ఈ పోస్ట్ వ్రాయడం మొదలుపెట్టింది హైదరాబాద్ లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్న రోజున..!! కానీ టైం కుదరక.. అర్ధంతరంగా ఆపేసాను. కానీ ఈ రోజు విశాఖపట్నం లో నేలకూలిన అతిపెద్ద వినాయక ప్రతిమను చూసి, ఉండలేక మళ్ళీ మొదలుపెట్టాను.
శ్రీ సంపత్ వినాయక ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో ఆర్భాటం గా పెట్టిన వినాయకుడు 127 అడుగుల ఎత్తు, 6300 కేజీల అతిపెద్ద లడ్డు నైవేద్యం - లాంటి విషయాలలో ప్రత్యేకతను సంతరించుకొంది. విగ్రహ ప్రతిష్టాపన జరుగవలసిన వినాయక చవితి రోజున ప్రొద్దున్నే పెద్ద వర్షం కురవడంతో ఆ కార్యక్రమం మర్నాడు జరిగింది. ఏదేమైనా నిమజ్జనం ఇంకొద్ది గంటల్లో జరగనుందనగా మొత్తం విగ్రహం నేల కొరగడం చాలా దురదృష్టకరం. కార్య నిర్వాహక సమితి వాళ్ళు ప్రాయశ్చిత్త విధులూ, గణేశ హోమాలూచేసి నిమజ్జనం విగ్రహం ఉన్నచోటే (?) చేసేసి అయిందనిపించారు.
ఈలోగా మన పాత్రికేయ మిత్రులు యధావిధిగా లైవ్ కవరేజ్ చేస్తూ, ఈ దుర్ఘటన వాళ్ళ ఏమైనా అనర్ధాలుంటాయా..! అపచారమేదైనా జరిగిందంటారా..?? అంటూ లీడ్ విశ్లేషణలూ.., దానికి ఒకరు.. "అబ్బే.. ఇక్కడ పూజలేవీ పధ్ధతి ప్రకారం జరగనే లేదండీ" అంటూ సన్నాయి నొక్కులు..!!
అదృష్టవశాత్తూ నిర్వాహకులు ప్రమాదాన్ని ముందుగానే ఊహించి, భక్తులకు దర్శనాలు నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కూలిన సమయం లో దగ్గరలో ఎవ్వరూ లేరు. ఇలాంటివి జరగడం ఇది మొదటిసారి కాదు. ఈ మధ్యే ఎవరో రాజశేఖర రెడ్డి భారీ విగ్రహాన్ని ఇలాగే తాత్కాలికంగా వేసిన పందిరి లోపెట్టబోతే అది నిర్మాణం కూడా పూర్తికాకుండానే నేలకూలింది. ఇంతకుముందు ఇలాంటి భారీ వినాయకుడి పెండాల్ లోనే షార్ట్ సర్క్యుట్ కారణం గా విగ్రహం పూర్తిగా తగలబడిపోయింది. కనీసం మంటలార్పే సాధనాలుకూడా నిర్వాహకుల వద్ద లేవు. అన్ని సందర్భాలలోనూ ఏదో ఘనత సాధించాలనీ, రికార్డుల కెక్కాలనే సరదా నే తప్ప.. ప్రమాదం జరిగే అవకాశం వుందనికానీ, ఒకవేళ జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గానీ నిర్వాహకులకి కొరవడుతోంది. అసలు అంతపెద్ద విగ్రహాలను పెట్టడం లో గల ఆంతర్యం ఏమిటో ఆ విగ్రహాలు పెట్టిన నిర్వాహకులకే తెలియాలి.
ఈసారి ప్రజల చైతన్యం పుణ్యమా అని దాదాపు అందరూ మట్టి విగ్రహాలకే మొగ్గుచూపారు. అందరితో పాటే ఈ పెద్ద విగ్రహాలు పెట్టే వాళ్ళు కూడా 'ఎకో ఫ్రెండ్లీ' వినాయకుడని చెప్పుకుంటూ మట్టి తోనే విగ్రహాలు తయారు చేసారు. అంతవరకూ బాగానే వుంది. కానీ నిమజ్జనం దగ్గరికొచ్చేసరికీ సమస్యలు మొదలు. అంత భారీ విగ్రహాన్ని వున్నచోట నుంచీ కదిల్చే పరిస్థితి లేదు. దాంతో ఉన్నచోటే నిమజ్జనం చెయ్యడం మొదలుపెట్టారు. అన్ని రోజులు పూజలందుకొన్న వినాయకుడు.. మన కళ్ళ ముందే తన సుందర రూపాన్ని కోల్పోతూ వుంటే చూడడానికి నాకైతే మనస్కరించదు. పైగా ఈ నిమజ్జన కార్యక్రమం లో కార్పోరేషన్ నుంచి తెచ్చే మంచినీరు (శుద్ధి చెయ్యబడిన, ప్రజలకు అందాల్సిన త్రాగునీరు) టాంకుల కొద్దీ తెచ్చి విగ్రహం మీదకి పిచికారీ చేస్తూ విగ్రహాన్ని కరగ బెడతారు. ఎంతనీరు వాడారో అంతా వృధాగా పోవలసిందే. విగ్రహం సైజు పెరిగే కొద్దీ ఈ మంచినీటి వృధా ఇంకా పెరుగుతూ వుంటుంది.
(ఈ మధ్యే పేపర్లో చూసాను..! నగరం లో సామాన్య ప్రజలకు దాహార్తిని తీర్చే ఉద్దేశంతో నెలకొల్పబడిన రక్షిత మంచినీటి కొళాయిలను ప్రభుత్వం అంచెలవారీగా తీసివేస్తుందట..!!) నీటిని ఇంతలా వృధా చేస్తూ ఆ వినాయకుడిని ఎకో ఫ్రెండ్లీ అని ఎలా భావించాలో అర్ధం కాదు.
నిమజ్జనం యొక్క అసలు స్ఫూర్తి ఇది. ఈ బాలలు చేస్తూన్న వినాయకుడు నిజమైన పర్యావరణ మిత్రుడు.ఈ రకమైన కృత్రిమ నీళ్ళ టాంకు లను అందుబాటులోకి తెస్తే మంచి నీటి వృధాని చాలా వరకు తగ్గించ వచ్చు.
*********
గణేశ నిమజ్జనాల తరువాత కనిపించే ఈ దృశ్యాలు ఎవ్వరినైనా కలవరపెట్టక మానవు.
- ప్రభుత్వం ఈ విగ్రహాల సంఖ్య మీద ఖచ్చితంగా నియంత్రణ విధించాలి. ప్రతీ సంవత్సరమూ నిర్వాహకులు క్రొత్తగా పుట్టుకొస్తున్నారు. అలాగే విగ్రహాల సంఖ్య కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోతోంది. ఫలితంగా కాలుష్యం కూడా అదే నిష్పత్తిలో పెరిగిపోతోంది.
- ఊరేగించలేని లేదా హాండిల్ చెయ్యలేని సైజు లో విగ్రహాలు పెట్టడానికి అనుమతించకూడదు.
- చెవులు చిల్లులు పడేలా పెట్టే సౌండ్ సిస్టం మరియు అర్ధ నగ్న నృత్యాలు, మరియు చెత్త పాటలకి స్వస్తి పలకాలి.
- నిర్వాహకులు వారి రికార్డుల కోసం, తద్వారా అక్కడకు వచ్చే భక్తులనుంచి డబ్బులు రాబట్టడం, లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తో వుండే విగ్రహాలని ప్రజలే బాయ్ కాట్ చేస్తే మరీ మంచిది.
- పర్యావరణ, కాలుష్య నియంత్రణ, అగ్ని మాపక శాఖ, పోలీసు, మరియు నగరపాలక సంస్థల నుంచి అనుమతులు తప్పనిసరి చేయాలి. ( MVP కాలనీ లో కూలిన విగ్రహానికి ఈ అనుమతులు లేవంటూ మర్నాడు పేపర్లో వచ్చింది. అవి లేకుండా ఇరవై రోజుల పాటూ దర్శనానికి ఎలా అనుమతించారో తెలీదు. నగర ప్రముఖులంతా దర్శనాలు చేసుకున్నారు. అలాంటి VIP లు వుండగా ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉండేదో..!!??)
- కొంత మంది సిక్స్ ప్యాక్ వినాయకుడు, అపరిచితుడు, అవతార్ లాంటి సినిమా గెటప్ లతో కూడా విగ్రహాలు పెడుతున్నారు. వాటివల్ల ఏ రకమైన భక్తిభావం కలుగుతుందో వారికే తెలియాలి.
- రంగులు కూడా ప్రమాదకరమైన రసాయనాలతో తయారవడం వల్ల చెరువుల్లో వుండే చేపలూ మొదలైన జీవ జాతులకు కూడా అపాయం కలుగుతోంది. అందువల్ల వాటి వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి.
విగ్రహాలు పెద్దవి పెడితేనే వాళ్ళ హుండీలలో డబ్బులు ఎక్కువ పడతాయని పెద్ద విగ్రహాలు తయారు చేస్తారు.
ReplyDeleteచక్కని బ్లాగ్ పోస్ట్ రాసారు.పోటీ పడి, పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతూ, కాలుష్యానికి కారణమవుతున్న ఈ నిర్వాహకులు కి ఇప్పుడు రాజ కీయ పార్టీల మద్దతు ఉందని స్పష్ట మవుతోంది.ఇంక ఈ నియంత్రణలు ఊసు ఎత్తితే, దేవుడి విగ్రహం..అంటూ సెంటిమెంట్ మొదలు పెడతారు.చక్కగా ఫోటోలు తో ఆకట్టుకునేలా ఉంది మీ బ్లాగ్. ఇంక ఈ చర్యలు తీసుకునే వాళ్ళు ?? ఎవరో?? ఒక పెద్ద అపాయం జరిగి, కొంత నష్టాలు జరిగితే గాని మేలుకోరు..ఎప్పటికో??
ReplyDeleteవసంతం.