో మెదిలేది జనవరి ఒకటవ తేది.

కానీ సంవత్సరారంభం.. యుగ + ఆది.. ఉగాది ఇప్పుడు కేవలం వేపపువ్వు తినే పండుగగా మాత్రమే భావించబడుతోంది..! ఖగోళ శాస్త్ర రీత్యా ప్రత్యేకత లేని జనవరి ఒకటినే ఇప్పుడందరూ క్రొత్త సంవత్సరాదిగా జరుపుకుంటున్నారు.

డిసెంబరు 31..! "విష్ యూ హ్యాప్పీ న్యూ ఇయర్..!!" అంటూ ఉత్సాహం ఉరకలు వేసే యువకులూ, యువతులూ, హర్షాతిరేకాల మధ్య పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే రోజు..!!! రాత్రి అంతా విందు వినోదాలతో కాలక్షేపం చేస్తూ, గడియారం 12 గంటలు కొట్టగానే..అందరూ ఒక్కసారిగా హ్యాపీ న్యూ ఇయర్ అనే గావుకేకలతో మారుమ్రోగే రోజు..!! కానీ డేటు మారగానే రోజుమారిందని అనుకుంటే కొత్త రోజు.. మొట్టమొదటే చేస్తున్నపని..పిచ్చెక్కినట్టు..గావుకేకలతో..రోడ్లమీదకెక్కి..వీరంగం చెయ్యడం..!! పబ్బుల్లో మందుకొడుతూ ఎంజాయ్ చేస్తున్నామనే భ్రమలో చిందులేయ్యడం..! బైకుల మీద విన్యాసాలతో మిగిలినవారిని బెదర గొట్టడం...ఖర్మం చాలకపోతే కాలో చెయ్యో విరగ్గొట్టుకోవడం...రాత్రి రెండుకో..లేదా మూడు కొట్టాకో ఇంటికొచ్చాక తెల్లారి 10 - 11 గంటల వరకు పడుకోవడం. మొత్తానికి కొత్తసంవత్సరానికి మొదటి రోజు(సంవత్సరాది) గా భావించే జనవరి ఒకటిన ఎక్కువమంది రోజు మొదలెట్టే తీరు ఇది.

ఇక ఉగాది రోజు కార్యక్రమం చూద్దాం..!!

సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని కొత్తబట్టలు ధరించి కొత్తరోజుకి ఆహ్వానం పలుకుతాం. ఉగాది పచ్చడి తిని ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకొంటాం. ఆలయాలకి వెళ్లి దైవదర్శనం చేసుకొని, పంచాంగ శ్రవణం వింటాం. ఇళ్ళన్నీ బంధుమిత్రుల తో కళకళ లాడుతూ వుంటాయి. వంటింటిలో ఇల్లాళ్ళు చేసే పిండి వంటల ఘుమఘుమలతో ఇంట్లో పిల్లలు పిల్లుల్లా వంటింటి లోకి వెళ్ళడం..."ఇంకా నైవేద్యం పెట్టలేదు..ఫొండి బయటికి..!" అని అమ్మలు కసురుకుంటే బుంగమూతి పెట్టుకొని తాతయ్య దగ్గరకో నాన్న దగ్గరకో చేరడం..!! మధ్యాహ్నం సహపంక్తి భోజనాల దగ్గర హడావిడైతే చెప్పే అక్కరలేదు..!

’న్యూ ఇయర్స్ డే’ కీ, ఉగాదికీ పండుగ జరుపుకొనే సందర్భం ఒకటే అయినా జరుపుకొనే విధానంలో ఇంత వ్యత్యాసానికి కారణం ఆ పండుగల యొక్క సాంస్కృతిక నేపధ్యమేననేది సుస్పష్టం.

ఇవన్నీ ఇలా వుంటే ఉగాది నాటి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ముద్రించిన కరపత్రాలు ఒక ఆలయం లో పంచారు. అది తీసుకొని రెండేళ్ళ పైనే అవుతోంది. క్రింది ఫోటోల పైన నొక్కి చదవండి.




పాశ్చాత్య పోకడల సుడిగుండం లో కొట్టుకుపోతూ మన సంస్కృతి సంప్రదాయాలను పూర్తిగా మర్చిపోతున్నాం. విదేశీ / పాశ్చాత్య సంస్కృతి లోని మంచి విషయాలను అనుసరించడానికి ప్రయత్నిస్తే బాగుణ్ణు. విదేశీ మోజులో పడి వారు చేసుకొనే ప్రతీ 'దినాన్నీ' మనం కూడా ఆయా 'దినాలుగా' (గుడ్డిగా) అనుస()రిస్తున్నాం. కానీ తరతరాలుగా మన జీవన విధానాలూ, ఆచారాలు ప్రాతిపదికగా జరుపుకొనే మన పండుగలను మర్చిపోతున్నాం. ఇవన్నీ'మల్టి నేషనల్ కంపెనీలు' తమ ఉత్పత్తులని అమ్ముకోవడానికి చేసే 'మార్కెటింగ్ స్ట్రాటెజీస్' అని కొందరు సంప్రదాయవాదులు చేసే వాదనలో నిజం లేకపోలేదు..! ఏదేమైనా వెర్రితలలు వేస్తున్న పెడ ధోరణుల నుంచీ బయటపడి మన సంస్కృతిని కాపాడుకొనే దిశగా అడుగులు వెయ్యాలి. మన పండుగలను కూడా విదేశీ 'దినాలకన్నా' ఎంత దివ్యంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవచ్చో న(యు)వతరానికి తెలియ జెప్పాలి. ఆ ఆనందం అనుభవం లోకి వచ్చిన నాడు మన పండుగలను మరింత శోభాయమానంగా జరిపించడంలో వారే ముందుంటారు.

7 comments:

  1. వేరే వాళ్ళని చూసి వాతలు పెట్టేసుకోవడం,
    పనికి మాలిన విషయాలని అనుకరించడం వీటిల్లో మనతర్వాతే ఎవరైన....
    చక్కగా విశ్లేషించారు... మంచి టపా!

    ReplyDelete
  2. Some statements in the article are not altogether correct. There is indeed some astronomical significance to a new year being in the month of January. The point it not about any particular date, like the 1st of January, but about the sun reaching the circle of Capricorn around 21/22 of December and its return journey; therefore, the days between end of December and mid January are quite significant for the entire globe to celebrate a beginning of another new period, consider also the significance of Sankranti. In India, Ugadi coincides with the day after the first new moon day following the vernal equinox (sun and equator being on the same plane) which happens to be after 21st of March in the Gregorian calendar. Incidentally, Ugadi is celebrated only in the states where Marathi, Telugu and Kannada are spoken and the Lunar calendar is followed, while most in other states with the solar calendar the new year is the first full moon day after the vernal equinox. Over several centuries different cultures have evolved different calendar systems, and in the Western countries too, there were corrections and adjustments until some practically useful calendar was established, without attaching much religious significance to it. In this part of the country, people take pleasure in deriding everything that is "west", like saying we are always correct, they are always wrong. Reading the history of the calendar would help in understanding different "Ugadis/Gudi Padavas/Baiskhis" and so on.

    ReplyDelete
  3. @Anonymous
    సహేతుకమైన, అర్ధవంతమైన మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. కానీ అనానిమస్ గా కాక రాసిందెవరో తెలిస్తే ఇంకా సంతోషం కదా..!!

    ReplyDelete
  4. రాధే, ఆర్టికల్ బాగుంది. మనలో చాలా మంది ఎందుకు జనవరి ఫస్టున చిన్దులేస్తారంటే అదొక మాస్ హిస్టీరియా మరియు మెన్టాలిటీ. మొన్ననే ప్రపంచ కప్పు గెల్చుకున్నాం క్రికెట్ లో. 120 కోట్ల హృదయాలు ఉప్పొంగిన వేళ అంటూ శీర్షికలు పత్రికలలో , టీవీలలో .. నిజానికి ఎంత మందికి లాంగ్ ఆన్ అంటే , స్క్వేర్ లెగ్ అంటే తెలుసు? ఆట చూసే వారంతా నిజమైన క్రీదాభిమానులేనా? ఇదంతా నలుగురితో బాటే నారాయణా అనే మానవ మనస్తత్వం మాత్రమే! పోయి ఆదిలాబాద్ లో ఉన్న గొండులను , లంబాడిలను అడుగుదాం క్రికెట్ అంటే ఏంటో. పోయి విశాఖ ఏజెన్సీ లో పాడేరు కి 10 కి.మీ. ల దూరం లో కొండల్లో ఉన్న 'సంపాల' ఆది వాసిలను అడుగుదాం మీరు క్రికెట్ చూస్తారా అని. ప్రపంచం మొత్తం లోనే నాగరికత ఇంకా సోకని మనుష్యులు మన అండమాన్ లోనే ఒకట్రెండు దీవులలో ఉన్నారు. వారు కూడా భారతీయులే. పోయి మైకు ముక్కుకి గుచ్చి అడుగుదాం సచిన్ వందవ సెన్చరీ ఎప్పుడు చెయ్యగలడు అని ఆశిస్తున్నారు అని. కానీ నాకొకటే అనిపించింది. క్రికెట్ ఎక్కువ మందిని ఐక్యంగా ఉంచుతోంది. కాసేపు భేదాలు మరిచి మనమంతా ఒక్కటే అనే భావాలను కలిగిస్తోంది. ఇదంతా పాజిటివ్ స్పిరిట్ కలిగిస్తే మంచిదే. కేకలేసి రోడ్ల మీద చిందులేయడానికి , క్రాకర్స్ పేల్చడానికి , అభినందనలు తెలుపడానికి మనకి ఏదో ఒక సందర్భం కావాలి. అది క్రికెట్ ప్రపంచ కప్పు కావచ్చు , ఇండియా-పాక్ మ్యాచ్ లో గెలుపు కావచ్చు లేదా ప్రతి ఏడాది వచ్చే జనవరి ఫస్టు కావచ్చు. అది అవధులు దాటకుండా ఉన్నంత వరకు ఫర్వాలేదు. ఎవరైనా శుభవార్త పంచుకుంటే పార్టీ అడగట్లే? ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం నరకాసురుడు అంతమొందాడని , లేదా పాండవుల అజ్ఞాత పర్వం ముగిసిందని, లేదా రావణాసురుడు అంతమొందాడని , ఇప్పటికీ దీపావళి సంబరాలు చేసుకుంటున్నాం. ఆఫ్టరాల్ మొన్న మొన్న వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ సంస్కృతి ఎంత??!! ప్రపంచం ఎటు పొతే మనమూ అటు పోదాం, మన మూలాలు మరువకుండా. ఇలా ఉన్నప్పుడు మనమే ఒక నాడు ప్రపంచానికి దిక్కు చూపించిన వాళ్లము అవుతాం. మరొక్కసారి.

    మేరా జూతా హై జాపానీ , యెహ్ పంట్లూన్ ఇంగ్లిష్తానీ
    సర్ పే లాల్ టోపీ రూసీ , ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ

    ఉగాది శుభాకాంక్షలతో ...

    ReplyDelete
  5. $చందుగారు
    మీరు చెప్పెనదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే! మరో వైపు ఏంటో కూడా ఆలోచించాలి కదా .. అసలే మనది గత యాభై ఏళ్లుగా అభివృద్ధి చెందుతూతూతూతూతూతూతూతూతూన్న భారతదేశం!

    ReplyDelete
  6. మనం 50 ఏళ్ళుగానే కాదు , గత కొన్ని వందల ఏళ్ళుగా అభివృద్ధి చెన్దుతూనేనేనే నే నే నే నేనే నే నే నే నేనే నే ... ఉన్నాం. లేకపోతే పారిశ్రామిక విప్లవం మనదేశం లోనే పుట్టి ఉండేది!!! త్వరలోనే మనం తప్పకుండా అభివృద్ధి చెందుతాం! ఎందుకు మనకింత అసహనం ? ఆఫ్టర్ ఆల్ 64 సంవత్సరాలకే (స్వాతంత్ర్యం వచ్చిన) , కొన్ని వందల వేల ఏళ్ళనాటి మనస్తత్వాలు మారిపోవు. మన గతమంతా ఘనం చరిత్రలో ఎన్నో పరాయి సంస్కృతులను స్వీకరించాం. వాటిలో మంచీ చెడులను గ్రహించడానికి 'ఆచరించి' చూసాం. కొన్ని తరాల తర్వాత వాటిలో మంచి ని గ్రహించాం. చెడుని త్యజించాం. తినకుండా రుచి ఎలా ? ఆచరించకుండా సంస్కృతి ఎలా? అలా పరాయి సంస్కృతులని ఆదరించి ఆచరించిన వాళ్ళని నిరసించిన వారు అప్పుడూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు! నిరసించే వారు 'చెడు' మాత్రమే చూస్తే , ఆచరించే వారు 'మంచీ' , 'చెడూ' రెండూ చూడగలరు.

    ReplyDelete
  7. #మనం 50 ఏళ్ళుగానే కాదు , గత కొన్ని వందల ఏళ్ళుగా అభివృద్ధి..
    పైన నే సరదాగా రాసింది.. మీకు ఆలోచన ఉంది అనుకుంటా!. యాబై అన్నది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత. మీరన్న వందల ఏళ్ళు శతాబ్దాలు ముందుకు వెళితే వలసపాలనలో ఉన్నా౦.. ఇంకా ముందుకు వెళితే మన పరిస్థితి అందరికన్నా మెండు.. అందుకే దేశాన్ని ఆక్రమించి దోచుకున్నారు. వీటిని గూర్చి వాడిన్చుకోవడానికి నాకేం సరదాలేదు. అందుకే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత..!

    #..పరాయి సంస్కృతులను..

    నే అన్నది.. ఈ దినాల మాటున జరుగుతున్న కోట్లాది రూపాయల మారక౦ గురించి. వీటిని అనుభవించి వాడుకునే హక్కు ఉన్నవాడికే చెల్లుతుంది.. మధ్యవాడు, అధమవాడు మరింతగా దిగజారిపోవడం తప్ప! అందుకే దేశం అంతటా అభివృద్ధి చెందిన నాడు తీరిగ్గా చావుదినాలు కూడా ముందే జరుపుకోవచ్చు..

    #..తినకుండా రుచి ఎలా ?

    పైన మాట్లాండి౦ది. .తిని రుచి చూసి అది అరుచి అను గ్రహించిన పెద్దలు ఇది తప్పు అని చెపుతున్నారనేగా!

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)